‘అర్నబ్’ తరువాత రానున్న 10 తుపాన్లు ఇవే..

బంగాళాఖాతంలో వాయుగుండం, తుపానుగా బలపడింది
ఫొటో క్యాప్షన్, పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా మారిన 'అర్నబ్'‌ను ఎదుర్కోవడానికి అధికారులు చర్యలు చేపడుతున్నారు
    • రచయిత, శారద మియాపురం
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 4 నిమిషాలు

పశ్చిమ- మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను 'అర్నబ్' ప్రభావం ఆంధ్రప్రదేశ్, ఒడిశాల్లో కనిపిస్తోంది.

ఈ తీవ్ర తుపాను కారణంగా కొన్ని తీర ప్రాంతాల్లో జోరుగా వానలు పడటంతో పాటు, బలమైన గాలులు కూడా వీస్తున్నట్లు వార్తాసంస్థ ఏఎన్‌ఐ పేర్కొంది.

అక్టోబర్ 27 నాటికి ఇది అతి తీవ్ర తుపానుగా బలపడే అవకాశముందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఆ తర్వాత ఇది వాయువ్య దిశగా కదిలి, అక్టోబర్ 28 ఉదయానికల్లా బాపట్ల - విశాఖపట్నం మధ్య ఉన్న యానాం వద్ద తీరం దాటే అవకాశం ఉంది. ఆ సమయంలో గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, గరిష్టంగా 140 కిలోమీటర్ల వరకు ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

అయితే, ఈ తుపానుకు 'అర్నబ్' అని పేరెలా వచ్చింది? అర్నబ్ అంటే అర్థం ఏంటి? అసలు ఈ తుపాన్లకు పేర్లు ఎలా పెడతారో ఇక్కడ చూద్దాం.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

అర్నబ్ అనే పేరును ఏ దేశం పెట్టింది?

ఈ తుపానుకు అర్నబ్ అనే పేరును బంగ్లాదేశ్ ప్రతిపాదించింది.

వరల్డ్ మెటియరలాజికల్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూఎంవో), ఐక్యరాజ్యసమితికి చెందిన ఎకనమిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఆసియా అండ్ ది పసిఫిక్ (ఈఎస్‌సీఏపీ)కి చెందిన నిపుణుల కమిటీ ఆమోదించిన అధికారిక ట్రాపికల్ సైక్లోన్స్ పేర్ల జాబితాలో ఈ అర్నబ్ పేరు ఉంది. 2020 ఏప్రిల్‌లో తుపాను పేర్ల జాబితాను విడుదల చేశారు.

అర్నబ్ అంటే బెంగాలీ భాషలో సముద్రం (sea or Ocean) అని అర్థం. తెలుగులోనూ అర్ణవం అంటే సముద్రమని అర్థం. సంస్కృత మూలం ఉన్న పదం ఇది.

తుపాన్లకు పేర్లు ఎలా పెడతారు?

ఉష్ణమండల తుపానులకు పేర్లను కేటాయించే ప్రక్రియను సంబంధిత ప్రాంతీయ తుపాను కేంద్రాలు తమ వార్షిక, ద్వైవార్షిక సమావేశాల్లో నిర్ణయిస్తాయని డబ్ల్యూఎంవో వివరించింది.

ప్రపంచవ్యాప్తంగా మొత్తం 5 ప్రాంతీయ తుపాను కేంద్రాలు, 6 రీజినల్ స్పెషలైజ్డ్ మెటియరలాజికల్ సెంటర్లు (RSMCs) పనిచేస్తున్నాయి.

ఉత్తర హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం, అరేబియా సముద్ర ప్రాంతాల్లో ఏర్పడే తుపాన్లకు పేర్లు పెట్టడానికి WMO/ESCAP ప్యానెల్‌లోని 13 సభ్య దేశాలు పాల్గొంటాయి.

భారత్, బంగ్లాదేశ్, మాల్దీవులు, మియన్మార్, ఒమన్, పాకిస్తాన్, శ్రీలంక, థాయిలాండ్, ఇరాన్, ఖతర్, సౌదీ అరేబియా, యూఏఈ, యెమెన్ ఈ ప్యానెల్‌లోని సభ్యదేశాలు.

ఈ 13 దేశాలు తలా 13 పేర్ల చొప్పున మొత్తం 169 పేర్లతో కూడిన సుదీర్ఘ జాబితాను రూపొందించాయి.

ఆయాదేశాల ఇంగ్లిష్ అక్షర క్రమం (ఆల్ఫాబెటికల్ ఆర్డర్) ప్రకారం ప్రతీ తుపానుకు వరుసగా పేర్లు కేటాయిస్తారు.

ఈ క్రమంలో భాగంగానే బంగ్లాదేశ్ ఇచ్చిన పేర్ల వరుసలో నుంచి ఈ తుపానుకు 'అర్నబ్' అని పేరును తీసుకున్నారు.

న్యూదిల్లీలోని కేంద్రానిదే నామకరణ బాధ్యత

ముందే నిర్ణయించిన విధివిధానాల ప్రకారం.. బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో ఏర్పడే తుపానులు నిర్ధిష్ట తీవ్రతకు చేరుకున్నప్పుడు వాటికి నామకరణం చేసే బాధ్యతను న్యూదిల్లీలోని ప్రాంతీయ ప్రత్యేక వాతావరణ కేంద్రం (ఆర్‌ఎస్‌ఎంసీ) నిర్వహిస్తుందని ప్రపంచ వాతావరణ సంస్థ పేర్కొంది.

ముందే సిద్ధం చేసిన పేర్ల జాబితా నుంచి క్రమం ప్రకారం ఆ పేరును ఖరారు చేసి అధికారికంగా ప్రకటించే బాధ్యత మాత్రం న్యూదిల్లీలోని ప్రాంతీయ కేంద్రం నిర్వహిస్తుంది.

ఆ రకంగా ఈ తుపానును అధికారికంగా అర్నబ్ పేరుతో పిలుస్తున్నారు.

అసలు వాయుగుండం, తుపానుగా మారినట్లు తెలుసుకోవడం ఎలా?

వాయుగుండం, తుపాను, అతి తీవ్ర తుపాను అనే వర్గీకరణను వాటి గరిష్ట స్థిరమైన గాలుల వేగం (మ్యాగ్జిమం సస్టెయిన్డ్ విండ్ స్పీడ్) ఆధారంగా నిర్ణయిస్తారు.

ట్రోపికల్ డిప్రెషన్ (వాయుగుండం): గాలుల వేగం గంటకు 63 కిలోమీటర్ల కంటే తక్కువ ఉన్నప్పుడు దీన్ని వాయుగుండంగా పరిగణిస్తారు.

ట్రోఫికల్ స్ట్రామ్ లేదా తుపాను: గాలుల వేగం గంటకు 63 కిలోమీటర్లు దాటినప్పుడు అది తుపానుగా మారుతుంది. ఈ దశకు చేరుకున్న తర్వాతే ఆ విపత్తుకు అధికారికంగా ఒక పేరును కేటాయిస్తారు.

అతి తీవ్ర తుపాను: గాలుల వేగం గంటకు 116-118 కిలోమీటర్లు దాటితే.. ఆయా సముద్ర ప్రాంతాలను (బేసిన్స్)ను బట్టి వీటికి హరికేన్, టైఫూన్, ట్రోఫికల్ సైక్లోన్, అతి తీవ్ర తుపానుగా పరిగణిస్తారు.

ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) నివేదిక ప్రకారం.. భూకంపాల తర్వాత అత్యంత ప్రమాదకరమైన రెండో అతిపెద్ద ప్రకృతి విపత్తు ఈ తుపానులే.

అర్నబ్ తర్వాత వచ్చే 10 తుపాన్లు ఏవో తెలుసా?

పేర్ల ప్రతిపాదనకు సభ్యదేశాలు పాటించాల్సిన నిబంధనలు

పేర్ల ప్రతిపాదనకు సభ్యదేశాలు పాటించాల్సిన నిబంధనలు

  • ఈ పేర్లు రాజకీయ, మత, సాంస్కృతిక, లింగ భేదాలకు, చిహ్నాలకు అతీతంగా ఉండాలి.
  • సభ్యదేశాలు సూచించిన పేర్లు ఏ వర్గం మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలి
  • ఆ పేర్లలో క్రూరత్వం కనిపించకూడదు
  • పలకడానికి, గుర్తు పెట్టుకోవడానికి సులభంగా ఉండాలి.
  • ఈ పేరు ఇంగ్లీషులో ఎనిమిది అక్షరాలకంటే ఎక్కువ ఉండరాదు.
  • పేరు ప్రతిపాదించడంతోపాటు దాని స్పెల్లింగ్‌, ఉచ్ఛారణను ఇవ్వాల్సిన బాధ్యత కూడా సభ్య దేశాలదే.
  • సభ్యదేశాలు సూచించిన పేరును ఏ కారణంతోనైనా తిరస్కరించేందుకు ప్యానెల్‌కు అధికారం ఉంటుంది.
  • ఒకసారి ప్రకటించిన పేర్ల జాబితాలో కాలానుగుణంగా అవసరమైన మార్పులు చేర్పులు చేయవచ్చు
  • ఉత్తర హిందూ మహాసముద్రంలో పుట్టే తుపానులకు సూచించే పేర్లు ఒకసారి వాడిర తర్వాత మరోసారి వాడటానికి వీలులేదు. పేర్లు ఎప్పటికప్పుడు కొత్తగా, మరే ఇతర రీజినల్‌ సెంటర్‌ ఉపయోగించనిదిగా ఉండాలి.

తుపాన్లకు పేర్లు ఎందుకు?

ప్రపంచ వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం,

తుపానులకు పేర్లుపెట్టడం వల్ల అధికారులు, సైంటిస్టులు, విపత్తుల నిర్వహణ శాఖ, మీడియాతోపాటు సామాన్య ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుంది.

తుపానును గుర్తుపెట్టుకోవడం సులభమవుతుంది.

తుపాను కదలికల మీద హెచ్చరికలు చేయడానికి సులువుగా ఉంటుంది.

ఒకేసారి రెండు, మూడు తుపానులు వచ్చినప్పుడు వాటిని గుర్తించడానికి వీలవుతుంది

పేర్ల వల్ల ఏ తుపాను ఎప్పుడు వచ్చిందన్నది గుర్తుపెట్టుకోవడం సులభం

ప్రజలకు హెచ్చరికలు జారీ చేయడానికి అనువుగా ఉంటుంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)