నేపాల్: జలవిద్యుత్‌పైనే ఆధారపడటం ఎంత తప్పో వరదలు కళ్లకు కట్టాయా?

నేపాల్ జల విద్యుదుత్పత్తి కేంద్రాలు, వరదలు, త్రిశూలీ, ప్రతికూల వాతావరణం

ఫొటో సోర్స్, Didier Marti

ఫొటో క్యాప్షన్, గతంలో నేపాల్ విద్యుత్ కోతలను ఎదుర్కొంది.
    • రచయిత, కెల్లీ ఎన్‌జీ, నవీన్ సింగ్ ఖడ్కా
    • హోదా, బీబీసీ వరల్డ్ సర్వీస్
  • ప్రచురణ
  • చదివే సమయం: 7 నిమిషాలు

నేపాల్ విద్యుత్‌లో దాదాపు 100 శాతం జల విద్యుత్ నుంచే వస్తుంది. ఇంత పెద్ద మొత్తంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను భారత్, బంగ్లాదేశ్‌కు కూడా సరఫరా చేయడం ద్వారా నేపాల్ ఏటా సుమారు 200 మిలియన్ డాలర్లు(1,670 కోట్ల రూపాయలు) ఆర్జిస్తోంది.

నేపాల్‌కు ప్రాకృతిక అనుకూలతగా ఉన్న హిమానీ నదాలు, పర్వతాలు ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్‌ బారినపడుతున్నాయి.

నేపాల్‌లో ఇటీవల బీభత్సం సృష్టించిన వరదలు ఆ దేశ జలవిద్యుత్ లక్ష్యాలకు ఎదురవుతున్న ముప్పును స్పష్టం చేసింది.

నేపాల్ వరదల్లో 1300 మందికి పైగా మరణించారు. వేలాది మంది జాడ ఇంకా తెలియడం లేదు.

నేపాల్- టిబెట్ సరిహద్దుల్లోని గ్రామాలను వరదలు పూర్తిగా ధ్వంసం చేశాయి. త్రిశూలీ నదీ పరీవాహక ప్రాంతంలోని 12 జల విద్యుత్ కేంద్రాలను తీవ్రంగా దెబ్బ తీశాయి.ఇది నేపాల్ మొత్తం విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో 10 శాతానికిపైగా దెబ్బతీసింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

వరదలకు దెబ్బతిన్న విద్యుదుత్పత్తి కేంద్రాలు మళ్లీ పని చేస్తాయో లేదో తెలియదని చెప్పలేమని నిర్వాహకులు బీబీసీతో చెప్పారు.

వరద విధ్వంసంలో దెబ్బతిన్న 12 విద్యుత్ కేంద్రాల్లో ఆరింటిని నిర్వహిస్తున్న నేపాల్ ప్రభుత్వ రంగ సంస్థ "నేపాల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ" విద్యుత్ సరఫరాకు ఎలాంటి ఆటంకం లేదని ప్రజలకు భరోసా ఇచ్చింది.

అయినప్పటికీ, వాతావరణ మార్పుల వల్ల సంభవించే విపత్తులు తరచుగా పెరుగుతున్న సమయంలో "మా జలవిద్యుత్ విధానంపై పునరాలోచన చేయాల్సిన సమయం ఆసన్నమైంది" అని ఆ సంస్థ ప్రతినిధి రాజన్ ధకాల్ చెప్పారు.

నేపాల్ జల విద్యుదుత్పత్తి కేంద్రాలు, వరదలు, త్రిశూలీ, ప్రతికూల వాతావరణం

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, ఇటీవలి వరదల్లో నేపాల్ జల విద్యుదుత్పత్తి మొత్తం సామర్థ్యంలో 10 శాతం తుడిచి పెట్టుకుపోయింది.

హైడ్రో పవర్ జనరేషన్‌పై దృష్టి

నేపాల్ జనాభాలో కేవలం 2/3 మందికి మాత్రమే 2010లో విద్యుత్ సదుపాయం అందుబాటులో ఉండేది. విద్యుత్ సరఫరా ఉన్న ఇళ్లకి కూడా 16 గంటల వరకు కోతలు ఉండేవి.

అయితే విద్యుత్ విభాగంలో అవినీతికి అడ్డుకట్ట వేయడం, జల విద్యుదుత్పత్తి కేంద్రాలను నిర్మించడం, వేసవి కాలంలో విద్యుత్ లోటును ఎదుర్కొనేందుకు భారత్ నుంచి కొనుగోళ్లను పెంచడం ద్వారా 2018 నాటికి దేశంలోని చాలా ప్రాంతాల్లో 24 గంటల విద్యుత్ సరఫరాను అందుబాటులోకి తీసుకొచ్చారు.

