తొలిచూపులోనే ప్రేమలో పడ్డారు.. కానీ తరువాత తాము ఒకే రక్తం పంచుకుపుట్టిన అన్నాచెల్లెళ్లమా అనే సందేహం వచ్చింది.. తరువాత ఏమైందంటే..?

ఆడ్రీ, ఆర్థర్ ఒక గ్యాదరింగ్ సందర్భంగా తొలిసారి కలుసుకున్నారు

ఫొటో సోర్స్, Courtesy of Audrey and Arthur Kermalvezen

ఫొటో క్యాప్షన్, ఆడ్రీ, ఆర్థర్ తొలిచూపులోనే ప్రేమలో పడ్డారు
ప్రచురణ
చదివే సమయం: 5 నిమిషాలు

"మన పుట్టుకకు కారణమైన వీర్యదాత ఎవరో తెలియనప్పుడు, ఎదురుపడే ప్రతి వ్యక్తీ మన తండ్రే కావచ్చని అనిపిస్తుంది."

వీర్య దానం ద్వారా జన్మించిన ఆర్థర్ కెర్మల్వేజిన్ చెప్పిన మాటలు ఇవి.

ఆయన ఎన్నో ఏళ్లపాటు ఎక్కడికి వెళ్లినా తనకు కనిపించే ప్రతీ పురుషునిలో తన కన్నతండ్రి రూపాన్నే ఊహించుకునేవారు.

"నాకు పాఠాలు చెప్పే మాస్టారే నా తండ్రి అయ్యుంటారా అనుకునేవాడిని. బస్సులో కనిపించే వ్యక్తి కూడా మా నాన్నేమో అని భ్రమపడేవాడిని. ఇలా బతకడం నరకంలా అనిపించేది. విపరీతమైన కోపం వచ్చేది" అని ఆయన గుర్తుచేసుకున్నారు.

పారిస్‌కు చెందిన ఆడ్రీ అనే మహిళతో ఆర్థర్ ప్రేమలో పడ్డారు. ఆమె కూడా వీర్య దానం ద్వారానే జన్మించారు. దీంతో తండ్రి ఎవరనే సమస్య వారికి మరింత తీవ్రంగా మారింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

'తొలి చూపులోనే ఆర్డర్‌పై ప్రేమ' ఏర్పడిందని ఆడ్రీ అంటారు. తనకు కూడా అదే భావన కలిగిందని ఆర్థర్ చెప్పారు.

అయితే ఆ భావన కేవలం ఆకర్షణేనా, లేదా ఒకే రక్తానికి చెందిన జన్యుపరమైన అనుబంధమా? అనే సందేహం వారిద్దరికీ వచ్చింది.

వారు పుట్టిన సమయంలో పారిస్‌లో స్పెర్మ్ బ్యాంకులు కేవలం రెండే ఉండేవి. చాలామంది పురుషులు పదే పదే వీర్యాన్ని దానం చేసేవారు. కాబట్టి, వారిద్దరూ ఒకే తండ్రికి పుట్టిన తోబుట్టువులు అయ్యే అవకాశం లేకపోలేదు.

కలిసి జీవించడం ప్రారంభించడానికి ముందే తాము రక్తసంబంధీకులమా కాదా అనే విషయం నిర్థరించుకోవడం ఆర్థర్, ఆడ్రీలకు అత్యవసరంగా మారింది.

కానీ ఫ్రాన్స్‌లోని కఠినమైన జన్యు పరీక్షల చట్టాలు, దాతల పేర్లను గోప్యంగా ఉంచే నిబంధనల వల్ల నిజం తెలుసుకోవడం వారికి చాలా కష్టమైంది.

ఫ్రాన్స్‌లో డీఎన్‌ఏ పరీక్షలు చేయించాలన్నా, పర్యవేక్షించాలన్నా పరిశోధకులు, వైద్యులు లేదా న్యాయమూర్తులకు మాత్రమే అనుమతి ఉంటుంది.

వ్యక్తిగత అవసరాల కోసం ఇంట్లోనే చేసుకునే డీఎన్‌ఏ కిట్లను దగ్గర ఉంచుకోవడం అక్కడ చట్టరీత్యా నేరం. అలా ఉంచుకుంటే 3,500 యూరోలకు (₹3.8 లక్షలకు పైగా) పైగా జరిమానా విధిస్తారు. అందుకే 23 అండ్‌మీ, యాన్‌సెస్ట్రీ, మై హెరిటేజ్ వంటి ప్రముఖ సంస్థలు ఫ్రాన్స్‌లో తమ టెస్టింగ్ కిట్లను విక్రయించవు.

