గుడ్‌నైట్.
ఈ లైవ్ పేజీని ఇంతటితో ముగిస్తున్నాం.
ఈరోజు ముఖ్యమైన వార్తలు కొన్నింటిని ఇక్కడ చూడండి.
ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల సందర్భంగా ఘర్షణలు చెలరేగాయి. పెరుగుతున్న ధరలు, పాఠశాల్లో అధ్వాన్న పరిస్థితులకు వ్యతిరేకంగా జరిగిన ర్యాలీలో నిరసనకారులు పాల్గొన్నారు. రిపబ్లిక్ స్క్వేర్ పరిసరాల్లో పెద్ద సంఖ్యలో నిరసనకారులు గుమిగూడి నినాదాలు చేశారు. కొందరు వాహనాలకు నిప్పంటించి ఆందోళనకు దిగారు.
గుడ్‌నైట్.
ఈ లైవ్ పేజీని ఇంతటితో ముగిస్తున్నాం.
ఈరోజు ముఖ్యమైన వార్తలు కొన్నింటిని ఇక్కడ చూడండి.

ఫొటో సోర్స్, Reuters

ఫొటో సోర్స్, Reuters

ఫొటో సోర్స్, PA

ఫొటో సోర్స్, PA

ఫొటో సోర్స్, EPA/Shutterstock

ఫొటో సోర్స్, AFP via Getty Images
పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ సరిహద్దులో ఇరుదేశాల సైనికుల మధ్య ఘర్షణలు జరిగినట్టు వార్తలొచ్చాయి. ఈ ఘటనపై ఇరుదేశాలు భిన్నమైన వాదనలు విన్పిస్తున్నాయి.
పక్తియా ప్రావిన్స్‌లో అఫ్గాన్ భద్రతా బలగాలకు, పాకిస్తాన్ సైనికులకు మధ్య కొన్ని గంటల పాటు కాల్పులు జరిగాయని అప్గానిస్తాన్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని బఖ్తర్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది.
ఏడుగురు పాకిస్తానీ సైనికులు మరణించారని తాలిబాన్ ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ బఖ్తర్ వార్తాసంస్థ తెలిపింది. దీన్ని స్వతంత్రంగా ధృవీకరించలేదు.
అంతకుముందు, ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రావిన్స్‌లోని అప్పర్ కుర్రం ప్రాంతంలో అఫ్గాన్ తాలిబాన్ ప్రభుత్వ బలగాలు ఎలాంటి కవ్వింపు లేకుండా కాల్పులు జరిపాయని పాకిస్తాన్ సైన్యం వాటికి సమర్థంగా బదులిచ్చిందని భద్రతా వర్గాలను ఉటంకిస్తూ రేడియో పాకిస్థాన్ తెలిపింది.
గత ఏడాదిగా ఇరు దేశాల మధ్య సాయుధ ఘర్షణలు, దాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అఫ్గానిస్తాన్‌తో ఉన్న అన్ని వాణిజ్య మార్గాలను పాకిస్తాన్ మూసివేసింది.

ఫొటో సోర్స్, Reuters
ఆల్బర్టాలోని కెనడా సైనిక స్థావరానికి సమీపంలో భారీ అగ్నిప్రమాదం సంభవించినట్లు ఆ దేశ సైన్యం ప్రకటించింది.
ప్రమాద తీవ్రతను ఇంకా అంచనా వేస్తున్నామని, ఎంతమంది మరణించారు.. ఎంతమంది గాయపడ్డారు అనే వివరాలు ఆ తరువాతే వెల్లడిస్తామని ‘ది కెనడియన్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్(సీఏఎఫ్) తెలిపింది.
అగ్నిప్రమాదం జరిగిన వేన్‌రైట్ కెనడియన్ ఫోర్సెస్ బేస్ ఆ దేశంలో కీలక మిలటరీ ట్రైనింగ్ కేంద్రం.
కాగా కనీసం ఏడుగురు మరణించారని కెనడానకు చెందిన టీవీ నెట్‌వర్క్ గ్లోబల్ న్యూస్ రిపోర్ట్ చేసింది.
ఫైర్ ట్రైనింగ్ ఎక్సర్‌సైజ్ జరుగుతున్న సమయంలో గ్యాస్ లైన్‌కు కానీ గ్యాస్ వెల్‌పై కానీ ఫైరింగ్ జరగడంతో ప్రమాదం జరిగినట్లు పేరు చెప్పడానికి ఇష్టపడని మిలటరీ సోర్సెస్‌ను ఉటంకిస్తూ గ్లోబల్ న్యూస్ రిపోర్ట్ చేసింది.
కాగా సీఏఎఫ్, స్థానిక అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారని, మంటలను అదుపులోకి తీసుకొస్తున్నారని కెనడా రక్షణ మంత్రి డేవిడ్ మెక్‌గింటీ చెప్పారు.

