అమ్మ తిట్టిందని అలిగి వెళ్లిపోయాడు.. 12 ఏళ్ల తరువాత ఆధార్ కార్డు ఓటీపీ అతనెక్కడున్నాడో కనిపెట్టేలా చేసింది

తన కుమారుడు దీపక్ రాజా 12 ఏళ్ల తరువాత తిరిగి రావడంతో కన్నీటి పర్యంతమవుతున్న తల్లి గిరిజ
ఫొటో క్యాప్షన్, తన కుమారుడు దీపక్ రాజా 12 ఏళ్ల తరువాత తిరిగి రావడంతో కన్నీటి పర్యంతమవుతున్న తల్లి గిరిజ
ప్రచురణ
చదివే సమయం: 5 నిమిషాలు

తల్లి తిట్టిందని అలిగి ఇంటి నుంచి వెళ్లిపోయిన కుమారుడిని 12 ఏళ్ల తరువాత పోలీసులు కనిపెట్టి, తిరిగి తల్లికి అప్పగించారు.

ఏడాది వ్యవధిలోనే భర్తను, తల్లిని కోల్పోయిన గిరిజ, తన కుమారుడు తిరిగి రావడం ఎంతో ఆనందంగా ఉందని బీబీసీకి తెలిపారు.

తన కుటుంబంతో తిరిగి కలవడం సంతోషంగా ఉన్నప్పటికీ, తన తండ్రి చనిపోవడం తనను తీవ్రంగా బాధిస్తోందని 12 ఏళ్ల తరువాత కుటుంబాన్ని కలుసుకున్న కుమారుడు దీపక్ రాజా బీబీసీకి చెప్పారు.

సుదీర్ఘకాలం సాగిన ఈ మిస్సింగ్ కేసును పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఛేదించారు. ఇందుకోసం పోలీసులు దీపక్ రాజా చిన్నప్పటి ఫోటోను ఆధారంగా చేసుకుని ఏఐ సాంకేతికతను ఉపయోగించి అతను ప్రస్తుతం ఎలా ఉంటాడో ఓ చిత్రాన్ని తయారు చేయించారు.

అలాగే అతని చిన్నప్పటి ఆధార్ కార్డు కూడా ఈ కేసులో కీలకంగా మారింది. ఆ ఆధార్ కార్డుకు గిరిజ ఫోన్ కాకుండా మరో కొత్త నెంబర్ లింక్ అవడం దీపక్ ఆచూకీని కనుగొనడానికి మార్గం చూపిందని పోలీసులు బీబీసీకి చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
పోలీసు స్టేషన్ వద్ద దీపక్ రాజాను చూసి సంతోషిస్తున్న గిరిజ
ఫొటో క్యాప్షన్, పోలీసు స్టేషన్ వద్ద దీపక్ రాజాను చూసి సంతోషిస్తున్న తల్లి

అసలేం జరిగింది?

తమిళనాడు రాష్ట్రంలోని ధర్మపురి గాంధీనగర్‌లో రాజేంద్ర, గిరిజ దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వారి రెండో కుమారుడైన దీపక్‌రాజా 2014లో కోపంతో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. దీనిపై రాజేంద్రన్ ధర్మపురి బీ1 పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి, ఎన్నో చోట్ల గాలించారు. కానీ దీపక్ ఆచూకీ తెలియలేదు.

రాజేంద్రన్ కిందటేడాది అనారోగ్యంతో మరణించారు. అప్పటి నుండి, దీపక్ రాజా గురించి గిరిజ పోలీసులను సంప్రదిస్తూనే ఉన్నారు.

ఈ నేపథ్యంలో అక్టోబర్ 13వ తేదీన ధర్మపురి బీ1 పోలీసులు దీపక్ రాజా ఆచూకీ తెలిసిందని, అతడిని తిరుప్పూర్ నుండి తీసుకువస్తున్నారని గిరిజకు తెలిపారు.

