రాజ్యసభ ఎన్నికలు: కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షీ నటరాజన్ నామినేషన్ రద్దుకు చూపిన కారణం సరైనదేనా?

ఫొటో సోర్స్, Getty Images
కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ అభ్యర్థిత్వాన్ని స్క్రూటినీలో తిరస్కరించడంతో జూన్ 18న జరగాల్సిన మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల సమీకరణాలు మారిపోయాయి.
బీజేపీ లేవనెత్తిన అభ్యంతరాలను అంగీకరించిన రిటర్నింగ్ అధికారి అరవింద్ శర్మ మీనాక్షి నటరాజన్ నామినేషన్ రద్దు చేశారు.
తన నామినేషన్ పత్రాలలో తెలంగాణలో తనపై కేసు పెండింగ్‌లో ఉందనే విషయాన్ని మీనాక్షి నటరాజన్ పేర్కొనలేదని బీజేపీ ఆరోపించింది.
అయితే రిటర్నింగ్ అధికారి నిర్ణయం అక్రమమని కాంగ్రెస్ అభివర్ణించింది. బీజేపీకి తగినంత సంఖ్యా బలం లేకున్నా మూడో రాజ్య సభ సీటు కోసం కుట్ర చేసిందని ఆరోపించింది.
ఎన్నికల నిబంధనల ప్రకారం, నామినేషన్ల పరిశీలన ప్రక్రియలో రిటర్నింగ్ అధికారి తీసుకున్న నిర్ణయాన్ని ఎన్నికల సంఘం రద్దు చేయలేదు.

బీజేపీ తరపున మూడో అభ్యర్థిగా మహేష్ కేవత్‌ను రంగంలోకి దింపడంతో పరిస్థితులు ఊహించని విధంగా మారాయి.
బీజేపీ తమ ఎమ్మెల్యేలను ప్రభావితం చేస్తుందనే ఆందోళనతో కాంగ్రెస్ తన ఎమ్మెల్యేలను బెంగళూరుకు తరలించింది.
కాంగ్రెస్ ఆందోళన కేవలం రాజకీయ పరమైనది కాదు. దాని వెనుక ఆరేళ్ల క్రితం జరిగిన రాజకీయ అనుభవం కూడా ఉంది.
కాంగ్రెస్ పార్టీలోని జ్యోతిరాదిత్య సింధియా 2020లో 22 మంది ఎమ్మెల్యేలతో బీజేపీలో చేరడంతో మధ్యప్రదేశ్‌లోని కమల్‌నాథ్ ప్రభుత్వం కూలిపోయింది. ఆ సంఘటన రాష్ట్ర రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చేసింది. బీజేపీ అధికారంలోకి రావడానికి మార్గం సుగమం చేసింది.
మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు తగిలిన అతి పెద్ద రాజకీయ ఎదురుదెబ్బ ఇదేనని ఇప్పటికీ భావిస్తారు.
ఈ అనుభవం దృష్ట్యా రాజ్యసభ ఎన్నికలలో పార్టీలో చీలిక, క్రాస్ ఓటింగ్ లేదా రాజకీయ ఒత్తిళ్లు ఎదురుకాకుండా కాంగ్రెస్ పార్టీ ముందు జాగ్రత్తలు తీసుకుంది.

