కోర్టు రూమ్‌లో 200 మంది మహిళల చేతిలో దెబ్బలు తిని మరణించిన అక్కూయాదవ్ ఎవరు? వారికి ఆయనంటే ఎందుకంత ఆగ్రహం

ఫొటో సోర్స్, Praveen Mudholkar/bbc
- రచయిత, తుషార్ కులకర్ణి
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 8 నిమిషాలు
తెల్లవారుజామున నాలుగైదు గంటల సమయంలో మా ఇంటి తలుపును ఎవరో గట్టిగా కొట్టారు. నా భర్త తలుపు తెరిచారు. ఏమైందని అడిగారు. అందుకు ఆయన 'మీతో కాదు... మీ భార్యతో పని ఉంది' అని అన్నాడు. మాట్లాడేందుకు నా భర్త నిరాకరించారు. కానీ ఆయన ఒక కత్తి చూపించాడు.
‘‘నా భర్తను బాత్రూమ్లో బంధించి, నా చేయి పట్టుకుని బలవంతంగా కాలనీ బయటకు ఈడ్చుకెళ్లాడు. అక్కడ నాపై అత్యంత దారుణమైన అఘాయిత్యానికి పాల్పడ్డాడు. నాతో ఎంత నీచమైన పనులు చేశాడంటే, వాటి గురించి నేను మీకు చెప్పలేను. ఆ నివాస ప్రాంతంలో జరిగిన మొదటి అత్యాచారం అదే. ఆ తర్వాత ఆయన చాలా మంది మహిళలపై ఇలాగే చేశాడు’’
2022లో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన మూడు భాగాల డాక్యుమెంటరీ సిరీస్ 'ఇండియన్ ప్రిడేటర్: మర్డర్ ఇన్ ఎ కోర్ట్‌రూమ్'లో ఓ మహిళ తనకు ఎదురైన అనుభవాన్ని ఇలా వివరించారు.
ఆ మహిళపై అత్యాచారం జరిగినప్పుడు అక్కూయాదవ్ను ఎవరూ ఎదిరించలేకపోయారు.
కానీ కొన్ని సంవత్సరాల తర్వాత అదే అక్కూ యాదవ్‌ను కోర్టులో అత్యంత దారుణంగా హత్య చేశారు.
ఈ కేసులో కొందరు మహిళలపై.. కోర్టులో అక్కూ యాదవ్‌ను హత్య చేశారనే ఆరోపణలు వచ్చాయి.
అధికారికంగా అయిదుగురు మహిళలపై హత్య ఆరోపణలు నమోదయ్యాయి.
అయితే ఆ అయిదుగురే కాదు, మొత్తం 200 మంది మహిళలు ముందుకొచ్చి 'హత్య కేసులో మమ్మల్ని కూడా దోషులుగా చేర్చండి' అని డిమాండ్ చేశారు. ఆ తర్వాత మొత్తం 21 మందిపై హత్య కేసు నమోదైంది. అయితే చివరికి నిందితులందరినీ కోర్టు నిర్దోషులుగా విడుదల చేసింది.

భారత్‌లో సంచలనం సృష్టించిన ఈ ఘటన మహారాష్ట్రలోని నాగపుర్‌లో జరిగింది.
భరత్ కాళీచరణ్ యాదవ్ అలియాస్ అక్కూ యాదవ్ చనిపోయే సమయానికి ఆయన వయసు 32 ఏళ్లు అని రికార్డుల్లో ఉంది.
అంటే ఆయన సుమారు 1971-72 మధ్య పుట్టి ఉండొచ్చు.
నాగపుర్లోని కస్తూర్బా నగర్ మురికివాడలో ఆయన నివసించేవారు. వాళ్ల ఇంట్లో గేదెలు ఉండేవి. ఆయన తండ్రి పాల వ్యాపారం చేసేవారు.

ఫొటో సోర్స్, Praveen Mudholkar/bbc
అక్కూయాదవ్ ఎవరు?
