సెల్లార్ గోడల మధ్య నుంచి బయటపడ్డ రూ. 87 కోట్ల విలువైన బంగారు బిస్కెట్లు, నాణేలు..

ఫొటో సోర్స్, Lokale Politie Dendermonde
- రచయిత, నిక్ బీక్, మయా డేవిస్
- హోదా, బ్రస్సెల్స్ నుంచి
- ప్రచురణ
- చదివే సమయం: 4 నిమిషాలు
బెల్జియంలోని ఓ ఇంటి పునరుద్ధరణ పనులు చేస్తున్న కార్మికులకు ఊహించని నిధి దొరికింది.
సెల్లార్ గోడల మధ్య దాచిన 9 మిలియన్ యూరోల బంగారం అంటే దాదాపు 87 కోట్ల రూపాయల విలువైన నిధిని వారు గుర్తించారు.
తూర్పు ఫ్లాండర్స్‌లోని ఆ భవనంలో ఈ వారం మొదట్లో కొత్త డ్రైనేజీ పైపుల ఏర్పాటు కోసం కార్మికులు తవ్వకాలు జరుపుతుండగా వారికి పెద్ద సంఖ్యలో బంగారు బిస్కెట్లు, బంగారు నాణేలు కనిపించాయని స్థానిక మీడియా తెలిపింది.
ఈ నిధి ఎవరికి సొంతమవుతుందనే అంశంపై ఇప్పుడు తీవ్ర ఆసక్తి మొదలైంది. దీన్ని వెలికి తీసిన కార్మికులతో పాటు, ఆ ఇంటి యాజమాన్య హక్కులున్న స్థానిక స్వచ్ఛంద సంస్థ కూడా ఈ సంపద తమదేనని వాదించే అవకాశం ఉంది.
ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఆ ఇంట్లో ఇంకా నిధులు ఏమైనా దొరుకుతాయేమోనని ఆశతో ఎవరూ ఆ ఇంటి వైపు రావొద్దని స్థానిక పోలీసులు హెచ్చరించారు.

భవనం మొత్తాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశామని, లభించిన బంగారాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించామని వారు స్పష్టం చేశారు.
కార్మికులు, భవనం పునాదుల వద్ద పనిచేస్తుండగా ఈ నిధి లభించింది. కార్మికుల బృందంలో 18 ఏళ్ల విద్యార్థి కోబ్ కూడా ఉన్నారు. వేసవి సెలవుల సందర్భంగా కోబ్ ఈ బృందంలో పనిచేస్తున్నారు.
''మొదట ఆ నిధిని చూసి ఆశ్చర్యపోయాం. అస్సలు నమ్మలేకపోయాం. అవన్నీ 1 యూరో నాణేలేమో అని అనుకున్నా. కానీ, ఆ తర్వాత అక్కడొక బంగారం ముద్ద కనిపించింది. అప్పుడే ఇది చాలా పెద్ద బంగారు నిధి అని మాకు అర్థమైంది'' అని బెల్జియం అధికార మీడియా వీఆర్‌టీతో కోబ్ చెప్పారు.
''దాచుకోవడం దొంగతనమే అవుతుంది''
బంగారు నిధి కనిపించిన వెంటనే కార్మికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ బంగారాన్ని తామే దాచుకోవాలని ఎప్పుడూ అనుకోలేదని వారు చెప్పారు.
''అక్కడ చాలా నాణేలు, బంగారు బిస్కెట్లు ఉన్నాయి. వాటిని దాచడం దాదాపు అసాధ్యం. అంతేకాకుండా, అలా దాచుకుంటే అది దొంగతనమే అవుతుంది'' అని వీఆర్‌టీతో ఆ సైట్ సూపర్‌వైజర్ మారియో చెప్పారు.
9 మిలియన్ యూరోల నిధిని దాచిపెట్టడం ఎవరి వల్లా కాదని కోబ్ అన్నారు.
ప్రస్తుతం ఆ భవనం 'సీఏడబ్ల్యూ ఓస్ట్-వ్లాండెరెన్' అనే స్వచ్ఛంద సంస్థ ఆధీనంలో ఉంది. డెండర్‌మొండె పట్టణంలో ఈ సంస్థ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
ఈ వార్త వినగానే తాను ఆశ్చర్యానికి గురయ్యానని సంస్థ డైరెక్టర్ గీర్ట్ హిల్లర్ట్ చెప్పారు.
ఈ నిధి ద్వారా లభించే డబ్బు తమ స్వచ్ఛంద కార్యక్రమాలకు, రోజూ ఎదురయ్యే భారీ అవసరాలకు ఉపయోగపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
బంగారు నిధి వేట కోసం ఎవరూ ఆ నిర్మాణ స్థలానికి రావొద్దని పోలీసులు ప్రజలను కోరారు.

ఫొటో సోర్స్, Lokale Politie Dendermonde
బెల్జియం చట్టాల ప్రకారం, ఆ నిధి అసలు యజమాని ఎవరైనా ఉంటే, ఆ సంపదను పొందేందుకు 5 సంవత్సరాల గడువు ఉంటుంది. అయితే ఆ యజమాని ఎవరనేది ఇంకా తెలియలేదని దర్యాప్తు చేస్తున్న ప్రాసిక్యూటర్ తెలిపారు.
ఎవరూ ముందుకు రాకపోతే, పౌర చట్టం (సివిల్ లా) నిబంధనల ప్రకారం ఆ నిధిని సమంగా పంచుతారు. నిధి దొరికిన స్థల యజమానికి సగం, దాన్ని కనిపెట్టిన వారికి సగం ఇస్తారు.
అయితే, ఈ నిధికి ఎలాంటి నేరపూరిత కార్యకలాపాలతో సంబంధం లేదని తేలితేనే ఇది వర్తిస్తుంది.
అసలు యజమాని కోసం అటు నిర్మాణ సంస్థ, ఇటు స్వచ్ఛంద సంస్థ ఇప్పుడు దాదాపు 1,823 రోజుల పాటు వేచి చూడాల్సి ఉంటుంది. ఎవరూ రాకపోతే, ఆ నిధి వీరికే దక్కుతుంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