ఫొటో సోర్స్, NATHAN HOWARD/POOL/AFP via Getty Image
పశ్చిమాసియాలోని వెస్ట్ బ్యాంక్‌లో యూరోపియన్ దౌత్యవేత్తల బృందంపై ముసుగులు ధరించిన కొందరు ఇజ్రాయెలీ సెటిలర్లు దాడి చేశారు.
బెల్జియం తమ కాన్సుల్ జనరల్‌తో పాటు ఇతర దౌత్యవేత్తలపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించింది. ఈ దాడికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఇజ్రాయెల్‌ను కోరింది.
ఇజ్రాయెల్ సైన్యం కూడా దీన్ని ‘తీవ్రమైన హింసాత్మక చర్య’గా అభివర్ణిస్తూ, దర్యాప్తు చేస్తున్నట్లు ప్రకటించింది.
ఈ ఘటనపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం అనుమానాలు వ్యక్తం చేసింది. ఇజ్రాయెల్ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు జరుగుతున్న ‘ప్రచారంలో’ భాగమై ఉండొచ్చని అభిప్రాయపడింది.
దీనికి ఒక రోజు ముందు వెస్ట్ బ్యాంక్‌లోని మరో గ్రామంలో పాలస్తీనీయులతో పాటు వాషింగ్టన్ పోస్ట్ ఫొటో జర్నలిస్ట్ హెడీ లెవిన్‌పై దాడి జరిగింది. ఈ ఘటనలో లెవిన్‌తో పాటు పలువురు పాలస్తీనా పౌరులు గాయపడ్డారు.
ఈ దాడి ఆందోళనకరమని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు ఇజ్రాయెల్ ప్రతిష్ఠకు కూడా మంచివి కావని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, ANI Video Grab
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో శీతలామాత ఆలయం సమీపంలో వేగంగా వచ్చిన ఓ ట్రక్కు భక్తులపైకి దూసుకెళ్లడంతో 11 మంది మృతి చెందారు. మరో 29 మంది గాయపడ్డారు.
శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత సుమారు 1.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రుల్లో ఐదారుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు రిపోర్టులు వస్తున్నాయి.
గ్వాలియర్ కలెక్టర్ రుచికా చౌహాన్ తెలిపిన వివరాల ప్రకారం.. చినోర్ నుంచి ఆలయం వైపునకు ట్రక్కు వస్తోంది. మార్గమధ్యంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ట్రక్కు ఎడమవైపు తిరిగింది. ఈ క్రమంలో రోడ్డు పక్కన ఉన్న దుకాణాలను ఢీకొట్టి, శీతలామాత ఆలయ ప్రవేశ ద్వారం వద్దకు దూసుకెళ్లింది.దీంతో ఆలయ గోడ కూలిపోయింది. శిథిలాల కింద 40 నుంచి 50 మంది చిక్కుకుపోయారు.
నవరాత్రుల సందర్భంగా ఈ రహదారిపై బారికేడ్లు, పోలీసు చెక్‌పోస్టులు కూడా ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. అయినప్పటికీ ట్రక్కు ఆలయ ప్రాంగణం వరకు ఎలా వచ్చిందనే అంశంపై విచారణ జరుపుతున్నట్లువెల్లడించారు.
క్షతగాత్రులకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నామని, ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోందని జిల్లా యంత్రాంగం తెలిపింది.

