‘ఎన్నికల సంఘంలో పరిణామాలపై సైబర్ ఫోరెన్సిక్ విచారణ జరపాలి’ - సుప్రీం కోర్టులో ఖమ్మం వాసి పిటిషన్

ఫొటో సోర్స్, Raj K Raj/Hindustan Times via Getty Images
దేశమంతా ఎన్నికల సంఘం పనితీరుపైనా, భారత ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా దేశ రాజధాని దిల్లీతో పాటు పలు ప్రాంతాల్లో నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టులో ఒక ఆసక్తికరమైన పిటిషన్ దాఖలు చేశారు ఖమ్మానికి చెందిన సామాజిక కార్యకర్త నల్లా సురేశ్ రెడ్డి.
ఎన్నికల సంఘంపై వచ్చిన ఆరోపణలపై సైబర్ ఫోరెన్సిక్ విచారణ జరగాలని కోర్టుకెక్కారు సురేశ్ రెడ్డి.
''ఎన్నికల సంఘంలో జరిగిన పరిణామాలపై సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో డిజిటల్ ఫోరెన్సిక్ నిపుణుడు, సైబర్ సెక్యూరిటీ, డేటాబేస్ నిపుణుడు, మాజీ సీనియర్ ఎన్నికల నిర్వాహకుడితో కూడిన స్వతంత్ర విచారణ కమిటీని లేదా సిట్‌ను ఏర్పాటు చేయాలి'' అని ఆయన పిటిషన్ వేశారు.
ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న సర్ ప్రక్రియపై, అంతకుముందు ఈవీఎంలు-వీవీపాట్ స్లిప్పులకు సంబంధించిన సాంకేతిక అంశాలపై తరచూ ప్రశ్నలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఆయా సాంకేతిక అంశాలను ప్రజల ముందు ఉంచేలా చేస్తే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయని సురేశ్ అంటున్నారు. ''అయితే అది ఆందోళనల కంటే న్యాయ వ్యవస్థ ద్వారానే సాధ్యం'' అని సురేశ్ చెప్పారు.

సురేశ్ పిటిషన్‌లోని డిమాండ్లు
- అక్టోబర్ 2025 నుంచి 2026 ఆగస్టు మధ్య కాలంలో సర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియకు సంబంధించి ఎన్నికల కమిషనర్లు నమోదు చేసిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్నారా? తదనుగుణ నిర్ణయాలు సీఈసీ, ఈసీల నిమయాకాలకు సంబంధించిన 2023 నాటి చట్టంలోని సెక్షన్ 18 ప్రకారం ఏకగ్రీవంగా తీసుకున్నారా లేదా మెజారిటీతో తీసుకున్నారా? లేక ఎవరి ఆదేశాల మేరకైనా వాటిని అమలు చేశారా? అనే అంశాలపై విచారణ జరపాలి.
- 2026 జులైలో ECINET పోర్టల్‌లో ఆన్లైన్ ఫారమ్ 6లో చేసిన మార్పులు చట్టబద్ధమైనవేనా? ఎన్నికల సంఘం అనుమతి లేకుండా కమిషన్ పేరిట సుప్రీంకోర్టులో అప్పీళ్లు దాఖలు చేయడానికి ఎవరు అనుమతించారు? అనే విషయాలను తేల్చాలి.
- సర్ సమయంలో ECINET, ERONET డేటాబేస్లను ఎవరు యాక్సెస్ చేశారు? ముఖ్యంగా తెలంగాణలో ఓటర్ల జాబితాలో ఎలాంటి మార్పులు, చేర్పులు, తొలగింపులు జరిగాయి? అన్నది ఆడిట్ చేయాలి.
- తెలంగాణలో డ్రాఫ్ట్ రోల్స్ నుంచి తొలగించిన లేదా నోటీసులు జారీ చేసిన ఓటర్ల వివరాలను కారణాలతో సహా, బూత్‌ల వారీగా, ఎపిక్ (EPIC) నంబర్‌తో సెర్చ్ చేసుకునే విధంగా వెబ్సైట్లో ప్రచురించేందుకు ఆదేశాలు ఇవ్వాలి.
- తెలంగాణతో పాటు సర్ అమలవుతున్న ఇతర రాష్ట్రాల్లో తుది ఓటర్ల జాబితాను ఈ పిటిషన్ తుది తీర్పునకు లోబడి ఉంచాలి.

