వర్షానికి తడుస్తాయని రూ.5 లక్షలను భూమిలో పాతిపెడితే చెదలు పట్టిపోయాయి, ఎక్కడంటే...

కరెన్సీ నోట్లు

ఫొటో సోర్స్, MOHAR SINGH MEENA

ఫొటో క్యాప్షన్, వర్షానికి తడవకుండా మంగీలాల్ తన దగ్గరున్న కరెన్సీ నోట్లను భూమిలో పాతిపెట్టారు.
    • రచయిత, మోహర్ సింగ్ మీణా
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 3 నిమిషాలు

ఒక ప్లాస్టిక్ టబ్‌లో పాడైపోయిన రూ.500 నోట్ల కట్టలను దిగాలుగా చూస్తున్న ఒక వృద్ధుడు, వృద్ధురాలి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వీరిద్దరు రాజస్థాన్‌ రాష్ట్రంలోని నెవైన్ అనే గ్రామానికి చెందిన 60 ఏళ్ల మంగిలాల్ మేఘ్వాల్, ఆయన భార్య సాయిలీ దేవి.

కొంత భూమి అమ్ముకోగా దాని నుంచి వచ్చిన డబ్బే ఈ ఐదు లక్షల రూపాయలని ఆ వృద్ధ జంట చెబుతోంది.

పాడైపోయిన స్థితిలో ఉన్న ఆ నోట్లను చూస్తుంటే ఏడుపు వస్తోందని, ఆందోళనతో అన్నం కూడా సహించడం లేదని వాళ్లు చెబుతున్నారు.

ఇప్పుడు ఆ నోట్లను ఎలా మార్చుకోవాలన్నదే తమ ముందున్న అతి పెద్ద సమస్యని ఆ దంపతులు అంటున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
కరెన్సీ నోట్లు

ఫొటో సోర్స్, MOHAR SINGH MEENA

ఫొటో క్యాప్షన్, చెదలు పట్టిన కరెన్సీ నోట్లతో మంగీలాల్, ఆయన భార్య సాయిలీ దేవి.

అసలేం జరిగింది?

బలోత్రా జిల్లాలోని నెవైన్ గ్రామంలో ఉన్న ఒక చిన్న వాడలో మంగిలాల్ మేఘ్వాల్ తన కుటుంబంతో కలిసి ఉంటున్నారు.

ఆయన ఉన్న వీడియో ఒకటి వైరల్ అయిన తర్వాత బీబీసీ ఫోన్‌లో ఆయనను సంప్రదించింది.

"సుమారు ఏడాది కిందట నేను పచ్‌పద్రాలో ఒక స్థలాన్ని ఐదు లక్షల రూపాయలకు అమ్మాను. ఆ డబ్బుతో నా కుటుంబం కోసం ఒక ఇల్లు కట్టుకోవాలని అనుకున్నా" అని ఫోన్‌లో మాట్లాడుతూ మంగిలాల్ చెప్పారు.

‘‘అప్పుడు వర్షాకాలం నడుస్తోంది. నాకు పక్కా ఇల్లు లేకపోవడంతో, వర్షం వల్ల ఆ డబ్బు పాడవుతుందేమోనని కంగారు పడ్డా. అందుకే, ఒక రాత్రి ఆ ఐదు లక్షల రూపాయలను ఒక సంచిలో పెట్టి పొలంలో పాతిపెట్టా. ఆ తర్వాత భారీ వర్షం కురిసింది. మరుసటి రోజు ఉదయం పొలానికి వెళ్ళినప్పుడు, ఆ డబ్బు సరిగ్గా ఎక్కడ పాతిపెట్టానో నాకు గుర్తుకు రాలేదు" అన్నారు.

డబ్బు పాతిపెట్టిన స్థలాన్ని కనుక్కోడానికి చాలాసేపు ప్రయత్నించానని, కానీ అది దొరకలేదని మంగిలాల్ చెప్పారు. మొదట్లో ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు చెప్పలేకపోయినా, తర్వాత భార్యకు, కొడుకుకు ఆ విషయం చెప్పినట్లు వెల్లడించారు.

‘‘మేం చాలా వెతికాం. కానీ ఎక్కడా ఆ డబ్బు సంచి దొరకలేదు" అని మంగిలాల్ చిన్న కొడుకు దీపక్ మేఘ్వాల్ బీబీసీతో చెప్పారు.

ఆ డబ్బును బ్యాంకులో ఎందుకు జమ చేయలేదని అడిగితే, ‘‘మరుసటి రోజు ఉదయం ఆ డబ్బును తీసి బ్యాంకులో వేయాలని అనుకున్నా. కానీ ఎక్కడ పాతిపెట్టానో మర్చిపోయా" అన్నారు మేఘ్వాల్.

బీబీసీతో ఫోన్‌లో మాట్లాడుతూ మంగిలాల్ భావోద్వేగానికి గురయ్యారు. ‘‘ఇప్పుడు ఆ కరెన్సీ చెల్లదని బ్యాంకు వాళ్లు అంటున్నారు. మేం ఇక ఇల్లు ఎలా కట్టుకోం?’’ అని ఆయన వాపోయారు.

మంగీలాల్

ఫొటో సోర్స్, MOHAR SINGH MEENA

ఫొటో క్యాప్షన్, ఒక స్థలాన్ని అమ్మడం ద్వారా మంగీలాల్‌కు రూ. ఐదు లక్షలు వచ్చాయి.

ఆ డబ్బు ఎక్కడిది?

