‘అసదుద్దీన్ అసలు ఎవరితో పోరాడుతున్నారు? బీజేపీకి ఎందుకు ప్రయోజనం కలిగిస్తున్నారు’.. ఎంఐఎం నేత రాజకీయాలపై ఆజంఖాన్ ప్రశ్నలు

asaduddin owaisi, azam khan
ఫొటో క్యాప్షన్, అసదుద్దీన్ ఒవైసీ, ఆజం ఖాన్
    • రచయిత, ప్రేరణ
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 5 నిమిషాలు

సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నాయకుడు ఆజం ఖాన్ జైలు నుంచి విడుదలైన తర్వాత బీబీసీకి ఇంటర్వ్యూ ఇచ్చారు.

అసదుద్దీన్ ఒవైసీ, అఖిలేశ్ యాదవ్, రామ మందిరం, కాంగ్రెస్, తనపై ఉన్న కేసులు సహా పలు అంశాలపై మాట్లాడారు.

సమాజ్‌వాదీ పార్టీ గురించి అడిగిన ప్రశ్నకు ఆజం ఖాన్ సమాధానమిస్తూ ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి ప్రయోజనం చేకూర్చాలని ఒవైసీ కోరుకుంటున్నారని ఆరోపించారు.

"ఒవైసీ బీజేపీతో పోరాడుతున్నారా లేక సమాజ్‌వాది పార్టీతో పోరాడుతున్నారా అనేది అర్ధం కావడం లేదు. ఒకవేళ సమాజ్‌వాదీ పార్టీ నష్టపోతే సహజంగానే బీజేపీకి ప్రయోజనం చేకూరుతుంది కదా" అని ఆజం ఖాన్ వ్యాఖ్యానించారు.

అసదుద్దీన్ ఒవైసీ తనపై చూపిస్తున్న సానుభూతిని కూడా ఆజం ఖాన్ ప్రశ్నించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

అసదుద్దీన్ ఒవైసీ తన ఇంటి ముందు నుంచి వెళ్తున్నప్పుడు తనను కలవడానికి ఎందుకు రాలేదని, కనీసం తన భార్యకైనా ఎందుకు ఫోన్ చేయలేదని ప్రశ్నించారు.

ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు సుప్రీంకోర్టు నుంచి ఉపశమనం లభించడంపై ఆయన భావోద్వేగంతో స్పందించారు. 'జరిగేది ఎన్నికలు కాదు... విప్లవం వస్తుంది' అని అన్నారు.

ఆజం ఖాన్‌ను గాజియాబాద్‌లోని డాస్నా జైలులో శిక్ష అనుభవించారు. ఈడీ దాఖలు చేసిన మనీలాండరింగ్ కేసులో అలహాబాద్ హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

ఉత్తరప్రదేశ్, సమాజ్‌వాదీ పార్టీ, ఆజం ఖాన్, బీజేపీ, అసదుద్దీన్ ఓవైసీ
ఫొటో క్యాప్షన్, ఉత్తరప్రదేశ్‌లో అసదుద్దీన్ ఎవరికోసం పనిచేస్తున్నారని ఆజం ఖాన్ ప్రశ్నించారు.

జైలులో అఖిలేశ్ కలవడానికి వస్తే....

ఆజం ఖాన్ విడుదలైన కొన్ని గంటలకే ఆ ఉత్తర్వుపై స్టే విధించాలని, అత్యవసర విచారణ జరపాలని కోరుతూ ఈడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కానీ ఆ అభ్యర్థనను కోర్టు అంగీకరించలేదు.

రెండు పాన్ కార్డులు కలిగి ఉన్నారన్న కేసులో ఆజం ఖాన్, ఆయన కొడుకు అబ్దుల్లా అజం గతంలో జైలులో ఉన్నారు.

ఈ కేసులో అక్టోబర్ 29న అలహాబాద్ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అక్టోబర్ 31న ఆజం ఖాన్ జైలు నుంచి విడుదల కాగానే ఈడీ ఆయనను అదుపులోకి తీసుకుంది.

మహమ్మద్ అలీ జౌహర్ విశ్వవిద్యాలయానికి సంబంధించిన మనీలాండరింగ్ ఆరోపణల కేసు నేపథ్యంలో ఈడీ ఈ చర్య తీసుకుంది. రైతుల వ్యవసాయ భూములను ఈ విశ్వవిద్యాలయం బలవంతంగా ఆక్రమించుకుందన్నది ఆరోపణ.