ఆ రాత్రి, ధర్మపురి పోలీస్ స్టేషన్‌లో తల్లీకొడుకులు తిరిగి కలుసుకున్నారు. దాదాపు 12 ఏళ్ల కిందట విడిపోయిన తల్లీ కొడుకులు మళ్ళీ కలుసుకున్నప్పుడు తీసిన వీడియో భావోద్వేగంగా ఉంది. వారిద్దరూ కన్నీళ్లు పెట్టుకుంటూ, ఒకరినొకరు పట్టుకుని ఏడుస్తున్న దృశ్యాలు, అలాగే ధర్మపురి బీ1 పోలీసు స్టేషన్ అధికారులు వారిని అభినందిస్తూ, సలహాలు ఇస్తూ సాగనంపుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి.

"మా అబ్బాయి పాలిటెక్నిక్ రెండో సంవత్సరం చదువుతున్న సమయంలో ఏదో కారణంతో తిట్టడంతో అతను కోపంతో ఇంటి నుంచి వెళ్లిపోయి తిరిగి రాలేదు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. ఊరూరా వెదికాం. కానీ మా అబ్బాయి ఆచూకీ తెలియలేదు’’ అని గిరిజ బీబీసీకి వివరించారు.

‘‘మా అబ్బాయి ఇంటి నుంచి వెళ్లిపోయిన తరువాత, ప్రమాదంలో మరణించిన గుర్తుతెలియని వ్యక్తుల ఫోటోలను పోలీసులు మాకు చూపించేవారు. కానీ అతని గురించి మాకు ఎలాంటి సమాచారం దొరకలేదు. అయితే దీపక్ చిన్నప్పుడు తీసుకున్న ఆధార్ కార్డుకు మా ఫోన్ నెంబర్ లింక్ చేశాం. రెండేళ్ల కిందట అతని ఆధార్ నెంబర్ ఆన్‌లైన్‌లో చెక్ చేస్తుంటే, ఓటీపీ నా ఫోన్ నెంబరుకు కాకుండా మరో నెంబర్‌కు వెళ్లినట్టు అర్థమైంది. నేను ఇదే విషయాన్ని పోలీసులకు చెప్పడంతో వారు విచారిస్తామని చెప్పారు" అని గిరిజ అన్నారు.

దీపక్ రాజా
ఫొటో క్యాప్షన్, దీపక్ రాజాను తీసుకువచ్చిన పోలీసులు

ఫోటో, సిమ్ కార్డు, ఓటీపీ

తప్పిపోయిన వ్యక్తిని కనుగొనడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా ఉపయోగించారో చూపిస్తూ తమిళనాడు పోలీసులు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియోకు కూడా అభినందనలు అందుతున్నాయి.

ధర్మపురి బీ1 పోలీస్ స్టేషన్‌లో అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న సుందరమూర్తి దీపక్ రాజా కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఈ మధ్యలో ఆయనను వేర్వేరు పోలీస్ స్టేషన్లకు బదిలీ అయ్యారు. అయితే ఇటీవలే ఆయన బీ1 పోలీస్ స్టేషన్‌కు తిరిగి వచ్చారు.

"నేను 2020 నుండి దీపక్‌రాజా అదృశ్యం కేసును చూస్తున్నాను. వివిధ వివరాలు సేకరిస్తుండగా, నన్ను మరో పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. నేను మళ్లీ ఇక్కడికి బదిలీపై వచ్చినప్పుడు, ఆధార్ నంబర్‌కు లింక్ అయిన సెల్ ఫోన్ నెంబర్ మారినట్టు తెలిసింది. ఆధార్ ఓటీపీ వెళుతున్న సెల్‌ఫోన్ నెంబర్ 618 నెంబర్లతో ముగుస్తోందని అర్థమైంది. నేను ఆ నంబర్ కోసం యూఐడీఏఐ (యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా) అధికారులను సంప్రదించా, కానీ వారు వేలిముద్రలు లేకుండా ఆ నంబర్ ఇవ్వలేమని నిరాకరించారు" అని ఆయన అన్నారు.

