తెలంగాణ: పగలు మండే ఎండలు, సాయంత్రం చల్లని వానలు... ఈ వాతావరణ మార్పుకు కారణమేంటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
- చదివే సమయం: 5 నిమిషాలు
ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండలు దంచికొడుతున్నాయి. సాయంత్రానికి ఒక్కసారిగా వాతావరణం మారిపోయి, మబ్బులు కమ్ముకుని వర్షం పడుతోంది.
కొన్ని రోజులుగా తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి.
ఈ వాతావరణ మార్పులకు కారణమేంటి? మేలో ఎండల తీవ్రత ఎలా ఉండనుంది?
ఎల్‌నినో రాబోతోందన్న వాతావరణ శాఖ అంచనాల నేపథ్యంలో అది ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది?
ఈ విషయాలపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి జీఎన్ఆర్ఎస్ శ్రీనివాసరావు బీబీసీతో మాట్లాడారు.
బీబీసీ ప్రశ్నలకు ఇయన ఇచ్చిన జవాబులేమిటో చదవండి.


మండుటెండల్లో వానలు ఎందుకు పడుతున్నాయి?
జవాబు:
తెలంగాణలో అక్కడక్కడా కురుస్తున్న వానలను ప్రీ-మాన్‌సూన్ షవర్స్ (రుతు పవనాల రాకకు ముందు కురిసే జల్లులని శ్రీనివాసరావు అభివర్ణించారు.
ఈసారి వర్షాలు పడటం ఎక్కువగా కనిపిస్తోంది. రెండు, మూడేళ్ల ముందు వరకు ఈ పరిస్థితి లేదు. ఈసారి ఎక్కువగా ఉంది.
నాలుగైదు రోజులపాటు 42-43 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు ఒక ప్రాంతంలో ఉన్నప్పుడు, సమీపంలోని ప్రాంతాలు లేదా సముద్ర ఉపరితలం మధ్య ఉన్న ఉష్ణోగ్రతల్లో తేడాల కారణంగా తక్కువ పీడనంతో ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుంది.
తెలంగాణ విషయానికి వస్తే... ఈ ప్రాంతం భారత్‌కు దాదాపు మధ్యలో ఉంటుంది. తూర్పున బంగాళాఖాతం, పశ్చిమాన అరేబియా సముద్రం ఉంటాయి.
భూ ఉపరితలంపై ఒకటి నుంచి నాలుగు కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడినప్పుడు సముద్రం మీదుగా తేమ గాలులు ఇటువైపు వీస్తాయి.
అలా వేడిగాలులకు తేమ గాలులు తోడైతే, తేమను మరింత పైకి నెట్టడంతో క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడతాయి.
ఇవి వేడి వల్ల ఏర్పడుతుంటాయి కనుక ఎక్కడైతే వేడి ఎక్కువగా ఉంటుందో.. అక్కడ ఈ తరహా వాతావరణ పరిస్థితులు గమనించవచ్చు. ఇవి ఫ్రీజింగ్ స్థాయి (ఎత్తు) దాటుకుని భూఉపరితలం నుంచి 8-10 కిలోమీటర్ల వరకు చేరితే, అప్పుడు వడగళ్లు పడే అవకాశం ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
మే నెలలో మరిన్ని వానలు పడొచ్చా?
జవాబు:
ప్రస్తుతం భారీ వర్షాలు కురవకపోవచ్చు. కానీ ఉరుములు, మెరుపులతోపాటు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంటుంది.
రాబోయే రోజుల్లో కూడా తెలంగాణలో అక్కడక్కడా వానలు పడుతూ, ఇలాంటి వాతావరణ పరిస్థితులే కొనసాగే అవకాశం ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
అకాల వర్షాలపై రైతులకు సమాచారం ఇస్తున్నారా?
జవాబు
అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్న ప్రాంతాలకు సంబంధించి అలర్ట్స్ ఇస్తున్నాం.
సంబంధిత జిల్లా కలెక్టర్లకు, వ్యవసాయ అధికారులకు, రైతుల వాట్సాప్ గ్రూపులకు రోజుకు మూడుసార్లు ఈ అలర్ట్స్ పంపిస్తున్నాం. క్యుములోనింబస్ మేఘాలు కచ్చితంగా ఏర్పడే వీలుందనే విషయం కేవలం రెండు మూడు గంటల ముందే తెలుస్తుంది.
