మొటిమలు ఎందుకు వస్తాయి, వాటిని గిల్లొచ్చా, నివారణ ఉందా?

మొటిమలు, ఆరోగ్యం, చర్మవ్యాధి

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, డాక్టర్ హిమానీ, రేడియేషనల్ ఆంకాలజిస్ట్
    • హోదా, బీబీసీ కోసం
  • ప్రచురణ
  • చదివే సమయం: 9 నిమిషాలు

16 ఏళ్ల రాహుల్‌కు పరీక్షల సమయంలో నుదురు, ముక్కు చుట్టూ చిన్న చిన్న తెల్లటి, నల్లటి గడ్డలు కనిపించాయి. మొదట వాటిని పట్టించుకోలేదు. కొంతకాలానికి కొన్ని ఎర్రగా మారి నొప్పి మొదలైంది. వాటిని చేతితో నొక్కడంతో మరింత వాపు వచ్చింది.

యవ్వనంలో ఇలా మొటిమలు(యాక్నె) రావడం సహజమే అనుకుని నిర్లక్ష్యం చేయొద్దు.

"ముఖంపై రెండు మూడు మొటిమలే కదా… వాటంతట అవే తగ్గిపోతాయి" అని చాలామంది భావిస్తారు. మరికొందరు మొటిమలు వస్తే పేస్ట్ రాస్తారు, గట్టిగా రుద్దుతారు, చిదుముతారు, లేదా ఎవరో చెప్పిన క్రీమ్ వాడేస్తారు. ఫలితంగా మొటిమలు తగ్గకపోగా మచ్చలు, గుంతలు ఏర్పడి మరింత ఇబ్బంది కలిగించవచ్చు.

మొటిమలు కేవలం అందానికి సంబంధించిన సమస్య కాదు. ఇది చర్మంలోని పైలోసెబాసియస్ యూనిట్ - అంటే వెంట్రుకల కుదుళ్లు, వాటికి అనుసంధానమైన తైల గ్రంధులను ప్రభావితం చేసే దీర్ఘకాలిక చర్మవ్యాధి.

సరైన సమయంలో చికిత్స తీసుకుంటే మొటిమలను నియంత్రించడమే కాకుండా భవిష్యత్తులో మచ్చలు, గుంతలు ఏర్పడకుండా కూడా నివారించవచ్చు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

మొటిమలు ఎలా వస్తాయి?

చర్మంలోని ప్రతి వెంట్రుక మొదలుకు ఒక చిన్న సెబాసియస్ గ్రంథి ఉంటుంది. ఈ గ్రంధి నుంచి సెబమ్ అనే సహజ నూనె ఉత్పత్తి అవుతుంది. ఇది చర్మాన్ని మృదువుగా ఉంచడంలో సహాయపడుతుంది.

యవ్వనంలో ఆండ్రోజెన్ హార్మోన్ల ప్రభావంతో సెబమ్ ఉత్పత్తి పెరుగుతుంది. అదే సమయంలో ఫాలికల్ లోపల మృత చర్మ కణాలు సరిగ్గా బయటకు రాకుండా పేరుకుపోతే చర్మ రంధ్రం మూసుకుపోతుంది.

ఇలా అధిక సెబమ్, చర్మకణాలు పేరుకుపోవడం, ఫాలికల్ మూసుకుపోవడం, దాని వలన వచ్చే వాపు, క్యూటిబ్యాక్టీరియమ్ యాక్నెస్ అనే బ్యాక్టీరియా చేరటం... ఇవన్నీ కలిసి మొటిమలు ఏర్పడటానికి కారణమవుతాయి.

ఈ మొటిమలు పాప్యూల్స్ , పస్ట్యూల్స్ (చీము పొక్కు)ల్లా ఏర్పడతాయి.

కొందరిలో తీవ్రమైన సందర్భాల్లో నాడ్యూల్స్ లేదా సిస్టులు ఏర్పడి శాశ్వత మచ్చలు, గుంతలకు కారణమవుతాయి.

అంటే మొటిమలు కేవలం "మురికి వల్ల" వచ్చేవి కావు.

