50 ఏళ్ల తర్వాత ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరమా? ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, డాక్టర్ హిమానీ, రేడియేషనల్ ఆంకాలజిస్ట్
- హోదా, బీబీసీ కోసం
- ప్రచురణ
- చదివే సమయం: 5 నిమిషాలు
56 ఏళ్ల రామయ్యకు ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులూ లేవు. కానీ ఆయనకు పొగతాగే అలవాటు ఉంది. బరువు కూడా కొంచెం ఎక్కువే.
"నేను బాగానే ఉన్నా" అనుకుంటూ ఎన్నో సంవత్సరాలుగా ఆయన ఎలాంటి పరీక్షలూ చేయించుకోలేదు.
ఇప్పుడు రొటీన్ చెకప్ చేయించుకున్నారు. అందులో హైబీపీ, హెచ్‌బీ1ఏసీ ప్రీడయాబెటిస్ స్థాయిలో ఉండడంతోపాటు ఎల్డీఎల్ ఎక్కువగా ఉన్నట్టు తేలింది.
ఆయనకు స్మోకింగ్ సెస్సేషన్, డైట్, వ్యాయామం, కార్డియోవాస్కులర్ రిస్క్ ఆధారంగా చికిత్స ప్రారంభించారు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించాలి.
స్క్రీనింగ్ అనేది వ్యాధి ఉందని చెప్పడానికి మాత్రమే కాదు... వ్యాధి వచ్చే ప్రమాదాన్ని ముందే తెలుసుకోవడానికి కూడా అవసరం.

"నాకు ఏ సమస్యా లేదు.. పరీక్షలు ఎందుకు?" అని రామయ్య లానే 50 ఏళ్లు దాటిన చాలామంది చెబుతారు. కానీ వైద్యపరంగా చూస్తే ఈ వయస్సు నుంచే క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరం.
ఎందుకంటే... హైబీపీ, మధుమేహం, కొలెస్ట్రాల్, గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు, కొన్ని క్యాన్సర్లు, ఎముకల బలహీనత వంటి అనేక సమస్యలు ప్రారంభ దశలో ఎలాంటి లక్షణాలు చూపకపోవచ్చు.
కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే.. 50 ఏళ్లు పైబడ్డాక సకాలంలో ఆరోగ్య పరీక్షలకు తప్పక ప్రాధాన్యం ఇవ్వాలి.

ఫొటో సోర్స్, Getty Images
50 ఏళ్లు దాటాక ప్రత్యేక శ్రద్ధ ఎందుకు?
వయసు పెరుగుతున్న కొద్దీ మన శరీరంలో సహజంగానే కొన్ని మార్పులు మొదలవుతాయి.
రోగనిరోధక శక్తి క్రమంగా తగ్గడంతో పాటు, రక్తనాళాలు, ఎముకలు, కండరాలు, కంటి చూపు, వినికిడి వంటి విషయాల్లో కూడా మార్పులు చోటుచేసుకుంటాయి.
అందుకే 50 ఏళ్లు దాటిన తర్వాత ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం, అవసరమైన పరీక్షలు క్రమం తప్పకుండా చేయించుకోవడం చాలా ముఖ్యం.
వయసుతో పాటు కొన్ని జీవనశైలి అలవాట్లు, కుటుంబ ఆరోగ్య చరిత్ర కూడా వ్యాధుల ప్రమాదాన్ని పెంచవచ్చు.
- శారీరక శ్రమ తగ్గిపోవడం
- అధిక బరువు
- పొగాకు వాడకం
- మద్యం సేవించడం
- ఉప్పు, చక్కెర, కొవ్వు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం
- తగినంత నిద్ర లేకపోవడం
- కుటుంబంలో గుండెజబ్బులు, మధుమేహం లేదా క్యాన్సర్ చరిత్ర ఉండటం
ఇలాంటివి వయసు పెరిగేకొద్దీ ఆరోగ్యంపై మరింత ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే వీటిని వీలైనంత వరకు నియంత్రించుకోవడం, క్రమం తప్పకుండా ఆరోగ్యాన్ని పర్యవేక్షించుకోవడం ముఖ్యం.

ఫొటో సోర్స్, Getty Images
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) నేతృత్వంలో నిర్వహించిన ఐసీఎంఆర్-ఐఎన్‌డీఐఏబీ అధ్యయనం ప్రకారం, భారత్‌లో జీవనశైలి ఆధారిత మెటబాలిక్ వ్యాధుల తీవ్రత ఆందోళనకర స్థాయికి చేరుకుంది.
భారత జనాభాలో అధిక రక్తపోటు కేసులు 35.5%, మధుమేహం 11.4%, సాధారణ ఊబకాయం 28.6%గా నమోదు కాగా, భారత్‌లో ప్రతి ముగ్గురిలో ఒకరు అధిక రక్తపోటు సమస్యను ఎదుర్కొంటున్నారని ఈ నివేదికలో వెల్లడైంది.
పట్టణ ప్రాంతాలకే పరిమితం కాకుండా గ్రామీణ జనాభాలోనూ వేగంగా విస్తరిస్తున్న ఈ పరిస్థితులు, గుండె జబ్బులు, ఇతర దీర్ఘకాలిక సమస్యల ప్రమాదాన్ని పెంచుతూ ప్రజారోగ్యానికి పెను సవాలుగా మారుతున్నాయి.
లక్షణాలు కనిపించకపోయినా ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు. కాబట్టి "నాకు ఏమీ అనిపించడం లేదు అంటే నేను ఆరోగ్యంగానే ఉన్నాను" అని అనుకోవడం సరైనది కాదు.

ఫొటో సోర్స్, Getty Images
50 ఏళ్లు దాటిన తర్వాత చేయించుకోవాల్సిన పరీక్షలు
రక్తపోటు
హై బీపీని "సైలెంట్ కిల్లర్" అంటారు.
ఎందుకంటే చాలామందికి బీపీ ఎక్కువగా ఉన్నా ఎలాంటి లక్షణాలూ కనిపించవు. కానీ బీపీ ఎక్కువ రోజులు నియంత్రణలో లేకపోతే గుండెపోటు, పక్షవాతం, కిడ్నీ సమస్యలు, కంటి చూపు దెబ్బతినడంవంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
మధుమేహం
ప్రస్తుతం జీవనశైలి మార్పులవల్ల విస్తరిస్తున్న సమస్యల్లో టైప్-2 మధుమేహం (డయాబెటిస్) ప్రధానమైంది. ప్రారంభ దశలో ఇది ఎటువంటి స్పష్టమైన లక్షణాలూ లేకుండానే శరీరంలో నిశ్శబ్దంగా పెరుగుతుంది. సరైన సమయంలో గుర్తించకపోతే గుండె, కిడ్నీలు, కళ్లు, నరాలపై తీవ్ర దుష్ప్రభావం చూపుతుంది.
రక్తంలో చక్కెర స్థాయిలను తెలుసుకోవడానికి సాధారణంగా ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్, హెచ్‌బీఏ1సీ అనే రెండు పరీక్షలు ఉపయోగపడతాయి.
డయాబెటిస్ లేదా ప్రీ-డయాబెటిస్ దశను ముందుగానే గుర్తిస్తే సమస్యను అదుపులో ఉంచుకోవచ్చు.
కొలెస్ట్రాల్
కొలెస్ట్రాల్ పరీక్ష (లిపిడ్ ప్రొఫైల్) లో సాధారణంగా ఎల్డీఎల్, హెచ్‌డీఎల్, ట్రైగ్లిజరైడ్స్, మొత్తం కొలెస్ట్రాల్ వంటి అంశాలను పరిశీలిస్తారు.
క్యాన్సర్ స్క్రీనింగ్
క్యాన్సర్ స్క్రీనింగ్ ఉద్దేశం క్యాన్సర్ లక్షణాలను వెతకడం మాత్రమే కాదు.. కొన్ని సందర్భాల్లో క్యాన్సర్ వచ్చే ముందు ప్రీక్యాన్సరస్ లెసియన్స్‌ను గుర్తించడం, లేదా క్యాన్సర్‌ను ప్రారంభ దశలో గుర్తించడం.
