దాతృత్వం: మత విశ్వాసాల నుంచి విజ్ఞానం వైపు మళ్లుతున్న భారత సంపన్నులు

భారత సంపన్నులు, శాస్త్ర సాంకేతిక పరిశోధనలు, విరాళాలు, మత విశ్వాసాలు

ఫొటో సోర్స్, AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, బయోకాన్ లిమిటెడ్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా బయాలజీలో పరిశోధనల కోసం ఒక లేబొరేటరీ ఏర్పాటుకు 2022లో నిధులు అందిచారు.
    • రచయిత, నిఖిల్ ఇనాందార్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 6 నిమిషాలు

గతేడాది భారత సంతతికి చెందిన అమెరికన్ శాస్త్రవేత్త జైనేంద్ర జైన్‌కు భారత రియల్ ఎస్టేట్ దిగ్గజం నుంచి ఓ ఫోన్ కాల్ వచ్చినప్పుడు ఆయన ఆశ్చర్యపోయారు.

క్వాంటమ్ ఫిజిక్స్‌లో పరిశోధనలకు గాను 2025లో జైనేంద్ర జైన్‌కు ప్రతిష్ఠాత్మక వోల్ఫ్ ప్రైజ్ లభించింది.

దక్షిణ ముంబయిలో అరేబియా సముద్రానికి ఎదురుగా ట్రంప్ టవర్ సహా అనేక ప్రముఖ విలాసవంతమైన ప్రాజెక్టుల్ని నిర్మిస్తున్న లోథా గ్రూప్‌కు చెందిన అభిషేక్ లోథా ఆ ఫోన్ చేశారు.

పెన్ స్టేట్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న జైనేంద్ర జైన్‌ను నగరంలో కొత్తగా ఏర్పాటు చేసే థియోరిటకల్ ఫిజిక్స్ ఇన్‌స్టిట్యూట్‌కు వ్యవస్థాపక డైరెక్టర్‌గా నాయకత్వం వహించగలరా అని అభిషేక్ లోథా అడిగారు.

"ఆకాశాన్ని తాకే పెద్ద పెద్ద భవనాలను నిర్మిస్తున్న వ్యక్తి హఠాత్తుగా ఫండమెంటల్ సైన్స్ రంగంలో ఆసక్తి చూపడంతో నేను ఆశ్చర్యపోయాను. అమెరికాలో సంపన్నులు ఇలా చేయడం సహజమే. భారత్‌లో ఇలాంటి పరిస్థితి లేదు" అని మే చివర్లో లోథా థియరిటికల్ ఫిజిక్స్ ఇన్‌స్టిట్యూట్ ప్రారంభోత్సవ సమయంలో బీబీసీతో అన్నారు జైన్.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

కొన్ని వారాల తర్వాత మరొక సంఘటన జరిగింది.

దేశంలోని పాత వ్యాపార వంశాల్లో ఒకదానికి వారసుడైన రాజీవ్ బజాజ్ కూడా కోర్ ఇంజనీరింగ్‌లో మహిళలకు భారత దేశంలోనే అతి పెద్ద స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించారు.

ఇందులో మహిళా స్కాలర్లకు ఎంపిక చేసిన ప్రముఖ యూనివర్సిటీలలో వారి విద్య కోసం గరిష్ఠంగా రూ. 8 లక్షల వరకు స్కాలర్‌షిప్ లభిస్తుంది.

భారత సంపన్నులు, శాస్త్ర సాంకేతిక పరిశోధనలు, విరాళాలు, మత విశ్వాసాలు

ఫొటో సోర్స్, The Lodha Group

ఫొటో క్యాప్షన్, లోథా థియేటరికల్ ఫిజిక్స్ ఇన్‌స్టిట్యూట్ ప్రారంభోత్సవ సమయంలో అభిషేక్ లోథా( కుడి వైపు ఉన్న వ్యక్తి) జితేంద్ర జైన్ ( ఎడమవైపున్న వ్యక్తి)

మారుతున్న పరిస్థితులు

దాతృత్వం విషయంలో భారత్‌లో శాస్త్రం కంటే మత విశ్వాసాలు కీలక పాత్ర పోషిస్తాయి. దేశంలో సగం విరాళాలు ఎక్కువగా దేవాలయాలు, మత పరమైన సంస్థలకు వెళతాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య దేశంలోని సంపన్నులు సైన్స్ పరిశోధనలు, సంస్థల నిర్మాణానికి తమ దాతృత్వాన్ని మళ్లించడం, వారి వైఖరిలో మార్పును సూచిస్తోంది.

