భారీ తొడలకు, దీర్ఘాయుష్షుకు ఏమైనా సంబంధం ఉందా?

తొడలు, ఆరోగ్యం, శక్తి, అందం, విశ్వాసం

ఫొటో సోర్స్, Getty Images

ప్రచురణ
చదివే సమయం: 5 నిమిషాలు

యునైటెడ్ కింగ్‌డమ్‌కు చెందిన రన్నర్ తాషా థాంప్సన్‌కు తన తొడల గురించి ఆలోచించినప్పుడల్లా ‘అవి అంత పెద్దగా లేకపోతే బాగుండేది’ అనిపించేదట.

కొన్ని సంస్కృతుల్లో సౌందర్య ప్రమాణాల విషయానికి వస్తే, నాజూకైన కాళ్లను చాలా కాలంగా ఆదర్శంగా భావిస్తున్నారు.

"ఆ అంచనాలను అందుకోలేకపోతే, మనలో మనమే కొంత విఫలమైన భావనకు లోనవుతాం" అని బీబీసీ వరల్డ్ సర్వీస్‌తో అన్నారు థాంప్సన్.

అయితే, పెరుగుతున్న శాస్త్రీయ ఆధారాలు పెద్ద తొడలకు దీర్ఘాయుష్షుతో సంబంధం ఉందని సూచిస్తున్నా, అలా భారీ తొడలు ఉండటాన్ని హేళనగానే చూస్తున్నారు. తొడ చుట్టుకొలత 5 సెంటీమీటర్లు పెరిగిన ప్రతిసారి, ఏ కారణంతోనైనా మరణించే ప్రమాదం 18 శాతం తక్కువగా ఉన్నట్లు 25 వేలమంది పాల్గొన్న మెటా విశ్లేషణలో తేలింది.

మరి, దీనర్థం ఏంటి? పెద్ద తొడలు ఉన్నవారు నిజంగా సంతోషించాలా? అలా లేనివారు వాటిని పెంచుకునేందుకు ప్రయత్నించాలా?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
థాంప్సన్

ఫొటో సోర్స్, Delene Adams

ఫొటో క్యాప్షన్, థాంప్సన్

పెద్ద తొడలతో ప్రయోజనమేంటి?

2020 నాటి మెటా విశ్లేషణలో పాల్గొన్న వారు ఎక్కువ కాలం జీవించడానికి కారణం, వారి కాళ్లలో కండపుష్ఠి ఎక్కువగా ఉండటం వల్ల తొడలు కూడా పెద్దగా ఉండి ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు.

"తొడలో ఉండే మూడు రకాల కణజాలాల్లో ఒకటైన కండరాలతో- ఆరోగ్యానికీ, దీర్ఘాయుష్షుకీ చాలా బలమైన సంబంధం ఉందని చెప్పడానికి అత్యంత బలమైన ఆధారాలు ఉన్నాయి" అని యూకేలోని కింగ్స్ కాలేజ్ లండన్‌లో వృద్ధాప్య, ఆరోగ్య విభాగం ప్రొఫెసర్ క్లేర్ స్టీవ్స్ చెబుతున్నారు.

ఎక్కువ కండపుష్ఠి ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రించుకోవడం సులభమవుతుంది. దాంతో మధుమేహం, గుండె జబ్బులు, ఇతర దీర్ఘకాలిక అనారోగ్యాల ముప్పు తగ్గుతుంది.

బ్రిటిష్ మెడికల్ జర్నల్‌ 2009లో ప్రచురించిన ఓ అధ్యయనంలో, పురుషులు, మహిళలు ఇద్దరిలోనూ చిన్న తొడలకు - గుండె జబ్బులు, మరణం ముప్పు పెరగడానికీ సంబంధం ఉన్నట్లు తేలింది.

బలమైన తొడలు వృద్ధుల్లో శారీరక బలహీనతను నివారించడంతో పాటు, ఇతరులపై ఆధారపడకుండా స్వతంత్రంగా జీవించే సామర్థ్యాన్ని పెంచగలవు.

"వయసు పెరిగిన తర్వాత శారీరక చురుకుదనానికి తొడ ముందు భాగంలోని క్వాడ్రిసెప్స్ కండరాలు ఎంతో ముఖ్యమైనవి. ఎందుకంటే కుర్చీలో నుంచి లేచి నిలబడటానికి, అటూ ఇటూ తిరగడానికి అవే మనకు సహాయపడతాయి" అని లండన్‌లోని గైస్ అండ్ సెయింట్ థామస్ హాస్పిటల్‌లో కన్సల్టెంట్ జెరియాట్రిషియన్‌గా పనిచేస్తున్న స్టీవ్స్ అన్నారు.

మన కాళ్లు ఉత్పత్తి చేయగల శక్తికి, వయసు పెరిగేకొద్దీ మెదడు మెరుగ్గా ఆరోగ్యంగా ఉండటానికీ సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది.

