ఆధునిక చరిత్రలో తిరుమల వెంకన్నకు అత్యధిక బంగారం విరాళమిచ్చిన ఐదుగురు దాతలు..

ఫొటో సోర్స్, TTD
- రచయిత, గరికిపాటి ఉమాకాంత్
- హోదా, బీబీసీ కోసం
- ప్రచురణ
- చదివే సమయం: 7 నిమిషాలు
తిరుమల వేంకటేశ్వరస్వామి వారికి చెన్నైకి చెందిన వ్యాపార వేత్త వర్ధమాన్ జైన్, రాధిక జైన్ దంపతులు గురువారం (నవంబర్ 26, 2026) సుమారు రూ. 207.6 కోట్ల విలువైన 121 కిలోల బంగారం, వజ్రాభరణాలను సమర్పించారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో తిరుమల ఆలయంలో ఈ విరాళాన్ని అందజేశారు.
స్వామి వారి మూల మూర్తికి తల నుంచి పాదాల వరకు అలంకరించే 46 రకాల బంగారు, వజ్రాభరణాలను వారు కానుకగా అందించినట్టు టీటీడీ పీఆర్‌వో రవి బీబీసీతో చెప్పారు.
తిరుమల శ్రీవారికి 106 కిలోల బంగారంతో ఆభరణాలు చేయించగా మిగిలిన 15 కిలోల బంగారాన్ని తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారికి స్వర్ణ వస్త్రాలు తయారు చేయడానికి ఉపయోగిస్తారని తెలిపారు.
చరిత్రలో శ్రీకృష్ణ దేవరాయల తర్వాత ఇదే అత్యంత విలువైన కానుకగా భావిస్తున్నారు.


ఫొటో సోర్స్, TTD
1933లో బ్రిటిష్ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) స్థాపించిన తర్వాత ఇప్పటివరకు తొమ్మిది దశాబ్దాల కాలంలో ఇంత పెద్ద మొత్తంలో బంగారు కానుకలు రావడం ఇదే తొలిసారని టీటీడీ పీఆర్‌వో రవితో పాటు టీటీడీ ఈవోగా గతంలో పని చేసిన ఎల్వీ సుబ్రమణ్యం, ప్రధాన అర్చకులుగా గతంలో పనిచేసిన డాక్టర్ ఏవీ రమణ దీక్షితులు బీబీసీతో చెప్పారు.
ఓ రకంగా చరిత్రలో శ్రీకృష్ణ దేవరాయల తర్వాత మళ్లీ ఆ స్థాయిలో అంత పెద్ద మొత్తంలో బంగారు కానుకలు రావడం ఇదేనని రమణ దీక్షితులు వ్యాఖ్యానించారు.
తిరుమల ఆధునిక చరిత్రలో ఒకేసారి అత్యధికంగా బంగారు కానుకలు అందించిన వ్యక్తిగత దాతగా వర్ధమాన్ జైన్ నిలుస్తారని అన్నారు.

