కార్తీక దీపం వివాదం: విజయ్ ప్రభుత్వం ఇబ్బందుల్లో పడనుందా? న్యాయ నిపుణులు ఏం చెబుతున్నారు?

తిరుప్పరంకుండ్రం, కార్తీక దీపం, తమిళనాడు, విజయ్, బీజేపీ
ఫొటో క్యాప్షన్, సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించలేదని విజయ్ ప్రభుత్వంపై బీజేపీ విమర్శలు చేస్తోంది.
    • రచయిత, విజయానంద ఆర్ముగం
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 5 నిమిషాలు

తిరుప్పరంకుండ్రం కొండ మీదున్న రాతి స్తంభంపై కార్తీక దీపం వెలిగించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించనందుకు మదురై జిల్లా కలెక్టర్ సహా నలుగురు అధికారులపై కోర్టు ధిక్కరణ కేసు నమోదైంది.

మదురై జిల్లాలోని తిరుప్పరంకుండ్రం కొండపై కార్తీక దీపం రోజు (నవంబర్ 24)న ఈ ఏడాది మటుకు దీపం వెలిగించాలని షరతులతో కూడిన అనుమతిచ్చింది. అయితే అది జరగలేదు.

కోర్టు ఆదేశాన్ని అమలు చేసేందుకు అన్ని విధాల ప్రయత్నించినట్లు మదురై కలెక్టర్ సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు.

సుప్రీంకోర్టు ఆదేశాన్ని విస్మరించినందుకు తమిళనాడులోని టీవీకే ప్రభుత్వం పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆ రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి నారాయణన్ తిరుపతి హెచ్చరించారు.

కోర్టు ఆదేశాన్ని అమలు చేయనందుకు విజయ్ ప్రభుత్వం చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కోనుందా? న్యాయ నిపుణులు ఏం చెబుతున్నారు?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఆలయ యంత్రాంగం, కోర్టు చెప్పినట్లు రాతి స్తంభంపై దీపాన్ని వెలిగించలేదు. ఎప్పటిలానే ఉచ్చిప్పిళ్లైయార్ మండపం వద్దే దీపాన్ని వెలిగించింది.

ఉద్దేశపూర్వకంగానే కోర్టు ఆదేశాన్ని అమలు చేయలేదని ఆరోపిస్తూ రామ్‌సుప్పు అనే న్యాయవాది బుధవారం రోజు (నవంబర్ 25)న సుప్రీంకోర్టులో ధిక్కరణ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.

మదురై జిల్లా కలెక్టర్, మదురై నగర పోలీస్ కమిషనర్, డిప్యూటీ పోలీస్ కమిషనర్, హిందూ రిలీజియన్ చారిటబుల్ ఎండోమెంట్స్ కమిషనర్, జాయింట్ కమిషనర్, తిరుప్పరంకుండ్రం సుబ్రమణ్యస్వామి ఆలయ ఎగ్జిక్యుటివ్ ఆఫీసర్‌లను కోర్టు ఆదేశాలను ధిక్కరించిన వారిగా తన పిటిషన్ లో పేర్కొన్నారు.

తిరుప్పరంకుండ్రం, కార్తీక దీపం, తమిళనాడు, విజయ్, బీజేపీ, సుప్రీం కోర్టు
ఫొటో క్యాప్షన్, ఆలయ యంత్రాంగం ఎప్పటిలానే ఉచ్చిప్పిళ్లైయార్ మండపం వద్దే దీపాన్ని వెలిగించింది.

సుప్రీంకోర్టు నవంబర్ 20న ఇచ్చిన ఆదేశాన్ని, మద్రాస్ హైకోర్టుకు ఇచ్చిన హామీని అధికారులు పూర్తిగా విస్మరించారని పిటిషన్‌లో పేర్కొన్నారు.

జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ విపుల్ పంచోలీతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం ఉదయం ఈ కేసు విచారణ చేపట్టింది.

తిరుప్పరంకుండ్రం, కార్తీక దీపం, తమిళనాడు, విజయ్, బీజేపీ, సుప్రీం కోర్టు
ఫొటో క్యాప్షన్, ఆలయ యంత్రాంగం, కోర్టు చెప్పినట్లు రాతి స్తంభంపై దీపాన్ని వెలిగించలేదు.

జిల్లా కలెక్టర్ ఏమన్నారు?