1994 నుంచి అమల్లో ఉన్న ఈ చట్టం వల్ల... కీలకమైన జన్యు సమాచారం ప్రైవేట్ కంపెనీల చేతుల్లోకి వెళ్లకుండా ఉంటుందని, అవాంఛిత ఫలితాల వల్ల కుటుంబాలు విచ్ఛిన్నం కాకుండా ఆపవచ్చని కొందరు సమర్థిస్తున్నారు.

కానీ, డీఎన్‌ఏ పరీక్షలను నేరంగా పరిగణిస్తున్న ఏకైక యూరోపియన్ దేశం ఫ్రాన్స్ మాత్రమేనని ఆర్థర్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఇంట్లో డీఎన్‌ఏ పరీక్షలు చేసుకోవడం ఫ్రాన్స్‌లో చట్టరీత్యా నేరం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇంట్లో డీఎన్‌ఏ పరీక్షలు చేసుకోవడం ఫ్రాన్స్‌లో చట్టరీత్యా నేరం

ఓ క్యాంపెయిన్‌లో తొలి పరిచయం

బయోఎథిక్స్ (జీవ నీతిశాస్త్రం) చట్టాల్లో స్పెషలైజేషన్ చేసిన న్యాయవాది ఆడ్రీ.

తన లా చదువు పూర్తయిన తర్వాతే, తాను వీర్య దానం ద్వారా పుట్టినట్లు తల్లిదండ్రులు ద్వారా ఆమెకు తెలిసింది. లాయర్ కావడంతో ఫ్రెంచ్ చట్టాల గురించి ఆమెకు బాగా తెలుసు. వీర్య దాత చనిపోయిన తర్వాత కూడా వారి వివరాలను బయటపెట్టకూడదనే 30 ఏళ్ల నాటి ఫ్రెంచ్ చట్టం గురించి ఆమెకు పూర్తిగా తెలుసు.

అయితే వీర్యదాతల వివరాలు బయటపెట్టకూడదనే చట్టం 1994లో రాగా, ఆడ్రీ 1979లోనే పుట్టారు. 1994 కంటే ముందు వీర్య దానం ద్వారా జన్మించిన వారిని వెతుకుతున్న క్రమంలో ఆమెకు ఆర్థర్ పరిచయమయ్యారు. తన కన్నతండ్రి ఎవరో తెలుసుకోవాలనే ఆరాటంతో ఆర్థర్ ఒక పుస్తకం రాశారు.

తాను మాటల్లో చెప్పలేని భావాలను ఆర్థర్ ఆ పుస్తకంలో అద్భుతంగా రాశాడని ఆడ్రీ అన్నారు. వారిద్దరూ తమను ఎంతో ప్రేమించే కుటుంబాల్లో పెరిగినప్పటికీ, తమ జన్మకు కారణమైన ఆ గుర్తుతెలియని వ్యక్తి గురించి ఇద్దరిలోనూ ఎన్నో సందేహాలు ఉండేవి.

వారిద్దరూ మొదటిసారి ఒకరినొకరు చూసుకున్న వెంటనే ప్రేమలో పడ్డారు. కానీ, అదే సమయంలో ఈ సమస్య కూడా మొదలైంది.

తమ తండ్రికి సంబంధించిన నిజం తెలుసుకోవాలని వారిద్దరూ భావించారు. కానీ, అధికారులు ఎవరూ ఆ వివరాలు చెప్పడానికి ముందుకు రాలేదు.

ప్రతీ ఒక్కరికి తమ మూలాలను తెలుసుకునే హక్కు ఉందని ఆడ్రీ, ఆర్థర్ నమ్ముతారు

ఫొటో సోర్స్, Courtesy of Audrey and Arthur Kermalvezen

ఫొటో క్యాప్షన్, ప్రతీ ఒక్కరికి తమ మూలాలను తెలుసుకునే హక్కు ఉందని ఆడ్రీ, ఆర్థర్ నమ్ముతారు

నిజం కోసం అన్వేషణ

చాలా నెలల అన్వేషణ తర్వాత ఫ్రాన్స్‌లో ఓ డాక్టర్ వారికి జన్యుపరీక్ష చేయడానికి ముందుకొచ్చారు. ఆయన 900 యూరోల నగదు తీసుకొని జన్యు పరీక్ష చేసి, వారిద్దరికీ రక్తసంబంధం లేదని రిపోర్ట్ ఇచ్చారు. కానీ ఆ రిపోర్టును వారు పూర్తిగా నమ్మలేకపోయారు. ఆ డాక్టర్ నకిలీ వ్యక్తేమోనని ఆడ్రీ భయపడ్డారు.

