'డోంట్ ట్రబుల్ ద ట్రబుల్' రివ్యూ: ప్రేక్షకులను ట్రబుల్ పెట్టిందా?

'డోంట్ ట్రబుల్ ద ట్రబుల్' రివ్యూ, ఫ‌హ‌ద్ ఫాజిల్
ఫొటో క్యాప్షన్, ఫ‌హ‌ద్ ఫాజిల్ హీరోగా నటించిన తొలి తెలుగు సినిమా 'డోంట్ ట్రబుల్ ద ట్రబుల్'.
    • రచయిత, జీఆర్ మ‌హ‌ర్షి
    • హోదా, బీబీసీ కోసం
  • ప్రచురణ
  • చదివే సమయం: 4 నిమిషాలు

ఆర్కా మీడియా వ‌ర్క్స్ బ్యాన‌ర్‌, ఎస్ఎస్‌.రాజ‌మౌళి స‌మ‌ర్ప‌ణ, ఫ‌హ‌ద్ ఫాజిల్ హీరోగా తొలి తెలుగు సినిమా, ప్ర‌మోష‌న్ల‌లో బాల‌కృష్ణ‌, మ‌హేశ్‌, ఎన్టీఆర్ ఇవన్నీ కలిసొచ్చి 'డోంట్ ట్రబుల్ ద ట్రబుల్' సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. మరి సినిమా ఎలా ఉంది?

కథ ఏమిటంటే.. సూరి (ఫ‌హ‌ద్‌) ఒక అంబులెన్స్ డ్రైవ‌ర్‌. డ‌బ్బు సంపాదించాల‌ని కోరిక‌. చిన్న‌చిన్న మోసాలు చేయ‌డానికి కూడా వెనకాడ‌డు.

ఇలా చేసి ఓల్డ్‌సిటీ గ్యాంగ్ లీడ‌ర్ అస్లాంబాయ్ (మ‌హేశ్ మంజ్రేక‌ర్‌) దగ్గర ఇరుక్కుంటాడు.

25 ల‌క్ష‌లు ఇవ్వ‌క‌పోతే అవ‌య‌వాలు అమ్మేస్తామ‌ని బెదిరిస్తారు. దాంతో డ‌బ్బు కోసం బాగా డ‌బ్బున్న వాళ్ల పిల్ల‌ల్ని కిడ్నాప్ చేయాల‌ని ప‌థ‌కం వేస్తాడు.

స‌రిగ్గా ఇదే టైమ్‌కి చిన్నారి దివ్య , ఆమె కుక్క స్నూపి క‌నిపిస్తారు. దివ్య ద్వారా డ‌బ్బు సంపాదించాల‌ని అడ్ర‌స్ తీసుకొని వెళితే సూరికి ఆశ్చర్యకర వాస్తవాలు తెలుస్తాయి. ఆ తర్వాత సూరి ఏం చేశాడనేదే కథ..

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

క‌థాక‌థ‌నాల్లో న‌త్త‌న‌డ‌క‌..

పసిబిడ్డ‌ల‌తో హీరోకి ఉన్న అనుబంధం అనే లైన్ చాలా బ‌ల‌మైంది. అమాయ‌క‌త్వం, ఎమోష‌న్‌, కామెడీ అన్నీ వ‌ర్కౌట్ అయ్యే జాన‌ర్ ఇది. దీనికి తోడు మంత్ర‌శ‌క్తులు తోడైతే మంచి ఫాంట‌సీ. 1985లో వ‌చ్చిన చిన్నారి కుట్టి చేత‌న సూప‌ర్ హిట్‌.

చిన్న పిల్ల‌ల‌కి మ్యాజిక్ ప‌వ‌ర్స్ అంటే చాలా ఇష్టం. చిన్న పిల్ల‌ల‌కే మ్యాజిక్ ప‌వ‌ర్స్ వుంటే ఆ లెవెల్ వేరు. దీనికి ఉదాహ‌ర‌ణ 'హ్యారీపోర్ట‌ర్‌'.

ఫ‌హ‌ద్ ఫాజిల్ లాంటి గొప్ప న‌టుడు, ఎక్స్‌ప్రెష‌న్స్ చక్కగా ప‌లికించే బాల‌న‌టి సారా పాలేక‌ర్ ఉండి, రాజ‌మౌళి స‌మ‌ర్ప‌ణ‌లో వ‌చ్చిన ఈ సినిమా ప్రేక్ష‌కుల‌కి ట్ర‌బుల్‌గా మార‌డానికి కార‌ణం కథాకథనాల్లో నత్తనడకే.

'డోంట్ ట్రబుల్ ద ట్రబుల్' రివ్యూ, ఫ‌హ‌ద్ ఫాజిల్
ఫొటో క్యాప్షన్, 'డోంట్ ట్రబుల్ ద ట్రబుల్' సినిమాలో ఫ‌హ‌ద్ ఫాజిల్, బాల‌న‌టి సారా పాలేక‌ర్ ప్రధాన పాత్రల్లో నటించారు.

