నేపాల్ వరదలు: 9 రోజులపాటు సొరంగంలో చిక్కుకుపోయిన ఇద్దరిని సజీవంగా రక్షించిన ఆర్మీ

ఫొటో సోర్స్, Nepal Army
నేపాల్‌లో సంభవించిన భారీ వరదల కారణంగా త్రిశూలి 3-ఏ జలవిద్యుత్ ప్రాజెక్ట్ సొరంగంలో చిక్కుకున్న ఇద్దరు వ్యక్తులను సహాయక బృందాలు రక్షించాయి. నేపాల్ విద్యుత్ అథారిటీ జాయింట్ మేనేజర్ సురేశ్ రౌత్ ఈ విషయాన్ని నిర్థరించారు.
సొరంగంలో చిక్కుకుపోయిన సంజయ్ షా, కబీర్ మహర్జన్‌లను సురక్షితంగా బయటకు తీసుకువస్తుండగా అత్యవసర సహాయక సిబ్బంది హర్షధ్వానాలు చేశారు.
తొలుత సొరంగం నుంచి గొంతు వినపడగానే ‘‘భయపడకండి, మిమ్మల్ని రక్షించడానికే మేం ఇక్కడ ఉన్నాం’’ అని గట్టిగా అరిచినట్టు సహాయకబృందాలు పేర్కొన్నట్టు స్థానిక వార్తా కథనాలు తెలిపాయి. తరువాత సొరంగం నుంచి ‘‘సరే’’ అంటూ బలహీనంగా స్పందన వచ్చిందని ఆ కథనాలు పేర్కొన్నాయి.
తొలుత కాపాడింది సంజయ్ షా అనే వ్యక్తిని. ప్రాజెక్ట్ వద్ద ఆయన మెకానికల్ ఫోర్‌మన్‌గా పనిచేస్తున్నారు. అనంతరం మెకానికల్ సూపర్వైజర్ కబీర్ మహార్జన్ని సురక్షితంగా బయటకు తీసుకువచ్చినట్లు రౌత్ తెలిపారు.
"అతని మొహంలో చిరునువ్వు కనిపించింది. రక్షించిన వారికి ఆయన చేతులెత్తి కృతజ్ఞత తెలియజేశారు." అని రౌత్ చెప్పారు. సొరంగంలో 39మంది చిక్కుకుపోయినట్టుగా భావిస్తున్నామని ఆయన బీబీసీకి తెలిపారు. వీరిలో ఎంతమంది ప్రాణాలతో ఉన్నదీ ఆయన చెప్పనప్పటికీ ఇద్దరిని ప్రాణాలతో రక్షించినట్టు తెలిపారు.


ఫొటో సోర్స్, Nepal Army
దాదాపు 9 రోజుల పాటు టన్నెల్లో చిక్కుకున్న తర్వాత పదో రోజు ఇద్దరు వ్యక్తులను ప్రాణాలతో గుర్తించడం రెస్క్యూ సిబ్బందిని, ఎన్ఈఏ ఉద్యోగులను కదిలించిందని నేపాల్ విద్యుత్ అథారిటీ (ఎన్ఈఏ) ఉద్యోగి శోభా పౌడెల్ బీబీసీకి చెప్పారు.వీరిలో ఒకరిని ఆర్మీ హెలికాప్టర్లో నువాకోట్‌లోని బత్తర్కి తరలించినట్లు తెలిపారు.
త్రిశూలి 3-ఏ జలవిద్యుత్ ప్రాజెక్ట్‌లోని సొరంగంలో చిక్కుకున్న వారిని సంప్రదించడంలో ఈ ఉదయం నేపాల్ ఆర్మీ నేతృత్వంలోని సహాయక బృందం సఫలమైంది.
"లోపలి నుంచి ఒకరి కంటే ఎక్కువ గొంతులను విన్నట్లు నిర్ధరణ జరిగింది." అని సహాయక చర్యల నిపుణులు శ్రీరామ్ నౌపణె సామాజిక మాధ్యమాల్లో రాసుకొచ్చారు. శ్రీ రామ్ నౌపణె.. నేపాల్ పార్లమెంట్ సభ్యులు కూడా.
‘‘త్రిశూలి 3-ఏ టన్నెల్ లోపలి నుంచి శబ్దాలు వస్తున్నాయని సహాయక చర్యలకు నేతృత్వం వహిస్తున్న ఆర్మీ కల్నల్ గంగా బరాల్ మాతో చెప్పారు." అని రౌత్ తెలిపారు

ఫొటో సోర్స్, Nepal Army

ఫొటో సోర్స్, Nepal Army
"సహాయక బృందాలు టన్నెల్ నుంచి 100 మీటర్లు లోపలకు వెళ్లాయి. వారు శిథిలాలను తొలగిస్తూనే వెళ్లాల్సి వచ్చింది." అని నేపాల్ ఆర్మీ బీబీసీకి చెప్పింది.
"నేపాల్ ఆర్మీ, సాయుధ పోలీస్ దళాల నుంచి సహాయక బృందాలు టన్నెల్ లోపలకు వెళ్లాయి. సహాయక చర్యలను వారు తీవ్రతరం చేస్తున్నారు. టన్నెల్ లోపలి నుంచి గొంతులు వినిపించడం కొత్త ఆశలను రేకెత్తిస్తోంది.ఒక ఇంజనీర్‌గా నిన్న సాయంత్రం వరకు సైట్ వద్ద సహాయక చర్యల్లో పాల్గొన్నా." అని శ్రీ రామ్ తెలిపారు.
కబీర్ మహార్జన్ సొరంగం నుంచి ప్రాణాలతో బయటపడం తమకు ఎంతో సంతోషంగా ఉందని ఆయన సోదరుడు అమిర్ మహార్జన్ చెప్పారు. ‘నా మనసు తేలికపడింది’ అని ఆయన ఏఎఫ్‌పీ న్యూస్ ఏజెన్సీకి తెలిపారు. ‘‘కుటుంబం మొత్తం సంబరపడుతోంది’ అని ఆయన చెప్పినట్టు రాయ్‌టర్స్ పేర్కొంది.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























