నిర్బంధానికి, అరెస్ట్‌కు తేడా ఏమిటి? వీటి విషయంలో పౌరులకు ఎలాంటి హక్కులు ఉంటాయి?

దిల్లీ, జంతర్ మంతర్, దిల్లీ పోలీసులు, సుప్రీంకోర్టు, భారత ఎన్నికల సంఘం
ఫొటో క్యాప్షన్, దిల్లీలో ఆందోళనాకారులను పోలీసులు నిర్బంధించారు
    • రచయిత, తుషార్ కులకర్ణి, వైభవి కలసాయిత
    • హోదా, బీబీసీ ప్రతినిధులు
  • ప్రచురణ
  • చదివే సమయం: 5 నిమిషాలు

ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్ కుమార్‌ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో గత కొంత కాలంగా దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి.

ఈ సందర్భంగా పలువురు ఆందోళనాకారులను, నేతలను పోలీసులు నిర్బంధించారని, కాసేపటి తర్వాత విడిచి పెట్టారని వింటూనే ఉన్నాం.

‘‘ఎవర్నీ అరెస్టు చేయలేదు, కొందరి అదుపులోకి తీసుకున్నామని, ప్రశ్నించి వదిలేశామని’’ తరచూ పోలీసులు చెబుతుంటారు.

ఇది విన్న తర్వాత అసలు అరెస్టు చేయడానికి, నిర్బంధించడానికి మధ్య తేడా ఏంటనే ప్రశ్న రావచ్చు.

అరెస్టు, నిర్బంధం లాంటి సమయాలలో పౌరులకు ఉండే హక్కులు ఏంటి, న్యాయపరంగా లభించే రక్షణ ఏమిటి?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
దిల్లీ, జంతర్ మంతర్, దిల్లీ పోలీసులు, సుప్రీంకోర్టు, భారత ఎన్నికల సంఘం
ఫొటో క్యాప్షన్, అదుపులోకి తీసుకున్న ప్రజల ప్రాథమిక హక్కులను పోలీసులు పరిరక్షించాల్సి ఉంటుంది.

నిర్బంధం, అరెస్టుకు మధ్య తేడా ఏంటి?

నిర్బంధంలోకి తీసుకోవడం గురించి తెలుసుకోవడానికి ముందు అసలు నిర్బంధం అంటే ఏమిటో అర్థం చేసుకోవాలి.

నేరం రుజువు అవడం వల్ల కాక, ఏ కారణం చేతనైనా ఓ వ్యక్తిని ముందు జాగ్రత్త చర్యగా అదుపులోకి తీసుకోవడం వల్ల ఆ వ్యక్తి, వ్యక్తిగత స్వేచ్ఛను కోల్పోవడాన్ని నిర్బంధమని ఐక్యరాజ్యసమితి మానవహక్కుల సంఘం పేర్కొంది.

‘‘"అధికారికంగా ఒక వ్యక్తిని ఒకే చోటుకు పరిమితం చేయడం లేదా బంధించి ఉంచే చర్యను 'నిర్బంధం' అంటారు" అని కేంబ్రిడ్జ్ నిఘంటువు చెబుతోంది.

"ఒక వ్యక్తి నేరానికి పాల్పడ్డాడనే ఆరోపణ ఆధారంగా లేదా ఒక చట్టబద్ధ సంస్థ చర్య ద్వారా ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకోవడాన్ని 'అరెస్ట్' అంటారు’’ అని ఐక్యరాజ్యసమితి మానవహక్కుల సంఘం పేర్కొంది.

ఓ వ్యక్తి ఏదైనా నేరానికి లేదా చిన్నపాటి తప్పుకు పాల్పడ్డాడని గుర్తించిన తరువాత ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకోవడాన్నే ‘అరెస్ట్’ అంటారని కేంబ్రిడ్జ్ నిఘంటువు వివరిస్తోంది.

దిల్లీ, జంతర్ మంతర్, దిల్లీ పోలీసులు, సుప్రీంకోర్టు, భారత ఎన్నికల సంఘం
ఫొటో క్యాప్షన్, ప్రభుత్వ, ప్రజల ఆస్తులకు నష్టం జరిగే అవకాశం ఉంటే, ముందస్తు నిర్బంధంలోకి తీసుకోవచ్చు.

