సర్ వివాదం: ఫామ్ 7 దరఖాస్తులు ఎందుకు, దీనిపై వివాదం ఏమిటి, ఫామ్ 6పై సుప్రీం కోర్టు ఏం చెప్పింది?

ఫొటో సోర్స్, ECI
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియ సాగుతున్న వేళ ఫామ్ 7 చుట్టూ వివాదం రేగింది.
ఏఐఎంఐఎం ప్రెసిడెంట్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఈ విషయంపై స్పందించారు. ఫామ్ 7 దరఖాస్తుల పేరుతో ఓట్లు తొలగించాలని చూస్తే పెద్దఎత్తున ఆందోళనలకు దిగుమతామని హెచ్చరించారు. అక్టోబరు 3న హైదరాబాద్‌లో ఆయన ఓ సభలో మాట్లాడారు.
''ఫామ్ 7 పేరుతో తప్పుడు దరఖాస్తులు లేదా అప్పీళ్లు సమర్పిస్తే వారిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలి'' అని కోరారు.
ఈ అంశంపై ఎన్నికల సంఘం కూడా స్పందించింది.
''ఫామ్ 7 దరఖాస్తుల విషయంలో అనర్హమైనవి సమర్పిస్తే తగిన చర్యలు తీసుకోవాలి'' అని తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ అధికారి (సీఈవో) సి. సుదర్శన్ రెడ్డి జిల్లాల కలెక్టర్లకు సూచించారు.

మరోవైపు, 'సర్' ప్రక్రియలో భాగంగా కర్ణాటకలో ఫామ్ 7 కింద దాదాపు నాలుగువేలకు పైగా ఓటర్ల పేర్లు తొలగించారని,వారిలో ఎక్కువ మంది ముస్లిం ఓటర్లు ఉన్నారంటూ 'ది హిందూ' రిపోర్టు చేసింది.
అసలు, ఇంతకీ ఫామ్ 7 ఎందుకు ఉపయోగిస్తారు?
ఓటరు పక్రియలో ఈ దరఖాస్తు ఎంత కీలకం?
ఫామ్ 7 అంటే..
ఓటరు జాబితాలో ప్రతిపాదిత పేరు చేర్చేందుకు లేదా తొలగించేందుకు ఫామ్ 7 కింద దరఖాస్తు చేసుకోవచ్చు.
భారత్‌లో 1960లో తీసుకువచ్చిన ఓటరు నమోదు నిబంధనలలోని సెక్షన్ 13 ఓటరు నమోదు, తొలగింపుల గురించి చెబుతుంది.
సెక్షన్ 13(2) మేరకు ఫామ్ 7 కింద ఓటరు జాబితాలో ఓటు నమోదు చేయడానికి లేదా తొలగించడానికి సంబంధించిన అభ్యంతరాల విషయంలో దరఖాస్తు చేసుకునే వీలుంటుంది.

ఫొటో సోర్స్, ECI
ఫామ్ 7 దరఖాస్తుకు ఏయే కారణాలు చెప్పాలి?
మూడు కేటగిరీలలో ఫామ్ 7 దరఖాస్తుకు అవకాశం ఉందని ఎన్నికల సంఘం నిబంధనలు చెబుతున్నాయి.
- చనిపోవడం లేదా తగిన కనీస వయసు లేకపోవడం లేదా గైర్హాజరు / శాశ్వతంగా వలస వెళ్లడం లేదా అప్పటికే ఓటరుగా ఉండటం లేదా భారతీయ పౌరుడు కాకపోవడం.. ఇలాంటి కారణాలతో ఓటరు తరఫున వేరొక వ్యక్తి దరఖాస్తు సమర్పించేందుకు వీలుంటుంది.
- ఎవరైనా ఓటరు ఆయా కారణాలతో ఓటు హక్కుకు అర్హుడు కాదని భావిస్తే, ఓటరు పేరును వ్యతిరేకిస్తూ ఇతరులు కూడా ఫామ్ 7 కింద దరఖాస్తులు సమర్పించవచ్చు.
- ఓటరు స్వతహాగా శాశ్వతంగా వలస వెళ్లడం లేదా అప్పటికే నమోదు కావడం లేదా భారతీయ పౌరుడు కాదని భావిస్తే ఫామ్ 7 కింద దరఖాస్తుకు వీలుంటుంది.
ఈ దరఖాస్తును ఓటరు నమోదు అధికారి లేదా సహాయ ఓటరు నమోదు అధికారి లేదా బూత్ స్థాయి అధికారికి సమర్పించేందుకు ఎన్నికల సంఘం వీలు కల్పించింది.
ఒకవేళ ఓటరు చనిపోయారనే కారణంతో ఓటు హక్కు తొలగించాలని ప్రతిపాదిస్తే ఫామ్ 7తోపాటు మరణ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది.
