మారుపేరుతో న్యూజీలాండ్‌లో క్లబ్ క్రికెట్ ఆడిన రిషబ్ పంత్

భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్
ఫొటో క్యాప్షన్, రిషబ్ పంత్
    • రచయిత, ఫిఫిన్ విన్నె
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 3 నిమిషాలు

భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ న్యూజీలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్‌లో ఒక క్లబ్ జట్టు తరఫున 'స్టాన్ స్టాన్' అనే మారు పేరుతో మ్యాచ్ ఆడాడు.

29 ఏళ్ల పంత్ ఓపెన్ హౌస్ స్వింగర్స్ జట్టు తరఫున ది చూజెన్ వన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఆడాడు.

ఈ మ్యాచ్‌లో కేవలం 21 బంతుల్లోనే 54 పరుగులు చేశాడు.

దీంతో అతను ప్రాతినిధ్యం వహించిన జట్టు16 పరుగుల తేడాతో విజయం సాధించింది.

న్యూజీలాండ్‌తో భారత్ ఆడనున్న రెండో టెస్టుకు ఒక రోజు ముందు పంత్ ఈ మ్యాచ్‌లో కనిపించాడు. ఈ రెండో టెస్టు హాగ్లీ ఓవల్‌లో మొదలైంది.

నగరంలో ఎలక్ట్రిక్ బైక్‌పై వెళ్తున్న పంత్‌ను తాను చూశానని ఓపెన్ హౌస్ జట్టు ఆటగాడు మహమ్మద్ సఫీ ‘న్యూజీలాండ్ హెరాల్డ్‌’తో చెప్పాడు.

తమ జట్టులో ఒక ఆటగాడు తక్కువగా ఉన్నాడని చెప్పి, అతడిని మ్యాచ్ ఆడాలని కోరినట్లు తెలిపాడు.

రెండు జట్లలోని చాలామంది పంత్‌ను వెంటనే గుర్తించలేకపోయారని కూడా సఫీ చెప్పాడు.

పంత్ పర్పుల్ రంగు ట్రాక్‌సూట్‌లో అక్కడికి వచ్చాడని, మ్యాచ్ ఆడేందుకు అవసరమైన క్రికెట్ కిట్ కూడా ఇతరుల దగ్గర తీసుకున్నాడని తెలిపాడు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

పంత్ ఇలా మ్యాచ్ ఆడటాన్ని అద్భుతమైన విషయంగా న్యూజీలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ అభివర్ణించాడు.

ఇది అతడి నిజమైన వ్యక్తిత్వాన్ని చూపిస్తోందని అన్నాడు.

సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆ వీడియోను చూసినప్పుడు తాను ఆశ్చర్యంతో కుర్చీలోనుంచి దాదాపు పడిపోయానని, భారత బౌలింగ్ కోచ్, దక్షిణాఫ్రికా మాజీ ఫాస్ట్ బౌలర్ మోర్నీ మోర్కెల్ చెప్పాడు.

కాగా వెల్లింగ్టన్‌లో జరిగిన తొలి టెస్టు భారీ స్కోర్లతో డ్రాగా ముగిసింది.

ఆ మ్యాచ్‌లో భారత్ ఒక ఇన్నింగ్స్‌ ఆడి 9 వికెట్లకు 720 పరుగులు చేయగా, పంత్ 128 పరుగులు సాధించాడు.

భారత్, న్యూజీలాండ్
ఫొటో క్యాప్షన్, ఇండియన్ క్రికెటర్లు

ప్రపంచంలోనే అత్యంత ఎంటర్‌టైనింగ్ క్రికెటర్లలో ఒకడిగా రిషబ్ పంత్ గుర్తింపు పొందాడు.

ఇప్పటివరకు 53 టెస్టులు ఆడిన అతను, మొత్తం 3,853 పరుగులు చేశాడు.

భారత్ తరఫున టెస్టుల్లో 2,000కు పైగా పరుగులు చేసిన ఆటగాళ్లలో పంత్ (74.43) కంటే మెరుగైన స్ట్రైక్‌రేట్ ఉన్న క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, కపిల్ దేవ్ మాత్రమే.

మరోవైపు భారత్, న్యూజీలాండ్ రెండో టెస్ట్‌ మొదటిరోజు ఆట కొనసాగుతోంది.

టాస్ గెలిచిన భారత్ ఆతిథ్యజట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.

47ఓవర్లు ముగిసే సమయానికి న్యూజీలాండ్ నాలుగు వికెట్లు కోల్పోయి 121 పరుగులు చేసింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)