ర‌ణ‌బాలి రివ్యూ: పెళ్లయిన తర్వాత రష్మికతో తొలి చిత్రం.. విజయ్ దేవరకొండ పంట పండిందా?

రణబాలి సినిమా రివ్యూ
ఫొటో క్యాప్షన్, ద‌ర్శ‌కుడు రాహుల్ రణబాలి సినిమాను ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా నిజాయితీగా తీశాడు.
    • రచయిత, జీఆర్ మ‌హ‌ర్షి
    • హోదా, బీబీసీ కోసం
  • ప్రచురణ
  • చదివే సమయం: 4 నిమిషాలు

విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు చాలా కాలంగా హిట్ లేదు. గతంలో ప‌ని చేసిన టాక్సీవాలా డైరెక్ట‌ర్ రాహుల్ సాంకృత్యాయ‌న్‌తో క‌లిసి ర‌ణ‌బాలిగా థియేట‌ర్‌లోకి వ‌చ్చాడు.

పెళ్ల‌యిన త‌ర్వాత ర‌ష్మిక‌తో తొలి సినిమా. 1878 నాటి రాయ‌ల‌సీమ క‌రువు నేప‌థ్యంలో క‌థ‌తో హిట్ కొట్టాడా?

క‌థ ఏమంటే.. కొండ‌పై వున్న దైవాంశ భ‌ద్ర‌మ‌ల్ల‌న్న ఆశీస్సుల‌తో ర‌ణ‌బాలి జ‌న్మిస్తాడు.

20 ఏళ్ల వ‌య‌సు వ‌చ్చే స‌రికి ఆయ‌న సింగ‌న‌మ‌ల పాలెగాడుగా మారుతాడు. మొండిగా మొరటుగా వుంటాడు.

జ‌య‌మ్మ (ర‌ష్మిక‌)తో పెళ్లి జరుగుతుంది. అదే స‌మ‌యంలో దారుణ‌మైన క‌రువు మొద‌ల‌వుతుంది.

అస‌లే ప్ర‌జ‌ల ద‌గ్గ‌ర ధాన్యం లేక ఆక‌లితో వుంటే, బ్రిటిష్ అధికారులు ప‌న్నుల పేరుతో తిండిగింజ‌ల‌ని సేక‌రించి మ‌ద్రాస్ నుంచి పంప‌డానికి రైల్వేలైన్ నిర్మిస్తూ , జ‌నంతో చాకిరీ చేయిస్తూ హింసిస్తూ వుంటారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఇది తెలిసిన ర‌ణ‌బాలి బ్రిటిష్ అధికారుల‌పై దాడి చేసి, తిండి గింజ‌ల‌ను పంచుతాడు.

మ‌ద్రాస్ ప్రెసిడెన్సీకి క‌మిష‌న‌ర్ హెక్ట‌ర్ దీన్ని స‌హించ‌లేక సైన్యంతో దాడి చేయిస్తాడు.

దీన్ని ర‌ణ‌బాలి ఎలా ఎదుర్కొన్నాడు? చివ‌రికి ఏమైంది?

రణబాలి సినిమా రివ్యూ
ఫొటో క్యాప్షన్, సింగ‌న‌మ‌ల బొబ్బిలి ర‌ణ‌బాలిగా విజ‌య్ దేవ‌ర‌కొండ అద్భుతంగా న‌టించాడు.

సింగ‌న‌మ‌ల బొబ్బిలి ర‌ణ‌బాలిగా విజ‌య్ దేవ‌ర‌కొండ అద్భుతంగా న‌టించాడు.

పాత్ర కోసం బాడీలాంగ్వెజ్‌ని మార్చుకున్న తీరు, అనంత‌పురం యాస‌ని ప‌లికిన ప‌ద్ధ‌తి సూప‌ర్బ్‌. యాక్ష‌న్‌, ఎమోష‌న్ స‌న్నివేశాల్లో గూస్‌బంప్స్ తెప్పించాడు.

