హైదరాబాద్, సికింద్రాబాద్, వైజాగ్, కడప.. మూడు ముక్కలు.. పీఎం ఆర్థిక సలహా మండలి ఇంకా ఏం చెప్పిందంటే..

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 7 నిమిషాలు
దేశంలో లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజనపై మరో ప్రతిపాదన తెరపైకి వచ్చింది.
ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి (ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ టు ది ప్రైమ్ మినిస్టర్: ఈఏసీ - పీఎం) వెబ్‌సైట్‌లో, దేశంలో లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజనపై 'ప్రత్యేక' పేపర్‌ను పొందుపరిచింది.
''డీలిమిటేషన్ వర్కింగ్ పేపర్ 2026' పేరుతో 77 పేజీల 'నివేదిక'ను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది.
దీని ప్రకారం, దేశంలో ఇప్పుడున్న 543 లోక్ సభ స్థానాలను 824కు పెంచాలని సూచించింది.
రాష్ట్రాల వారీగా ఇప్పుడున్న సీట్లకు 50 శాతం పెంచాలని చెబుతూనే, పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలను ఈ 'పేపర్'లో పేర్కొంది.

ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యురాలు షామిక రవి, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్(దిల్లీ)లో ఎకనామిక్ అండ్ ప్లానింగ్ యూనిట్ సభ్యులు ముదిత్ కపూర్ ఈ పేపర్‌ను సిద్ధం చేశారు.
అయితే, ఈ పేపర్‌పై కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని చెప్పారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ ఇ.వెంకటేశు.
"50 శాతం సీట్లు పెంచాలని చెబుతున్నారు. దీనికి ప్రాథమిక సూత్రం ఏమిటో చెప్పడం లేదు. అలా 50 శాతం పెంచితే ఉత్తర భారతంలోని రాష్ట్రాలే లబ్ది పొందుతాయని ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాల నుంచి అభ్యంతరాలు ఉన్నాయి" అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Reuters
కేంద్రం ప్రతిపాదిత బిల్లు తరహాలో..
కేంద్ర ప్రభుత్వం 2026 ఏప్రిల్ 16న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల సందర్భంగా ఒక బిల్లును తీసుకువచ్చింది.
ప్రతి రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న లోక్ సభ సీట్లను 50 శాతం పెంచుతున్నట్లు బిల్లులో ప్రకటించింది. ఈ బిల్లుపై చర్చ జరిగింది. కానీ, ఏప్రిల్ 17న జరిగిన ఓటింగ్‌లో దీనికి ఆమోదం లభించలేదు.
ఇప్పుడు ఇంచుమించు అదే తరహాలో ప్రధాన మంత్రి ఆర్థిక మండలి రూపొందించిన డీలిమిటేషన్ వర్కింగ్ పేపర్ ఉంది.
అయితే, ఏప్రిల్‌లో జరిగిన పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ప్రవేశపెట్టిన బిల్లులో దేశంలోని లోక్ సభ స్థానాలను 813కు పెంచాలని ప్రతిపాదించగా, ఇప్పుడు ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి 'డీలిమిటేషన్ వర్కింగ్ పేపర్ 2026' ప్రకారం 824 సీట్లను ప్రతిపాదించింది.