రిజల్ట్ తెలుసుకోవడానికి హోమ్ టెస్ట్ కిట్ వాడాలనుకున్నారు. కానీ లాయర్ అయిన ఆడ్రీ చట్టాన్ని అతిక్రమించడానికి ఇష్టపడలేదు.

దాంతో 2010 నుంచి ఫ్రెంచ్ న్యాయ వ్యవస్థపై ఆమె న్యాయపోరాటం మొదలుపెట్టారు.

తనకు జన్మనిచ్చిన దాత ఇంకా బతికే ఉన్నారా? ఆయన వివరాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా? అని ఆమె తెలుసుకోవాలనుకున్నారు. అలాగే ఆయన ఎన్నిసార్లు వీర్య దానం చేశారు? ఆర్థర్ తనకు కజిన్ అయ్యే అవకాశాలేమైనా ఉన్నాయా వంటి వివరాలను ఆమె తెలుసుకోవాలనుకున్నారు.

కానీ ఆమె ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. 2015లో ఫ్రాన్స్ సుప్రీం అడ్మినిస్ట్రేటివ్ కోర్టు ఆమె పిటిషన్‌ను కొట్టివేసింది.

ఆడ్రీ

ఫొటో సోర్స్, Courtesy of Audrey Kermalvezen

ఫొటో క్యాప్షన్, ఆడ్రీ

వారి మొదటి సంతానం పుట్టబోయే సమయంలో ఒక వైద్యుడు వారికి సహాయం చేయడానికి ముందుకొచ్చారు. వారిద్దరి పుట్టుకకు కారణమైన వీర్యదాతల వివరాలను పరిశీలించడానికి ఆయన అంగీకరించారు. ఫ్రెంచ్ చట్టం ప్రకారం డాక్టర్లకు ఆ వివరాలు చూసే అధికారం ఉంటుంది, కానీ వాటిని పేషెంట్లకు చెప్పకూడదు.

ఆ ఇద్దరి దాతలు జన్మించిన సంవత్సరాలు వేరని, కాబట్టి వారిద్దరూ ఒక్కరే అయ్యే అవకాశం లేదని ఆ డాక్టర్ కనిపెట్టారు. అది వారి జీవితాన్ని మార్చే సమాచారం. కానీ, ఆ డాక్టర్ చట్టాన్ని ఉల్లంఘించి మాత్రమే ఆ నిజాన్ని వారికి చెప్పగలిగారు.

"ఇది నిజంగా విచిత్రం. నా గురించి నాకంటే ఒక డాక్టర్‌కే ఎక్కువ తెలుసు" అని ఆర్థర్ అన్నారు.

ఈ సమాచారం తెలిసినా వారిద్దరూ బంధువులేమోనన్న భయం ఆర్థర్‌ను వీడలేదు. దీంతో కొన్నేళ్లుగా వద్దనుకుంటున్న పర్సనల్ డీఎన్‌ఏ టెస్ట్‌ను ఆయన చివరకు చేయించుకున్నారు.

ఫ్రాన్స్‌లో నిషేధం ఉన్నప్పటికీ ప్రజలు డీఎన్‌ఏ పరీక్షలు చేయించుకోవడాన్ని ప్రభుత్వం ఆపలేకపోయిందని హక్కుల కార్యకర్తలు చెబుతున్నారు.

'డీఎన్‌ఏ పాస్' అనే సంస్థ ప్రకారం ఇప్పటికే 10 లక్షల మందికి పైగా ఫ్రెంచ్ పౌరులు ఈ పరీక్షలు చేయించుకున్నారు. అనుమతి ఉన్న ఇతర దేశాల్లోని స్నేహితుల ద్వారా లేదా కొరియర్ సేవల ద్వారా ప్రజలు ఈ కిట్లను తెప్పించుకుంటున్నారు.

పరీక్ష ఫలితాల్లో ఆర్థర్, ఆడ్రీలకు ఎలాంటి రక్తసంబంధం లేదని తేలింది.