ప్రస్తుతం నేపాల్‌లో 3,900 మెగావాట్లకుపైగా ఉత్పత్తి సామర్థ్యం ఉన్న 225 జల విద్యుత్ కేంద్రాలు ఉన్నాయని నేపాల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ చెబుతోంది. వీటి ద్వారా ఒకేసారి 30 లక్షల ఇళ్లకు విద్యుత్ సరఫరా చేయవచ్చు.

ఇప్పటికే ఉన్న విద్యుదుత్పత్తి కేంద్రాలతోపాటు ఇంకా వందలకొద్దీ జల విద్యుత్ ప్రాజెక్టులు నిర్మాణ దశలోనో, ప్రణాళికా దశలోనో ఉన్నాయి.

వీటిలో ఎక్కువ భాగం పర్వత ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నారు. దీంతో వేగంగా వచ్చే నీటి ప్రవాహాన్ని ఉపయోగించుకొని విద్యుత్ ఉత్పత్తి చేస్తారు.ఈ ప్రాజెక్టులకు నీటిని నిల్వ చేసే వ్యవస్థల అవసరం చాలా తక్కువ. అసలు లేకున్నా పెద్ద సమస్య ఏమీ లేదు.

అయితే, హిమాలయాలలోని ఎత్తైన ప్రాంతాలు ప్రపంచ సగటు కంటే 50% వేగంగా వేడెక్కుతుండటంతో ఈ ప్రాజెక్టులు తీవ్రపర్యావరణ ముప్పు ఎదుర్కొంటున్నాయి.

గత వారం వచ్చిన వరదలకు ఒక హిమానీ నదం, దాని అడుగు భాగం కూలిపోవడమే కారణమై ఉండొచ్చని ప్రాథమిక పరిశోధనలు సూచిస్తున్నాయి.

ఇప్పుడు వచ్చిన వరదలను నేరుగా వాతావరణ మార్పులతో ముడిపెట్టడం తొందరపాటు అవుతుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

అయితే నేపాల్ విపత్తు ప్రమాద నివారణ, నిర్వహణ సంస్థ మాత్రం 2018 నుంచి 2024 మధ్య నమోదైన విపత్తుల్లో 90 శాతం కంటే ఎక్కువ ‘‘వాతావరణానికి సంబంధించినవేనని’’ పేర్కొంది.

విమాజీ మంత్రి కుల్మన్ ఘిసింగ్ ఈ విపత్తును "శతాబ్దానికి ఒక్కసారి వచ్చే ఘటన"గా అభివర్ణించారు.

విద్యుత్పత్తి ప్లాంట్ల డిజైనింగ్ వాటి నిర్మాణ స్థలాలను ఎంచుకోవడంలో ఈ ఘటన ఒక పాఠం లాంటిదని ఆయన పేర్కొన్నారు.

"వరదలను తట్టుకునేలా మనం జలవిద్యుత్ కేంద్రాలను రూపొందించాలి. ముఖ్యంగా ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను బలోపేతం చేసుకోవాలి. అత్యవసర తరలింపు చర్యలను పటిష్ఠం చేసుకోవాలి" అని ఆయన మోంగాబే పర్యావరణ వార్తా సంస్థకు చెప్పారు.

ఈ వరదల్లో కొట్టుకొచ్చిన మట్టి, రాళ్లతో నిండిపోయిన సొరంగాల్లో వందల మంది కార్మికులు, ఇంజనీర్లు, స్థానిక ప్రజలు చిక్కుకుని ఉండవచ్చని భావిస్తున్నారు.

నేపాల్ జలవిద్యుదుత్పత్తి ‘‘పునరాలోచన’’ విధానంలో పర్వతాలపై నిర్మించాల్సిన అవసరం లేని రిజర్వాయర్ ఆధారిత ప్లాంట్లను చేర్చాలని నేపాల్ ఎలక్ట్రిసిటీ అథారిటీకి చెందిన ధకాల్ చెప్పారు. ఈ రిజర్వాయర్లలో అవసరమైనప్పుడు నీటిని నిల్వ చేసుకుని, విడుదల చేయడానికి ఉపయోగపడతాయి. కానీ ఇందులో గణనీయమైన ఆర్థిక, పర్యావరణ అంశాలు కూడా ఉన్నాయి.

నేపాల్ జల విద్యుదుత్పత్తి కేంద్రాలు, వరదలు, త్రిశూలీ, ప్రతికూల వాతావరణం

ఫొటో సోర్స్, Boy_Anupong

ఫొటో క్యాప్షన్, నేపాల్ ప్రభుత్వం కేవలం జల విద్యుదుత్పత్తిపైనే ఆధారపడకుండా ఇతర మార్గాలపై దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.

జల విద్యుదుత్పత్తి ఒక్కటే మార్గమా?

నేపాల్ జలవిద్యుదుత్పత్తిపైనే నేపాల్ ఎక్కువగా ఆధారపడిందా అనే ప్రశ్నలు కూడా ఇప్పుడు తలెత్తుతున్నాయి.

"ఇలాంటి ప్రమాదకరమైన కాలంలో మనం మన పెట్టుబడులను ఒకే విధానంలో ఖర్చు చేయకూడదు" అని క్లీన్ టెక్ సంస్థ విండ్‌పవర్ నేపాల్ వ్యవస్థాపకుడు పునరుత్పాదక ఇంధన నిపుణుడు కుశాల్ గురుంగ్ అంటున్నారు.

"సౌరశక్తి, పవనశక్తి వంటి ప్రత్యామ్నాయాలనూ తప్పక స్వీకరించాలి. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న జలవిద్యుత్‌ విధానాన్ని సవరించాల్సి ఉంటుంది" అని ఆయన చెప్పారు.

కొలంబియా విశ్వవిద్యాలయం గ్లోబల్ ఎనర్జీ పాలసీ కేంద్రానికి చెందిన పరిశోధకుడు వివేక్ శాస్త్రి కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.

"పవనశక్తి, సౌర విద్యుత్ ఉత్పత్తిని బాగా పెంచగలిగితే, భవిష్యత్తులో ఒకే వ్యవస్థపై ఆధారపడటం తగ్గుతుంది" అని ఆయన అన్నారు.

నేపాల్‌లో సౌరశక్తి ఉత్పత్తి సామర్థ్యం జలవిద్యుత్ కంటే దాదాపు 10 రెట్లు ఎక్కువగా ఉందని జర్మన్ ఎయిడ్ ఏజెన్సీ నివేదిక చెబుతోంది.

అయితే, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్‌కు చెందిన పుష్ప శర్మ మాట్లాడుతూ పవన, సౌర శక్తి రంగాల్లో అవకాశాలు ఉన్నప్పటికీ ఇది కొంతమేరకే సాధ్యపడుతుందని అంటున్నారు.

"సౌర, పవన శక్తిలో ఇంకా వినియోగించుకోని సామర్థ్యం ఉన్నప్పటికీ దక్షిణాసియా దేశాలతో పోలిస్తే నేపాల్‌కు పోటీ ప్రయోజనాన్ని ఇచ్చేది జలవిద్యుత్ మాత్రమే" అని ఆయన చెప్పారు.

నేపాల్ జల విద్యుదుత్పత్తి కేంద్రాలు, వరదలు, త్రిశూలీ, ప్రతికూల వాతావరణం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నేపాల్ జలవిద్యుదుత్పత్తి కంటే సోలార్ పవర్ ద్వారా ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చని జర్మనీ నివేదిక సూచిస్తోంది.

హైడ్రో పవర్‌లో విదేశీ పెట్టుబడులు

ఇప్పటికీ నేపాల్‌కు వచ్చే పెట్టుబడుల్లో జలవిద్యుత్ రంగానిదే పైచేయిగా ఉంది. వాతావరణ సంబంధిత ప్రమాదాలు తెలిసినా కూడా పెట్టుబడులు కొనసాగుతున్నాయని కొందరు పర్యావరణవేత్తలు విమర్శిస్తున్నారు.

గత వారం వచ్చిన వరదల్లో పూర్తిగా ధ్వంసమైన అప్పర్ త్రిశూలి-1 నేపాల్‌లోనే అతి పెద్ద విదేశీ పెట్టుబడి కలిగిన ప్రాజెక్టుల్లో ఒకటి.

దీని విలువ సుమారు 647 మిలియన్ డాలర్లు(6,113.53 కోట్ల రూపాయలు). దీనికి ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ మద్దతు ఇచ్చాయి.