జ‌య‌మ్మ‌గా ర‌ష్మిక ఆ పాత్ర‌లో ఒదిగిపోయింది. విజ‌య్‌తో ఆమె కెమిస్ట్రీ పండింది. హీరో త‌ల్లిగా ఈశ్వ‌రీరావు, విల‌న్‌గా ఆర్నాల్డ్ వూస్లో (మ‌మ్మీ ఫేమ్‌) బాగా న‌టించారు.

రాయ‌ల‌సీమ‌కి క‌రువు కొత్త‌కాదు. కానీ, 1876-78లో వ‌చ్చింది మ‌హా క‌రువు.

సీమ‌, ఆర్కాట్ జిల్లాల్లో క‌లిపి 70 ల‌క్ష‌ల మంది చ‌నిపోయారు. దీనికి కార‌ణం అంత‌కు మునుపు వ్య‌వ‌సాయ పంట‌లు త‌గ్గించి , వ్యాపార పంట‌లు ( ప‌త్తి, పొగాకు) వేయ‌డం.

దీనికి తోడు బ్రిటీష్ అధికారులు ల‌క్ష‌ల ట‌న్నుల ధాన్యాన్ని యూర‌ప్ దేశాల‌కి త‌ర‌లించారు.

కంటి తుడుపుగా గంజి కేంద్రాలు పెట్టి, క‌రువు ప‌నులు చేయించినా ల‌క్ష‌ల మంది పిట్ట‌ల్లా రాలిపోయారు.

ఈ నేప‌థ్యాన్ని తీసుకున్న ద‌ర్శ‌కుడు రాహుల్ ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా నిజాయితీగా తీశాడు.

అయితే, సినిమాకి అవ‌స‌ర‌మైన డ్రామా, ఎమోష‌న్ పండించ‌డంలో పూర్తిగా స‌క్సెస్ కాలేక‌పోయాడు. అక్క‌డ‌క్క‌డ డాక్యుమెంట‌రీ ల‌క్ష‌ణాలు రావ‌డానికి ఇదే కార‌ణం.

రణబాలి సినిమా రివ్యూ
ఫొటో క్యాప్షన్, ఫ‌స్టాఫ్‌లో హీరో ఎలివేష‌న్‌, రొమాన్స్‌ని సెట్ చేయ‌డానికి చాలా టైమ్ ప‌ట్టింది.

బ్రిటిష్ పాల‌న సినిమాల‌ను మ‌నం చాలా చూశాం. అవ‌న్నీ హీరో తిరుగుబాటు, పోరాటాల‌తో ముగుస్తాయి. ల‌గాన్ దీనికి మిన‌హాయింపు. ర‌ణ‌బాలి కూడా అదే. మ‌హా క‌రువు బ్యాక్‌డ్రాప్‌తో ద‌ర్శ‌కుడు కొత్త క‌థ రాసుకున్నాడు కానీ సీన్స్ రాసుకోవ‌డంలో త‌డ‌బ‌డ్డాడు.

ఫ‌స్టాఫ్‌లో హీరో ఎలివేష‌న్‌, రొమాన్స్‌ని సెట్ చేయ‌డానికి చాలా టైమ్ ప‌ట్టింది.

త‌న భ‌ర్త చేతిలో బ‌లైపోయిన అలిమేలు కుటుంబం ద‌గ్గ‌రికి ర‌ష్మిక వెళ్లిన‌పుడు ఎమోష‌న్ పీక్స్‌కి వెళ్లి, ఇంట‌ర్వెల్ బ్యాంగ్‌తో ప్రేక్ష‌కులు అద్భుతం అని ఫీల్ అవుతారు.

అందరు ద‌ర్శ‌కుల‌కి ఉన్న‌ట్టే రాహుల్‌కి కూడా సెకండాఫ్‌తో క‌ష్టాలు మొద‌ల‌య్యాయి.

క‌థ‌లో బ‌ల‌మైన పాత్ర‌లు లేక హీరో, హీరోయిన్ , హీరో త‌ల్లి, విల‌న్ త‌ప్ప ఇంకెవ‌రికీ స్కోప్ లేకపోవ‌డంతో సెకండాఫ్ రిపిటేష‌న్‌గా మారింది.