కవలలైన 300మందికి పైగా మహిళల్లో కాళ్ల శక్తిని కొలిచే అధ్యయనం జరిగింది. ఈ అధ్యయనం ప్రారంభంలో ఎక్కువ కాలిశక్తి ఉన్న కవలల్లో పదేళ్ల తర్వాత మెరుగైన జ్ఞాపక శక్తి, ఆలోచనా సామర్థ్యాలు, మెరుగైన మెదడు నిర్మాణం ఉన్నట్లు గుర్తించారు.

చురుకుగా పనిచేసే కండరాలు కొన్ని రసాయనాలను ఉత్పత్తి చేస్తాయి. వయసు పెరిగేకొద్దీ శరీరంలో వాపును తగ్గించడం, మెదడులోని నాడీ వ్యవస్థను రక్షించడం ద్వారా ఈ రసాయనాలు మన మెదడును కాపాడగలవని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

"శారీరక చురుకుదనం మన రోగనిరోధక వ్యవస్థపైనా చాలా బలమైన ప్రభావం చూపుతుంది" అని ఈ అధ్యయనాన్ని నిర్వహించిన స్టీవ్స్ చెబుతున్నారు.

కింగ్స్ కాలేజ్ లండన్‌కు చెందిన మరో అధ్యయనంలో, అత్యంత చురుకుగా ఉండే వృద్ధ సైక్లిస్టులను పరిశీలించగా, వారికి యవ్వనంలో ఉన్నవారిని తలపించే రోగనిరోధక వ్యవస్థలు ఉన్నట్లు తేలింది. కొన్ని సందర్భాల్లో వారి రోగనిరోధక వ్యవస్థలు 20 ఏళ్ల వయసున్నవారితో సమానంగా ఉన్నాయి.

తొడలు, ఆరోగ్యం, శక్తి, అందం, విశ్వాసం

ఫొటో సోర్స్, Ella Cuchet

ఫొటో క్యాప్షన్, తొడల బలం పెంచుకోవడం ఎప్పుడైనా మొదలుపెట్టొచ్చని ఫిట్‌నెస్ శిక్షకురాలు ఎలిజిబెత్ డేవిస్ చెబుతున్నారు

తొడలను బలంగా మార్చుకోవడం ఎలా?

దీర్ఘాయుష్షు కోసం కండపుష్ఠిని పెంచుకోవడంపైనే దృష్టి పెట్టాలని, తొడల ఆకారాన్ని ప్రత్యేకంగా మార్చుకోవడం మీద కాదని ఫిట్‌నెస్ కోచ్ ఎలిజబెత్ డేవిస్ కూడా చెబుతున్నారు.

"మీ తొడలు చిన్నగా, పెద్దగా లేదా వేరేలా కనిపించాలని మీరు ఏళ్ల తరబడి కోరుకుని ఉంటే, ఆ ఆలోచనా విధానాన్ని వదిలేయాల్సిన సమయం వచ్చింది. మీ తొడలు ఎలా కనిపిస్తున్నాయనే దానికంటే, అవి ఏమి చేయగలవో దానిపై దృష్టి పెడదాం" అని ట్రైనింగ్ ఫర్ యువర్ ఓల్డ్ లేడీ బాడీ పుస్తక రచయిత డేవిస్ అంటున్నారు.

తొడలు చిన్నవిగా ఉన్నా, పెద్దవిగా ఉన్నా అవి శక్తిమంతంగా, బలంగా ఉండగలవని ఆమె చెబుతున్నారు.

పరిమాణంకంటే బలంపై దృష్టి పెట్టాలన్న విషయానికి శాస్త్రీయ ఆధారాలు కూడా ఉన్నాయి. 70 ఏళ్ల వయసులో ఉన్న పెద్దలను పరిశీలించిన 2006 నాటి ఓ అధ్యయనంలో, కేవలం కండరాలు చిన్నగా ఉండటంకంటే కాళ్ల కండరాలు బలహీనంగా ఉండటమే మరణించే ప్రమాదాన్ని అంచనా వేయడంలో మరింత బలమైన సూచికగా ఉన్నట్లు తేలింది.

తొడలను బలంగా మార్చుకోవాలనుకుంటే, రెసిస్టెన్స్ ట్రైనింగే అత్యుత్తమ మార్గంగా పరిగణించవచ్చని డేవిస్ చెబుతున్నారు. బరువులు ఎత్తడం వల్ల కండరాల బలంతో పాటు ఎముకల సాంద్రత కూడా మెరుగుపడుతుంది. ఎముకలను బలహీనపరిచి అవి పెళుసుగా మారి సులభంగా విరిగిపోయేలా చేసే ఆస్టియోపొరోసిస్‌ను నివారించడంలోనూ ఇది సహాయపడుతుంది.

వారానికి రెండు లేదా మూడుసార్లు కాళ్లకు వ్యాయామం చేయడం మంచి మార్గమని డేవిస్ సూచిస్తున్నారు.

"ఇదే కీలకం. మీరు ఎక్కడి నుంచి ప్రారంభిస్తున్నారో, మీ ప్రత్యేకమైన ప్రారంభ స్థాయిని గుర్తించి, అక్కడి నుంచి క్రమంగా శ్రమను పెంచుకుంటూ వెళ్లాలి" అని ఆమె చెప్పారు.

