డీలిమిటేషన్: ఈసారి మోదీ సర్కార్ బిల్లు పాస్ చేయించగలదా? సంఖ్యా బలం ఏం చెబుతోంది?

డీలిమిటేషన్ బిల్లు, పార్లమెంట్
ఫొటో క్యాప్షన్, పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
ప్రచురణ
చదివే సమయం: 6 నిమిషాలు

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు. ఈ సమావేశాల్లో మోదీ ప్రభుత్వం డీలిమిటేషన్ బిల్లును ఆమోదింపజేసుకునేందుకు ప్రయత్నించవచ్చనే చర్చ జరుగుతోంది.

అయితే, ప్రత్యేక సమావేశాల అజెండా గురించి రిజిజు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. 'ముఖ్యమైన ప్రభుత్వ కార్యకలాపాలను పూర్తి చేయడం' కోసమే ఈ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నట్లు సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో ఆయన తెలిపారు.

విపక్ష ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న ఎన్సీపీ (శరద్ పవార్) నేత సుప్రియా సూలే రెండు రోజుల కిందట చేసిన వ్యాఖ్యలు ఈ చర్చకు మరింత ఊతమిచ్చాయి.

‘‘దేశ ప్రయోజనాలకు సంబంధించిన అంశమైతే దానిపై కూడా ఏకాభిప్రాయానికి రావచ్చు’’ అని ఆమె అన్నారు. అయితే, ‘‘మాకు ఇప్పటివరకేం తెలియదు. ముందు బిల్లు రానివ్వండి’’ అన్నారు.

కొత్త బిల్లులను ప్రవేశపెట్టనున్నారనే వార్తల నేపథ్యంలో మరోసారి డీలిమిటేషన్‌పై చర్చ మొదలైంది. రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించేందుకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు పార్లమెంట్‌లో మూడింట రెండొంతుల మెజారిటీ ఉందా? అన్న సందేహాలు కూడా ఉన్నాయి. అవసరమైన మెజారిటీ లేకపోవడంతో ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన ఓటింగ్‌లో ఈ బిల్లు ఆమోదం పొందలేదు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించిన వివరాల ప్రకారం, లోక్‌సభ సమావేశాలు నవంబర్ 30న, రాజ్యసభ సమావేశాలు డిసెంబర్ 2న జరగనున్నాయి.

డిసెంబర్ 3న ప్రత్యేక సమావేశాలు ముగిసే అవకాశం ఉంది. అజెండాను అధికారికంగా ప్రకటించకపోయినా ఈ ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్ బిల్లును ప్రవేశపెడతారని విపక్ష నేతలు చెబుతున్నారు.

''వారి నియోజకవర్గాల పునర్విభజన బిల్లు పార్లమెంట్‌ చోరీ ప్రయత్నం తప్ప మరొకటి కాదు. ఆ బిల్లును ఆమోదించనివ్వం'' అని కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ ఎక్స్ పోస్టులో రాశారు. కాంగ్రెస్ ‘ఓట్ చోరీ’ నినాదం మాదిరిగా ఆయన ‘పార్లమెంట్ చోరీ’ పదాన్ని ఉపయోగించారు.

డీలిమిటేషన్ బిల్లు, పార్లమెంట్
ఫొటో క్యాప్షన్, ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రవేశపెట్టిన డీలిమిటేషన్ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందలేదు.

ఏప్రిల్‌లో ఏం జరిగింది?

మహిళా రిజర్వేషన్ చట్టం, డీలిమిటేషన్‌కు సంబంధించిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు 2026 ఏప్రిల్ 17న లోక్‌సభలో వీగిపోయింది.

పార్లమెంట్‌లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే చట్టానికి సవరణలు, డీలిమిటేషన్‌కు సంబంధించిన బిల్లులపై ఓటింగ్ జరిగినప్పుడు అనుకూలంగా 298 ఓట్లు, వ్యతిరేకంగా 230 ఓట్లు వచ్చాయి. 11 మంది ఎంపీలు ఓటింగ్‌కు గైర్హాజరయ్యారు.

రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే లోక్‌సభలో కనీసం మూడింట రెండొంతుల మంది సభ్యుల మద్దతు అవసరం. అప్పట్లో లోక్‌సభలో 528 మంది సభ్యులు ఓటింగ్‌లో పాల్గొనగా, బిల్లు ఆమోదం పొందడానికి 352 ఓట్లు కావాలి. అంటే అవసరమైన సంఖ్య కంటే 54 ఓట్లు తక్కువగా వచ్చాయి.