ఫొటో సోర్స్, TTD
ఎవరీ వర్ధమాన్ జైన్?
చెన్నై కేంద్రంగా పనిచేసే ఆసియా ఇంజినీరింగ్ సంస్థ డైరెక్టర్‌గా వర్ధమాన్ జైన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
అలాగే ప్రముఖ హెల్త్‌కేర్ బిజినెస్ ప్రాసెస్ ఔట్‌సోర్సింగ్ సంస్థ యాక్సెస్ హెల్త్‌కేర్ వ్యవస్థాపకుడు, బోర్డు వైస్ చైర్మన్‌గా కూడా వర్ధమాన్ ఉన్నారు.
‘‘వర్ధమాన్ జైన్ తిరుమల శ్రీవారి పరమ భక్తుడు. 15 నెలల క్రితం తన హెల్త్ కేర్ కంపెనీలో వాటాల విక్రయం ద్వారా కొన్ని వేల కోట్లు సంపాదించారు. అందులోంచి స్వామివారికి భారీ కానుక సమర్పించుకుంటానని మొక్కుకున్నారు.
ఇందులో భాగంగానే స్వామివారికి 106 కిలోలు, అమ్మవారికి 15 కిలోల బంగారు, వజ్రాభరణాలు తయారు చేయించి ఇవ్వాలనుకున్నారు. చెన్నెలో ఓ ప్రముఖ బంగారు ఆభరణాల తయారీ సంస్థ ఈ ఆభరణాలను తయారు చేసింది.
ఈ 46 ఆభరణాలను 46 చెక్క పెట్టెల్లో భద్రంగా పొందుపరిచి, చెన్నై నుంచి లారీలో తిరుమల శ్రీవారి ఆలయం వరకు తరలించారు. శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో ఈ ఆభరణాలను ప్రదర్శించి టీటీడీ అధికారులు లెక్క చూసుకున్నారు'' అని టీటీడీ పీఆర్‌వో రవి బీబీసీకి వివరించారు.

ఫొటో సోర్స్, TTD
ఇంతకు ముందూ టీటీడీకి వర్ధమాన్ జైన్ విరాళాలు
ఇప్పుడే కాదు.. గతంలోనూ జైన్ టీటీడీకి ఎన్నో విరాళాలను అందించారని రవి తెలిపారు.
''వర్ధమాన్ జైన్ 2025 జనవరిలో టీటీడీ ఆధ్వర్యంలోని వివిధ ట్రస్టుల కోసం 6 కోట్లరూపాయలు విరాళంగా ఇచ్చారు.
టీటీడీ గోశాలలో పశువుల దాణా తయారీ (మిక్సింగ్) ప్లాంట్ నిర్మాణానికి 5 కోట్లరూపాయలు అందజేశారు.
శ్రీవారి హుండీ కానుకల లెక్కింపు ప్రక్రియను వేగవంతం చేసేందుకు కోటిరూపాయల విలువైన నాణేల సార్టింగ్ , లెక్కింపు యంత్రాన్ని బహూకరించారు.
తిరుమలలో భక్తుల ఉచిత రవాణా సౌకర్యార్థం ఈ ఏడాది మేలో 'ఒలెక్ట్రా' ఎలక్ట్రిక్ బస్సును టీటీడీకి విరాళంగా ఇచ్చారు.
శ్రీ వేంకటేశ్వర భక్తి చానెల్ అభివృద్ధి కోసం 7 కోట్లరూపాయలు విరాళంగా అందించారు.
2020 సంవత్సరంలో వేర్వేరు సందర్భాలలో 2.10 కోట్లరూపాయలు, 1.11 కోట్లరూపాయల విరాళాలు సమర్పించారు.
అలాగే చెన్నైలోని టీటీడీ ఆలయానికి కూడా భారీ విరాళాలను అందించారు'' అని టీటీడీ అధికారులు వివరించారు.