ఫొటో సోర్స్, ANI
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా నాదర్‌గుల్‌లోని ఎంవీఎస్ఆర్ కాలేజీలో దాండియా కార్యక్రమం సందర్భంగా ఏర్పాటుచేసిన లైటింగ్ స్టాండ్ కూలిపోవడంతో ఓ విద్యార్థిని మృతి చెందగా, మరో 12 మంది గాయపడ్డారని ఏఎన్ఐ రిపోర్ట్ చేసింది.
“సాయంత్రం 7 నుంచి 8 గంటల మధ్య నాకు ఫోన్ వచ్చింది. ఎంవీఎస్ఆర్ కాలేజీలో దాండియా కార్యక్రమం జరుగుతోంది. బలమైన గాలులు వీచాయి. లైటింగ్, అలంకరణ కోసం ఏర్పాటు చేసిన స్తంభం ఒక్కసారిగా కూలిపోయింది. మీ బిడ్డ తలపై స్తంభం నేరుగా పడిందని నా స్నేహితుడు అశోక్ ఫోన్ చేసి చెప్పాడు. గాయం చిన్నదేనని, వెళ్లి చూడాలని చెప్పాడు. అయితే ఆస్పత్రి సిబ్బందిని అడిగితే.. ఆమెను ఆస్పత్రికి తీసుకొచ్చేసరికే మృతి చెందినట్లు తెలిపారు. సరైన భద్రతా చర్యలు తీసుకోలేదని, నిర్లక్ష్యం జరిగిందని కొందరు చెబుతున్నారు” అని మృతురాలి బంధువు సురేశ్ ఏఎన్ఐతో చెప్పారు.
“సంగమం కార్యక్రమాలను ఏర్పాటు చేశాం. నిన్న సాంకేతిక, ఈ రోజు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాం. విద్యార్థుల ఆసక్తి, అభ్యర్థన మేరకు ముగింపు కార్యక్రమంగా దాండియా ఏర్పాటు చేశాం. విద్యార్థినులు నృత్యం చేస్తున్న ప్రాంతంలో స్టాండ్ పడటంతో ఈఈఈ విభాగానికి చెందిన సోనీ నారాయణ దాస్ అనే విద్యార్థినిని కోల్పోయాం. సుమారు తొమ్మిది మంది విద్యార్థులను ఆస్పత్రిలో చేర్చాం. యాజమాన్యం పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. బాధిత విద్యార్థుల తల్లిదండ్రులకు అన్ని విధాలా అండగా ఉంటాం” అని కాలేజీ డైరెక్టర్ ప్రసన్న కుమార్ ఏఎన్ఐతో చెప్పారు.
ఈ ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేసినట్లు ఏజెన్సీ రిపోర్ట్ చేసింది. మృతురాలి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదానికి బాధ్యులైన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఫొటో సోర్స్, Getty Images
పాఠశాలల్లో సమస్యలు, పెరుగుతున్న జీవన వ్యయాలకు వ్యతిరేకంగా ఫ్రాన్స్‌లో శనివారం జరిగిన తాజా నిరసనలు హింసాత్మకంగా మారాయి.
సుమారు 5.5 లక్షల మంది వీధుల్లోకి వచ్చి నిరసనకు దిగగా, హింస తీవ్రతరం కావడంతో కనీసం 1,200 మందిని అరెస్టు చేసినట్లు ఫ్రాన్స్ ప్రభుత్వం తెలిపింది. ఈ అల్లర్లలో 150 మంది పోలీసు సిబ్బంది గాయపడినట్లు ఫ్రాన్స్ ప్రధానమంత్రి సెబాస్టియన్ లెకోర్ను తెలిపారు.
రాజధానితో పాటు ఇతర ప్రాంతాల్లోనూ నిరసనకారులు భవనాలకు నిప్పు పెట్టారు. లిమోజెస్ పట్టణంలోని మున్సిపల్ భవనంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో పైకప్పులో కొంత భాగం కూలిపోయింది.
మరోవైపు, పలు నగరాల్లో దోపిడీలు చోటుచేసుకున్నాయి. నగర పాలక సంస్థల కార్యాలయాలు, వ్యాపార సంస్థలను లక్ష్యంగా చేసుకుని పెద్ద ఎత్తున విధ్వంసానికి పాల్పడ్డారు. పారిస్‌లో దుస్తులు, ఆహార పదార్థాల దుకాణాలపై దాడులు చేసి దోపిడీకి పాల్పడ్డారు. లిల్లే నగరంలో యాపిల్ స్టోర్‌లోకి చొరబడిన ఆందోళనకారులు..అక్కడి వస్తువులన్నింటినీ పూర్తిగా పట్టుకుపోయారు.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లకు స్వాగతం.
నేను బీబీసీ ప్రతినిధి వద్ది ప్రభాకర్, మధ్యాహ్నం 2 గంటల వరకు ముఖ్యమైన వార్తలను మీకు అందిస్తాను.
నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి.