మైగ్రేన్ తలనొప్పి: మగవాళ్లకన్నా ఆడవాళ్లకే ఎక్కువగా వస్తుందా?ఎందుకు..

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సారా బెల్
- హోదా, గ్లోబల్ హెల్త్, బీబీసీ వరల్డ్ సర్వీస్
- ప్రచురణ
- చదివే సమయం: 6 నిమిషాలు
తీవ్రమైన తలనొప్పితో చీకటి గదిలో పడుకుని ఉండటం మైగ్రేన్‌తో బాధపడే చాలామందికి బాగా తెలిసిన భయంకరమైన, బాధాకరమైన అనుభవం.
మనిషిని తీవ్రంగా బాధించే ఈ పరిస్థితి.. సంబంధాలపై, ఉద్యోగాలపై, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
ముఖ్యంగా ఇది మహిళలను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది.
పురుషులతో పోలిస్తే మహిళలకు మైగ్రేన్ అటాక్ అయ్యే అవకాశాలు మూడింతలు ఎక్కువని పరిశోధనలు చెబుతున్నాయి.
అసలు మైగ్రేన్ రావడానికి కారణమేంటి? దాన్ని తగ్గించుకోవడానికి ఏం చేయచ్చు?


ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడుగురిలో ఒకరు మైగ్రేన్‌తో బాధపడుతున్నారని యూకేకు చెందిన మైగ్రేన్ ట్రస్ట్ చారిటీ తెలిపింది. అంటే 100 కోట్ల మంది కంటే ఎక్కువగా దీని బారిన పడుతున్నారు.
ఇదొక జన్యుపరమైన, నాడీ సంబంధిత సమస్య.
''కొంతమందిలో మైగ్రేన్‌కు సంబంధించిన జన్యువులు ఉండవచ్చు. అయితే, అవి ఎప్పటికీ క్రియాశీలకం కావు. అలాంటి వారు ఎలాంటి ఇబ్బంది లేకుండా జీవితాలను గడుపుతారు'' అని యూకే చారిటీ నేషనల్ మైగ్రేన్ సెంటర్‌కు చెందిన మైగ్రేన్ నిపుణులు డాక్టర్ కేటీ మున్రో చెప్పారు.
కానీ, ఇతరుల్లో వివిధ రకాల బాహ్య కారణాలు మెదడులోని నిర్దిష్ట మార్గాలను ప్రేరేపించగలవు. ఇవి మైగ్రేన్ లక్షణాలను ప్రేరేపించే న్యూరోకెమికల్స్ విడుదలకు దారితీస్తుంది.
వీటిలో తలనొప్పి మాత్రమే కాకుండా.. వాంతులు, కళ్లు తిరగడం, లేదా బ్రెయిన్ ఫాగ్ వంటివి కూడా ఉండొచ్చు.
''కొన్నిసార్లు ఒకరికి ఒక రకమైన లక్షణాలు కనిపిస్తాయి. మరోసారి ఆ లక్షణాలు భిన్నంగా ఉండొచ్చు. ఒకే కుటుంబంలోని సభ్యుల మధ్య కూడా దీని లక్షణాలు మారుతుండొచ్చు. జీవితకాలం దీని లక్షణాలు మారుతూ ఉండొచ్చు'' అని మైగ్రేన్ గురించి 'హెడ్స్ అప్' అనే పాడ్‌కాస్ట్ నిర్వహించే వ్యాఖ్యత డాక్టర్ మున్రో తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images

కేవలం ఒకే కారణం వల్ల మైగ్రేన్ రావడం చాలా అరుదు.
చిన్న చిన్న కారకాలు అన్నీ కలిసి బాధితుడి సహనశక్తి పరిమితిని దాటే వరకు పేరుకుపోతాయి. వీటిలో హార్మోన్ మార్పులు, అనియంత్రిత రక్తంలో చక్కెర స్థాయిలు, సరిగా నిద్రపోకపోవడం లేదా ఎక్కువసేపు నిద్రపోవడం వంటివి ఉండవచ్చు.
ఒత్తిడి చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అయితే, ఒత్తిడితో కూడిన సమయం తర్వాత వచ్చే ప్రశాంతమైన సమయం కూడా మైగ్రేన్ దాడికి దారితీస్తుంది.
మహిళల విషయంలో ఇది ఎక్కువగా జరుగుతుందని డాక్టర్ మున్రో చెప్పారు.
''మేమే తరచూ బాధ్యతలన్నింటిన్నీ సమన్వయం చేసుకుంటూ, మల్టిటాస్కింగ్ చేస్తూ, కుటుంబంలోని అందరి దినచర్యలను నిర్వహిస్తుంటాం'’ అని డాక్టర్ మున్రో తెలిపారు.
వాతావరణంలో మార్పులు అంటే ఉష్ణోగ్రతలు పెరగడం తగ్గడం, వాతావరణ పీడనం, తేమ వంటివి కూడా మైగ్రేన్ అటాక్స్‌ను ప్రేరేపించగలవు.
గాలి పీడనంలో మార్పు వంటి వాతావరణ మార్పులను శరీరం తట్టుకోవడానికి ప్రయత్నించడం ద్వారా లేదా డీహైడ్రేషన్ వంటి సంబంధిత ప్రభావాల ద్వారా ఇది జరుగుతుంది.
తక్కువ ఐరన్ స్థాయిలు, సీలియాక్ వ్యాధి లేదా థైరాయిడ్ పనితీరు మందగించడం వంటి ఆరోగ్య సమస్యలు కూడా మైగ్రేన్‌ను కలిగిస్తాయి.