అఖిలేశ్ యాదవ్ జైలులో తనను కలవడం వల్ల చాలా ఇబ్బందులు కలిగేవని ఆజం ఖాన్ చెప్పారు.

"అఖిలేశ్ రావడానికి ముందు, వచ్చిన తర్వాత ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొనేవాడినో మీరూహించలేరు. ఆయన జైలుకు వస్తున్నారంటే ముందుగానే ఆంక్షలు, మరిన్ని కఠిన నిబంధనలు అమలుచేసేవాళ్లు'' అని ఆయన అన్నారు.

షేవింగ్ క్రీమ్ వంటి వాటిని రహస్యంగా ఉపయోగించినా కూడా చెత్తబుట్టలో పడేస్తారని ఆయన అన్నారు.

అందుకే అఖిలేశ్ యాదవ్ తనను కలిసేందుకు రావడాన్ని తాను ఇష్టపడేవాడిని కానని ఆజం ఖాన్ అన్నారు.

తనపై నమోదైన రెండు పాన్ కార్డులకు సంబంధించిన కేసుపై ఆజం ఖాన్ మాట్లాడుతూ తన దగ్గర చట్టబద్ధమైన పాన్ కార్డు ఒక్కటే ఉండేదని చెప్పారు.

"ఒక పాన్ కార్డుతో ఎలాంటి వ్యాపారం జరగలేదు. ఎలాంటి లావాదేవీలు జరగలేదు. అసలు దాన్ని ఉపయోగించనేలేదు. ఆ పాన్ కార్డును తిరిగి అప్పగించేశాను. నిబంధనల ప్రకారం మరో కొత్త పాన్ కార్డు తీసుకున్నాను. కాబట్టి ఒక సమయంలో నా దగ్గర ఒకే పాన్ కార్డు ఉంది. రెండూ ఒకేసారి ఎప్పుడూ లేవు" అని అన్నారు.

జైలు నుంచి విడుదలైన వెంటనే ఈడీ చర్యలు తీసుకోవడంపై ఆజం ఖాన్ స్పందించారు.

"మేం చాలా నిశ్చింతగా బయటకు వచ్చాం. ఎనిమిదేళ్ల క్రితం నమోదైన ఎఫ్‌ఐఆర్‌కు సంబంధించి చర్యలు తీసుకోవడానికి ఆ రోజునే ఎంచుకుంటారని అసలు ఊహించలేదు" అని అన్నారు.

ఉత్తరప్రదేశ్, సమాజ్‌వాదీ పార్టీ, ఆజం ఖాన్, బీజేపీ, అసదుద్దీన్ ఓవైసీ
ఫొటో క్యాప్షన్, జౌహర్ యూనివర్సిటీ

జౌహర్ విశ్వవిద్యాలయం గురించి ఆజం ఖాన్ ఏం చెప్పారు?

గత జూలై 15న రాంపూర్ అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఆర్‌డీఏ) ఒక ప్రకటన చేసింది. జౌహర్ యూనివర్సిటీలోని మొత్తం 40 భవనాల్లో 38 భవనాలను ఆమోదించిన నిర్మాణ ప్రణాళికలు లేకుండానే నిర్మించారని ఆరోపించింది.

రాంపూర్‌లోని మహమ్మద్ అలీ జౌహర్ యూనివర్సిటీకి దాదాపు రెండు దశాబ్దాల క్రితం ఆజం ఖాన్ శంకుస్థాపన చేశారు. ఆ సమయంలో ఆయన రాంపూర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. వివిధ సందర్భాల్లో ఈ యూనివర్సిటీని తన కలల ప్రాజెక్టుగా ఆయన అభివర్ణించారు.

మహమ్మద్ అలీ జౌహర్ యూనివర్సిటీకి సంబంధించిన వివాదంపై మాట్లాడుతున్నప్పుడు ఆజం ఖాన్ భావోద్వేగానికి గురయ్యారు.

యూనివర్శిటీలోని 38 భవనాలను కూల్చివేస్తారనే వార్త వినగానే ఏమనిపించిందని అడగ్గా తన కొడుకు పక్కన లేకపోతే తన గుండె ఆగిపోయేదని అన్నారు.