ఆడ్రీ, ఆర్థర్ 2013లో పెళ్లితో ఒకటయ్యారు

ఫొటో సోర్స్, Courtesy of Audrey Kermalvezen

ఫొటో క్యాప్షన్, ఆడ్రీ, ఆర్థర్ 2013లో పెళ్లితో ఒకటయ్యారు

దొరికిన తండ్రి ఆచూకీ

డీఎన్‌ఏ పరీక్షల వల్ల వారికి మరిన్ని నిజాలు తెలిశాయి. 30 ఏళ్లుగా తన తండ్రి ఎవరా అని ఎదురుచూసిన ఆర్థర్, చివరకు 2017 క్రిస్మస్ రోజున సదరు వీర్య దాతను సంప్రదించగలిగారు.

అయితే ఆడ్రీకి ఊహించని షాక్ తగిలింది. డీఎన్‌ఏ మ్యాచ్ లిస్ట్‌లో సోఫీ అనే పేరును చూసీ ఆడ్రీ షాకయ్యారు. ఆడ్రీ కోర్టులో వాదించిన ఒక కేసులో సోఫీ క్లయింట్‌గా ఉన్నారు.

"నేను కోర్టులో ఎవరి తరఫునైతే వాదించానో, ఆ సోఫీ నా సొంత సోదరి అని తెలిసి ఆశ్చర్యపోయాను" అని ఆడ్రీ చెప్పారు.

ఆడ్రీ, ఆర్థర్‌లతో పాటు తమ మూలాల కోసం పోరాడుతున్న మరో 8 మంది కార్యకర్తలు డీఎన్‌ఏ పరీక్షలు చేయించుకున్నారు. ఆ 10 మందిలో నలుగురు ఒకే దాతకు జన్మించారని తేలింది. ఒకే వీర్య దాత వల్ల ఎంతమంది జన్మిస్తున్నారో, అది ఎంత పెద్ద సమస్యో దీని ద్వారా స్పష్టమైంది.

ఆడ్రీ,ఆర్థర్ కుటుంబం

ఫొటో సోర్స్, Courtesy of Audrey Kermalvezen

ఫొటో క్యాప్షన్, ఆడ్రీ,ఆర్థర్ కుటుంబం

అమూల్యమైన బహుమతి

కొన్నేళ్ల తర్వాత ఒక అమెరికన్ వ్యక్తి డీఎన్‌ఏ సరిపోలడంతో, దాని ఆధారంగా ఆడ్రీ తన తండ్రి ఫిలిప్‌ను గుర్తించగలిగారు. కానీ అప్పటికే ఆయన చనిపోయారు.

ఫిలిప్ తమకు ఇచ్చిన "అమూల్యమైన బహుమతికి" కృతజ్ఞతలు తెలుపుతూ ఆడ్రీ తల్లి ఆయన కుటుంబానికి ఒక లేఖ రాశారు.

ఫిలిప్ కుటుంబం ఆడ్రీని సాదరంగా ఆహ్వానించింది.

"ఆ సమయంలో అందరి కళ్లలో నీళ్లు తిరిగాయి" అని ఆడ్రీ గుర్తుచేసుకున్నారు. ఫిలిప్ వీర్యాన్ని దానం చేశాడనే విషయం ఆయన సొంత సోదరికి కూడా తెలియదు.

ఈ కలయికతో ఆడ్రీకి దశాబ్దాలుగా ఉన్న ప్రశ్నలకు సమాధానాలు దొరికాయి. ఆమె తన కుటుంబ ఆరోగ్య చరిత్రను తెలుసుకుంది. ఫిలిప్ పాత ఫోటోలు, వీడియోలను చూశారు.

"ఆ వీడియోల్లో ఆయన ఎలా నడిచారో చూశాను, ఆయన గొంతును వినగలిగాను" అని ఆమె చెప్పారు.

ఆడ్రీ చేసిన న్యాయపోరాటం, ఆర్థర్ రాసిన పుస్తకం ఫ్రాన్స్‌లో వీర్య దాన చట్టాలు మారడానికి దారితీశాయి.

చివరకు 2025 ఏప్రిల్ తర్వాత జన్మించిన వారు మేజర్లు అయ్యాక తమ దాతల వివరాలను తెలుసుకునే హక్కును చట్టం కల్పించింది.

అయితే, ఇంట్లో చేసుకునే డీఎన్‌ఏ పరీక్షలపై నిషేధం కొనసాగిస్తున్న అతికొద్ది యూరోపియన్ దేశాల్లో ఫ్రాన్స్ కూడా ఒకటి. అందుకే ఆడ్రీ పోరాటం ఇంకా ముగియలేదు.

"ప్రతి ఒక్కరికీ తమ మూలాలను, తమ చరిత్రను తెలుసుకునే పూర్తి హక్కు ఉంది" అని ఆమె స్పష్టం చేశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)