ఫొటో సోర్స్, Getty Images
బీజేపీ అభ్యర్థులు ముగ్గురూ గెలుస్తారు
మధ్య ప్రదేశ్ అసెంబ్లీలో 230 మంది సభ్యులున్నారు. ఇందులో బీజేపీకి 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ సంఖ్యతో ఆ పార్టీ రెండు సీట్లు తేలికగా గెలుచుకోగలదు.
రాజ్యసభ ఎన్నికల్లో ఒక అభ్యర్థి గెలవాలంటే 58 ఓట్లు అవసరం. బీజేపీకున్న 164 మంది సంఖ్యాబలంతో ఇద్దరు అభ్యర్థులకు 116 ఓట్లు పోతే, ఇంకా ఆ పార్టీ దగ్గర 46 ఓట్లు ఉంటాయి. మూడో అభ్యర్థి గెలవాలంటే బీజేపీకి 12 ఓట్లు అవసరం.
ఈ సమీకరణాలన్నీ చూస్తే బీజేపీ మూడో అభ్యర్థి విజయం క్రాస్ ఓటింగ్ లేదా అదనపు ఓట్లు, ప్రతిపక్ష సభ్యులు ఓటింగ్‌కు గైర్హాజరు కావడం మీద ఆధారపడి ఉంది.
బీజేపీ ఓట్లను దొంగిలించే రాజకీయాలను నమ్ముకుందని కాంగ్రెస్ నేత మీనాక్షీ నటరాజన్ విమర్శించారు.
"తగినన్ని ఓట్లు లేకపోయినా, బీజేపీ మూడో అభ్యర్థిని పోటీ పెట్టింది. దీంతో ఇలాంటిదేదో జరుగుతుందని ముందే ఊహించాం మొదట ఎస్ఐఆర్ ద్వారా ఓట్లను దొంగిలించారు. ఇప్పుడు సీట్లను దొంగిలిస్తున్నారు. మేము దీనిపై ప్రతి ప్రజాస్వామ్య, రాజ్యాంగ వేదికపై పోరాడతాం" అని ఆమె అన్నారు.
ఎన్నికల సంఘం లేదా సుప్రీంకోర్టు నుంచి కాంగ్రెస్‌కు తక్షణమే ఉపశమనం లభించకపోతే, ఖాళీగా ఉన్న మూడు స్థానాలకు ముగ్గురు బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది.
నామినేషన్‌లో అవసరమైన సమాచారం అందించేందుకు మీనాక్షి నటరాజన్‌కు అవకాశం ఇచ్చామని, అయితే ఆమె ఆ వివరాలను అందించలేకపోయారని అధికారులు చెబుతున్నారు.
దీన్ని కారణంగా చూపుతూ ఆమె నామినేషన్ రద్దు చేశారు. కానీ, దీన్ని కాంగ్రెస్ పార్టీ తప్పు పడుతోంది.
మీనాక్షి నటరాజన్ నామినేషన్‌పై వివాదం ఇప్పుడొక చట్టపరమైన ప్రశ్నను లేవనెత్తుతోంది. హైదరాబాద్ కోర్టు జారీ చేసిన నోటీసు గురించి ఆమె నామినేషన్ పత్రాలలో ప్రస్తావించడం తప్పనిసరా? అన్నదే ఆ ప్రశ్న.
అదసలు కేసే కాదని కాంగ్రెస్ పార్టీ అంటోంది. మీనాక్షీ నటరాజన్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు కాలేదని అలాగే కోర్టు ఏ క్రిమినల్ కేసులోనూ అభియోగాలు మోపలేదని కాంగ్రెస్ అంటోంది.
ఆమెకు కేవలం ఒక నోటీసిచ్చారు. దానికి ఆమె స్పందించారు. అందు వల్ల దాని గురించి నామినేషన్ పత్రాలలో ప్రస్తావించడం తప్పనిసరి కాదని కాంగ్రెస్ పార్టీ వాదిస్తోంది.
రిటర్నింగ్ అధికారి నిర్ణయంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో పాటు సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తామంటోంది.
అయితే బీజేపీ ఈ వాదనను తిరస్కరిస్తోంది.
ఈ విషయం కేవలం ఎఫ్‌ఐఆర్‌కు మాత్రమే పరిమితమైన అంశం కాదని బీజేపీ లీగల్ సెల్ సభ్యుడు సంకేత్ గుప్తా చెప్పారు. ఏదైనా కేసులో కోర్టు నుంచి సమన్లు లేదా నోటీసు వస్తే ఆ విషయాన్ని అభ్యర్థి వెల్లడించాలని ఆయన అన్నారు.
హైదరాబాద్ కోర్టు జారీ చేసిన నోటీసుకు మీనాక్షి నటరాజన్ స్పందించారు కాబట్టి, తనకు ఆ విషయం తెలియదని ఆమె చెప్పలేరని సంకేత్ గుప్తా అన్నారు.
ఎన్నికల అఫిడవిట్‌లో కోర్టు నోటీసు, పెండింగ్‌లో ఉన్న కేసు వివరాలు వెల్లడించాలా వద్దా అనే దాని చుట్టూనే ఈ వివాదం మొత్తం తిరుగుతోంది.
కాంగ్రెస్ ఇది కేవలం ఒక లీగల్ నోటీసేనని అంటుంటే, దీనిని దాచిపెట్టడం నామినేషన్ నిబంధనలను ఉల్లంఘించడమేనని బీజేపీ వాదిస్తోంది.