యూనివర్సిటీ నిర్మాణానికి సంబంధించిన పనులన్నీ చట్ట పరిధిలోనే జరిగాయని ఆయన చెప్పారు.

ఆ సమయంలో రాంపూర్ అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఆర్‌డీఏ) లేదని చెప్పారు. యూనివర్సిటీ క్యాంపస్ ఆర్‌డీఏ పరిధిలోకి వచ్చిన తర్వాత నిర్మించిన భవనాలకు సంబంధించిన నిర్మాణ ప్రణాళికలను దాని నుంచి ఆమోదం తీసుకున్నామని తెలిపారు.

ఆయన మాట్లాడుతూ, "బనారస్ హిందూ యూనివర్సిటీ (బీహెచ్‌యూ), అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ) నిర్మించిన సమయంలో కూడా ఇలాంటి చట్టాలన్నీ అమల్లో ఉండి ఉంటే, మదన్ మోహన్ మాలవీయ, సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఇద్దరూ జైలులో ఉండేవారు" అని అన్నారు.

"గాజియాబాద్‌లో జడ్జి ముందు కన్నీళ్లు పెట్టుకుంటూ ఒక మాట చెప్పాను. జడ్జి గారూ, యూనివర్సిటీలు, పాఠశాలలు నిర్మిస్తే ఇంత పెద్ద శిక్ష పడుతుందని నాకు ముందే తెలిస్తే, నేను రిక్షా తొక్కేవాడిని కానీ చదువుకునేవాడిని కాదు. నా కొడుకును బీడీలు తయారు చేసే పనిలో పెట్టేవాడిని కానీ ఎం.టెక్ చదివించేవాడిని కాదని చెప్పాను" అని ఆయన అన్నారు.

ఉత్తరప్రదేశ్, సమాజ్‌వాదీ పార్టీ, ఆజం ఖాన్, బీజేపీ, అసదుద్దీన్ ఓవైసీ
ఫొటో క్యాప్షన్, ఆజాద్ సమాజ్ పార్టీ, ఏఐఎంఐఎం కలిసి కూటమిగా ఏర్పడ్డాయి.

అఖిలేశ్ యాదవ్ రామ మందిరానికి వెళ్లడంపై ఏమన్నారు?

బాబ్రీ మసీదు యాక్షన్ కమిటీ సహ-కన్వీనర్లలో ఆజం ఖాన్ ఒకరు. ఆయన రాజకీయ జీవితంలో రామ మందిర ఉద్యమం, బాబ్రీ మసీదు అంశాలకు కూడా ముఖ్యమైన స్థానం ఉంది.

‘‘హజ్ యాత్రకు చాలా మంది చిన్న వయసులోనే వెళ్తారు. కొందరు మధ్య వయసులో వెళ్తారు. మరికొందరు వృద్ధాప్యంలో వెళ్తారు. ఇంకొందరికి వెళ్లే అవకాశం కూడా రాదు. మా విశ్వాసం ప్రకారం అల్లా ఎప్పుడు పిలుస్తాడో అప్పుడే వెళ్తాం అనుకుంటాం. అన్ని చోట్లా ఇదే నమ్మకం ఉంటుంది. మీ దేవుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడే మీరు వెళ్తారు. బహుశా ఆయనకు పిలుపు వచ్చి ఉంటుంది. అందుకే వెళ్తున్నారు. దేవుడి విషయంలో ఇతరులతో పోటీపడకూదు'' అని అన్నారు.

ముస్లింలకు సంబంధించిన సమస్యలపై అఖిలేశ్ యాదవ్ తగినస్థాయిలో గట్టిగా మాట్లాడడం లేదని విమర్శకులు తరచుగా ఆరోపిస్తుంటారు. దీనిపై చాలా మంది రాజకీయ విశ్లేషకులు రెండు రకాల అభిప్రాయాలను వ్యక్తంచేస్తున్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో అలా వ్యవహరించాల్సిన అవసరం ఉందని కాబట్టి అఖిలేశ్ వైఖరి సరైనదేనని కొందరు అంటున్నారు.