ఫొటో సోర్స్, PRALHAD JOSHI
ఈఏసీ - పీఎం 'పేపర్'లో ఏముందంటే..
ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి పేపర్ ప్రకారం, దేశంలోని అన్ని నియోజకవర్గాలను పునర్విభజించకుండా కొత్త ప్రతిపాదన తెరపైకి తీసుకువచ్చింది.
దేశంలోని 170 లోక్ సభ నియోజకవర్గాలను పునర్విభజిస్తే సరిపోతుందని సూచించింది.
''దేశవ్యాప్తంగా 59 సీట్లను రెండు నియోజకవర్గాలుగా విభజించాలి, మరో 111 సీట్లను మూడు నియోకవర్గాలుగా విభజించాలి'' అని పేపర్లో సూచించారు.
తమ సూచనల మేరకు పునర్విభజన చేస్తే, పెరుగుదల పరంగా ఎలాంటి తేడాలు వస్తాయో కూడా ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి స్పష్టం చేసింది.
''మేం ప్రతిపాదించిన మోడల్ ప్రకారం, దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, తమిళనాడుల సీట్ల వాటా 23.6 శాతంగా ఉంటుంది. ప్రస్తుతం ఇది 23.7 శాతంగా ఉంది" అని పేర్కొంది.
అలాగే ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, బిహార్, మహారాష్ట్ర వంటి అధిక జనాభా కలిగిన రాష్ట్రాల సీట్ల షేర్ 45.2 శాతానికి తగ్గనుంది. ప్రస్తుతం ఈ రాష్ట్రాల షేర్ 45.6 శాతంగా ఉంది.
ఇప్పటికే దీనిపై కొన్ని దక్షిణాది రాష్ట్రాలు తీవ్ర అభ్యంతరం చెబుతున్నాయి.
''ఉత్తరప్రదేశ్‌లో 80 సీట్లను 50 శాతం పెంచితే 120 అవుతాయి. అదే సమయంలో కేరళలో 20 సీట్లను 50 శాతం పెంచితే 30 అవుతాయి. అప్పుడు ఈ రెండు రాష్ట్రాల మధ్య అంతరం ఇప్పటితో పోల్చితే మరింత పెరుగుతుంది'' అని తెలంగాణ మఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో చెప్పారు.
పీఎం-ఈఏసీ సభ్యులు, డీలిమిటేషన్ కోసం పేపర్ సిద్ధం చేసిన సభ్యులు 2009 నుంచి 2024 మధ్య జరిగిన ఎన్నికల డేటాను ప్రామాణికంగా తీసుకున్నట్లు చెప్పారు.
2011 జనాభా లెక్కలు పరిగణనలోకి తీసుకుని, నియోజకవర్గంలోని భాషాపరమైన వైవిధ్యాన్ని ప్రామాణికంగా తీసుకుని 2009 నుంచి 2024 వరకు జరిగిన ఎన్నికల డేటా సెట్ రూపొందించారు.
''ఆయా ఎన్నికల్లో ఓటింగ్ శాతం, నియోజకవర్గ పరిమాణం, పట్టణీకరణ శాతం, ఎస్సీ, ఎస్టీ జనాభా శాతం, భాషా వైవిధ్యం, భాషాపరమైన పోలరైజేషన్.. వీటిన్నింటినీ బేరీజు వేసుకుని నియోజకవర్గాల పునర్విభజనకు మోడల్‌ను సూచించాం. ఇందులో పురుష ఓటర్లు, మహిళా ఓటర్లను వేర్వేరుగా పరిగణనలోకి తీసుకున్నాం'' అని పేపర్‌లో పేర్కొన్నారు.
దీని ఆధారంగా నియోజకవర్గాన్ని యథావిధిగా కొనసాగించాలా.. రెండుగా విభజించాలా.. మూడుగా విభజించాలా అనే విషయంపై ఒక 'మోడల్'ను తయారు చేసినట్లు 'పేపర్'లో పేర్కొన్నారు.
''మేం సూచించిన విధంగా 59 నియోజకవర్గాలను రెండుగానూ, 111 నియోజకవర్గాలను మూడుగానూ విభజిస్తే తర్వాత జరిగే సార్వత్రిక ఎన్నికలలో ఆయా నియోజకవర్గాల్లో 0.3 నుంచి 2.3 శాతం వరకు ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది'' అని అంచనా వేశారు.