ఫొటో సోర్స్, TTD
వర్ధమాన్ జైన్ కంటే ముందు భారీ విరాళాలిచ్చింది ఎవరంటే...
టీటీడీ అధికారులు బీబీసీతో చెప్పిన వివరాల ప్రకారం ఇప్పటివరకు అత్యధిక బరువున్న బంగారు ఆభరణాలను కానుకగా అందజేసినవారిలో వర్ధమాన్ జైన్ మొదటి స్థానంలో ఉన్నారు.
కర్ణాటకకు చెందిన గాలి జనార్దన్ రెడ్డి, ప్రవాసాంధ్రులు మంతెన రామరాజు, కోల్‌కతాకు చెందిన పారిశ్రామికవేత్త సంజీవ్ గోయెంకా, విశాఖకు చెందిన పువ్వాడ మస్తాన్ రావు, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణ మూర్తిలు ఆ తరువాత స్థానాల్లో నిలుస్తారు.
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి చారిత్రక కాలం నుంచి ఇప్పటి వరకు ఎందరో రాజులు, పారిశ్రామికవేత్తలు, సామాన్య భక్తులు భారీ మొత్తంలో బంగారు కానుకలు సమర్పించారు.
ఆధునిక చరిత్రలో శ్రీవారికి భారీ స్థాయిలో దాదాపు 206 కోట్లరూపాయలకు పైగా విలువైన స్వర్ణ కానుకలను బహూకరించిన వారిలో మొదటి స్థానంలో జైన్ ఉంటారు.
ఆ తర్వాత స్థానంలో కర్ణాటకకు చెందిన మాజీ మంత్రి గాలి జనార్ధన్‌రెడ్డి నిలుస్తారు. 2009 జూన్‌లో ఆయన నవరత్నాలు పొదిగిన సుమారు 31 కిలోల బరువైన దివ్య వజ్ర కిరీటం సమర్పించారు.
ఆ తర్వాత అమెరికాలో నివసించే ప్రవాసభారతీయుడు మంతెన రామరాజు 2017లో శ్రీవారికి 28 కిలోల సహస్రనామ కాసుల హారం కానుకగా అందజేశారు. అప్పటికి ఆ కానుకల విలువ సుమారు 8 కోట్లరూపాయలు.
2025లో కోల్‌కతాకి చెందిన పారిశ్రామికవేత్త సంజీవ్ గోయెంకా సుమారు 5 కోట్లరూపాయల విలువైన వజ్రాలు పొదిగిన బంగారు కటి హస్తం, వరద హస్తం, ఇతర స్వర్ణాభరణాలను అందించారు.
2025లో విశాఖకు చెందిన పువ్వాడ మస్తాన్‌రావు, కుంకమరేఖ దంపతులు 3.8రూపాయల కోట్ల విలువైన బంగారాన్ని స్వామివారికి కానుకగా అందజేశారు.
వీరే కాకుండా.. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి, సుధా మూర్తి దంపతులు కోటిన్నర రూపాయల విలువ చేసే 2 కేజీల బరువున్న బంగారు శంఖం, బంగారు కూర్మం విగ్రహం అందించారు. వీటిని స్వామివారి అభిషేకం కోసం ఉపయోగిస్తారు.

ఫొటో సోర్స్, TTD
శ్రీకృష్ణదేవరాయలు, పల్లవ, చోళ, పాండ్య రాజులు...
''విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు 16వ శతాబ్దంలో తిరుమల ఆలయాన్ని ఏడుసార్లు సందర్శించి, ఆనంద నిలయ విమానానికి బంగారు తాపడం చేయించడంతో పాటు, వజ్రాలు, నవరత్నాలు పొదిగిన అనేక కిరీటాలు, కంఠాభరణాలు, బంగారు నాణేలను సమర్పించారు.
పల్లవ, చోళ, పాండ్య రాజులు ఆలయ ప్రాకారాలు, ధ్వజస్తంభం, మూలవిరాట్టు అలంకరణ కోసం వందల కిలోల బంగారాన్ని, స్వర్ణ కలశాలను కానుకలుగా ఇచ్చారు'' అని రమణ దీక్షితులు బీబీసీకి వివరించారు.
18వ శతాబ్దంలో మరాఠా సేనాని రఘోజీ భోంస్లే స్వామివారికి అత్యంత విలువైన మరకతాలు, వజ్రాలు పొదిగిన బంగారు ఆభరణాలను సమర్పించారని.. ఇవి టీటీడీ ఆభరణాల రికార్డులలో నమోదై ఉన్నాయని దీక్షితులు వివరించారు.
మైసూర్ మహారాజులు, గద్వాల సంస్థానాధీశులు స్వామివారి ఉత్సవాల కోసం బంగారు వాహనాలు, కవచాలు, విలువైన ఆభరణాలను కానుకలుగా అందించిన చరిత్ర ఉందన్నారు.

