నెలసరి కడుపు నొప్పి తగ్గడానికి సరైన మందే తీసుకుంటున్నారా?

నెలసరి కడుపు నొప్పి

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, మిచెల్ రాబర్ట్స్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 3 నిమిషాలు

నెలసరి సమయంలో వచ్చే కడుపు నొప్పికి చాలా మంది మహిళలు ప్రభావవంతమైన మందులను ఉపయోగించడం లేదని ఒక అధ్యయనంలో తేలింది. సూపర్ మార్కెట్ల రశీదులను విశ్లేషించి ఈ అతిపెద్ద అధ్యయనం చేశారు.

ఇంగ్లండ్‌లోని ప్రసిద్ధ రిటైల్ దుకాణాలలో లాయల్టీ కార్డ్ కొనుగోలు వివరాల ఆధారంగా ఈ అధ్యయనం నిర్వహించారు. గడచిన 10 ఏళ్లలో జరిగిన 21.1 కోట్ల కొనుగోలు లావాదేవీలను పరిశీలించగా, టాంపాన్లు, శానిటరీ ప్యాడ్‌లతో పాటు పారాసెట్మాల్ ఎక్కువగా కొనుగోలుచేసినట్టు తెలిసింది.

కానీ, చాలామందికి ఐబుప్రొఫెన్ సరైన ఔషధమని నిపుణులు చెపుతున్నారు. కండరాల నొప్పికి ఇది ప్రభావవంతంగా పనిచేస్తుందని చెబుతున్నారు.

కానీ, నెలసరి నొప్పి ‘స్థాయి, ప్రభావం’ ఎంతలా ఉందో ఈ కొనుగోళ్లు వ్యవహారాలు వెల్లడిస్తున్నాయి. దీని గురించి గతంలో పెద్దగా అధ్యయనాలు జరగలేదని పరిశోధకులు చెబుతున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

పారాసెట్మాల్ అందరికీ ఎక్కువగా తెలిసిన మందు కావడం వల్ల దాన్ని ఎక్కువగా కొంటున్నారని పరిశోధకులు అంటున్నారు.

పారాసెట్మాల్ మంచి నొప్పి నివారిణి అయినప్పటికీ, నెలసరి నొప్పికి ఐబుప్రోఫెన్ మరింత ప్రభావవంతంగా ఉండవచ్చు. ఎందుకంటే ఇది గర్భాశయ కండరాల నొప్పికి కారణమయ్యే ప్రోస్టాగ్లాండిన్స్ రసాయనాల తయారీని తగ్గిస్తుంది.

పారాసెట్మాల్ ప్రధానంగా మెదడులో పనిచేసి నొప్పి సంకేతాలను తగ్గిస్తుంది. అందుకే తలనొప్పికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే జ్వరం తగ్గించడంలో కూడా సాయపడుతుంది. జలుబు చేసినప్పుడు కూడా దీన్ని తరచుగా వాడుతారు.

2006 నుంచి 2015 వరకు 34 లక్షల మంది కొనుగోలు వివరాలను పరిశోధకులు పరిశీలించారు.

నెలసరి ఉత్పత్తులు కొనుగోలు చేసిన ప్రతి ఇద్దరిలో ఒకరు నొప్పి తగ్గించే మందులు కూడా కొనుగోలు చేసినట్టు పీఎల్ఓఎస్ డిజిటల్ హెల్త్ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం పేర్కొంది.

వారిలో సుమారు మూడింట రెండొంతులమంది పారాసెట్మాల్ , మూడింట ఒక వంతు జనం ఐబుప్రోఫెన్ కొనుగోలు చేశారు.

'మొత్తం దేశ పరిస్థితిని ఈ డేటా పూర్తిగా చూపించదు. కేవలం ఒక భాగాన్ని మాత్రమే చూపిస్తుంది. అయితే నెలసరి నొప్పిని తగ్గించుకోవడానికి మహిళలు ఏ మందులను ఎంచుకుంటున్నారో అర్థం చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది' అని ఈ అధ్యయన సహ రచయిత బ్రిస్టల్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ అన్యా స్కటోవా చెప్పారు.

పీరియడ్స్‌, క్రాంప్స్, కడుపు నొప్పి

ఫొటో సోర్స్, Getty Images

సాధారణంగా నెలసరి సమయంలో గర్భాశయం తన లోపలి పొరను తొలగించేందుకు కండరాలు సంకోచించడం వల్లే కడుపునొప్పి వస్తుంది. ఆ సమయంలో శరీరంలో ప్రోస్టాగ్లాండిన్స్ అనే హార్మోన్‌లాంటి పదార్థాలు తయారవుతాయి. ఇవి ఎక్కువగా ఉంటే నొప్పి కూడా ఎక్కువగా ఉంటుంది.

నెలసరి నొప్పి గురించి అవగాహన చాలా అవసరమని, ఈ విషయంలో పరిశోధనలు కూడా తక్కువగా జరిగాయని జేమ్స్ గౌల్డింగ్ చెప్పారు.

"పురుషులకు కూడా నెలసరి నొప్పి వచ్చి ఉంటే, ఈ విషయం గురించి ఇంకా ఎక్కువ సమాచారం తెలిసేది" అని ఆయన బీబీసీతో అన్నారు.

ఐబుప్రోఫెన్ నొప్పి, వాపును తగ్గించే మందు. ఇది శరీరంలో నొప్పికి కారణమయ్యే ప్రోస్టాగ్లాండిన్స్ స్థాయిని తగ్గిస్తుంది. అయితే పారాసెట్మాల్‌కు ఇలాంటి వాపు తగ్గించే లక్షణాలు ఉండవు.

నెలసరి ప్రారంభానికి ఒకటి లేదా కొన్ని రోజుల ముందే ఐబుప్రోఫెన్ తీసుకుంటే ఉపయోగకరంగా ఉండవచ్చు. ఎందుకంటే అప్పటికి శరీరంలో ప్రోస్టాగ్లాండిన్స్ పెరగడం మొదలవుతుందని ఎండో మెట్రోసిస్ యూకే సంస్థ చెబుతోంది.

నెలసరి నొప్పి చాలా తీవ్రంగా ఉంటే డాక్టర్‌ను సంప్రదించాలని, ముఖ్యంగా రోజువారీ పనులకు ఆటంకం కలిగించినా, లేదా ఆందోళన కలిగించినా పరీక్షలు చేయించుకోవాలని నేషనల్ హెల్త్ సర్వీస్ సూచించింది.

ఎక్కువగా నొప్పిరావడం ఎండోమెట్రియోసిస్ లేదా ఫైబ్రాయిడ్స్ వంటి ఇతర సమస్యల లక్షణం కూడా కావచ్చు.

కొన్ని మందుల్లాగే నొప్పి తగ్గించే మందులు కూడా దుష్ప్రభావాలు కలిగించవచ్చు.

ఐబుప్రోఫెన్ అందరికీ పడకపోవచ్చు. కాబట్టి దాన్ని వాడే ముందు దానికి సంబంధించిన సూచనలు చదవడం మంచిది.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)