ఫొటో సోర్స్, Getty Images
లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజనపై 'ఫ్రీజ్'
దేశంలో లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజనపై 1976 నాటి 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 'ఫ్రీజ్' విధించారు. దీనికి 1971 జనాభా లెక్కలు ప్రామాణికంగా ఉన్నాయి.
2001లో చేసిన 84వ రాజ్యాంగ సవరణ ద్వారా '2026 తర్వాత జరిగే మొదటి జనాభా లెక్కల వరకు' ఫ్రీజ్‌ను పొడిగించారు.
దీనిపై పార్లమెంటులో బిల్లు పెట్టి రాజ్యాంగ సవరణ చేస్తే తప్ప నియోజకవర్గాల పునర్విభజన చేపట్టేందుకు వీల్లేదు.
2027లో వచ్చే జనాభా లెక్కల తర్వాత 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కొత్తగా 281 నియోజకవర్గాలను ఏర్పాటు చేయవచ్చని ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి పేపర్లో పొందుపరిచారు.
ఈ సీట్లను రాష్ట్రాల వారీగా విభజించవచ్చని సూచించారు.
''ఏయే నియోజకవర్గాలను విభజించాలి? ఏ ప్రాతిపదికన విభజించాలి? ఎన్ని భాగాలుగా విభజించాలి? వంటి అంశాలపై మేం పనిచేశాం'' అని పేపర్‌లో పేర్కొన్నారు షామిక రవి, ముదిత్ కపూర్.
నియోజకవర్గాలను ఒకే తరహాలో కాకుండా 'నిర్దేశిత లక్ష్యాల ప్రాతిపదికన' విభజించాలని సూచించినట్లుగా పేర్కొన్నారు.
''2027 జనాభా లెక్కల తర్వాత డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటైతే, నియోజకవర్గ పరిమాణం కాకుండా జనాభా, భాషాపరమైన వైవిధ్యాన్ని పరిగణనలోకి తీసుకోవాలి'' అని పేపర్లో సూచించారు.
ఈ ప్రాతిపదికన పునర్విభజన చేసినప్పటికీ మహిళల ఓటింగ్ విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం గుర్తించామని పేర్కొన్నారు.
''ఇది సరిదిద్దాలంటే ఎన్నికల సంఘం మహిళల పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల జాబితాలో మహిళా ఓటర్ల సవరణ వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి'' అని సూచించారు.
అయితే, ఈ మోడల్ విషయంలో దక్షిణాది రాష్ట్రాల నుంచి గతంలో వ్యక్తమైన అభ్యంతరాలు మళ్లీ తెరపైకి వచ్చే అవకాశం ఉందని ప్రొ.ఇ.వెంకటేశు బీబీసీతో చెప్పారు.
''ఉత్తర భారతంలో జనాభా ఎక్కువగా ఉంది. అయినప్పటికీ, దేశ జీడీపీకి కాంట్రిబ్యూషన్ తక్కువగా ఉందనే వాదన ఉంది. ఇదే సమయంలో దక్షిణ భారతంలో జనాభా తగ్గినా, దేశ జీడీపీకి ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేస్తోంది. మరి, అలాంటప్పుడు నియోజకవర్గాల పెంపు అనేది అభివృద్ధికి శిక్ష అన్నట్లుగా ఉండకూడదు కదా'' అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
మూడుగా విభజించాలని ప్రతిపాదించిన కొన్ని నియోజకవర్గాలు..
తెలంగాణ – హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, మెదక్
తమిళనాడు – కన్యాకుమారి
కర్ణాటక - ధార్వాడ్, బెళగావి(బెల్గాం), విజయపుర (బీజాపూర్)
ఒడిశా – కాందమాల్
పశ్చిమ్ బెంగాల్ – కోల్‌కతా దక్షిణ్
ఝార్ఖండ్ – లోహర్ దగా
ఆంధ్రప్రదేశ్ – విశాఖపట్నం, కడప, రాజంపేట, నంద్యాల, అనంతపూర్, కర్నూలు
గుజరాత్ – భావ్‌నగర్, రాజ్ కోట్
ఇలా మొత్తం 111 నియోజకవర్గాలను మూడుగా విభజించాలని పీఎం-ఈఏసీ సూచించింది. ఇవన్నీ కూడా పట్టణీకరణ వివిధ స్థాయిల్లో ఉన్న నియోజకవర్గాలుగా చెబుతోంది.
విజయపురలో 28 శాతం పట్టణీకరణ ఉంటే, కోల్‌కతా దక్షిణ్‌లో 98 శాతం వరకు ఉంది.
ఈ నమూనా కేవలం మహానగరాలు లేదా పట్టణీకరణ ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలకే కాకుండా ఎస్టీ జనాభా ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలకు ప్రయోజనం కలిగిస్తుందని, దానివల్ల ఓటింగ్ శాతంలో పెరుగుదల ఉంటుందని చెబుతోంది.

ఫొటో సోర్స్, x.com/naralokesh
దేశంలో నియోజకవర్గాల సంఖ్యను 50 శాతం పెంచాలనే ప్రతిపాదనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్.
దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలతో కూడిన పత్రిక క్లిపింగ్‌ను జత చేసి ఎక్స్ లో శశిథరూర్ పోస్ట్ చేశారు.
''నాయుడు జీ, ఇప్పుడొక ప్రయోగం చూద్దాం. మీ జీతం 2 లక్షలు, మీ డ్రైవర్ జీతం 20000 అనుకుందాం. ఇద్దరికీ 50 శాతం పెంచితే, మీ జీతం 3 లక్షలు అవుతుంది. మీ డ్రైవర్ జీతం 30 వేలు అవుతుంది. అలాగని పెరుగుదల ఇద్దరికీ ఒక్కటే, డ్రైవర్ కన్నా మీరు ఎక్కువ ప్రయోజనం పొందడం లేదా?
ఇప్పుడు ఇదే విషయంపై దక్షిణాది ముఖ్యమంత్రులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు'' అని అన్నారు.
ఇదే విషయంపై ఏపీ మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా స్పందించారు.
''రాజ్యాంగంలోని ఆర్టికల్ 81 - జనాభా ప్రాతిపదికన లోక్ సభ సీట్లు కేటాయించాలని చెబుతోంది. 1971 జనగణన ఆధారంగా లోక్‌సభ సీట్లు పెంచి, తర్వాత ఫ్రీజ్ విధించారు. అది 2026తో ముగిసిపోతోంది. 1971తో పోల్చితే భారత జనాభా 55 కోట్ల నుంచి దాదాపు 146 కోట్లకు పెరిగింది. లోక్ సభ సీట్ల పరిధిలో జనాభా రెండున్నర రెట్లు పెరిగింది.
లోక్ సభ సీట్ల పెంపు అనేది ప్రజాస్వామిక అవసరమే కానీ, ఇందులో రాజకీయాలకు తావు లేదు'' అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)






