ఓటరు స్వయంగా కాకుండా ఇతరులు ఆ ఓటరుపై అభ్యంతరాలు లేవనెత్తిన పక్షంలో ఆ వ్యక్తి వివరాలు రాయాల్సి ఉంటుంది. పేరు, ఇంటి పేరు, ఓటరు ఫొటో గుర్తింపు కార్డు నంబరు (అందుబాటులో ఉంటే) రాయాల్సి ఉంటుంది. దరఖాస్తుదారు పూర్తి చిరునామా కూడా సమర్పించాల్సి ఉంటుంది.
ఇలా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఓటరు నమోదు అధికారి (ఈఆర్వో) పరిష్కరించాల్సి ఉంటుంది.
భారత పౌరసత్వం కలిగి ఉండి విదేశాల్లో ఉన్న వ్యక్తులు (ఎన్నారైలు) ఓటు హక్కు కోసం చేసుకునే దరఖాస్తు ఫామ్ 6ఏ.
తప్పుల సవరణ లేదా ఓటరు వివరాలు అప్డేట్ చేసేందుకు పెట్టుకునే దరఖాస్తు ఫామ్ 8. ఓటరు వివరాలు, పేరులో సవరణలు, ఎపిక్ వివరాలు లేదా దివ్యాంగుల వివరాల సవరణ కోసం ఈ ఫామ్ కింద దరఖాస్తు చేసుకోవడానికి ఎన్నికల సంఘం వీలు కల్పిస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
తప్పుడు వివరాలు సమర్పిస్తే..
దరఖాస్తుదారు తప్పుడు సమాచారం ఇస్తే శిక్షార్హమైన నేరంగా ఎన్నికల సంఘం పరిగణిస్తుంది.
తప్పుడు సమాచారం సమర్పిస్తే ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ 31 కింద గరిష్ఠంగా ఏడాది వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉందని తెలంగాణ సీఈవో సుదర్శన్ రెడ్డి చెప్పారు.
ఫామ్ 6 విషయంలోనూ వివాదం
ఫామ్ 6 విషయంలో ఇటీవల దేశవ్యాప్తంగా వివాదం రేగింది. అయితే, ఈ వివాదం గురించి తెలుసుకునే ముందు... ఫామ్ 6 ఎందుకు ఉపయోగిస్తారనేది చూద్దాం.
1960 ఓటరు నమోదు ప్రక్రియ నిబంధనలలో సెక్షన్ 13(1) ఈ ఫామ్ 6 గురించి వివరిస్తుంది.
18 ఏళ్లు నిండిన భారతీయ పౌరులైన వారు ఫామ్ 6ను సంబంధిత నియోజకవర్గ ఓటరు నమోదు అధికారికి సమర్పించి ఓటు హక్కు పొందొచ్చు. దీనికోసం పౌరసత్వం, వయసు ధ్రువీకరణ (పుట్టిన తేదీ రుజువు), నివాస రుజువుకు సంబంధించిన పత్రాలు సమర్పించాలి.
తల్లిదండ్రులు లేదా సంరక్షకులకు సంబంధించిన గత 'సర్' వివరాలు నమోదు చేయాలనే కాలమ్ గతంలో ఫామ్ 6 దరఖాస్తులో ఉండేది కాదు. తాజా సర్ పక్రియలో భాగంగా ఈ కాలమ్ చేర్చడం వివాదానికి కేంద్ర బిందువుగా మారింది.
ఎస్ఐఆర్తో ముడిపడిన మార్పుల సమయంలో కొత్త కాలమ్ చేర్చడం వల్ల కొత్త ఓటర్లు లేదా వారి తల్లిదండ్రులు/తాతనానమ్మల పాత ఎస్ఐఆర్ రికార్డులతో సంబంధాన్ని తెలపాల్సి వస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.
'ఇండియన్ ఎక్స్‌ప్రెస్' కథనం ప్రకారం.. ఈ మార్పును ఎన్నికల కమిషనర్ సుఖ్బీర్ సింగ్ సంధు "అనధికారికం, చట్టవిరుద్ధం" అని పేర్కొన్నారు.
ఎస్ఐఆర్తో ముడిపడిన ఫామ్-6 డిక్లరేషన్‌ను సుప్రీంకోర్టు సమర్థించిందని ఎన్నికల కమిషన్ ఇటీవల విడుదల చేసిన ప్రెస్ నోట్లో పేర్కొంది.
అయితే ఫామ్ 6లో మార్పులను తాము ఆమోదించలేదని సుప్రీం కోర్ట్ అక్టోబర్ 5న పేర్కొంది.