కొండపై ఎలాంటి దీపం వెలిగించలేదని మదురై జిల్లా కలెక్టర్ తరపు సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ సుప్రీంకోర్టుకు తెలిపారు.

కోర్టు ఆదేశాన్ని అమలు చేసేందుకు అన్ని విధాల చర్యలు తీసుకున్నట్లు ఓ ప్రకటనలో మదురై కలెక్టర్ తెలిపారు.

"దీపాలను వెలిగించే వ్యక్తుల పేర్లను ఆలయం యంత్రాంగం విడుదల చేయలేదు. అయినప్పటికీ, దీపాన్ని వెలిగించే కార్యక్రమం కోసం ఆలయ పాలకవర్గం, పోలీసులతో చర్చల అనంతరం భద్రతా ఏర్పాట్లను చేశాం" అని కలెక్టర్ పేర్కొన్నారు.

"అయితే ఆలయం హిందూ రిలీజియస్, చారిటబుల్ ఎండోమెంట్స్ డిపార్ట్‌మెంట్ పరిధిలో ఉండటం వల్ల, ఆ విభాగ కమిషనర్‌ని తగిన చర్యలను తీసుకోవాలని కోరాం. ఆలయంలో అనాదిగా వస్తున్న ఆచారాన్ని దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు బోర్డు ట్రస్టీలు మాకు చెప్పారు" అని జిల్లా కలెక్టర్ తెలిపారు.

అందుకే దీపాలు వెలిగించే వ్యక్తుల పేర్లను విడుదల చేయలేదని ఆయన వివరించారు.

దీపాలను వెలిగించనందుకు జిల్లా కలెక్టర్ కోర్టుకు క్షమాపణలు తెలిపారు.

"దీపాన్ని వెలిగించకపోవడం కోర్టు ఆదేశాన్ని ఉల్లంఘించడమే" అని ఆయన పేర్కొన్నారు.

కాగ, దీపాన్ని వెలిగించకపోవడం కోర్టు ఆదేశాన్ని ఉల్లంఘించడమేనని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. దీపాన్ని ఉచ్చిప్పిళ్లైయార్ ఆలయం నుంచి రాతి స్తంభం వద్దకు మార్చాలని అన్నారు. ఈ వ్యవహారంపై కోర్టు ధిక్కారణ చర్యలను ప్రారంభించాలని కోరారు.

తిరుప్పరంకుండ్రం వ్యవహారంతో రాజకీయంగా తీవ్ర చర్చ నడుస్తోంది. కాంగ్రెస్, వీసీకే, లెఫ్ట్ పార్టీలు దీపాన్ని వెలిగించకపోవడాన్ని స్వాగతించాయి.

కానీ, ఉప ఎన్నికల్లో మైనారిటీ ఓట్లు, అధికారం కోసమే టీవీకే ప్రభుత్వం కోర్టు తీర్పును గౌరవించలేదని తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. నాగేంద్రన్ విమర్శించారు.

సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులను అమలు చేయకుండా న్యాయ శాఖ మంత్రి తన పదవిలో కొనసాగడాన్ని ఖండిస్తున్నట్లు తమిళనాడు సీనియర్ బీజేపీ నేత తమిళసై సౌందరరాజన్ పేర్కొన్నారు.

"తిరుప్పరంకుండ్రం దీపం వ్యవహారంలో రాజ్యాంగ వ్యవస్థ విచ్ఛిన్నమైంది. ఒకసారి దీపాన్ని వెలిగించాలని సుప్రీంకోర్టు నవంబర్ 20న తీర్పు చెప్పింది. అయితే రాత్రి స్తంభంపై దీపం వెలిగించడాన్ని మంత్రులు సీటీఆర్ నిర్మల్ కుమార్, వన్నిఅరసు వ్యతిరేకిస్తున్నారు" అని కేంద్ర ప్రభుత్వం తరపు సీనియర్ న్యాయవాది రామమూర్తి చెప్పారు.

తిరుప్పరంకుండ్రం, కార్తీక దీపం, తమిళనాడు, విజయ్, బీజేపీ, సుప్రీం కోర్టు
ఫొటో క్యాప్షన్, ఈ వ్యవహారంలో ప్రభుత్వం పెద్దగా ఇబ్బందులేమీ ఎదుర్కోదని సీనియర్ లాయర్ కేఎం విజయన్ అన్నారు.

విజయ్ సర్కార్ ఇరకాటంలో పడనుందా?