దీంతో కేంద్రపాలిత ప్రాంతాలు, నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన మరో రెండు బిల్లులను కూడా ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లలేకపోయింది.

అయితే, ఈసారి మోదీ ప్రభుత్వం కొత్తగా బిల్లును పార్లమెంట్ ముందుకు తీసుకురావచ్చని, ఆమోదం పొందేందుకు గట్టిగా ప్రయత్నిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం, గతంలో ఇండియా కూటమిలో భాగంగా ఉన్న డీఎంకే ఈసారి బిల్లుకు మద్దతు ఇచ్చే సంకేతాలు పంపడంతో తమకు మూడింట రెండొంతుల మెజారిటీ లభిస్తుందని కేంద్ర ప్రభుత్వం ఆశిస్తోంది.

అయితే, తమిళనాడుకు ప్రస్తుతం లోక్‌సభలో ఉన్న సుమారు 7.2 శాతం సీట్ల వాటా అలాగే కొనసాగుతుందనే హామీ కావాలని డీఎంకే కోరుతున్నట్లు ఆ పత్రిక తన కథనంలో పేర్కొంది.

డీలిమిటేషన్ బిల్లు, పార్లమెంట్, స్టాలిన్
ఫొటో క్యాప్షన్, తమిళనాడు ప్రయోజనాలకు సంబంధించిన షరతులకు అంగీకరిస్తే బిల్లుకు మద్దతు ఇవ్వనున్నట్లు డీఎంకే సంకేతాలు పంపింది.

ప్రస్తుత బలాబలాలు ఏం చెబుతున్నాయి?

ప్రస్తుతం లోక్‌సభలో మొత్తం 540 మంది ఎంపీలు ఉన్నారు. ఈ లెక్కన మూడింట రెండొంతుల మెజారిటీకి 360 మంది సభ్యుల మద్దతు అవసరం. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏకు 293 సీట్లు వచ్చాయి.

అయితే, తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన 20 మంది అసమ్మతి ఎంపీలు పార్టీ నుంచి విడిపోయి ఎన్డీఏకు మద్దతు ప్రకటించడంతో ఈ సంఖ్యలో మార్పు వచ్చింది.

ఈ ఏడాది జూన్‌లో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేనకు చెందిన ఆరుగురు ఎంపీలు పార్టీ మారి ఏక్‌నాథ్ షిండే వర్గంలో చేరారు. షిండే వర్గం ఇప్పటికే ఎన్డీఏలో భాగస్వామి. దీంతో ఎన్డీఏ బలం 319కి పెరిగింది.

గతంలో డీలిమిటేషన్ బిల్లును డీఎంకే వ్యతిరేకించింది. అయితే, ఈసారి మద్దతు ఇచ్చే సంకేతాలు పంపింది.

''కొత్త బిల్లు మాకు ఆమోదయోగ్యంగా ఉంటే మద్దతు ఇస్తాం. ముందు బిల్లు రానివ్వండి'' అని డీఎంకే అధికార ప్రతినిధి టీకేఎస్ ఇళంగోవన్ శుక్రవారం ఏఎన్‌ఐతో చెప్పారు.

లోక్‌సభలో డీఎంకేకు 22 మంది ఎంపీలు ఉన్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కాంగ్రెస్‌తో విడిపోయిన డీఎంకే, 'ఇండియా కూటమి'కి దూరమైంది.

ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం, కేంద్ర ప్రభుత్వం తమను సంప్రదించినట్లు డీఎంకే నేత ఒకరు అంగీకరించారు. తమిళనాడుకు ప్రస్తుతం లోక్‌సభలో ఉన్న సుమారు 7.2 శాతం సీట్ల వాటాను కొనసాగిస్తామని హామీ ఇస్తే డీలిమిటేషన్‌కు మద్దతు ఇచ్చే అవకాశం ఉందని ఆయన చెప్పారు.

ఎన్సీపీ (శరద్ పవార్) నేత సుప్రియా సూలే కూడా బిల్లుకు మద్దతు ఇచ్చే సంకేతాలు గతంలో ఇచ్చారు. అయితే, శుక్రవారం దీనిపై వ్యాఖ్యానించేందుకు ఆమె నిరాకరించారు. లోక్‌సభలో ఆ పార్టీకి ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు.