గత 10 నెలల కాలంలో ఇద్దరు ఎన్నికల కమిషనర్లు ఈసీ నిర్ణయాలపై 14సార్లు అభ్యంతరాలు లేవనెత్తారని 'ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్' సెప్టెంబరు 25న ప్రచురించిన కథనంలో పేర్కొంది.
దీనిపై ఎన్నికల సంఘం సెప్టెంబరు 26న ఒక ప్రెస్ నోట్ విడుదల చేసింది.
ఓటర్ల జాబితాలో వ్యత్యాసాలు లేదా ఇతర కారణాల వల్ల నోటీసులు అందుకున్న ఓటర్ల కోసం బీఎల్ఓ (బూత్ లెవెల్ ఆఫీసర్)లు వారి ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరించి, వాటిని ఈసీఐనెట్‌లో అప్లోడ్ చేస్తారు. దీనికోసం ఓటర్లను ఈఆర్ఓ లేదా ఏఈఆర్ఓ ఆఫీసుకు పిలవరు.
నైట్ షెల్టర్లలో ఉండే సామాన్యులు, పేదలు, కార్మికులు, నిరాశ్రయులైన పౌరుల కోసం జిల్లా ఎన్నికల అధికారులు (డీఈఓలు) ప్రత్యేక శిబిరాలు, సహాయ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. దీనివల్ల గరిష్ఠ సంఖ్యలో అర్హులైన ఓటర్లను జాబితాలో చేర్చే అవకాశం ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
తెలంగాణలో ఏం జరుగుతోంది?
తెలంగాణలో 'సర్' ప్రక్రియ కొనసాగుతోంది. నవంబరు 9న తుది ఓటరు జాబితాను ప్రచురిస్తామని ఎన్నికల సంఘం చెబుతోంది.
ఈ ప్రక్రియలో భాగంగా అనామలీస్ (తేడాలు) గుర్తింపు, మ్యాపింగ్ కాని ఓటర్లు, అభ్యంతరాలు వచ్చిన ఓటర్లను కలిపి మొత్తం 92,88,181 నోటీసులు ఇచ్చేందుకు ఎన్నికల సంఘం నిర్ణయించింది.
ఇందులో అక్టోబరు 3నాటికి 90,26,993 మందికి నోటీసులు అందించినట్లు సీఈవో సుదర్శన్ రెడ్డి చెప్పారు.
''ఇప్పటివరకు నోటీసులు అందుకున్న ఓటర్లకు సంబంధించి తగిన పత్రాలు, రుజువులు తీసుకుని వెరిఫికేషన్ చేశాం. వీరిలో అక్టోబరు 3నాటికి 59,35,479 మంది ఓటర్లను అర్హులుగా గుర్తించి ఓటరు జాబితాలో చేర్చేందుకు గుర్తించాం'' అని చెప్పారు.

ఫొటో సోర్స్, Pradeep Gaur/Mint via Getty Images
తెలంగాణ సీఈవో ఏం చెప్పారంటే..
గోషామహల్ నియోజకవర్గంలోని బూత్ నం.173లో పెద్ద సంఖ్య(బల్క్)లో ఫామ్-7 దరఖాస్తులు సమర్పించినట్లు ఒక వీడియో వైరల్ అయ్యింది.
''ఈ దరఖాస్తులు ఆమోదించడం సాధ్యం కాదు'' అని బీఎల్వో చెబుతున్నట్లు ఆ వీడియోలో ఉంది.
ముషీరాబాద్, బహదూర్ పురా నియోజకవర్గాల్లోనూ పెద్ద సంఖ్యలో ఫామ్ 7 ప్రీ-ప్రింటెడ్ దరఖాస్తులు సమర్పించినట్లుగా టీపీసీసీ ఆరోపించింది.
ఈ నేపథ్యంలో తెలంగాణ సీఈవో దీనిపై వివరణ ఇచ్చారు.
ఫామ్ – 6, 6ఏ, 7, 8 కింద తప్పుడు దరఖాస్తులు సమర్పించిన వారిపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్‌తోపాటు తెలంగాణలోని అన్ని జిల్లాల కలెక్టర్లు/ఎన్నికల అధికారులకు సుదర్శన్ రెడ్డి లేఖ రాశారు.
''ఫామ్ 7 పేరుతో పెద్ద సంఖ్యలో దరఖాస్తులను ఈఆర్వోలకు సమర్పిస్తున్నట్లు ఎన్నికల సంఘం దృష్టికి వచ్చింది. అలాంటి దరఖాస్తులు అర్హమైనవి కావని కూడా తెలుస్తోంది. అలా పెద్ద సంఖ్యలో దరఖాస్తులు సమర్పించిన వారిని గుర్తించి ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ 31కింద చర్యలు తీసుకోవాలి'' అని కోరారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