భారత్‌లో నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ నాన్-కమ్యూనికబుల్ డిసీజెస్ కింద బ్రెస్ట్, సర్వికల్, ఓరల్ క్యాన్సర్లకు స్క్రీనింగ్ కార్యక్రమాలు అమలులో ఉన్నాయి.
రొమ్ము క్యాన్సర్
50 ఏళ్లు దాటిన మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్‌ను నిర్లక్ష్యం చేయకుండా మామోగ్రఫీ అనే స్క్రీనింగ్ పరీక్షను చేయించుకోవాలి.
అంతర్జాతీయ మార్గదర్శకాల ప్రకారం 40–74 ఏళ్లు దాటిన, రిస్క్ ఉన్న మహిళల్లో మామోగ్రఫీని సాధారణంగా ప్రతి రెండేళ్లకు ఒకసారి చేయాలని యునైటెడ్ స్టేట్స్ ప్రివెంటివ్ సర్వీసెస్ టాస్క్ ఫోర్స్ (యూఎస్‌పీఎస్‌టీఎఫ్) సూచిస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
గర్భాశయ ముఖద్వార లేదా సర్వైకల్ కేన్సర్
"50 దాటింది కాబట్టి ఇక పాప్ స్మియర్ టెస్ట్ అవసరం లేదు" అనుకోవడం తప్పు.
30–65 ఏళ్ల మధ్య సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్‌కు హెచ్‌పీవీ, పాప్ స్మియర్ లేదా రెండు పరీక్షలూ కలిపి చేస్తారు.
నోటి కేన్సర్
భారత్‌లో పొగాకు వినియోగం కారణంగా నోటి క్యాన్సర్లు పెద్ద ప్రజారోగ్య సమస్యగా ఉన్నాయి.
నోటిలో 2 వారాలకు మించి మానని పుండు, తెల్లటి/ఎర్రటి మచ్చ, నొప్పి, నోరు పూర్తిగా తెరవలేకపోవడం, నమలడంలో ఇబ్బంది, మింగడంలో ఇబ్బంది, అకారణ రక్తస్రావం ఉంటే వెంటనే డాక్టర్‌ను కలవాలి.
పెద్ద పేగు క్యాన్సర్
పెద్ద పేగు క్యాన్సర్ ప్రమాదం వయస్సుతో పాటు పెరుగుతుంది.
అంతర్జాతీయ మార్గదర్శకాల ప్రకారం 45 ఏళ్ల నుంచి పెద్ద పేగు క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకోవాలి.
కుటుంబంలో కొలన్ క్యాన్సర్ లేదా పాలిప్స్ చరిత్ర ఉన్నవారికి సాధారణ వ్యక్తుల కంటే ముందుగా లేదా తరచుగా పరీక్షలు అవసరమవుతాయి.
ఊపిరితిత్తుల క్యాన్సర్
50 ఏళ్లు వచ్చాయని ప్రతి ఒక్కరూ ఛాతీకి సీటీ స్కాన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు.
50–80 సంవత్సరాలు ఉండి, ప్రస్తుతం పొగ తాగుతున్నవారు లేదా గత 15 ఏళ్లలో పొగ తాగడం మానేసిన వారు ఏడాదికి ఒకసారి లో-డోస్ సీటీ స్కాన్ చేయించుకోవాలి.
ఫుల్ బాడీ సీటీ స్కానింగ్ అంటే పూర్తిస్థాయి క్యాన్సర్ స్క్రీనింగ్ జరిగినట్లే అనేది ఓ అపోహ.
ప్రోస్టేట్ క్యాన్సర్
50 ఏళ్లు దాటిన పురుషులు ప్రోస్టేట్ క్యాన్సర్ గురించి వైద్యుడితో చర్చించవచ్చు.
ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ (పీఎస్ఏ) పరీక్ష అందరికీ తప్పనిసరి కాదు. కొన్ని రకాల క్యాన్సర్ కాని వ్యాధుల్లో కూడా పీఎస్ఏ విలువ పెరిగే అవకాశం ఉంటుంది. కావున పీఎస్ఏ స్క్రీనింగ్‌తో ప్రయోజనాలతో పాటు ఫాల్స్ పాజిటివ్స్, ఓవర్ డయాగ్నసిస్, అవసరం లేకుండా బయాప్సీ చేయాల్సి రావడం కూడా జరగవచ్చు.