బరువులతో వ్యాయామం చేయడం మీకు ఇష్టం కాకపోవచ్చు. అయినా, దాన్ని మీ రోజువారీ వ్యాయామ క్రమంలో తప్పనిసరిగా ఉండాల్సిన భాగంగా భావించాలని ఆమె తన క్లయింట్లను ప్రోత్సహిస్తున్నారు.

"నాకు పళ్లు శుభ్రం చేసుకోవడం ఇష్టం ఉండదు. కానీ అది నోటి పరిశుభ్రతకు ఉపయోగపడుతుందని తెలుసు కాబట్టి చేస్తాను" అని ఆమె చెబుతున్నారు.

తొడలు, ఆరోగ్యం, శక్తి, అందం, విశ్వాసం

ఫొటో సోర్స్, Getty Images

తొడ కొవ్వు వల్ల ఏమైనా ప్రయోజనాలున్నాయా?

తొడల్లో ఉండే కొవ్వు శరీరంలోని ఇతర ప్రాంతాల్లో ఉండే కొవ్వుతో పోలిస్తే అంత హానికరం కాదు. ముఖ్యంగా, స్టీవ్స్ చెప్పే పొట్ట చుట్టూ పేరుకునే కొవ్వుతో పోలిస్తే ఇది చాలా తక్కువ సమస్యాత్మకం.

అవయవాల చుట్టూ పేరుకునే కొవ్వును 'విసెరల్ ఫ్యాట్' అంటారు. ఇది టైప్-2 మధుమేహం, గుండె జబ్బులు, మెటబాలిక్ డిస్‌ఫంక్షన్-అసోసియేటెడ్ స్టియాటోహెపటైటిస్ ముప్పును పెంచుతుంది. దీని వల్ల కాలేయ వైఫల్యం, క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఎక్కువవుతుంది.

శరీరం కింది భాగంలో ఉండే కొవ్వు మాత్రం రక్షణాత్మక పాత్ర పోషించగలదు. ఈ ప్రాంతంలోని కొవ్వు కణాలు హానికరమైన కొవ్వు ఆమ్లాలను తమలో బంధించుకోగలవని అధ్యయనాలు చెబుతున్నాయి.

దీంతో కింది శరీర భాగాల్లోని కొవ్వు 'చెడు' కొలెస్ట్రాల్‌గా పిలిచే ఎల్‌డీఎల్ స్థాయిలను తగ్గించడంతో పాటు, 'మంచి' కొలెస్ట్రాల్‌గా పిలిచే హెచ్‌డీ‌ఎల్ స్థాయిలను పెంచి, రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించగలదు.

అనారోగ్యం సమయంలో అత్యవసర శక్తి నిల్వగా ఉపయోగపడటం వల్ల కొవ్వు కూడా మనకు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా వృద్ధులకు ఇది ఎంతో సహాయకరంగా ఉంటుంది.

తొడలోని మరో ప్రధాన కణజాలం ఎముక. వయసు పెరిగేకొద్దీ సార్కోపీనియా అనే పరిస్థితి కారణంగా మనం కండపుష్ఠిని, కండరాల బలాన్ని కోల్పోవచ్చు.

సార్కోపీనియా ఆస్టియోపొరోసిస్‌ను వేగవంతం చేస్తుంది. దీనివల్ల ఎముకల సాంద్రత తగ్గి అవి పెళుసుగా మారతాయి. అందుకే రెసిస్టెన్స్ ట్రైనింగ్ ద్వారా ఎముకలను కూడా బలోపేతం చేసుకోవచ్చు. ఇది వయసు పెరిగేకొద్దీ ఎంతో ఉపయోగకరమని స్టీవ్స్ చెబుతున్నారు.

తొడలు, ఆరోగ్యం, శక్తి, అందం, విశ్వాసం

ఫొటో సోర్స్, Getty Images

శక్తిని గుర్తించండి

తొడలు ఏం చేయగలవో దానిపై దృష్టి పెట్టడం వల్ల, వాటి గురించి తాను ఆలోచించే విధానాన్ని మార్చుకోగలిగానని ‘బ్లాక్ గర్ల్స్ డూ రన్ యూకే’ కమ్యూనిటీ వ్యవస్థాపకురాలు తాషా థాంప్సన్ చెబుతున్నారు.

కూతురు పుట్టిన తర్వాత, తన తొడలను వర్ణించడానికి తాను ఉపయోగించే భాషను కూడా మార్చుకోవాలనిపించిందని ఆమె అంటున్నారు.

"వాటిని లావు లేదా పెద్దవి అని పిలవడానికి బదులుగా, శక్తిమంతమైనవి అని అభివర్ణిస్తా" అని థాంప్సన్ అంటున్నారు.

"మనమంతా విభిన్న ఆకారాలు, పరిమాణాల్లో ఉంటాం. మీ శరీరం ఎలా కనిపిస్తుందనేది కాదు, అది ఏమి చేయగలదన్నదే నిజంగా ముఖ్యమైనది" అని ఆమె అంటున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)