మరికొందరు మాత్రం ఇది బీజేపీకి అనుకూలమైన రాజకీయ వేదిక అని అఖిలేశ్ యాదవ్ కూడా అదే బాటలో వెళ్తే అది ఆయనకు నష్టం కలిగిస్తుందని విశ్లేషిస్తున్నారు.

"మంచి హిందువు ఎప్పటికీ ముస్లింలకు శత్రువు కాలేడు. అఖిలేశ్ యాదవ్ మంచి హిందువు అయితే, మత విశ్వాసాలు కలిగిన హిందువు అయితే, తిలకం పెట్టుకుంటే నాకేమీ అభ్యంతరం లేదు. అయితే నా నుదుటిపై నమాజ్ వల్ల ఏర్పడిన గుర్తును కూడా ద్వేషించకూడదన్నదే నా షరతు" అని ఆజం ఖాన్ అన్నారు.

ఉత్తరప్రదేశ్, సమాజ్‌వాదీ పార్టీ, ఆజం ఖాన్, బీజేపీ, అసదుద్దీన్ ఓవైసీ
ఫొటో క్యాప్షన్, అఖిలేశ్ యాదవ్ రామమందిరానికి వెళ్లడంపై తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆజం ఖాన్ అన్నారు.

'ములాయం సింగ్ యాదవ్‌కు ఉన్న లోపం అఖిలేశ్ యాదవ్‌కు లేదు'

"ఈ ఎన్నికలు మతం, కులం ఆధారంగా జరగవని నా గట్టి నమ్మకం. ప్రజా సమస్యలు, పనితీరు, అభివృద్ధి అంశాలే ఎన్నికల్లో ప్రధానంగా ఉంటాయి" అని ఆయన చెప్పారు.

కాంగ్రెస్ గురించి గతంలో తాను చేసిన వ్యాఖ్యలపై ఆజం ఖాన్ స్పష్టత ఇచ్చారు. తాను ఆ పార్టీని కాకుండా, ఆ పార్టీ నాయకత్వాన్ని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశానని వివరించారు.

"నేను నాయకత్వం గురించి మాట్లాడాను. వారందరిలో రాహుల్ గాంధీ మెరుగైన నాయకుడు. ఆయన బలమైన వ్యక్తి, మంచి నాయకుడు" అని అన్నారు.

ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత పరిస్థితి గురించి మాట్లాడుతూ "ప్రస్తుతం ఆ పార్టీకి కార్యకర్తలే లేరు. ఇక అభ్యర్థుల గురించి మాట్లాడడం ఉపయోగం లేదు" అని అన్నారు.

ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ తన రాజకీయ పునాదిని బలోపేతం చేసుకోవడానికి ఇంకా ఎంత సమయం పడుతుందని అడగ్గా ఆ పార్టీ తన పరిస్థితిని మెరుగుపరుచుకోవడానికి మరో 100 నుంచి 150 ఏళ్లు పడుతుందని సమాధానమిచ్చారు.

సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్, ప్రస్తుత అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్‌ను పోల్చి చూస్తే ఇద్దరి పనితీరు భిన్నంగా ఉందని ఆజం ఖాన్ స్పందించారు.

"ములాయం సింగ్ యాదవ్‌లో ఒక లోపం ఉండేది. ఆయనకు కోపం ఎక్కువ. అఖిలేశ్‌కు ఎప్పుడూ కోపం రాదు. కొన్నిసార్లు దాని వల్ల కూడా నష్టం జరుగుతుంది" అని అఖిలేశ్ యాదవ్ గురించి ఆయన అన్నారు.

తన రాజకీయ జీవితం గురించి మాట్లాడుతూ ఆజం ఖాన్ తన మొదటి నుంచి విద్యా రంగంపై ఆసక్తి ఉండేది అన్నారు.

"నేను పిల్లలకు పాఠాలు చెప్పాలని అనుకున్నాను" అని ఆయన అన్నారు.

ఎమర్జెన్సీ సమయంలో తనను జైలుకు పంపించారని దాని కారణంగా విద్యా రంగంలో తన కెరీర్ ముందుకు సాగలేదని వివరించారు.

"నాకు రాజకీయాలపై పెద్దగా ఆసక్తి కూడా ఉండేది కాదు. కానీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నిజాయితీగా పనిచేశాను. అందుకే విజయం సాధించాను" అని ఆజం ఖాన్ అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)