‘‘ఆ తర్వాత, జాతీయ నిఘా సంస్థల ఏఐ టెక్నాలజీ (నాట్‌గ్రిడ్ టూల్)ని ఉపయోగించి, పోలీసులు దీపక్‌రాజా చిన్ననాటి ఫోటోను ఉపయోగించి, ప్రస్తుతం అతను ఎలా ఉండి ఉంటాడో ఓ ఫోటోను సిద్ధం చేశాం’’ అని చెప్పారు.

‘‘ ఆ ఫోటో ఆధారంగా ఆధార్ కార్డు ఓటీపీ వెళుతున్న సిమ్‌ కార్డును కొనుగోలుచేసిన వ్యక్తిని కనుగొనాలని ప్రయత్నించారు. అలాగే ఈ ఫోటో ఆధారంగా సామాజిక మాధ్యమాలు ఖాతాలు ఏవైనా సరిపోలుతాయమో చూశాం’’ అన్నారు సుందరమూర్తి.

అలా దీపక్‌రాజాకు చెందిన ఒక సోషల్ మీడియా ఖాతా బయటపడింది. దీని ఆధారంగా మరింత ముమ్మర దర్యాప్తు చేయడంతో ఈ ఖాతాలోని వ్యక్తి, తాము ఏఐ సాయంతో రూపొందించిన ఫోటోలోని వ్యక్తి ఒకరేనని నిర్థరణకు వచ్చినట్టు సుందరమూర్తి వివరించారు.

తరువాత ఫోటో ఆధారంగా సిమ్ కార్డు ఎక్కడ కొనుగోలు చేశారో పోలీసులు కనిపెట్టగలిగారు. దీపక్ తిరప్పూర్‌లో ఒక సిమ్ కార్డును కొనుగోలు చేశారని, దాని నంబర్ 618తో ముగుస్తుందని పోలీసులు కనుగొన్నారు. అతను తిరుప్పూర్‌లోని ఒక ప్రైవేట్ బనియన్ కంపెనీలో పనిచేస్తున్నాడని గుర్తించారు.

దీంతో అతని కోసం ధర్మపురి ఎస్ఐ సుందరమూర్తి నేతృత్వంలోని ఇద్దరు పోలీసుల బృందం అక్టోబర్ 13న తిరుప్పూర్‌కు వెళ్ళింది. అక్కడ పోలీసుల విచారణలో దీపక్ స్నేహితుడు దొరికాడు. అతని ద్వారా దీపక్ రాజా ఉండే చోటుకు వెళ్లారు. అలా దీపక్ రాజాను ధర్మపురికి తీసుకువచ్చి తల్లికి అప్పగించినట్టు సుందరమూర్తి బీబీసీకి చెప్పారు.

అక్టోబర్ 13న ధర్మపురిలో తన కుమారుడిని కలిసిన గిరిజ, మరుసటి రోజు అతడిని కోయంబత్తూరుకు తీసుకువచ్చి తన కుమార్తెకు పరిచయం చేశారు. దీపక్‌రాజు ప్రస్తుతం తన పెద్ద కుమారుడి ఇంట్లో ఉన్నారని గిరిజ చెప్పారు.

"నా కుమార్తె యూకేజీ చదువుతున్నప్పుడు, నా కొడుకు ఇంటి నుంచి వెళ్లిపోయాడు. దాంతో ఆమె తన అన్నను మరిచిపోయింది. వాళ్లిద్దరూ కలుసుకున్నప్పుడు, అతన్ని చూడగానే తన తండ్రిని చూసినట్టుగా ఉందని ఆమె ఏడుస్తూ చెప్పింది " అని గిరిజ అన్నారు.

తన తల్లిని, కుటుంబాన్ని కలవడం గురించి దీపక్‌రాజా మాట్లాడుతూ "ఏదో జరిగిపోయింది. ఇన్నేళ్ల తర్వాత మా అమ్మను, సోదరుడిని, సోదరిని చూడటం సంతోషంగా ఉంది. కానీ మా నాన్న చనిపోయారన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నా. అందుకే ఇప్పుడు మాట్లాడలేని స్థితిలో ఉన్నా" అని దీపక్ బాధగా చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)