భారత ప్రముఖ వ్యాపార దిగ్గజాలు ఇలాంటి కార్యక్రమాలకు ఇచ్చే నిధులను పెంచుతున్నారు. మెదడుపై పరిశోధనలకు ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు క్రిస్ గోపాలకృష్ణన్ నిధులు అందిస్తున్నారు. బయో సైన్సెస్‌లో అత్యాధునిక పరిశోధన, ఆవిష్కరణల ముందుకు తీసుకెళ్లేందుకు ఫార్మా వ్యాపారవేత్తే కిరణ్ మజుందార్‌షా 2002లో ఒక లేబొరేటరీని స్థాపించారు.

ఇండియన్ సిలికాన్ వ్యాలీగా గుర్తింపు పొందిన బెంగళూరుకు చెందిన కనీసం అరడజను మంది టెక్ సంస్థల అధిపతులు ఇటీవలి సంవత్సరాల్లో రోబోటిక్ ఆస్ట్రానమీ నుంచి మల్టీ స్పెషాలిటీ మెడికల్ రీసర్చ్ వరకు వివిధ రంగాలకు భారీగా విరాళాలు ఇవ్వాలని నిర్ణయించారు.

ఈ ధోరణి శాస్త్ర పరిశోధనలు, దీర్ఘకాలిక జాతీయ పోటీ తత్వం ఒకదానితో ఒకటి ముడి పడి ఉన్నాయనే అంశం గురించి దేశ సంపన్న వర్గాల్లో పెరుగుతున్న అవగాహనను సూచిస్తోందని నిపుణులు చెబుతున్నారు.

"లోతైన శాస్త్రీయ పునాది లేకుండా ఏ దేశం కూడా గొప్పది కాలేదు. భారత్‌ గొప్ప గొప్ప మేథావులను తయారు చేస్తుందని మనం అనుకుంటాం. అంటే ఇక్కడ ప్రతిభ లేదని కాదు. మన దగ్గర సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల దాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నాం" అని లోథా గ్రూప్ సీఈఓ అభిషేక్ లోథా బీబీసీతో చెప్పారు.

"మా ఇన్‌స్టిట్యూట్‌లో సంవత్సరాల తరబడి మంచి పరిశోధనలు జరుగుతాయని ఇక్కడి వాతావరణం నూతన ఆవిష్కరణలకు, వాణిజ్యానికి, టెక్నాలజీకి దారి తీస్తుందని ఆశిస్తున్నాను" అని ఆయన అన్నారు.

వచ్చే 8 నుంచి పదేళ్ల పాటు ఎలాంటి సమస్యలు లేకుండా నడిచేందుకు రూ.955 కోట్లు కేటాయించినట్లు ఆయన వెల్లడించారు.

భారత సంపన్నులు, శాస్త్ర సాంకేతిక పరిశోధనలు, విరాళాలు, మత విశ్వాసాలు

ఫొటో సోర్స్, Corbis via Getty Images

ఫొటో క్యాప్షన్, సర్ దొరాబ్జి టాటా ట్రస్ట్ 1945లో టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసర్స్ సంస్థ ఏర్పాటు చేసింది.

'ప్రభుత్వ బాధ్యతనుకుని వదిలేశాం'

ఈ విరాళాలు భారత అభివృద్ధి కీలక దశలో ఉన్నప్పుడు వస్తున్నాయి. కృత్రిమ మేథ, రోబోటిక్స్ లాంటి అత్యాధునిక ఆవిష్కరణల్లో భారత్ వెనుకబడుతోందనే ఆందోళనలు పెరుగుతున్నాయి.