ప్రతి మూడు గంటలకోసారి రాడార్‌ను పరిశీలిస్తూ 'నౌ కాస్ట్' అలర్ట్‌ను రాష్ట్ర విపత్తుల శాఖకు పంపిస్తుంటాం. ఏ ఏరియాలో అలర్ట్ పెట్టామో.. అక్కడి సెల్ నంబర్లకు వెంటనే మేసేజ్‌లు వెళ్లే ఏర్పాట్లున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఇకపై మే నెల ఎలా ఉండొచ్చు?
జవాబు:
మేలో తెలంగాణలో సాధారణ స్థితి అంటే.. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు అటూ ఇటూగా లేదా అంతకంటే తక్కువగానే ఉండే అవకాశం ఉంది.
వర్షపాతం ఎక్కువగా ఉండొచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
సాధారణంగా తెలంగాణలో హీట్ వేవ్ (వడగాల్పుల) తీవ్రత 7-8 రోజులు ఉంటుంది. అవి కూడా ఈసారి సాధారణ స్థితిలో ఉండొచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
ఎల్‌నినోతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడతాయా?
జవాబు:
జులై నాటికి ఎల్‌నినో రావొచ్చని ఏప్రిల్‌లో ఐఎండీ విడుదల చేసిన నివేదిక చెబుతోంది.
ఆగస్ట్ నాటికి ఐవోడీ (ఇండియన్ ఓషియన్ డైపోల్) పాజిటివ్‌గా ఉంటే, ఎల్‌నినో తీవ్రతను అడ్డుకుంటుందని అంచనా వేసింది.
అయినప్పటికీ 92శాతం వర్షపాతం రికార్డు అవుతుందని నివేదిక చెబుతోంది.
మే నెల ప్రారంభంలో వచ్చిన నివేదిక ప్రకారం, జూన్ మాసం మొదటి నుంచే ఎల్‌నినో ప్రభావం ఉంటుందని అంచనా వేసింది. అలాగే ఐవోడీ సెప్టెంబరు తర్వాత పాజిటివ్ అయ్యే అవకాశం వచ్చింది.
దీంతో వర్షపాతం గతంలో అంచనా వేసిన 92శాతం కంటే తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నాం.
అయితే కచ్చితంగా రుతుపవనాలపై ఎంత ప్రభావం ఉంటుంది.. వర్షపాతం తగ్గుతుందా… సాధారణ స్థాయిలో ఉంటుందా.. ఇవన్నీ మే 15 నాటికి పూర్తి స్థాయిలో వెల్లడయ్యే అవకాశం ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
ఎల్‌నినో వస్తే ఏం జరుగుతుంది?
జవాబు:
ఎల్‌నినో వస్తే రుతుపవనాల వేగం మందగిస్తుంది. తేమ శాతం పడిపోతుంది.
రుతు పవన వర్షాలలోనూ మార్పులు కనిపిస్తాయి.
దీనివల్ల వర్షాలు ముందుగానే కురవడం లేదా తర్వాత రావడం, సమస్థాయిలో వర్షపాతం లేకపోవడం.. ఇలాంటి పరిణామాలు ఎదురుకావొచ్చు.
ఓ వారంపాటు భారీ వర్షాలు పడటం.. తర్వాత చాలాకాలంపాటు వర్షం లేకపోవడం లాంటి పరిస్థితులు ఉంటాయి. ఈసారి వర్షాకాలంలో గడ్డు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది.
ఎల్‌నినో ఏర్పడే అవకాశాలున్నాయని స్పష్టంగా తెలుస్తోంది కాబట్టి ప్రభుత్వాలు దానికి తగ్గట్టుగా ప్రణాళికలు వేసుకోవాలి.
తక్కువ వ్యవధి, తక్కువ నీటితో లేదా డ్రిప్ పద్ధతిలో సాగు చేసే పంటలను ప్రభుత్వం ప్రోత్సహించాలి.
ఈ విషయంలో రైతులను అప్రమత్తం చేయాలని ముగించారు శ్రీనివాసరావు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

