మొటిమలు, ఆరోగ్యం, చర్మవ్యాధి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మొటిమలు సాధారణ చర్మవ్యాధుల్లో ఒకటి.

మొటిమల్లో రకాలుంటాయా?

వైట్‌హెడ్స్: రంధ్రాలు పూర్తిగా మూసుకుపోయినప్పుడు కనిపించే తెల్లటి చిన్న గడ్డలు / పొక్కులు

బ్లాక్‌హెడ్స్: రంధ్రాలు తెరిచి ఉండి దానిలోని పదార్థం గాలితో ప్రతిచర్య చెందడం వల్ల నల్లగా కనిపించే గడ్డలు ఇవి. ఇది "చర్మంలో మురికి పేరుకుపోవడం" కాదు.

పాప్యూల్స్: ఎర్రగా, వాపుతో ఉండే చిన్న మొటిమలు.

పస్ట్యూల్స్: పైభాగంలో తెల్లటి / పసుపు రంగు చీము, వాపుతో కనిపించే మొటిమలు

నాడ్యూల్స్ / సిస్టులు: లోతుగా ఏర్పడే పెద్ద, బాధ కలిగించే గడ్డలు. ఇవి యాక్నె స్కార్స్ ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతాయి.

మొటిమలు, ఆరోగ్యం, చర్మవ్యాధి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారతీయుల్లో 18 నుంచి 25 ఏళ్ల వయసు మధ్య మొటిమలు ఎక్కువగా కనిపిస్తాయని ఓ పరిశోధనలో తేలింది.

మొటిమల సమస్య ఎంత మందిలో ఉంది?

మొటిమలు ప్రపంచవ్యాప్తంగా అత్యంత సాధారణ చర్మవ్యాధుల్లో ఒకటి.

గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ 2019 నివేదిక ఆధారంగా 204 దేశాలు, ప్రాంతాలపై చేసిన విశ్లేషణలో 2019లో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా కనిపిస్తున్న మొటిమల కేసులు సుమారు 231.2 మిలియన్లు ఉన్నట్టు అంచనా వేశారు. 1990తో పోలిస్తే ఇది సుమారు 48శాతం పెరిగింది.

నైస్ (ఎన్ఐసీఈ – నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ హెల్త్ అండ్ కేర్ ఎక్స్‌లెన్స్ ) మార్గదర్శకాల ప్రకారం 11–30 సంవత్సరాల మధ్య సుమారు 80శాతం మందికి జీవితంలో ఏదో ఒక దశలో మొటిమలు వచ్చే అవకాశం ఉంటుంది.

అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ ప్రకారం అమెరికాలో సంవత్సరానికి దాదాపు ఐదు కోట్ల మందిని మొటిమల సమస్య ప్రభావితం చేస్తుంది. కౌమారంలోని వారిలో సుమారు 85శాతం మందిలో మొటిమలు కనిపిస్తాయి.

భారత్‌లో కూడా మొటిమలు చాలా సాధారణం. భారతీయ యాక్నె-కేర్ కన్సెసస్‌ ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా మొటిమల సమస్య సుమారు 20శాతం మందిలో కనిపిస్తుండగా, ఆసియాలో ఇది 19.4శాతంగా ఉంది.

భారత్‌లో 18 నుంచి 25 ఏళ్ల వయసులో మొటిమలు ఎక్కువగా కనిపిస్తాయని అంచనా వేసింది.

మొటిమలు, ఆరోగ్యం, చర్మవ్యాధి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తల్లిదండ్రులకు మొటిమలు ఉంటే వారి పిల్లలకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

మొటిమలకు కారణమేంటి?

1. హార్మోన్లు

యుక్తవయసు వచ్చే సమయంలో ఆండ్రోజెన్ హార్మోన్ల ప్రభావంతో సెబాసియస్ గ్రంధులు ఎక్కువగా పనిచేస్తాయి. అందుకే టీనేజ్‌లో మొటిమలు ఎక్కువగా కనిపిస్తాయి.