రాజ్యాంగ రక్షణలు

దిల్లీలో భారీ సంఖ్యలో ఆందోళనాకారులను పోలీసులు నిర్బంధించారు.

ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని వరుసగా రెండు రోజులు నిర్బంధించి, ప్రశ్నించాక వదిలేశారు.

ఎలాంటి నేరానికి పాల్పడకపోయినా పోలీసులు రాహుల్ గాంధీని ఒక ప్రాంతంలో నిర్బంధించారు. తర్వాత ఆయన్ని ఒక వ్యాన్‌లో తీసుకెళ్లారు. అనంతరం ఆయన తమ కస్టడీలో ఉన్నట్టు పోలీసులు చెప్పారు. దీనర్థం ఆయన ఏదో నేరమో, మరేదైనా తప్పో చేసినట్టు కాదు, కానీ భవిష్యత్తులో ఆయన అలాంటి చర్యలకు దిగకుండా పోలీసుల పర్యవేక్షణలో ఉంచారు.

చాలా మంది నిరసనకారుల విషయంలోనూ ఇదే జరిగింది. పోలీసులు పలువురిని వాహనాల్లో తీసుకెళ్లి, కొంతసేపు తమ పర్యవేక్షణలో ఉంచిన తర్వాత విడుదల చేశారు. వారిపై ఎలాంటి అభియోగాలూ నమోదు చేయలేదు. ఇలాంటి పరిస్థితిని 'డిటెన్షన్‌' లేదా అదుపులోకి తీసుకోవడం అంటారు.

అంటే ఇక్కడ ఎలాంటి నేరం నమోదు కాలేదంటే, వారు ఏ తప్పూ చేయలేదనే సందేహం మనకు రావచ్చు. అయితే భవిష్యత్తులో చేయవచ్చు అనే అనుమానంతో వ్యక్తులను పోలీసులు తమ పర్యవేక్షణలో ఉంచుతారు.

మరి ఇలా అదుపులోకి తీసుకునే అధికారం దుర్వినియోగమైతే, ఆ సమయంలో అదుపులోకి తీసుకున్నవారి స్వేచ్ఛను హరిస్తే ఎవరు రక్షణ కల్పిస్తారు?

దీనికి జవాబు రాజ్యాంగంలోనే ఉంది. చట్టాన్ని దుర్వినియోగం చేసి మనల్ని ఇష్టానుసారంగా ఎవరూ నిర్బంధించలేరని రాజ్యాంగం మనకు హామీ ఇస్తోంది. దీనికి కొన్ని మినహాయింపులు ఉన్నప్పటికీ, స్వేచ్ఛ ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు. ఈ హక్కును రాజ్యాంగమే పరిరక్షిస్తుంది. దీనినే 'నిర్బంధం నుంచి రక్షణ (ప్రొటెక్షన్ ఫ్రమ్ ప్రివెంటివ్ డిటెన్షన్)' అని రాజ్యాంగం చెబుతోంది.

దిల్లీ, జంతర్ మంతర్, దిల్లీ పోలీసులు, సుప్రీంకోర్టు, భారత ఎన్నికల సంఘం
ఫొటో క్యాప్షన్, స్వేచ్ఛ పౌరుడి ప్రాథమిక హక్కు. దీనిని రాజ్యాంగమే పరిరక్షిస్తుంది.

ఎలాంటి రక్షణలు ఉన్నాయి?

అరెస్టు, నిర్బంధం నుంచి రాజ్యాంగంలోని ఆర్టికల్ 22(1) కొన్ని నిర్ణీత కేసులలో రక్షణ కల్పించింది.

"అరెస్టు చేసిన వ్యక్తికి ఆ అరెస్టుకు గల కారణాలను వీలైనంత త్వరగా తెలియజేయకుండా నిర్బంధంలో ఉంచకూడదు. అలాగే, తనకు నచ్చిన న్యాయవాదిని సంప్రదించుకుని, ఆ న్యాయవాది ద్వారా తన తరఫున వాదనలు వినిపించుకునే హక్కును నిరాకరించకూడదు."