"ఈ వ్యవహారంలో ప్రభుత్వం పెద్దగా ఇబ్బందులేమీ ఎదుర్కోదు. కోర్టు ఆదేశాన్ని ఉల్లంఘించినందుకు ఓ ధిక్కరణ నోటీస్ వస్తుంది. దీనిపై ప్రభుత్వం వివరణ ఇస్తుంది. శిక్ష పడే అవకాశం తక్కువే" అని సీనియర్ లాయర్ కేఎం విజయన్ అన్నారు.

"కోర్టు ఆదేశాన్ని అమలు చేయడంపై ప్రభుత్వ వైఖరి ఏంటో చూడాలి. తిరుప్పరంకుండ్రంపై గత పదేళ్లుగా అంతగా చర్చ లేదు. ఇప్పుడు ప్రతిదీ రాజకీయమైపోయింది" అని ఆయన పేర్కొన్నారు.

సీనియర్ లాయర్ సత్యచంద్రన్ కూడా ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. "సాంకేతిక కారణాల వల్ల కోర్టు ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టలేదు. దీనికి తమిళనాడు ప్రభుత్వాన్ని బాధ్యురాలిని చేయలేం. కాబట్టి కోర్టు ధిక్కారణ చర్యలకు అవకాశం తగ్గుతుంది" అని అన్నారు.

"నిబంధనల ప్రకారం, దీపం వెలిగించాలా లేదా అనే నిర్ణయం ఆలయ యంత్రాంగం మాత్రమే తీసుకోవాలి. కాబట్టి, ఇది రాజ్యాంగ ఉల్లంఘన అని చెప్పలేం. ప్రజా భద్రత వేరు. శాంతి భద్రత వేరు. ప్రజా భద్రత అంటే పెద్దపెద్ద అల్లర్లను నివారించడం. తిరుప్పరంకుండ్రం కేసులో రాజ్యాంగ వ్యవస్థ కుప్పకూలిందని చెప్పడానికి ఎలాంటి ఆధారం లేదు" అని సత్యచంద్రన్ చెప్పారు.

తిరుప్పరంకుండ్రం, కార్తీక దీపం, తమిళనాడు, విజయ్, బీజేపీ, సుప్రీం కోర్టు, రాజా
ఫొటో క్యాప్షన్, తమిళనాడు బీజేపీ నేత నాగేంద్రన్

కర్ణాటక ప్రభుత్వ కార్యదర్శిపై కేసు ఏమిటి?

కోర్టు ధిక్కరణ కేసులో టీఆర్ ధనంజయ్ వర్సెస్ వాసుదేవన్ కేసు చాలా కీలకమైనదిగా భావిస్తారు. 1995లో అప్పటి కర్ణాటక అర్బన్ డెవలప్‌మెంట్ సెక్రటరీగా ఉన్న వాసుదేవన్‌పై కోర్టు ధిక్కరణ కేసు నమోదైంది.

బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్‌లో డీఆర్ ధనంజయ ప్రమోషన్‌కి సంబంధించి కోర్టు ఆదేశాన్ని అమలు చేయనందుకు ఐఏఎస్ అధికారి వాసుదేవన్‌పై కోర్టు ధిక్కరణ కేసు నమోదైంది.

ప్రభుత్వ అధికారి అయినాసరే, కోర్టు ముందు అందరూ సమానమే అని సుప్రీం కోర్టు నాడు స్పష్టం చేసింది.

కోర్టు ఆదేశాన్ని ఉల్లంఘించడం చట్టవిరుద్ధమని పేర్కొంటూ, కోర్టు ఆయనకు నెల రోజులపాటు జైలు శిక్ష విధించింది.

తమిళనాడు బీజేపీ సీనియర్ నేత హెచ్.రాజాపై పడిన ధిక్కరణ కేసు గురించి ప్రస్తావిస్తూ, "ఈ ఒక్క కేసు మినహా, ఇటీవలి కాలంలో కోర్టు ధిక్కరణ గురించి పెద్దగా చర్చ లేదు" అని సత్యచంద్రన్ అన్నారు.

"అయితే, రాజా క్షమాపణ చెప్పిన తర్వాత ఆయనపై కేసును కొట్టివేశారు. మదురై జిల్లా కలెక్టర్‌కు కూడా ఇదే వర్తిస్తుంది" అని ఆయన వివరించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)