2. కుటుంబ చరిత్ర

తల్లిదండ్రుల్లో మొటిమల చరిత్ర ఉంటే పిల్లల్లో వచ్చే అవకాశం పెరుగుతుంది. తల్లిదండ్రులకు ఉంటే పిల్లలకు కూడా వచ్చే అవకాశం గణనీయంగా పెరిగినట్టు ఎన్నో అధ్యయనాల్లో వైద్య నిపుణులు గుర్తించారు.

3. చర్మంలో అధిక సెబమ్

సెబమ్ ఎక్కువగా ఉత్పత్తి కావడం ఫాలిక్యులర్ బ్లాకేజ్‌కు దోహదం చేస్తుంది.

4. మృత చర్మ కణాలు పేరుకుపోవడం

ఫాలికల్ లైనింగ్‌లో అసాధారణ కెరటినైజేషన్ వల్ల రంధ్రాలు మూసుకుపోవచ్చు.

5. వాపు, క్యూటిబ్యాక్టీరియమ్ యాక్నె

యాక్నెకి ఫాలికల్‌లో బ్యాక్టీరియల్ యాక్టివిటీ మాత్రమే కాకుండా ఇన్‌ఫ్లమేటరీ మెకానిజమ్స్ కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అందుకే మొటిమలను కేవలం "బాక్టీరియా వల్ల వచ్చిన ఇన్ఫెక్షన్"గా భావించడం తప్పు.

6. కొన్ని హార్మోనల్ పరిస్థితులు

మహిళల్లో అకస్మాత్తుగా తీవ్రంగా మొటిమలు రావడం, ముఖ్యంగా పీరియడ్స్ క్రమంగా రాకపోవడం, ముఖంపై వెంట్రుకలు పెరగడం వంటి లక్షణాలతో ఉంటే హార్మోనల్ డిజార్డర్ (ఉదాహరణకు పీఎంఏఎస్) గురించి వైద్యుణ్ని సంప్రదించాలి.

7. కొన్ని మందులు

కొన్ని కార్టికోస్టెరాయిడ్స్, హార్మోనల్ మందులు, లిథియమ్ వంటి మందులు మొటిమలను పోలిన దద్దుర్లుకు కారణమవుతాయి. మందులు సొంత నిర్ణయాలతో ఒకేసారి ఆపకుండా వైద్యుణ్ని సంప్రదించాలి.

8. స్ట్రెస్

ప్రతి వ్యక్తిలో మొటిమలకు స్ట్రెస్ ప్రత్యక్ష కారణం కాకపోయినా ఇప్పటికే ఉన్నవారిలో తీవ్రతను పెంచే అవకాశం ఉంది.

9. ఆహారం

"చాక్లెట్ తింటే మొటిమలు వస్తాయి" అనడానికి శాస్త్రీయ ఆధారాలు లేవు. కొన్ని పరిశోధనల్లో హై గ్లైసెమిక్ ఫుడ్స్ లేదా పాల ఉత్పత్తులకు మొటిమలకు మధ్య సంబంధం కనిపించినప్పటికీ, అందరికీ ఒకే ఆహారం కారణమవుతుందని చెప్పడానికి తగిన ఆధారాలు లేవు. నైస్ కూడా మొటిమల చికిత్స కోసం నిర్దిష్ట డైట్‌‌ను సిఫారసు చేయడానికి తగిన ఆధారాలు లేవని చెబుతోంది.

మొటిమలు, ఆరోగ్యం, చర్మవ్యాధి

ఫొటో సోర్స్, Getty Images

మొటిమలు రాకుండా ఏం చేయాలి?

అన్ని యాక్నెలను 100శాతం నివారించడం సాధ్యం కాదు. కానీ తీవ్రతను తగ్గించడానికి కొన్ని అలవాట్లు ఉపయోగపడతాయి. రోజువారీగా చర్మ సంరక్షణ పాటించాలి.

రోజుకు సుమారు రెండుసార్లు మృదువైన క్లెన్సర్‌తో ముఖాన్ని కడుక్కోవాలి.

  • చాలా గట్టిగా రుద్దకూడదు.
  • నూనె ఆధారిత, కామెడోజెనిస్ కాస్మెటిక్స్ వాడకాన్ని నివారించాలి.
  • మేకప్ ఉపయోగిస్తే రాత్రి తప్పనిసరిగా తొలగించాలి.
  • నాన్-కామెడోజెనిక్ మాయిశ్చరైజర్, సన్‌స్క్రీన్ ఉపయోగించవచ్చు.
  • మొటిమలను చేతులతో పదేపదే తాకకూడదు.
  • చెమట ఎక్కువగా వచ్చిన తర్వాత ముఖాన్ని మృదువుగా శుభ్రం చేసుకోవాలి.
మొటిమలు, ఆరోగ్యం, చర్మవ్యాధి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, డాక్టర్ల సలహా లేకుండా మొటిమలకు మందులు ఉపయోగించకూడదు.

ఎలాంటి చికిత్స తీసుకోవాలి?

మొటిమల తీవ్రత ఆధారంగా చికిత్స మారుతుంది. ఒకరికి ఉపయోగపడిన క్రీమ్ మరొకరికి సరిపోవాల్సిన అవసరం లేదు.

తక్కువ నుంచి మధ్యస్థ స్థాయి మొటిమలు ఉంటే సాధారణంగా పైపూత మందులు ఉపయోగిస్తారు. ఇవి యాక్నె సంబంధిత బ్యాక్టీరియాను తగ్గించడంతో పాటు వాపును తగ్గించడంలో సహాయపడతాయి.

రంధ్రాలు పూడుకుపోకుండా చేయడంలోను, కొత్త మొటిమలు రాకుండా నివారించడంలో టాపికల్ రెటినాయిడ్స్ రకం ఔషధాలు ఉపయోగపడతాయి.

మొటిమలు, ఆ తర్వాత ఏర్పడే పిగ్మెంటేషన్ తగ్గించడానికి, రంధ్రాలు పూడుకుపోవడాన్ని తగ్గించడంలో సహాయపడటానికి మరికొన్ని రకాల ఔషధాలు ఉంటాయి.

మధ్యస్థ నుంచి తీవ్ర స్థాయి మొటిమలు ఉంటే డెర్మటాలజిస్టులు కొన్ని రకాల ఓరల్ మెడిసిన్స్ (నోటి ద్వారా తీసుకునే మందులు) సూచించవచ్చు . వాటిలో...

  • కొన్ని రకాల యాంటీబయాటిక్స్
  • కొందరు మహిళల్లో అవసరాన్ని బట్టి హార్మోనల్ చికిత్సలు
  • కొన్ని సందర్భాల్లో ప్రత్యేక మందులు
  • తీవ్రమైన, స్కారింగ్ ప్రమాదం ఉన్న లేదా ఇతర చికిత్సలకు స్పందించని మొటిమలకు కొన్ని ప్రత్యేక మందులు ఉండొచ్చు.

యాంటీ బయాటిక్స్‌ను డాక్టర్ సలహా లేకుండా తీసుకోకూడదు. యాంటీ బయాటిక్ నిరోధకత ప్రమాదం తగ్గించడానికి వీటిని సాధ్యమైనంత తక్కువ కాలం, సరైన కాంబినేషన్‌తో ఉపయోగించాలి.

తీవ్రమైన మొటిమల కోసం తీసుకునే అత్యంత ప్రభావవంతమైన చికిత్సల్లో ఉపయోగించే కొన్ని ప్రత్యేక ఔషధాలతో కొన్ని దుష్ప్రభావాలు, గర్భధారణ సంబంధిత ప్రమాదాలు తలెత్తవచ్చు. కాబట్టి వైద్య పర్యవేక్షణ తప్పనిసరి.

మొటిమల చికిత్సలో ఉపయోగించే ఔషధాల్లో గర్భధారణలో ఉపయోగించకూడనివి కూడా కొన్ని ఉంటాయి. అందుకే మొటిమలు ఎక్కువగా ఉన్నాయని షాపు నుంచి సొంతంగా మందులు కొనుక్కుని వాడటం ప్రమాదకరం.

చికిత్స - ఫలితాలకు ఎంత సమయం పడుతుంది?