ఆర్టికల్ 22(1)కు మరో ప్రత్యేకత కూడా ఉంది. ఇది రాజ్యాంగంలోని మూడో భాగంలో ఉంది. ఈ భాగం పౌరుల ప్రాథమిక హక్కులకు సంబంధించినది. పౌరుల ప్రాథమిక హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని రాజ్యాంగం చెబుతోంది.

ఎవరినైనా అరెస్టు చేసినా, నిర్బంధించినా 24 గంటల్లో మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచాలని రాజ్యాంగం 22 (2) చెబుతోంది.

దీనికి రాజ్యాంగం రెండు మినహాయింపులను కూడా పేర్కొంది.

రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 22(3) ప్రకారం, పైన పేర్కొన్న ఆర్టికల్‌ 22(1), 22(2) నిబంధనలు రెండు సందర్భాల్లో వర్తించవు.

1. శత్రుదేశానికి చెందిన వ్యక్తిని అరెస్టు చేసినప్పుడు,

2. ముందస్తు నిర్బంద చట్టం కింద అరెస్ట్, లేదా నిర్బంధించినప్పుడు

నిర్బంధానికి సంబంధించిన నిబంధనలను రాజ్యాంగం స్పష్టంగా పేర్కొంది. అయినా దిల్లీలో చాలామందిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం చూశాం. దీనికి గల కారణాలు తెలుసుకోవడానికి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది రాకేశ్ రాథోడ్‌ను బీబీసీ మరాఠీ సంప్రదించింది.

"నిరసనలకు అనుమతి ఉన్నప్పుడు పోలీసులు ఎలాంటి చర్యలూ తీసుకోరు. కానీ అనుమతి లేనప్పుడే ఇలాంటి పరిస్థితి తలెత్తుతుంది" అని రాకేశ్ అన్నారు.

"అనుమతి లభించిన నిరసనల్లో శాంతిభద్రతలు సరిగా ఉంటే పోలీసులు ఎవరినీ నిర్బంధించలేరు. కానీ ఏదైనా గందరగోళం ఏర్పడితే, అలాంటి పరిస్థితికి కారణమైన వారిని అదుపులోకి తీసుకుంటారు" అని ఆయన పేర్కొన్నారు.

అయితే ఎవరినైనా అదుపులోకి తీసుకోవడానికి కూడా కొన్ని నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. భారతీయ నాగరిక్ సురక్షా సంహిత 2023(బీఎన్ఎస్ఎస్) ప్రకారం కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాలి.

దర్యాప్తు చేయగలిగే నేరం జరగకుండా నిరోధించడానికి వీలుగా సంబంధిత వ్యక్తిని వారెంట్ లేకుండానే అదుపులోకి తీసుకోవచ్చు, లేదా అరెస్ట్ చేయవవచ్చని బీఎన్ఎస్ఎస్‌లోని సెక్షన్ 170 చెబుతోంది. అయితే ఆ వ్యక్తిని 24 గంటల్లోపు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి.

ప్రభుత్వ లేదా ప్రజా ఆస్తులకు నష్టం కలిగిస్తున్నప్పుడు సంబంధిత వ్యక్తులను అదుపులోకి తీసుకునే అధికారం పోలీసులకు ఉంటుంది. ప్రజల ఆస్తులను ధ్వంసం చేస్తున్నట్లు పోలీసులు గుర్తిస్తే జోక్యం చేసుకోవచ్చని బీఎన్‌ఎస్‌ఎస్‌ సెక్షన్‌ 171 చెబుతోంది.

ఈ సందర్భంలోనూ సంబంధిత వ్యక్తులను 24 గంటలకు మించి నిర్బంధంలో ఉంచకూడదు. ఒకవేళ ఉంచాలి అంటే మాత్రం బీఎన్ఎస్ఎస్ ఇతర నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలి.

దిల్లీ, జంతర్ మంతర్, దిల్లీ పోలీసులు, సుప్రీంకోర్టు, భారత ఎన్నికల సంఘం
ఫొటో క్యాప్షన్, అరెస్టుల విషయంలో రాజ్యాంగం కూడా కొన్ని పరిమితులు విధించింది.