బ్రిటిష్ అధికారుల‌పై దాడుల సీన్స్ "సైరా"ని మ‌ళ్లీ చూస్తున్న‌ట్టు అనిపించింది.

విల‌న్ కూడా మెల్లిగా బ‌ల‌హీన‌ప‌డి రొటీన్‌గా మారిపోతాడు. అయితే, సెకండాఫ్‌లో వ‌చ్చే గుహ ఫైట్ గుర్తుంటుంది.

క‌థ జ‌రుగుతూ ఉంటుంది. కానీ , డెప్త్ లేక‌పోవ‌డంతో సెకెండాఫ్‌లో అత్యంత కీల‌క‌మైన ర‌ష్మిక సీన్ తేలిపోయింది.

చివ‌రి "కోబ‌లి" ఎపిసోడ్ కాంతారాని గుర్తు తెచ్చింది.

రణబాలి సినిమా రివ్యూ
ఫొటో క్యాప్షన్, విజ‌య్ దేవ‌ర‌కొండ కెరీర్‌లో గుర్తుండిపోయే పాత్ర‌. లైఫ్ టైమ్ క్యారెక్ట‌ర్‌.

దైవిక శ‌క్తితో కూడిన మ్యాజిక్ రియ‌లిజంతో క‌థ ప్రారంభ‌మైన తీరు బాగుంది కానీ, ముగింపు బ‌లంగా లేక‌పోవ‌డం ఒక లోపం.

దాదాపు 3 గంట‌ల నిడివి భార‌మే అయిన‌ప్ప‌టికీ, 150 ఏళ్ల క్రితం రాయ‌ల‌సీమ గ్రామాల‌ని, క‌రువుని చూపించిన తీరు మెచ్చుకోదగినది.

జాగ్ర‌త్త‌గా ప్రొడ‌క్ష‌న్ డిజైనింగ్ చేయ‌డంలో శ్ర‌ద్ధ క‌నిపిస్తుంది. శివంరావు నాగ‌సాని శ్ర‌మ సినిమాని గ‌తంలోకి తీసుకెళ్లింది.

అజ‌య్ అతుల్ బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా సీన్స్‌ని ఎలివేట్ చేసింది.

కొన్ని చోట్ల చ‌ప్పుగా ఉంది. ఎంద‌య్యాసామీ పాట మిన‌హా మిగ‌తావి గుర్తుండ‌వు.

జిష్ణు భ‌ట్టాచార్యాజీ - నీర‌వ్ షా కెమెరా క‌నుల విందుగా వుంది. పీరియాడిక్ సినిమాని ప్రేక్ష‌కుల క‌ళ్ల ముందు ప‌రిచింది.

విజ‌య్ దేవ‌ర‌కొండ కెరీర్‌లో గుర్తుండిపోయే పాత్ర‌. లైఫ్ టైమ్ క్యారెక్ట‌ర్‌.

క‌మ‌ర్షియ‌ల్ ఫ‌లితాలు ఎలా ఉన్నా.. ద‌ర్శ‌కుడు రాహుల్ సిన్సియారిటీ, రీసెర్చ్ , మ‌హా క‌రువుని తెర‌మీద ఆవిష్క‌రించిన విధానం అద్భుతం.

ప్లస్ పాయింట్

1.విజ‌య్ , ర‌ష్మిక న‌ట‌న‌

2.ఆర్నాల్డ్ వూస్లో స్క్రీన్ ప్రెజెన్స్‌

3.కెమెరా

4.ప్రొడ‌క్ష‌న్ డిజైనింగ్‌

5.ఖ‌ర్చుకి వెనుకాడ‌ని మైత్రీ మూవీ మేక‌ర్స్‌

మైన‌స్ పాయింట్స్‌

1.సెకండాఫ్

2.ఎమోష‌న‌ల్ డెప్త్ మిస్స‌వ‌డం

3.నిడివి

ఫైన‌ల్‌గా కొంచెం స‌హ‌నంతో చూస్తే ఇది మంచి సినిమా

(అభిప్రాయాలు సమీక్షకుడి వ్యక్తిగతం)

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)