మొటిమలకు చికిత్స ప్రారంభించాక మరుసటి రోజే ముఖంలో మార్పు రావడం, పూర్తిగా శుభ్రం కావడం సాధారణంగా జరగదు. చాలా రకాల చికిత్సలకు 8నుంచి12 వారాలు పట్టొచ్చు. 12 వారాల తర్వాత మొదటి దశ చికిత్సను సమీక్షించాలని నైస్ సూచిస్తోంది.

అందుకే ఫలితం రాలేదని రెండు, మూడు వారాలకే మందులు మార్చడం, ఎక్కువగా రాయడం లేదా ఒకేసారి అనేక క్రీములు ఉపయోగించడం మంచిది కాదు

మొటిమను చిదిమితే త్వరగా తగ్గిపోతుందా?

ఇది సాధారణంగా చాలామంది చేసే తప్పు. మొటిమను గిల్లడం లేదా చిదమడం వల్ల వాపు, నొప్పి మరింత పెరిగి పోస్ట్-ఇన్‌ఫ్లమేటరీ పిగ్మెంటేషన్, గాయం మచ్చలు,గుంతలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

ఒక చిన్న మొటిమను నొక్కి తొలగించామని అనుకున్నా, తర్వాత మిగిలే గుంత మాత్రం సంవత్సరాల పాటు ఉండవచ్చు.

మొటిమలు, ఆరోగ్యం, చర్మవ్యాధి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మొటిమలకు టూత్ పేస్ట్ రాయకూడదు.

మొటిమలపై అపోహలు—నిజాలు

అపోహ: చర్మం మురికిగా ఉండటం వల్లే మొటిమలు వస్తాయి

నిజం: మొటిమలు మల్టీఫ్యాక్టోరియల్ స్కిన్ డిసీజ్. ఇది కేవలం మురికి వల్ల రాదు.

అపోహ: మొటిమలు నొక్కితే త్వరగా తగ్గుతాయి.

నిజం: అలా చేస్తే స్కారింగ్, పిగ్మెంటేషన్ ప్రమాదం పెరుగుతుంది.

అపోహ: చాక్లెట్లు తింటే తప్పనిసరిగా మొటిమలు వస్తాయి.

నిజం: అందరికీ ఇలా జరుగుతుందని కచ్చితంగా చెప్పలేం.

అపోహ: మొటిమలు టీనేజీ అబ్బాయిలకే వస్తాయి

నిజం: అమ్మాయిలు, పెద్దవారిలో కూడా ఇది సాధారణమే.

అపోహ: ముఖం రోజుకు చాలాసార్లు కడిగితే మొటిమలు పోతాయి.

నిజం: ఎక్కువగా కడగడం, ఇరిటేషన్ వంటివి మొటిమలను మరింత తీవ్రం చేయొచ్చు.

అపోహ: టూత్ పేస్ట్ రాస్తే మొటిమ పోతుంది.

నిజం: మొటిమలకు చికిత్స కోసం టూత్ పేస్ట్ పనికిరాదు. అది వాడితే మరింత మంట పుట్టొచ్చు.

అపోహ: మొటిమలు ఉన్నవారు మాయిశ్చరైజర్ వాడకూడదు.

నిజం: నాన్-కామెడోజెనిక్ మాయిశ్చరైజర్ అవసరమైన సందర్భాల్లో ఉపయోగపడుతుంది.

అపోహ: ఒకసారి మొటిమలు వచ్చాయంటే జీవితాంతం ఉంటుంది.

నిజం: సరైన చికిత్సతో చాలామందిలో దీన్ని నియంత్రించవచ్చు.

అపోహ: యాంటీబయాటిక్స్ ఎంత ఎక్కువకాలం వాడితే అంత మంచిది.

నిజం: నిరోధకత, ఇతర దుష్ప్రభావాల కారణంగా పరిమిత కాలం మాత్రమే వాడాలి.

మొటిమలు, ఆరోగ్యం, చర్మవ్యాధి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మానసిక ఆరోగ్యంపై మొటిమలు ప్రభావం చూపగలవు.

ఏం చేయాలి?