క‌థ అక్క‌డ‌క్క‌డే తిరుగుతూ..

హీరో క్యారెక్ట‌ర్‌ని ఎస్టాబ్లిష్ చేయ‌డానికే అర‌గంట స‌మ‌యం స‌రిపోయింది. పాప వ‌చ్చిన త‌ర్వాత వేగం పెరుగుతుంద‌ని అనుకుంటే క‌థ అక్క‌డ‌క్క‌డే తిరుగుతూ వుంటుంది. హీరో కిడ్నాప్ ప్లాన్స్ , ఎగ్జిబిష‌న్ గ్రౌండ్‌కి డ‌బ్బు తీసుకు ర‌మ్మ‌న‌డం ఇవ‌న్నీ 'సిల్లీ'గా వున్నాయి.

ఫాంట‌సీ సినిమాల్లో లాజిక్‌లు అడ‌గ‌డం క‌రెక్ట్ కాదు. అయితే ఆ మ్యాజిక్ కూడా వ‌ర్కౌట్ కాలేదు. పిల్ల‌ల సినిమా, పెద్ద‌ల సినిమా రెండూ కాకుండా పోయింది. మంచి క‌థ‌, వీక్ ఎగ్జిక్యూష‌న్‌తో దెబ్బ‌తింది.

ఆ అమ్మాయి ఎవరనేది మొదటి సీన్‌లోనే ప్రేక్షకుడికి తెలిసిపోతుంది. ఈ విష‌యం ఇంట‌ర్వెల్ వ‌ర‌కు హీరోకి తెలియ‌దు. ప్రేక్ష‌కుల‌కి క‌థ‌లో ఏం జ‌రుగుతుందో అర్థ‌మ‌య్యే స‌రికి ఉత్కంఠ పోయింది.

'డోంట్ ట్రబుల్ ద ట్రబుల్' రివ్యూ, ఫ‌హ‌ద్ ఫాజిల్
ఫొటో క్యాప్షన్, క్లైమాక్స్‌లో ఫాజిల్ నటన ఆకట్టుకుంటుంది.

ఎవరెలా నటించారు?

కొన్ని స‌న్నివేశాల్లో ఫాజిల్ చాలా బాగా నటించారు, ముఖ్యంగా క్లైమాక్స్‌లో. సారా పాలేక‌ర్ అమాయ‌క న‌ట‌న ఆక‌ట్టుకుంది. బాలీవుడ్ న‌టుడు మ‌హేశ్ మంజ్రేక‌ర్‌, సౌర‌బ్ పూర్తిగా వృథా అయ్యారు. క్యారెక్ట‌ర్ స‌రిగా రాసుకుని ఉంటే వాళ్లు సినిమాకి ప్ల‌స్ అయ్యేవాళ్లు. సుబ్బ‌రాజు ప‌రిస్థితి కూడా అదే.

హీరో ఫ్రెండ్‌ పాత్రధారి వెంక‌టేశ్ కాకుమాను మంచి న‌ట‌న చూపించాడు. సంగీతం అంతంత మాత్ర‌మే. హైద‌రాబాద్ లొకేషన్స్‌లో కెమెరా ప‌నిత‌నం బాగుంది.

క‌థా కాలం ఎన్ని రోజులో అర్థంకాదు. కారులో వెళ్లిన కుటుంబం వాహ‌నంతో స‌హా క‌న‌ప‌డ‌కుండా పోతే, పోలీసులు ఆ రోడ్డులో వెత‌క్కుండా ఏదేదో చేస్తుంటారు. చివ‌ర్లో లోయ స‌న్నివేశం మ‌రీ హాస్యాస్ప‌దంగా వుంది.

ఈ మ‌ధ్య అన్ని సినిమాలు రెండున్న‌ర నుంచి మూడు గంట‌లు తీస్తున్నారు. విష‌యం ఉంటే ఎంత నిడివి అయినా ఓకే. ఈ సినిమాని రెండు గంట‌ల‌కి కుదిస్తే ప్రేక్ష‌కుల‌కి ట్ర‌బుల్ త‌గ్గేది. బాల‌కృష్ణ ఫేమ‌స్ డైలాగ్ 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్‌'ని ద‌ర్శ‌కుడు శ‌శాంక్ స‌రిగా వండ‌ని, పండ‌ని మ్యాజిక్ రియ‌లిజ‌మ్‌తో వేస్ట్ చేశాడు.

ప్ల‌స్ పాయింట్స్‌

1.ఫాజిల్‌, సారా న‌ట‌న‌

2. సెకెండాఫ్‌లో కొన్ని సీన్స్‌

మైన‌స్ పాయింట్స్‌

1. క‌ద‌ల‌ని క‌థాక‌థ‌నాలు

2. సంగీతం

3. డైలాగ్స్‌

(అభిప్రాయాలు సమీక్షకుడి వ్యక్తిగతం)

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)