రాజస్థాన్‌లోని పచ్‌పద్ర ప్రాంతంలో వ్యవసాయం పూర్తిగా వర్షాలపైనే ఆధారపడి ఉంటుంది. అందుకే ఇక్కడి రైతులు ఏడాదికి ఒక పంటే పండించగలుగుతారు.

ఈ ప్రాంతంలో ఇటీవల మంచి వర్షాలు కురిశాయని మంగీలాల్ చెప్పారు. దీనివల్ల, విత్తనాలు వేయడానికి సిద్ధంగా రైతులు తమ పొలాలను దున్నడం మొదలుపెట్టారు.

ఒక సంవత్సరం విరామం తర్వాత, ఆగస్టు 6వ తేదీ సాయంత్రం మంగీలాల్ కుటుంబం తమ పొలాన్ని దున్నడానికి ట్రాక్టర్‌ను అద్దెకు తీసుకుంది.

‘‘సుమారు ఐదు గంటల పాటు దున్నాం. రాత్రి కాగానే అందరూ ఇంటికి తిరిగి వచ్చారు" అని మంగీలాల్ చెప్పారు.

మరుసటి రోజు ఉదయం, మంగీలాల్ భార్య సాయిలీ దేవి, ఆయన కొడుకు పొలానికి వెళ్లారు.

‘‘పొలం దున్నిన తర్వాత, మట్టిలోంచి ఒక సంచి బయటకు కనిపించింది. దాన్ని బయటకు తీసి చూడగా అందులో కరెన్సీ నోట్లు ఉన్నాయి. కానీ అవి చెదపురుగుల వల్ల పాడైపోయాయి. అది చూసి నేను కన్నీళ్లు పెట్టుకున్నా. ఒక్క నోటు కూడా బాగా లేదు" అన్నారామె.

ఈ బాధతో తాను ఏమీ తినలేకపోయానని మంగీలాల్ చెప్పారు.

కరెన్సీ నోట్లు

ఫొటో సోర్స్, MOHAR SINGH MEENA

ఫొటో క్యాప్షన్, చాలా వరకు నోట్లు చిరిగిపోయి లేదా పాడైపోయి ఉన్నాయి. కొన్ని పూర్తిగా ముక్కలైపోయాయి.

కష్టపడితేనే పూటగడిచే జీవితం

మంగిలాల్‌‌కు పూర్వీకుల నుంచి వచ్చిన కొంత భూమి ఉంది. వర్షాకాలంలో ఆయన ఈ భూమిలో సజ్జలు, పప్పుధాన్యాలను పండిస్తారు. పంట దిగుబడి పూర్తిగా వర్షాలపైనే ఆధారపడి ఉంటుంది. వర్షాలు బాగా కురిస్తే పంట పండుతుంది, లేకపోతే లేదు.

మంగిలాల్, ఆయన భార్య సాయిలీ దేవి ఇద్దరూ చదువుకోలేదు. వారికి ముగ్గురు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు.

కూతురు ఎనిమిదో తరగతి వరకు చదువుకుంది. పెళ్లయింది. ముగ్గురు కొడుకులలో చిన్నవాడైన దీపక్ పదో తరగతి వరకు చదవగా, మిగిలిన ఇద్దరూ ఎనిమిదో తరగతి వరకే చదివారు.

మంగీలాల్ కుటుంబం ప్రస్తుతం ఒక కచ్చా (మట్టి లేదా కాల్చని ఇటుకలతో కట్టిన ఇల్లు) ఇంట్లో నివసిస్తోంది. వర్షాకాలంలో ఆ ఇంటి పైకప్పు కారుతుంది.

కుటుంబం కోసం ఒక పక్కా ఇల్లు కట్టుకోవాలని అనుకున్నట్లు మంగిలాల్ చెప్పారు.

‘‘ఇల్లు కట్టుకోవడానికి పచ్‌పద్రాలో ఉన్న నా స్థలం ఒకదాన్ని అమ్మేశా. కానీ ఇప్పుడు ఆ డబ్బు పాడైపోయింది. నోట్లను చెదపురుగులు తినేశాయి" అన్నారు మంగీలాల్.

చెదపురుగులు తిన్న నోట్లను తన తల్లి పచ్‌పద్రాలోని ఒక బ్యాంకుకు తీసుకెళ్లారని, అయితే నోట్లు తీవ్రంగా దెబ్బతినడం వల్ల బలోత్రాకు వెళ్లమని బ్యాంకు సిబ్బంది చెప్పారని మంగీలాల్ చిన్న కొడుకు దీపక్ చెప్పారు.

‘‘బలోత్రాకు కూడా వెళ్లాం. కానీ అక్కడ కూడా ఆ నోట్లను అంగీకరించమని, జైపూర్‌ వెళ్లండని చెప్పారు. మేం చదువుకోని వాళ్లం. ఆ నోట్లను మార్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నాం" అన్నారు సాయిలీ దేవి.

పాడైపోయిన నోట్ల సమస్యకు పరిష్కారం లభిస్తుందని, బ్యాంకు వాటిని చెల్లుబాటు అయ్యే కరెన్సీతో మారుస్తుందని మంగిలాల్, ఆయన కుటుంబం ఆశిస్తోంది.

ఈ నోట్లను మార్చుకోవడం గురించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (జైపూర్ జోన్)కు చెందిన ఒక సీనియర్ అధికారి బీబీసీతో మాట్లాడింది. ఆయన తన పేరు ప్రచురించడానికి ఇష్టపడలేదు.

‘‘నోట్లు తీవ్రంగా దెబ్బతిన్నట్లయితే, వాటిని మార్చుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఒక ప్రత్యేక విధానం ఉంది" అని ఆ అధికారి చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)