''గతంలో ప్రతిపక్షాలు పలు అంశాలకు మద్దతు ఇచ్చాయి. పహల్గాం ఘటన, జీఎస్టీ బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లుకు మేమంతా ఏకాభిప్రాయంతో మద్దతు ఇచ్చాం. దేశ ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై చర్చ జరగాలి'' అని సుప్రియా సూలే గత బుధవారం మీడియాతో అన్నారు.

లోక్‌సభలో ఆమోదం పొందితే ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

245 మంది సభ్యులున్న రాజ్యసభలో ఎన్డీఏకు 142 మంది ఎంపీల బలం ఉంది. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే కనీసం 161 మంది సభ్యుల మద్దతు అవసరం. అంటే అధికార కూటమికి మరో 19 మంది ఎంపీల మద్దతు కావాలి.

రాజ్యసభలో డీఎంకేకు ఎనిమిది మంది, ఎన్సీపీ (శరద్ పవార్)కు ఒక ఎంపీ ఉన్నారు. ఎన్డీఏలో భాగం కాని ప్రాంతీయ పార్టీలతో సహా ఇతర పార్టీలకు చెందిన సుమారు 100 మంది ఎంపీలు ఉన్నారు. అవసరమైన మద్దతును కూడగట్టగలమనే ధీమాతో బీజేపీ ఉంది.

డీలిమిటేషన్ బిల్లు, పార్లమెంట్
ఫొటో క్యాప్షన్, 'నిష్పక్షపాత డీలిమిటేషన్ కోసం జాతీయ నేతల సమావేశం' అంటూ గతంలో తీసిన ఈ ఫోటోను స్టాలిన్ షేర్ చేశారు.

స్టాలిన్ ఏమన్నారు?

'డీలిమిటేషన్ వల్ల తలెత్తే పరిణామాలపై దేశంలో తొలుత గళమెత్తిన పార్టీ డీఎంకేనే' అని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నారు.

నిష్పక్షపాతంగా నియోజకవర్గాల పునర్విభజన జరగాలనే డిమాండ్‌పై జాతీయ స్థాయి నేతలందరినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చేందుకు తొలి సమావేశం కూడా చెన్నైలోనే నిర్వహించినట్లు ఆయన ఎక్స్‌లో తెలిపారు.

తమిళనాడు అసెంబ్లీలో ఆమోదించిన తీర్మానం, నిష్పక్షపాత డీలిమిటేషన్ కోసం ఏర్పాటైన జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం తమకు రెండు స్పష్టమైన డిమాండ్లు ఉన్నాయని స్టాలిన్ పేర్కొన్నారు.

1. లోక్‌సభ సీట్ల సంఖ్య పెంచినా ఏ పరిస్థితుల్లోనూ తమిళనాడుకు ప్రస్తుతం ఉన్న 7.18 శాతం వాటా తగ్గకూడదు.

2. 1971 జనాభా లెక్కల ఆధారంగా నిర్ణయించి, ఇప్పటికే స్థిరీకరించిన రాష్ట్రాల మధ్య లోక్‌సభలో ప్రస్తుతం ఉన్న ప్రాతినిధ్య నిష్పత్తి మరో 25 ఏళ్ల పాటు కొనసాగాలి.

''డీఎంకే ఇప్పటికీ ఈ రెండు డిమాండ్లకు కట్టుబడి ఉంది. భవిష్యత్తులోనూ వాటిపై మా వైఖరి మారదు. మా వైఖరిలో ఎలాంటి మార్పు లేదు. రాజీ పడే ప్రసక్తే లేదు. మీడియాలో వస్తున్న ఊహాగానాలు, నమ్మకద్రోహుల వ్యాఖ్యలు మా వైఖరిని ఏమాత్రం ప్రభావితం చేయలేవు'' అని స్టాలిన్ తెలిపారు.

మనోజ్ ఝా

ప్రతిపక్షాలు ఏమంటున్నాయి?

డీలిమిటేషన్ బిల్లుపై ఇండియా కూటమి నేతలు స్పందించారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు మహిళా రిజర్వేషన్ల కోసం కాదని స్పష్టమవుతోందని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ అన్నారు. మహిళా రిజర్వేషన్ ఇప్పటికే చట్టంగా మారిందని గుర్తుచేశారు.

''ప్రజల గొంతుకను అణచివేసేందుకు నియోజకవర్గాల సరిహద్దులను ఇష్టానుసారంగా మార్చడమే ఈ ప్రత్యేక సమావేశాల ఉద్దేశం'' అని ఎక్స్ పోస్టులో జైరాం రమేశ్ తెలిపారు.