పోలీసులు పాటించాల్సిన నిబంధనలేంటి?

ఒక వ్యక్తిని నిర్బంధంలోకి తీసుకున్న తర్వాత వారితో ఎలా వ్యవహరించాలో దిల్లీ పోలీసులు ఉత్తర్వులను జారీ చేశారు. కస్టడీలోకి తీసుకున్న వ్యక్తిని ఎలా చూసుకోవాలో మార్గదర్శకాలలో పేర్కొన్నారు.

  • వ్యక్తి లేదా వ్యక్తులను నిర్బంధించిన ప్రాంతం శుభ్రంగా, సురక్షితంగా ఉండాలి.
  • అదుపులో ఉన్న వ్యక్తులకు తాగునీరు, మరుగుదొడ్డి సౌకర్యం అందుబాటులో ఉండాలి.
  • మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి . వారితో గౌరవంగా వ్యవహరించాలి.
  • శానిటరీ ప్యాడ్స్ అడిగితే అందుబాటులో ఉంచాలి.
  • మహిళల గౌరవానికి భంగం కలగకుండా, నిర్ణీత నిబంధనలకు అనుగుణంగా తనిఖీలు, పరీక్షలు నిర్వహించాలి.
  • అదుపులో ఉన్నవారికి పోలీసులే ఆహారాన్ని ఏర్పాటు చేయాలి.
  • బంధువులు ఆహారం తీసుకొస్తే తనిఖీ చేసి ఇవ్వాలి.
  • ఎవరికైనా వైద్య సహాయం అవసరమైతే అందుకు తగిన ఏర్పాట్లు చేయాలి.
  • ఆ వివరాలకు సంబంధించిన రికార్డులను కూడా నిర్వహించాలి.
24గంటలకు మించి నిర్బంధంలో ఉంచకూడదు
ఫొటో క్యాప్షన్, 24గంటలకు మించి నిర్బంధంలో ఉంచకూడదు

అరెస్టులపై సుప్రీం కోర్టు మార్గదర్శకాలేంటి?

అరెస్టులు, నిర్బంధాలకు సంబంధించి దిల్లీ పోలీసులు 2019లో స్టాండింగ్ ఆర్డర్‌ జారీ చేశారు. ఈ ఆదేశాల్లో సుప్రీంకోర్టు విచారించిన మూడు ముఖ్యమైన కేసులను ప్రస్తావించారు.ఈ కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ఆధారంగానే దిల్లీ పోలీసులు తమ ఆదేశాలను రూపొందించారు. అందుకే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ డాక్యుమెంట్ కీలకమని చెప్పవచ్చు.

సుప్రీం కోర్టు విచారించిన ఆ మూడు కేసులు:

  • జోగిందర్ కుమార్ వర్సెస్ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం (25 ఏప్రిల్ 1994)
  • డీకే బసు వర్సెస్ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం (18 డిసెంబర్ 1996)
  • అర్నేశ్ కుమార్ వర్సెస్ బిహార్ ప్రభుత్వం, ఇతరులు (2 జూలై 2014)

ఈ కేసులు ఆధారంగా దిల్లీ పోలీసులు 13 పేజీల ఉత్తర్వులను జారీ చేశారు. ఒక వ్యక్తిని పోలీసులు ఎందుకు తీసుకెళ్తున్నారో సదరు వ్యక్తికి, ఆయన బంధువులకు చెప్పాలని అందులో ఉంది.

అలాగే న్యాయ సలహా పొందే అవకాశాన్ని నిరాకరించకూడదు. అన్ని చర్యలను రికార్డు చేయాలి.

సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించని అధికారులపై చర్యలు తీసుకోవచ్చని కూడా ఈ ఉత్తర్వుల్లో ఉంది.

సుప్రీంకోర్టు, దిల్లీ హైకోర్టు ఆదేశాలను జాగ్రత్తగా, వాటి అసలు ఉద్దేశాలకు అనుగుణంగా పాటించాలని ఆ ఉత్తర్వులలో స్పష్టం చేశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)