అక్కూయాదవ్కు సంతోష్, యువరాజ్ అనే ఇద్దరు సోదరులు ఉన్నారు. అక్కూయాదవ్ హత్య జరిగినప్పుడు ఈ ఇద్దరూ కోర్టులో సాక్ష్యం చెప్పారు. అయితే వాళ్ల సాక్ష్యాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు.
ఆయన పెద్దగా చదువుకోలేదు. స్నేహితులతో తిరగడం, మద్యం, గంజాయి తాగడం, జూదం ఆడటం వంటి అలవాట్లకు బానిసయ్యాడు.
1991లో తొలిసారిగా అక్కూ యాదవ్ పేరు పోలీసు రికార్డుల్లో నమోదైంది. ఒక బాలికపై అత్యాచారం చేసినట్టు ఆయనపై ఆరోపణలొచ్చాయి.
ఆ సమయంలో నాగపుర్లోని కస్తూర్బా నగర్లో రెండు గ్యాంగులు పనిచేస్తుండేవి. వాటిలో ఒక గ్యాంగ్‌లో అక్కూ యాదవ్ చేరాడు. దొంగతనాలు, దోపిడీలు, బెదిరించి డబ్బులు వసూలు చేయడం వంటి నేరాలకు పాల్పడేవాడు.
కస్తూర్బా నగర్లో చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునే వారి నుంచి ఆయన బలవంతంగా నెలవారీ మామూళ్లు వసూలు చేసేవాడు.
బెదిరింపులతో ఇతరుల భూములను కూడా ఆక్రమించేవాడు.
ఆయనపై 24కు పైగా కేసులు నమోదయ్యాయి. వాటిలో హత్య, బెదిరించి డబ్బులు వసూలు చేయడం వంటి తీవ్రమైన నేరాలు కూడా ఉన్నాయి.
అక్కూ యాదవ్‌పై మహారాష్ట్ర ప్రివెన్షన్ ఆఫ్ డేంజరస్ యాక్టివిటీస్ (ఎంపీడీఏ) చట్టం కింద కూడా కేసు నమోదైంది.
మహారాష్ట్రలో మురికివాడల్లో అక్రమ భూ ఆక్రమణలు, అక్రమ మద్యం తయారీదారులు, మాదకద్రవ్యాల నేరగాళ్లు, ప్రమాదకర వ్యక్తుల చట్టవిరుద్ధ కార్యకలాపాలను అడ్డుకోవడానికి ఈ చట్టాన్ని రూపొందించారు.

ఫొటో సోర్స్, Netflix/Twitter
అక్కూయాదవ్ అరాచకాలు
అక్కూయాదవ్ హత్య తర్వాత అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఈ కేసుపై స్వతంత్రంగా అధ్యయనం చేశాయి.
కస్తూర్బా నగర్‌కు వెళ్లి అక్కడి ప్రజలను కలిశాయి. వారి అనుభవాలను, వాంగ్మూలాలను సేకరించాయి. ఆ సమయంలో వార్తాపత్రికల్లో వచ్చిన కథనాలను పరిశీలించాయి. పోలీసు రికార్డుల్లో నమోదైన కేసుల వివరాలను కూడా తనిఖీ చేశాయి.
ఇలాంటి సంస్థల్లో కామన్వెల్త్ హ్యూమన్ రైట్స్ ఇనిషియేటివ్ ఒకటి.
ఈ సంస్థ మొత్తం ఘటనపై 'విజిలెంటిజం ఇన్ నాగపుర్' పేరుతో ఒక నివేదికను విడుదల చేసింది.
అక్కూ యాదవ్ ఆ ప్రాంతంలో ఎలా భయాందోళనలు సృష్టించేవాడో ఈ నివేదికలో వివరించారు.
‘‘కస్తూర్బా నగర్లో హరిచంద్ ఖోర్సే అనే వృద్ధుడు నివసించేవారు. జీవనోపాధి కోసం ఆయన వాద్యం వాయించేవారు.
ఒకసారి అక్కూ ఆయన దగ్గరకు వచ్చి వంద రూపాయలు ఇవ్వాలని అడిగాడు.
ఆయన డబ్బులు ఇవ్వలేకపోవడంతో అక్కూ అత్యంత కిరాతకంగా ఆయనను కొట్టాడు.
ఆ ప్రాంతంలో ఎవరిదగ్గరకైనా సరే, ఎప్పుడైనా సరే వెళ్లి డబ్బులు, తినుబండారాలు, ఇతర వస్తువులు అడిగేవాడు. ఇవ్వకపోతే అసభ్య పదజాలంతో దూషించి కొట్టేవాడు.
అక్కూ యాదవ్ వేధింపులు భరించలేక కనీసం పది నుంచి పదిహేను కుటుంబాలు ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లిపోయాయి.
అక్కూయాదవ్కు ఎప్పుడూ అనుమానపడే స్వభావం ఉండేది. కాలనీలోని ప్రజలు తనకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారని అనుమానించేవారు.
అందుకే ఎప్పుడూ తన అనుచరులతోనే ఉండేవాడు.
ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నా వాళ్లు తనకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నారని అనుమానించేవాడు.
కాలనీలో మహిళలు, పురుషులు ఎవరైనా సరే స్వేచ్ఛగా మాట్లాడుకోవడం ఆయనకు నచ్చేది కాదు. చివరికి చిన్నపిల్లలను కూడా ఆడుకోనిచ్చేవాడు కాదు’’ అని ఆ నివేదికలో పేర్కొన్నారు.
ఈ నివేదికలో అక్కూ యాదవ్ గురించి మాయా జాంభుల్కర్ అనే మహిళ ఒక సంఘటనను వివరించారు.
"అక్కూ మా ఇంటికి వచ్చాడు. నా భర్త దుస్తులు విప్పించి, నన్ను డ్యాన్స్ చేయాలని బలవంతం చేశాడు. నేను నిరాకరించడంతో నా భర్త తొడపై సిగరెట్‌తో కాల్చాడు. మా కూతురు ముందే నన్ను డ్యాన్స్ చేయాలని బలవంతం చేశాడు" అని చెప్పారు.
అమెరికాలోని నాఫ్ ప్రచురణ సంస్థ ప్రచురించిన 'హాఫ్ ది స్కై: టర్నింగ్ అప్రెషన్ ఇంటూ ఆపర్చునిటీ ఫర్ విమెన్ వరల్డ్‌వైడ్' అనే పుస్తకంలో కూడా అక్కూ యాదవ్ గురించి ఆ ప్రాంత ప్రజలు చెప్పిన అనేక ఘటనలున్నాయి.
‘‘అక్కూ యాదవ్ ఒక కొత్తగా పెళ్లయిన మహిళపై అత్యాచారం చేశాడు.
మరో ఘటనలో పది రోజుల క్రితమే బిడ్డకు జన్మనిచ్చిన బాలింతరాలిపై ఆయన, ఆయన అనుచరులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ మహిళ కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు ప్రయత్నించారని ఆ పుస్తకంలో పేర్కొన్నారు.
అదే కాలనీలో నివసించే ఆశా భగత్ అనే మహిళను అక్కూ యాదవ్ హత్య చేశాడు. ఆమె రొమ్ములను కోసి, శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికేశాడు.
ఆ తర్వాత ఎవరినైనా బెదిరించడానికి ఈ హత్యను ఉదాహరణగా చూపించేవాడు.
'నీకు కూడా అలాంటి గతే పడుతుంది. ముందు అత్యాచారం చేసి, ఆ తర్వాత నీ శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికేస్తాను' అని మహిళలను బెదిరించేవాడు.
ఆశా భగత్ హత్య గురించి పోలీసులకు సమాచారం ఇవ్వడానికి అదే వీధిలో నివసించే మరో యువకుడు ముందుకొచ్చాడు.
ఆ యువకుడు అక్కూతో కూడా కలిసి తిరిగేవాడు. ఆశా భగత్‌తో కూడా అతనికి మంచి సంబంధాలు ఉండేవి’’ అని ఆ పుస్తకంలో రాశారు.
అయితే అక్కూ యాదవ్ ఆ యువకుడిని కూడా హత్య చేశాడని 'హాఫ్ ది స్కై' పుస్తకంలో పేర్కొన్నారు.
ఆ తర్వాత అక్కూ యాదవ్ జైలుకు వెళ్లాడు. అయితే కొన్ని నెలలకే బెయిల్‌పై బయటకు వచ్చాడు.
జైలులో ఉన్న సమయంలో ఆయనకు మరింత పెద్ద నేరగాళ్లతో పరిచయాలు ఏర్పడ్డాయి.
దీంతో అక్కూయాదవ్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఆగడాలు మరింత ఎక్కువయ్యాయి.
ఆయనపై ఎవరూ ఫిర్యాదు చేయడానికి కూడా ధైర్యం చేసేవారు కాదు.

ఫొటో సోర్స్, Puneet/BBC
అక్కూయాదవ్పై తిరుగుబాటు ఎలా మొదలైందంటే...
2004 జులై 30న కస్తూర్బా నగర్లో జరిగిన ఒక ఘటన అక్కూ యాదవ్‌పై తిరుగుబాటుకు కారణమైంది.
'హాఫ్ ది స్కై' పుస్తకంలో దీని గురించి రాశారు.. ‘‘అక్కూ యాదవ్ 13 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత డబ్బుల కోసం ఉషా నారాయణే ఇంటి పక్కనే నివసించే రత్నా డుంగ్రీ ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో ఉషా నారాయణే హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చదువుతున్నారు. ఆ కాలనీలో చదువుకున్న కొద్దిమందిలో ఆమె కూడా ఒకరు.
రత్నా ఇంట్లో జరుగుతున్న గొడవను ఉషా విన్నారు. వెంటనే అక్కూ యాదవ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయాలని రత్నాకు సూచించారు.
రత్నా పోలీసుల దగ్గరకు వెళ్లలేదు. కానీ ఉషా మాత్రం అక్కూ యాదవ్‌పై ఫిర్యాదు చేశారు.
ఆ తర్వాత ఉషా నారాయణే ఫిర్యాదు గురించి అక్కూ యాదవ్‌కు పోలీసుల్లో ఒకరు చెప్పారు.
ఈ విషయం తెలిసి అక్కూ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు.
సుమారు 40 మంది గూండాలను వెంటబెట్టుకుని ఉషా ఇంటికి వెళ్లాడు.
ఆమె ఇంటి తలుపును గట్టిగా కొడుతూ, 'నీ ముఖంపై యాసిడ్ పోస్తాను' అని బెదిరించాడు.
'మళ్లీ నువ్వు నా కంటపడితే, సామూహిక అత్యాచారం అనేది చాలా చిన్న విషయం. నీకు ఎలాంటి పరిస్థితి కల్పిస్తానో చూడు' అని కూడా హెచ్చరించాడు.
దీంతో ఉషా తన వంటగదిలో ఉన్న గ్యాస్ సిలిండర్‌ను తలుపు దగ్గరకు తీసుకొచ్చారు.
తలుపు సందులో నుంచి గ్యాస్ పైపును బయటకు పెట్టి, 'నువ్వు ఇక్కడి నుంచి వెళ్లకపోతే సిలిండర్‌కు నిప్పంటిస్తాను. మనమందరం కాలిపోతాం' అని హెచ్చరించారు’’ అని ఆ పుస్తకంలో రాశారు.
‘‘అక్కూ యాదవ్‌కు వ్యతిరేకంగా ఒకరు గొంతెత్తడం ఆ కాలనీవాసులకు కొత్త అనుభవం.
ఉషా అక్కూను ఎదిరించగలిగితే, తామెందుకు ఎదిరించలేమని వారు ఆలోచించారు.
దీంతో కాలనీలోని ప్రజలంతా ఇళ్ల నుంచి బయటకు వచ్చారు.
చేతికి దొరికిన కర్రలు, రాళ్లు పట్టుకుని అక్కూ యాదవ్‌ను ఎదిరించడానికి ముందుకొచ్చారు.
ప్రజల ఆగ్రహాన్ని చూసి అక్కూ అక్కడి నుంచి పారిపోయారు.
అక్కూ యాదవ్‌పై పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉషా నారాయణే ఆగస్టు 4న విలేకరుల సమావేశం కూడా ఏర్పాటు చేశారు.
అక్కూ కనిపించకపోవడంతో కాలనీవాసులు అతని ఇంటిని పూర్తిగా ధ్వంసం చేశారు.
కొన్ని రోజుల పాటు అతను కనిపించకుండా పోయాడు. ఆ తర్వాత స్వయంగా పోలీసులకు లొంగిపోయాడు’’ అని రాశారు.
2004 ఆగస్టు 8న తొలిసారి అతన్ని కోర్టులో హాజరుపరిచారు. ఆ తర్వాత ఆగస్టు 13న తదుపరి విచారణ తేదీని నిర్ణయించారు.

ఫొటో సోర్స్, Not Specified
అక్కూయాదవ్ హత్య జరిగిన రోజు...
ఆగస్టు 13న అక్కూ యాదవ్ కేసు విచారణ జరగనుందని, అతనికి బెయిల్ వచ్చే అవకాశం ఉందని కాలనీ అంతటా వార్త వ్యాపించింది.
ఆయన మళ్లీ బయటకు వస్తే తన అరాచకాలు తిరిగి మొదలవుతాయని మహిళలు భయపడ్డారు.
ఎలాగైనా అక్కూ యాదవ్‌ను అంతం చేయాలని వారు నిర్ణయించుకున్నారు.
ఇళ్లలో ఉన్న ఎండుమిర్చిని దంచి పొడిగా తయారు చేసుకున్నారు.
అందుబాటులో ఉన్న ఆయుధాలను తీసుకుని కోర్టుకు వెళ్లారు.
మధ్యాహ్నం 2.30 గంటలకు అక్కూ యాదవ్ నాగ్‌పూర్‌లోని న్యాయ మందిర్ కోర్టు ప్రాంగణానికి చేరుకున్నాడు.
ఆయన చేతులకు సంకెళ్లు ఉన్నాయి. ఆ సంకెళ్లతో మరోవైపు రామ్ గేడమ్ అనే మరో నిందితుడిని కూడా బంధించారు. ఆయన కేసులో కూడా అదే రోజు కోర్టులో విచారణ జరగాల్సి ఉంది.
'హాఫ్ ది స్కై' పుస్తకంలో పేర్కొన్న వివరాల ప్రకారం అక్కూ యాదవ్ పోలీసు వ్యాన్ నుంచి కిందకు దిగాడు.
ఆయన ముఖంలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించలేదు.
అక్కడ గుమిగూడిన మహిళల్లో ఒకరిని గుర్తించి, ఆమెను అసభ్య పదజాలంతో దూషించాడు.
మళ్లీ నీపై అత్యాచారం చేస్తానని బెదిరించాడు.
అప్పుడు ఆ మహిళ తన కాలికి ఉన్న చెప్పును తీసి, ఆయన దగ్గరకు వెళ్లి తలపై కొట్టింది.
"ఈరోజు నువ్వు నా ప్రాణం తీయాలి. లేదంటే నీ ప్రాణం నేను తీస్తాను" అని ఆమె అంది.
ఆ తర్వాత మహిళలంతా ఒక్కసారిగా ఆయన్ను చుట్టుముట్టి దాడి చేశారు.
అక్కూయాదవ్కు రక్షణగా ఇద్దరు పోలీసులున్నారు. కానీ అక్కడ ఏం జరుగుతుందో వారికి అర్థం కాలేదు.
ఎలాగోలా అక్కూయాదవ్ను కోర్టు నంబర్ 7లోని గదిలోకి తీసుకెళ్లారు.
అయితే అక్కడ కూడా ఆయనపై దాడి జరిగింది.
తనపై దాడి చేయొద్దని అక్కూయాదవ్ వేడుకున్నాడు. ఇకపై ఇలాంటి పనులు ఎప్పుడూ చేయనని బతిమాలుకున్నాడు.
కానీ మహిళలు ఆయన మాట వినే పరిస్థితిలో లేరు.
వారు ఆయన ముఖంపై కారం పొడి చల్లారు. కర్రలతో కొట్టారు. కత్తులతో పొడిచారు.