''నియోజకవర్గాల సరిహద్దులను నిర్ణయించే బాధ్యత ఎవరికి అప్పగిస్తారు?'' అని ఆయన ప్రశ్నించారు.

నవంబర్ 30న జరగనున్న పార్లమెంట్ సమావేశాలపై దేశం మొత్తం దృష్టి ఉంటుందని కాక్రోచ్ జనతా పార్టీకి చెందిన ఆశుతోష్ రాంకా అన్నారు.

డీలిమిటేషన్ బిల్లును మోదీ ప్రభుత్వం చేయబోతున్న అతిపెద్ద తప్పిదంగా సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ అభివర్ణించారు.

డీలిమిటేషన్ పేరుతో రాజకీయ పక్షపాతం చూపే అవకాశం ఉందని రాష్ట్రీయ జనతాదళ్ ఎంపీ, జాతీయ అధికార ప్రతినిధి మనోజ్ ఝా 'ఎక్స్' పోస్టులో తెలిపారు. ప్రతిపాదిత డీలిమిటేషన్ ప్రక్రియ కేవలం సీట్ల సంఖ్యను పెంచడానికి మాత్రమే పరిమితం కాదనే విషయం స్పష్టంగా ఉండాలని తెలిపారు.

మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సాగరికా ఘోష్ కూడా ఈ బిల్లుపై విమర్శలు చేశారు.

''నరేంద్ర మోదీ ప్రభుత్వం డీలిమిటేషన్ బిల్లును తీసుకొస్తోంది. ఎన్నికల్లో బీజేపీకి ప్రయోజనం కలిగేలా అన్ని నియోజకవర్గాల మ్యాప్‌ను తిరిగి రూపొందించుకునే అవకాశం కల్పించడమే దీని ఉద్దేశం. ఇదంతా మహిళా శక్తి లేదా మహిళల ప్రాతినిధ్యం కోసమేనని ప్రభుత్వం చెబుతోంది'' అని సాగరిక ఘోష్ ఎక్స్ పోస్టులో తెలిపారు.

''డీలిమిటేషన్ బిల్లు అంటే మరేమీ కాదు. చీర చుట్టి తీసుకువస్తున్న అధికారాన్ని సిగ్గులేకుండా కైవసం చేసుకునే ప్రయత్నం. ఇది ప్రజాస్వామ్యం పట్ల బీజేపీకి ఉన్న నిర్లక్ష్యాన్ని మాత్రమే కాకుండా మహిళల పట్ల ఆ పార్టీకి ఉన్న వ్యతిరేకతను, అవమానకర వైఖరిని కూడా బయటపెడుతోంది'' అని ఆమె అన్నారు.

ఏప్రిల్‌లో బీజేపీ చేసిన తొలి ప్రయత్నాన్ని ప్రతిపక్షాలు అడ్డుకున్నాయని రాజకీయ విశ్లేషకుడు యోగేంద్ర యాదవ్ ఎక్స్‌లో పోస్టు చేసిన వ్యాసంలో చెప్పారు. ఇప్పుడు అధికార పార్టీ అనుసరించబోయే రెండో వ్యూహాన్ని, అంటే ప్లాన్ బీని ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలు సిద్ధం కావాలని అన్నారు.

''ఈ వ్యూహంలో రాష్ట్రాలకు కేటాయించిన లోక్‌సభ సీట్ల వాటాను మార్చకుండా, ఎన్నికల నియోజకవర్గాల మ్యాప్‌ను తిరిగి రూపొందిస్తారు. తద్వారా బీజేపీకి దీర్ఘకాలికంగా ఎన్నికల్లో ప్రయోజనం కలిగేలా చూస్తారు'' అని ఆయన అన్నారు.

అస్సాం, జమ్మూకశ్మీర్‌లలో డీలిమిటేషన్ ద్వారా అధికార పార్టీకి పెద్దఎత్తున ఎన్నికల ప్రయోజనాలు కలిగినట్లు ఇప్పటికే కనిపించిందని యోగేంద్ర యాదవ్ అభిప్రాయపడ్డారు. ఒక నిర్దిష్ట రాజకీయ పార్టీకి ప్రయోజనం చేకూర్చేలా ఎన్నికల నియోజకవర్గాల సరిహద్దులను ఉద్దేశపూర్వకంగా మార్చే ప్రక్రియను 'గెర్రీ మాండరింగ్' అంటారని ఆయన వివరించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)