కాబట్టి "50 వచ్చిందంటే పీఎస్ఏ తప్పనిసరి" అనేది సరి కాదు.
కుటుంబ చరిత్ర, వంశపారంపర్య ప్రమాదం, లక్షణాలు, వ్యక్తిగత అభిరుచిని పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాలి.

ఫొటో సోర్స్, Getty Images
ఎముకల బలం(బోన్ డెన్సిటీ)
మహిళల్లో మెనోపాజ్ తర్వాత ఆస్టియోపొరోసిస్ ప్రమాదం పెరుగుతుంది.
అలాగే తక్కువ శరీర బరువు, గతంలో ఎముకలు విరిగిన చరిత్ర, ఎక్కువ రోజులు స్టెరాయిడ్స్ వాడినా, కొన్ని రకాల హార్మోన్ల అసమతుల్యత ఉన్నా, కుటుంబ చరిత్ర ఉన్నవారిలో ఈ ప్రమాదం ఎక్కువ.
అవసరమైతే డెక్సా బోన్ మినరల్ డెన్సిటీ పరీక్ష చేయాలి.
కేవలం కాల్షియం ట్యాబ్లెట్ తీసుకోవడంతో ఆస్టియోపొరోసిస్ రాకుండా నివారించలేం.
కాల్షియం, అవసరానికి తగ్గట్లుగా విటమిన్ డీ తీసుకోవడం, బరువులు మోసేలా వ్యాయామాలు చేయడం, పడిపోకుండా లేదా ప్రమాదాలు జరగకుండా చూసుకోవడం కీలకం.
కంటి పరీక్ష
50ల్లో కంటి శుక్లాలు, నీటి కాసులు, డయాబెటిక్ రెటినోపతి, వయసుతో పాటు వచ్చే ఇతర కంటి సమస్యల ప్రమాదం పెరుగుతుంది.
మధుమేహం ఉన్నవారు క్రమం తప్పకుండా రెటీనా పరీక్ష చేయించుకోవాలి. చూపు బాగానే ఉన్నా, కొన్ని కంటి వ్యాధుల లక్షణాలు ప్రారంభ దశలో కనిపించకపోవచ్చు.
వినికిడి పరీక్షలు
"వయస్సు వల్ల వినికిడి తగ్గడం సహజమే" అంటూ దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు.
వినికిడి తగ్గితే సామాజికంగా దూరమవడం, సంభాషణలో ఇబ్బంది, మానసిక ఒత్తిడి వంటి సమస్యలు రావచ్చు. ఇలాంటివారికి అవసరాన్ని బట్టి ఆడియోమెట్రీ పరీక్ష చేయాలి.
50 ఏళ్లు దాటిన తర్వాత ఆరోగ్య సంరక్షణ అంటే కేవలం ఏదైనా సమస్య వస్తేనే డాక్టర్ దగ్గరకు వెళ్లడం కాదు.
వ్యాధి రావడానికి ముందే ప్రమాదాన్ని గుర్తించడం, క్యాన్సర్‌ను ప్రారంభ దశలో గుర్తించడం, టీకాలతో నివారించగల ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ పొందడం, బరువు, బీపీ, చక్కెర, కొలెస్ట్రాల్‌ను నియంత్రించడం, పొగాకు పూర్తిగా మానేయడం - ఇవే ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి పునాది.
నాకు ఏ పరీక్షలు అవసరం? - 50వ పుట్టినరోజు తర్వాత మీకు మీరే ఈ ప్రశ్న వేసుకోండి.
ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఇస్తే అది మీ ఆరోగ్యాన్ని ఎన్నో సంవత్సరాలు ముందుకు తీసుకెళ్లగలదు.
(గమనిక: రచయిత ఓ డాక్టర్. వైద్యపరమైన విధానాలు, చికిత్సలపై అవగాహన కల్పించడమే ఈ ఆర్టికల్ ఉద్దేశం. ఆరోగ్యపరమైన ఏ నిర్ణయమైనా డాక్టర్‌ను సంప్రదించి మాత్రమే తీసుకోగలరు)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