సుమారు 10 శాతం మంది పిల్లలు మైగ్రేన్‌ల బారిన పడతారు. అబ్బాయిలు, అమ్మాయిలు సమానంగా ప్రభావితమవుతారు. అయితే, ఒక వయసుకు వచ్చిన తర్వాత, మహిళలకు పీరియడ్స్ సైకిల్ ప్రారంభమైనప్పుడు ఈ పరిస్థితి మారుతుంది.
"ఈ వయస్సు తర్వాత అమ్మాయిలలో మైగ్రేన్లు పెరగడానికి, పురుషుల కంటే ఎక్కువ మంది మహిళలు మైగ్రేన్ ఎటాక్స్‌తో బాధపడటానికి ఇది ఒక కారణం" అని డాక్టర్ మున్రో అన్నారు.
"పీరియడ్స్ పూర్తిగా ఆగిపోయే మెనోపాజ్ వరకు ఈ పరిస్థితి కొనసాగుతుంది" అని తెలిపారు.
హార్మోన్లలో హెచ్చుతగ్గులు మైగ్రేన్‌లకు ఒక ప్రధాన కారణం.
అమ్మాయిలకు పీరియడ్స్ ప్రారంభమైన తర్వాత ఈస్ట్రోజన్ స్థాయిలు విపరీతంగా పడిపోవడం వల్ల కూడా మైగ్రేన్లు మరింత ఇబ్బందికరంగా మారవచ్చు.
పెరిమెనోపాజ్ సమయంలో కూడా హార్మోన్ స్థాయిల్లో విపరీతమైన మార్పులు వస్తాయి. పెరిమెనోపాజ్ అనేది మహిళలకు పీరియడ్స్ ఆగిపోవడానికి ముందుండే కాలం. ఈ వేగవంతమైన మార్పులు కూడా మైగ్రేన్‌ను మరింత తీవ్రతరం చేస్తాయి.
"హార్మోన్లు పూర్తిగా అస్థిరంగా మారతాయి. పెరిమెనోపాజ్ సమయంలో మైగ్రేన్ ఒక పెద్ద సమస్య. ఇది చాలామంది మహిళలకు పెద్ద సమస్య" అని ఆమె తెలిపారు.
కానీ, దీనికి కారణం కేవలం హార్మోన్లు మాత్రమే కాదు. "మీరు ఒకే సమయంలో టీనేజ్ పిల్లలను, వృద్ధులైన తల్లిదండ్రులను చూసుకుంటూ ఉండవచ్చు. మెనోపాజ్ లక్షణాల కారణంగా మీకు నిద్ర పట్టడంలో ఇబ్బంది కూడా ఉండవచ్చు" అని ఆమె చెప్పారు.
మెనోపాజ్ తర్వాత హార్మోన్ స్థాయిలు మరింత స్థిరంగా మారడంతో మైగ్రేన్ తీవ్రత, తరచూ వచ్చే అవకాశం తగ్గుతుండొచ్చు.

ఫొటో సోర్స్, Getty Images

మైగ్రేన్ నాలుగు దశలలో వస్తుంది. మొదటి దశను ప్రోడ్రోమల్ లేదా ముందస్తు హెచ్చరిక దశ అని అంటారు.
ఈ కాలంలో, మెదడులో మార్పులు క్రమంగా పెరుగుతాయి. కొంతమందికి ఆవలింతలు, తీవ్రమైన అలసట లేదా మెడ నొప్పి వంటి హెచ్చరిక సంకేతాలు కనిపించవచ్చు.
తర్వాతి దశను ఆరా అంటారు. ఇది గంట వరకు కొనసాగవచ్చు. ఇందులో సాధారణంగా కళ్ల ముందు వంకర గీతలు లేదా తెల్లటి మచ్చలు వంటివి కనిపిస్తుంటాయి.
మైగ్రేన్ బాధితులలో సుమారు మూడింట ఒక వంతు మందిలో ఇది జరుగుతుంది.
దీని తర్వాత తలనొప్పి లేదా చాలా తీవ్రమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది 4 నుండి 72 గంటల వరకు కొనసాగవచ్చు. ఈ సమయంలో కొంతమందికి వికారం, వాంతులు కూడా అవుతుంటాయి.
చివరి దశను పోస్ట్-డ్రోమల్ లేదా హ్యాంగోవర్ ఫేజ్ అంటారు. తలనొప్పి చాలా వరకు తగ్గిన తర్వాత కూడా ఈ దశ ఒకటి లేదా రెండు రోజుల పాటు కొనసాగవచ్చు.
"మీ మీద నుంచి ఒక భారీ స్టీమ్‌రోలర్ వెళ్లినట్లు అనిపిస్తుంది" అని డాక్టర్ మున్రో చెప్పారు.