భారత జీడీపీలో రీసర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కోసం చేస్తున్న స్థూల వ్యయం 0.6 నుంచి 0.7 శాతం మాత్రమే. ఇది చైనా, సౌత్ కౌరియా, అమెరికాతో పోలిస్తే చాలా తక్కువ. ప్రైవేటు రంగం విషయానికొస్తే అభివృద్ధి చెందిన దేశాల్లో రీసర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (R&D) కోసం 70 శాతం ఖర్చు చేస్తున్నారు. భారత్‌లో ఇది 36 శాతం మాత్రమే.

భారత్‌తోపాటు ప్రపంచంలోని అనేక దేశాల్లో విజ్ఞాన శాస్త్ర అభివృద్ధికి తోడ్పడే అనేక కార్యక్రమాలకు కిరణ్ మజుందార్ షా నిధులు అందిస్తున్నారు.

శాస్త్ర, సాంకేతిక రంగాల అభివృద్ధికి తగినన్ని విరాళాలు సమీకరించడంలో భారత్ వెనుకబడిందని ఆమె భావిస్తున్నారు

"మన విద్యాసంస్థలకు ప్రభుత్వ మద్దతు ఉందని భావించి మనం వాటిని నిర్లక్ష్యం చేశాం" అని ఆమె అన్నారు.

"హార్వర్డ్, ఎంఐటీ, స్టాన్‌ఫోర్డ్ లాంటి ప్రపంచ స్థాయి ప్రముఖ విద్యా సంస్థలు దాతలు ఇచ్చే విరాళాలతో ఎదిగాయి. భారత్‌లో ఇప్పటి వరకు ఇది ప్రభుత్వం బాధ్యత అనే విధానం ఉంది" అని ఆమె వివరించారు.

భారత సంపన్నులు, శాస్త్ర సాంకేతిక పరిశోధనలు, విరాళాలు, మత విశ్వాసాలు
ఫొటో క్యాప్షన్, భారత్‌లో ఫార్మాతో పాటు అనేక రంగాల్లో పరిశోధనలకు విస్తృత మౌలిక సదుపాయాలు అవసరం అని పారిశ్రామికవేత్తలు చెబుతున్నారు.

"నేటి తరం ముందుకొస్తోంది"

అయితే ఇప్పుడీ పరిస్థితి మారుతోంది.

కొన్నేళ్ల కిందటి వరకు టాటా గ్రూప్ లాంటి వ్యాపార సంస్థలు భారత్‌లో పరిశోధనల కోసం అమెరికా తరహాలో విరాళాలు ఇవ్వడంలో ముందుండేవి.

ముంబైలో టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసర్చ్, బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ వంటి ప్రఖ్యాత విద్యా సంస్థలను స్థాపించినప్పటికీ, మధ్యలో చాలా అంతరం ఉంది.

సుదీర్ఘ విరామం తర్వాత శాస్త్రీయ పరిశోధనలకు విరాళాలు మళ్లీ వేగం పుంజుకున్నాయి.

"ఈ ధోరణిని ఇంటర్- జెన్ (సంప్రదాయ దాతృత్వ కుటుంబాలకు చెందిన ప్రస్తుత తరం) నౌ- జెన్ (మొదటిసారి సంపద సృష్టించిన తరం) నడిపిస్తోంది" అని కంపెనీలు తమ దాతృత్వ వ్యూహాల రూపకల్పనలో సాయపడే సంస్థ దస్రా సహ వ్యవస్థాపకురాలు నీరా నంది బీబీసీతో చెప్పారు.

"ఈ సంపన్నుల సమూహం సాంకేతిక, డేటా ఆధారిత అంశాల్లో ఫలితాల మీద దృష్టి పెడుతోంది. ఇది సహజంగానే సైన్స్, ఆవిష్కరణలు, పరిశోధన ఆధారిత పెట్టుబడుల పరిష్కారాల కోసం చూస్తోంది" అని ఆమె అన్నారు.

భారత్‌లో విద్య, ఆరోగ్య సంరక్షణ వంటి రంగాలతో పోలిస్తే సైన్స్, ఇన్నోవేషన్ వంటి వాటికిచ్చే విరాళాలు చాలా తక్కువ. ఇప్పటికీ విద్య, ఆరోగ్య సంరక్షణకే విరాళాల రూపంలో ఎక్కువగా నిధులు అందుతున్నాయని నంది చెబుతున్నారు.

భారత సంపన్నులు, శాస్త్ర సాంకేతిక పరిశోధనలు, విరాళాలు, మత విశ్వాసాలు

ఫొటో సోర్స్, Simon Dawson/Bloomberg via Getty Images

ఫొటో క్యాప్షన్, పారిశ్రామిక అవసరాలకు యూనివర్సిటీల్లో బోధిస్తున్న దానికి మధ్య అంతరం చాలా ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు.

పరిశోధనలకిచ్చే విరాళాలు పెరుగుతున్నాయా?

తలసరి ఆదాయం తక్కువగా ఉండటం, అభివృద్ధి ప్రాధాన్యతల మధ్య విస్తృత పోటీ లాంటి వాటిని పరిగణనలోకి తీసుకుంటే ఇది ఆశ్చర్యం కలిగించే అంశం ఏమీ కాదు.

పరిశ్రమలు- విద్యా సంస్థల మధ్య బలహీనమైన అనుసంధానం కూడా భారత్‌లో రీసర్చ్ విభాగాన్ని ప్రభావితంచేస్తోంది.

ఉన్నత విద్యలో నాణ్యత లేకపోవడం మరో కారణం. యూనివర్సిటీల్లో బోధించే దానికి, పరిశ్రమకు అవసరమైన నైపుణ్యాలకు మధ్య దూరం పెరుగుతోంది.

ఏదేమైనప్పటికీ శాస్త్రీయ పరిశోధనల కోసం ఇచ్చే విరాళాల మొత్తం పెరుగుతోందని నంది చెప్పారు.

"2030 ఆర్థిక సంవత్సరం నాటికి సంపన్న కుటుంబాలు మాత్రమే అదనంగా రూ. 1.43 లక్షల కోట్లు విరాళాలు ఇచ్చే సామర్థ్యం ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీనివల్ల శాస్త్రీయ పరిశోధనల రంగానికి ఎంత మేలు జరుగుతుందనేది ఈ విరాళాలు ఎలా విస్తరిస్తాయనే దాన్ని బట్టి ఉంటుంది. ప్రత్యేకించి సంస్థల నిర్మాణం, శాస్త్రీయ రంగంలో దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం విశ్వసనీయ మార్గాలను సృష్టించడంలో ఉంటుంది" అని ఆమె తెలిపారు.

ఫార్మా లాంటి రంగాల్లో దాతృత్వ కార్యక్రమాలకు వ్యాపారంతో ప్రత్యక్ష అనుబంధం ఉన్నందున అవి దీనికి నాయకత్వం తీసుకోవాలి" అని కిరణ్ మజుందార్ షా అన్నారు.

"భారత్‌లో ఫార్మా కంపెనీలు అత్యాధునిక పరిశోధనలు చేయడం లేదు. కొత్త ఔషధాలను కనుక్కోవడం వల్ల మాత్రమే వాటి విలువ పెరుగుతుంది. దీని కోసం పరిశోధన సంస్థల ఏర్పాటు చేయాలి. అందుకు చాలా నిధులు అవసరం" అని ఆమె అన్నారు.

‘‘ఆసియాలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి నిచ్చెన మెట్లు ఎక్కుతున్న సమయంలో పరిశోధనకు భారీగా నిధులు వస్తాయనడంలో సందేహం లేదు" అని లోథా చెప్పారు.

"ఇదొక పరిణామ క్రమం. అభివృద్ధి కోసం తపిస్తున్న సమాజానికి ఆర్థిక సాయం అందుతుంది. ఇప్పుడీ ధోరణి దాతృత్వం వైపు మళ్లడం మీరు చూస్తారు" అని లోథా అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)