ఆయన శరీరంపై మొత్తం 74 గాయాలు ఉన్నట్టు పోస్ట్‌మార్టమ్‌లో తేలింది.
మహిళలు ఎంతటి ఆగ్రహంతో ఉన్నారంటే వాళ్లు ఆయన జననాంగాన్ని కూడా కోసేశారని 'హాఫ్ ది స్కై' పుస్తకంలో పేర్కొన్నారు.
ఆయన కళ్లలో, ముక్కులో, నోటిలో రాళ్లు, మిరపకాయలు కుక్కారు.

మహిళల అరెస్టు, విడుదల
అక్కూయాదవ్ హత్య కేసులో పోలీసులు మొదట అయిదుగురు మహిళలను అరెస్టు చేశారు.
అయితే కస్తూర్బా నగర్‌కు చెందిన మహిళలు తమను కూడా అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
'ఆ అయిదుగురు మహిళలే కాదు, మమ్మల్ని కూడా అరెస్టు చేయండి' అని వాళ్లు చెప్పారు.
తామే అక్కూ యాదవ్‌ను హత్య చేశామని 200 మంది మహిళలు ప్రకటించారు.
తమను కూడా అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
అక్కూయాదవ్ హత్యతో మహారాష్ట్ర అంతటా సంచలనం రేగింది.
దేశవ్యాప్తంగా ఈ ఘటనపై చర్చ మొదలైంది. అంతర్జాతీయ మీడియా కూడా ఈ ఘటనను ప్రముఖంగా ప్రచురించింది.
చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడాన్ని చాలామంది తప్పుబట్టారు.
అయితే అక్కూ యాదవ్‌ను చంపడం తప్ప, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం తప్ప ఆ మహిళలకు మరో మార్గం లేకుండా పోయిందని కొందరు అభిప్రాయపడ్డారు.
రిటైర్డ్ న్యాయమూర్తి వహానే మహిళలకు మద్దతుగా నిలిచారు.
"ఆ మహిళలు ఎదుర్కొన్న పరిస్థితులను చూస్తే, అక్కూను అంతం చేయడం తప్ప వారికి మరో మార్గం మిగలలేదు. తమకు రక్షణ కల్పించాలని మహిళలు పోలీసులను పదేపదే కోరారు. కానీ పోలీసులు వారికి రక్షణ కల్పించడంలో విఫలమయ్యారు" అని న్యాయమూర్తి వహానే 'ది గార్డియన్' వార్తాపత్రికకు చెప్పారు.
కమ్యూనిస్టు ఉద్యమానికి చెందిన సీనియర్ సామాజిక కార్యకర్త వి.చంద్ర కూడా ఆ మహిళలకు అండగా నిలిచారు.
ఇది హత్య కాదని, న్యాయం చేయడమేనని అన్నారు.
సీనియర్ జర్నలిస్ట్ తవ్లీన్ సింగ్ ఎన్డీటీవీ కోసం ఈ ఘటనపై ఒక ప్రత్యేక కథనం రూపొందించారు.
"రాత్రింబవళ్లు ప్రజలను దోచుకునే, మహిళలపై అత్యాచారాలు చేసే ఒక గూండా అక్కూయాదవ్. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరిపై కత్తులతో దాడి చేసేవాడు. 14 ఏళ్ల బాలిక నుంచి ఏడు నెలల గర్భిణి వరకు ఎవరినీ వదలకుండా అత్యాచారాలకు పాల్పడేవాడు.
ఇలాంటి వ్యక్తి అరాచకాలను ప్రజలు పదేళ్ల పాటు భరించారు.
న్యాయవ్యవస్థ, పరిపాలనా వ్యవస్థ, పురుషాధిక్య సమాజ వ్యవస్థ పూర్తిగా విఫలమయ్యాయి. వాటికి వ్యతిరేకంగా కస్తూర్బా నగర్ ప్రజలు తమను తాము రక్షించుకోవడానికి ఈ చర్యకు పాల్పడ్డారు" అని ఆమె చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)


