ఫొటో సోర్స్, Suresh Reddy
సురేశ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో ఇంకా విచారణకు రావాల్సి ఉంది.
అయితే, దీంతో పాటు ఎన్నికల సంఘం ఈవీఎంలలో వాడే సాంకేతిక పరిజ్ఞానంపై వివరణ కోరుతూ ఇప్పటికే సుప్రీంకోర్టుకు వెళ్లారు సురేశ్ రెడ్డి.
ముఖ్యంగా నాన్-వాలటైల్ మెమొరీ గురించి ఆయన ప్రశ్నలు లేవనెత్తారు.
సాధారణ పరిభాషలో చెప్పాలంటే, నాన్-వాలటైల్ మెమొరీ సాంకేతికత ఉంటే బాహ్య కేబుల్స్, బ్లూటూత్ లేకపోయినా హ్యాకింగ్‌కు ఆస్కారం ఉంటుందన్న ఆరోపణ ఉంది.
అందువల్ల సాంకేతిక పరిజ్ఞాన వినియోగ సమాచారం కీలకం అంటారు సురేశ్. అయితే, సుప్రీంకోర్టు ఆ పిటిషన్‌ను ఎన్నికల సంఘానికి పంపింది.
సుప్రీంకోర్టు ద్వారా భారత ఎన్నికల సంఘం సాంకేతిక విభాగం వద్ద పిటిషనర్ లేవనెత్తిన ప్రశ్నలు ఇవీ.
- కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్ లేదా వీవీప్యాట్లలో ఎలాంటి 'నాన్-వాలటైల్ మెమొరీ' (EEPROM, Flash, OTP, Masked ROM) వాడుతున్నారు?
- ఈ చిప్‌లు రీ-రైటబుల్ (తిరిగి రాయగలవా) లేక వన్-టైమ్ ప్రోగ్రామబుల్ (OTP) పరికరాలా?
- వీటికి వైర్లెస్, బాహ్య కమ్యూనికేషన్ లేదా రిమోట్ యాక్సెస్ ద్వారా ఫర్మ్‌వేర్ మార్చే అవకాశం ఉందా?
- ఓటు నమోదైన సమయాన్ని తెలిపే డయాగ్నోస్టిక్ లాగ్స్ లేదా ఈవెంట్ లాగ్స్ మెషీన్లలో ఉంటాయా?
వీటికి సమాధానం ఇవ్వడానికి భారత ఎన్నికల సంఘం నవంబర్ వరకూ సమయం కోరినట్టు పిటిషనర్ నల్లా సురేశ్ రెడ్డి బీబీసీకి చెప్పారు.

ఫొటో సోర్స్, Faisal Bashir/SOPA Images/LightRocket via Getty Images
ఇప్పటికే పెండింగులో వీవీప్యాట్ టైం స్టాంప్ అంశం
ఈవీఎం ఓటింగ్‌లో ఓటు వేసిన ఖచ్చితమైన తేదీ, సమయం వీవీప్యాట్ స్లిప్పులపై ముద్రించాలని, ఆ స్లిప్పులను ఐదేళ్లపాటు భద్రపరచాలని కోరుతూ గతంలో కూడా సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు సురేశ్ రెడ్డి.
ఈ ఏడాది మేలో ఈ పిటిషన్‌ను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ విపుల్ ఎం.పంచోలీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారించింది.
కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్ రూల్స్ (1961) లోని రూల్ 49(ఎం) ప్రకారం అభ్యర్థి పేరు, క్రమ సంఖ్య, చిహ్నం వీవీప్యాట్‌పై వస్తున్నప్పటికీ, సమయం నమోదు కాకపోవడం వల్ల ఓటింగ్ వివాదాలు, ఆఖరి గంటల్లో పోలింగ్ పెరుగుదల వంటి అంశాల విచారణలో ఆడిట్ సమస్యలు వస్తున్నాయని పిటిషనర్ వాదించారు.
నిజానికి ఈ వీవీపాట్లపై టైం స్టాంపుల అంశం అత్యంత సున్నితమైనది. అర్థరాత్రి పూట ఒకేసారి పెద్ద మొత్తంలో ఓట్లు నమోదయ్యాయని పలువురు తరచూ ఎన్నికల సంఘంపై ఆరోపణలు చేయడం కనిపించింది.
ఆంధ్రప్రదేశ్‌లో 2024లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కూడా అర్థరాత్రి పోలింగ్‌పై రాజకీయ విశ్లేషకుడు పరకాల ప్రభాకర్ పలు అనుమానాలు లేవనెత్తారు. ఈ పరిస్థితుల్లో ఓటు నమోదైన సమయం కీలకంగా మారింది.
అయితే, ఇది సాంకేతిక సాధ్యాసాధ్యాలకు సంబంధించిన అంశం కాబట్టి దీనిని వినతిపత్రంగా పరిగణించి పరిశీలించాలని భారత ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నిర్దేశించింది.
ఈ క్రమంలో ఈసీఐ ఒక సాంకేతిక కమిటీని ఏర్పాటు చేసిందని, నవంబర్ నాటికి దీనిపై నిర్ణయం వెల్లడిస్తామంటూ ఎన్నికల సంఘం తనకు సమాచారం అందించిందని ఆయన తెలిపారు.
అయితే వీటిపై సుప్రీంకోర్టుకు వెళ్లడం వల్ల ప్రయోజనం ఉంటుందా అని ప్రశ్నించినప్పుడు, తాజా ఆందోళనల వలన ఈ వివాదం పరిష్కారం కాదని చెబుతున్నారు సురేశ్ రెడ్డి.
"జ్ఞానేశ్ రాజీనామా చేయాలి లేదా పార్లమెంటులో 2/3 మెజార్టీతో తొలగించాలి. ఈ రెండూ అంత ఆచరణలో సాధ్యం కాకపోవచ్చు. దానికి పరిష్కారం కేవలం న్యాయమార్గమే. అందుకే, ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు సిట్టింగ్ లేదా రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో గానీ, లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థతో గానీ నిష్పాక్షిక న్యాయ విచారణ జరిపించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిల్ వేస్తున్నా" అని సురేశ్ రెడ్డి బీబీసీకి చెప్పారు.
దీనిపై ప్రధాని కూడా స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.
''దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎందుకు స్పందించడం లేదు? వెంటనే అత్యున్నత స్థాయి దర్యాప్తు బృందాన్ని నియమించి వాస్తవాలను దేశ ప్రజల ముందుంచాలి. ప్రజలు శాంతియుతంగా ఉండాలంటే నిజాలు నిగ్గుతేలాలి. దేశంలో యువత ప్రభుత్వ సంస్థలపై విశ్వాసాన్ని కోల్పోతున్న తరుణంలో న్యాయం వెంటనే జరగాలి" అని ఆయన అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