ఫొటో సోర్స్, @INC
నామినేషన్ అలా తిరస్కరించవచ్చా?
మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం భోపాల్‌లోని అసెంబ్లీ సచివాలయంలో గందరగోళానికి దారి తీసింది. కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు అనేక మంది ఒకరితో ఒకరు వాగ్వాదానికి దిగారు.
అనేక మంది బీజేపీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలతో పాటు మంత్రులు రాకేష్ సింగ్, కైలాష్ విజయ వర్గీయ అసెంబ్లీ సచివాలయంలోనే ఉన్నారు.
"మీనాక్షి నటరాజన్ నామినేషన్ విషయంలో గందరగోళం సృష్టిస్తున్నారు. ఆమెపై ఎలాంటి క్రిమినల్ కేసు నమోదు కాలేదు. ఆమెపైన, ఇతరులపైనా రూ.10 కోట్ల పరిహారం కోసం ఎందుకు చర్యలు ప్రారంభించకూడదో ప్రశ్నిస్తూ కేవలం ఒక నోటీసు మాత్రమే అందింది. ఈ నోటీసుకు మీనాక్షి న్యాయవాది స్పందించారు. ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు" అని కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ, సీనియర్ న్యాయవాది వివేక్ తంఖా ఎక్స్‌లో ఒక మెసేజ్ పోస్ట్ చేశారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఐక్యంగా ఉన్నట్లు తేలడంతో, లీగల్ నోటీస్ ముసుగులో బీజేపీ తన నామినేషన్‌ను సవాలు చేసిందని మీనాక్షి నటరాజన్ ఆరోపించారు.
"కనీసం పరిగణనలోకి కూడా తీసుకోని లీగల్ నోటీస్ ఆధారంగా నా నామినేషన్‌ను సవాలు చేశారు. మా న్యాయవాదులు తమ వాదనలను వినిపించినా వాటిని సరిగ్గా వినలేదు, పరిగణనలోకి తీసుకోలేదు. అయినప్పటికీ తీర్పు ఇచ్చారు. వారి ఉద్దేశం ఏంటో ఇది స్పష్టం చేస్తోంది" అని మీనాక్షి నటరాజన్ చెప్పారు.
ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘాన్ని సంప్రదించడానికి ప్రయత్నించింది.
ఆ రోజు సాయంత్రం కె.సి. వేణుగోపాల్, సచిన్ పైలట్, భూపేష్ బఘేల్‌లతో కూడిన కాంగ్రెస్ ప్రతినిధి బృందం ఎన్నికల సంఘం కార్యాలయానికి చేరుకుంది. కానీ వారిని లోపలికి అనుమతించలేదు.
"ఇది ప్రజాస్వామ్యానికి సంబంధించిన మౌలికమైన ప్రశ్న. మమ్మల్ని లోపలికి అనుమతించే వరకు ఇక్కడే కూర్చుంటాము. మాజీ ముఖ్యమంత్రి, మాజీ ఉప ముఖ్యమంత్రి ఎంపీ ఉన్నారు. మేము బాధ్యత గల వ్యక్తులం" అని కేసీ వేణుగోపాల్ అన్నారు.
ఎన్నికల సంఘం బుధవారం మధ్యాహ్నం కాంగ్రెస్ ప్రతినిధి బృందంతో సమావేశం ఏర్పాటు చేసింది. మీనాక్షి నటరాజన్ కేసుకు సంబంధించిన సమాచారాన్ని దాచిపెట్టేందుకు కాంగ్రెస్ నాయకులు కుట్ర పన్నారని మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఆరోపించారు.

ఫొటో సోర్స్, @INC
బీజేపీ అభ్యర్ధులెవరు?
మూడో స్థానాన్ని గెలుచుకోవడానికి అవసరమైన ఓట్ల కంటే బీజేపీకి 10 ఓట్లు తక్కువగా ఉండటంతో, పలు దఫాల చర్చల అనంతరం ఆదివారం రాత్రి పొద్దుపోయాక మహేష్ కేవత్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు.
మధ్యప్రదేశ్ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 62 చెల్లుబాటు అయ్యే ఓట్లు ఉన్నాయి.
రాజ్యసభ ఎన్నికల్లో కచ్చితంగా గెలుస్తారని భావిస్తున్న ఇద్దరు బీజేపీ అభ్యర్థుల్లో ఒకరు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్, మరొకరు రాష్ట్ర యూనిట్ కార్యదర్శి రజనీష్ అగర్వాల్.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



