మైగ్రేన్ బాధితులకు సాంప్రదాయకంగా కెఫీన్ లేదా చాక్లెట్ వంటి వాటికి దూరంగా ఉండమని చెబుతారు.
కానీ దానికి బదులుగా, మన దినచర్యను వీలైనంత వరకు ఎలా క్రమబద్ధీకరించుకోవాలో ఆలోచించాలని డాక్టర్ మున్రో అన్నారు.
'' మైగ్రేన్ అటాక్ తీవ్రం కావడానికి ముందు గత రెండు మూడు రోజులలో ఏమి మార్పులు జరిగాయో ఆలోచించడం, ఒక మైగ్రేన్ డిటెక్టివ్‌లా మారడం వంటివి సహాయపడతాయి. ఎందుకంటే మీరు ఆ పనులను చేయకుండా ఉండటానికి ప్రయత్నించవచ్చు'' అని ఆమె వివరించారు.
కానీ, జీవితంలో చాలా జరుగుతుంటాయని డాక్టర్ మున్రో తెలిపారు. ''మనమందరం అంతా పర్‌ఫెక్ట్‌గా ఉండలేం. కాబట్టి అపరాధ భావంతో మిమ్మల్ని మీరే బాధించుకోకండి. మీవంతు ప్రయత్నం చేయండి'' అని మున్రో సూచించారు.
క్రమబద్ధంగా భోజనం చేయడం, రక్తంలో చక్కెర స్థాయిలను పడిపోకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. అలాగే మంచి నిద్రను పొందడానికి ప్రయత్నించడం, సాధ్యమైనంత వరకు ఒకే సమయంలో నిద్రపోవడం, ఒకే సమయంలో లేవడం కూడా అంతే ముఖ్యం.
వ్యాయామం ప్రతి ఒక్కరికీ చాలా ముఖ్యమైనదే అయినప్పటికీ.. ఇది మైగ్రేన్ నొప్పిని ప్రేరేపించగలదు. బాధితులు తగినంత ఆహారం, నీరు తీసుకుంటున్నారా లేదా? అన్నది వారికి వారుగా గమనించుకోవాలి.

ఫొటో సోర్స్, Getty Images

మైగ్రేన్‌లకు ప్రారంభ దశలోనే ప్రభావవంతమైన మందులతో చికిత్స అందేలా చూసుకోవడం చాలా ముఖ్యం. చాలామంది నొప్పి తీవ్రంగా మారేదాక నిర్లక్ష్యం చేస్తారని, వైద్యులను సంప్రదించేందుకు ఆలస్యం చేస్తారని డాక్టర్ మున్రో అన్నారు.
''అప్పటికే దాని ప్రభావాలు ఒకదాని తర్వాత ఒకటి తీవ్రతరమవుతూ, మీరు ఏం చేసిన ఆ నొప్పిని ఆపలేని స్థాయికి వెళ్తుంది. ప్రారంభంలోనే మందులు తీసుకోవడం వల్ల ఈ నొప్పి ప్రభావం మరింత తీవ్రతరం కాకుండా ఆపవచ్చు'' అని చెప్పారు.
పీరియడ్స్ సమయంలో మైగ్రేన్‌తో బాధపడే మహిళలకు, గర్భనిరోధక మాత్రలు హార్మోన్ల హెచ్చుతగ్గులను నియంత్రించడంలో సహాయపడతాయని తెలిసింది. పెరిమెనోపాజ్ సమయంలో హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ (హెచ్‌ఆర్‌టీ) కూడా ఉపయోగపడవచ్చు.
ఏ న్యూరోకెమికల్స్ ముఖ్యమైనవో శాస్త్రవేత్తలు గుర్తించారు. కొన్నింటిలో, సీజీఆర్‌పీ అనే పెప్టైడ్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇప్పుడు, మైగ్రేన్ ప్రభావాన్ని నిరోధించే చికిత్సలు అందుబాటులో ఉన్నాయి.
ఇతర చికిత్సలలో బోటాక్స్ కూడా ఉంది. ఇది నొప్పిని కలిగించే రసాయనాలను నిరోధించగలదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
ఆక్యుపంక్చర్, యోగా, తాయ్ చి, పెయిన్ రీప్రాసెసింగ్ థెరపీ వంటి చికిత్సలు కూడా సహాయపడవచ్చు.
ప్రజలు చేయగలిగిన అత్యంత ముఖ్యమైన పని మైగ్రేన్‌ల గురించి మరింత తెలుసుకోవడమేనని డాక్టర్ మున్రో అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