ఫొటో సోర్స్, TTD
స్వామివారికి వచ్చే ఆభరణాలన్నీ బొక్కసంలో చాలా భద్రం: ఎల్వీ సుబ్రమణ్యం
‘‘స్వామివారికి వచ్చే బంగారు ఆభరణాలన్నీ టీటీడీ భద్రపరుస్తుంది. స్వామి వారికోసం ప్రత్యేకంగా చేయించిన ఆభరణాలను టీటీడీ దేవస్థానం ఖజానా బొక్కసంలోనే భద్రపరుస్తారు.
ఆ ఆభరణంలోని ఒక్క రాయి ముక్కలైనా.. ఆ ముక్కలతో సహా జాగ్రత్తపరుస్తారు. ఈ ఆభరణాలను యథాతథంగానే ఉంచుతారు’’ అని టీటీడీ ఈవోగా గతంలో పనిచేసిన ఎల్వీ సుబ్రమణ్యం బీబీసీకి తెలిపారు.

ఫొటో సోర్స్, TTD
ఏ బంగారం కరిగిస్తారు..
''భక్తులు తాము వినియోగించిన తర్వాత స్వామివారికి ఇచ్చే నగలు, ఆభరణాలు, నిలువు దోపిడీ మొక్కులుగా ఒంటి మీద ఉండే బంగారం తీసి ఇచ్చే కానుకలను మాత్రం కరిగించి బిస్కట్ల రూపంలోకి మార్చి జాతీయ బ్యాంకుల్లో గోల్డ్ డిపాజిట్ల రూపంలో భద్రపరుస్తారు.
ఇవి కూడా ఆర్‌బీఐ, మైన్స్ మినరల్ ట్రేడింగ్ కార్పొరేషన్ (ఎంఎంటీసీ) పర్యవేక్షణలోనే భద్రపరుస్తారు.
స్వామివారి కోసం భక్తులు ప్రత్యేకంగా తయారు చేసే ఆభరణాలు మాత్రం తిరుమల బొక్కసంలోనే ఉంటాయి.
వీటిపై ఎవరికీ అనుమానం అక్కరలేదు... జాగ్రత్తగా భద్రపరుస్తారు.. ఇప్పటివరకు టీటీడీ చరిత్రలో భారీ స్థాయిలో రెండుసార్లు విచారణ జరిగింది.
గతంలో వాగ్దా కమిషన్, జగన్నాథరావు కమిషన్‌లు టీటీడీ నగలు, ఆభరణాలకు సంబంధించి పూర్తి స్థాయిలో పరిశీలించి టీటీడీ జాగ్రత్తగా భద్రపరుస్తుందని నివేదికలిచ్చాయి. ఎవరూ అనుమానించాల్సిన అవసరం లేదని ఆ కమిషన్‌లు స్పష్టం చేశాయి'' అని ఎల్వీ సుబ్రమణ్యం వివరించారు.

ఫొటో సోర్స్, TTD
స్వామివారి ఒంటిపై 106 కేజీల బంగారం
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి విగ్రహాన్ని వారంలో ప్రతి శుక్రవారం నుంచి బుధవారం వరకు 106 కేజీల బంగారు ఆభరణాలతో అలంకరిస్తారని టీటీడీలో గతంలో ఓఎస్‌డీగా పనిచేసిన నగేశ్ బీబీసీతో చెప్పారు.
ఒక్క గురువారం మాత్రమే నిజరూప దర్శనం ఉంటుందని, మిగిలిన రోజుల్లో స్వామి వారికి 106 కేజీల బంగారు ఆభరణలతోనే అలంకరణ ఉంటుందని వివరించారు.
అందుకే దాత జైన్ ఇప్పుడు స్వామివారికి 106 కేజీల ఆభరణాలను బహూకరించారని ఆయన చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)


