  • రోజుకు రెండుసార్లు మృదువుగా క్లెన్సింగ్ చేయాలి.
  • నాన్-కామెడోజెనిక్ చర్మ సంరక్షణ ఉత్పత్తులను ఉపయోగించాలి.
  • వైద్యుడు సూచించిన చికిత్సావిధానాన్ని అనుసరించాలి.
  • చికిత్సకు సమయం ఇవ్వాలి.
  • యాక్నె తీవ్రంగా ఉంటే చర్మ వైద్యుడిని సంప్రదించాలి.
  • నొప్పిని కలిగించే నాడ్యూల్స్, సిస్టులు, స్కారింగ్ ఉంటే ఆలస్యం చేయకూడదు.
  • మొటిమల వల్ల ఆత్మవిశ్వాసం తగ్గడం, నలుగురితో కలవలేకపోవడం, మానసిక ఇబ్బందులు ఉంటే వైద్యుడితో మాట్లాడండి. ఎందుకంటే మొటిమలు మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపగలవు.
మొటిమలు, ఆరోగ్యం, చర్మవ్యాధి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మొటిమలను నొక్కకూడదు.

ఏం చేయకూడదు?

  • మొటిమలను నొక్కడం.
  • రోజుకు పదేపదే ముఖాన్ని కడుగుతూ, గట్టిగా రుద్దడం.
  • ఇతరులకు సూచించిన క్రీములు వాడటం.
  • స్టెరాయిడ్స్ ఉన్న ఫెయిర్‌నెస్ లేదా మొటిమల క్రీములు వైద్యుల సలహా లేకుండా వాడటం.
  • యాంటీబయాటిక్స్‌ను స్వయంగా ప్రారంభించడం లేదా ఎక్కువకాలం కొనసాగించడం.
  • ప్రత్యేకమైన ఔషధాలను డాక్టర్ సూచన లేకుండా కొని, వాడటం
  • "100శాతం యాక్నె క్యూర్" అని చెప్పే తెలియని కాస్మొటిక్ లేదా ఇంటి చికిత్సలను నమ్మడం.
  • ఫలితం రాలేదని రెండు మూడు రోజుల్లోనే చికిత్స‌ను మార్చడం.

మొటిమలు "యవ్వనంలో సాధారణంగా అందరికీ వస్తాయి కాబట్టి పట్టించుకోవాల్సిన అవసరం లేదు" అనే స్థాయి సమస్య కాదు. అదే సమయంలో ప్రతి మొటిమకూ భయపడి ఖరీదైన చికిత్సలు తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు.

ముఖ్యమైన విషయం... సరైన సమయంలో సరైన చికిత్స

మొటిమలను నొక్కకుండా, ఫార్మసీలో కనిపించిన ప్రతి క్రీమూ వాడకుండా, డెర్మటాలజిస్టు‌ను సంప్రదించి సరైన చికిత్స తీసుకుంటే మచ్చలు ఏర్పడకుండా చాలా వరకు నివారించవచ్చు.

మొటిమలు ఉన్నవారికి "ముఖం పాడైంది" అని చెప్పడం కంటే, "ఇది ఒక సాధారణమైన, చికిత్స చేయగల చర్మ వ్యాధి" అని చెప్పడం మరింత అవసరం.

ముఖ్యంగా తీవ్రమైన ఇన్‌ఫ్లమేటరీ యాక్నె, నాడ్యూల్స్, సిస్టులు, వేగంగా ఏర్పడుతున్న స్కార్స్, లేదా యాక్నె వల్ల మానసికంగా బాధపడుతున్నవారు డెర్మటాలజిస్టు‌ను సంప్రదించడంలో ఆలస్యం చేయకూడదు.

(గమనిక: రచయిత ఓ డాక్టర్. వైద్యపరమైన విధానాలు, చికిత్సలపై అవగాహన కల్పించడమే ఈ ఆర్టికల్ ఉద్దేశం. ఆరోగ్యపరమైన ఏ నిర్ణయమైనా డాక్టర్‌ను సంప్రదించి మాత్రమే తీసుకోగలరు)

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)