తీవ్రంగా దెబ్బతిన్న మరో ప్రాజెక్టు అప్పర్ త్రిశూలి- 3A ప్రాజెక్టు. దీనికి చైనా ఎక్స్‌పోర్ట్-ఇంపోర్ట్ బ్యాంక్ నిధులు సమకూర్చింది.

"వేల మంది కార్మికులు, ప్రజలు, అధికారులు, నదులు, మౌలిక సదుపాయాలు, పర్యావరణాన్ని ప్రమాదంలోకి నెడుతున్నామని రుణాలు ఇచ్చే సంస్థలకు తెలుసు" అని దక్షిణాసియా నెట్‌వర్క్ ఆన్ డ్యామ్స్, రివర్స్ అండ్ పీపుల్ సమన్వయకర్త హిమాన్షు ఠక్కర్ చెప్పారు.

"ప్రమాదాలు పొంచి ఉన్నాయని ఆయా సంస్థల సొంత నివేదికలే చెబుతున్నాయి. కానీ నివారణ చర్యలు తీసుకోలేదు. నియంత్రణ, కఠిన నిబంధనలు, తనిఖీలు కోసం ఎలాంటి షరతులు పెట్టలేదు. వచ్చే విపత్తును ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా కూడా లేరు" అని ఆయన అన్నారు.

త్రిశూలీ నదీ పరీవాహక ప్రాంతం ప్రమాదకరమైందని చరిత్రే చెబుతోందని ఠక్కర్ గుర్తు చేశారు.

గత రెండేళ్లలో కూడా ఈ ప్రాంతం వరదల బారిన పడిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

2024 సెప్టెంబర్‌లో త్రిశూలి, భోటే కోశి నదీ పరివాహక ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్ వల్ల రసువా, నువాకోట్, ధాడింగ్ ప్రాంతాలలో ఆకస్మిక వరదలు ముంచెత్తాయి.

నదీ తీరాన ఉన్న ఈ జనావాసాలే గత వారం వచ్చిన వరదల్లో కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి.

ఆ తర్వాత 2025 జూలైలో, టిబెట్‌లోని గ్యిరోంగ్ కౌంటీలో ఒక హిమ సరస్సు బద్దలై నేపాల్ వైపు ప్రవహించింది. దీని కారణంగా 11 మంది మరణించారు. ఆ వరద కారణంగా మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి.

ఎప్పుడూ రద్దీగా ఉండే నేపాల్-చైనా కారిడార్ మూతపడింది. వాణిజ్యం ఆగిపోయింది. ఆరు నెలల తర్వాత ఈ ఏడాది జనవరి 1న ఈ మార్గాన్ని తెరిచారు.

"వాతావరణ మార్పులు, వచ్చే ముప్పును సరిగా అంచనా వేసినప్పటికీ, విద్యుత్ కేంద్రాల ఏర్పాటు దానికి అనుగుణంగా జరిగి ఉండకపోవచ్చు" అని నేపాల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ప్రతినిధి ధకాల్ చెప్పారు.

"మన జల విద్యుత్ కేంద్రాల నిర్మాణం, నిర్వహించే పద్దతులను మరింత మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంది" అని ఆయన సూచించారు.

నేపాల్ జల విద్యుదుత్పత్తి కేంద్రాలు, వరదలు, త్రిశూలీ, ప్రతికూల వాతావరణం

ఫొటో సోర్స్, NurPhoto via Getty Images

ఫొటో క్యాప్షన్, నేపాల్‌లో ఇటీవలి వరదల్లో 1300 మందికి పైగా ప్రజలు మరణించారు.

'ప్రపంచం పట్టించుకోవాలి’

ప్రైవేటు నిర్వాహకులు ఇప్పటికే ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారని ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ఆఫ్ నేపాల్‌కు చెందిన ఉత్తమ్ భ్లోన్ లామా చెబుతున్నారు.

మూడేళ్లుగా వరద ప్రభావంతో జరిగిన నష్టానికి 20కిపైగా ప్రైవేటు విద్యుత్ కేంద్రాలకు బీమా కంపెనీలు 40 మిలియన్ డాలర్లు (377.96 కోట్ల రూపాయలు) చెల్లించాయి.

దీనివల్ల ఇన్సూరెన్స్ ప్రీమియంలు విపరీతంగా పెరుగుతున్నాయని, ఇది వ్యాపార నిర్వహణ వ్యయాన్ని పెంచి ప్రాజెక్టులను "నడపలేనంత భారంగా" మారుస్తోందని ఆయన హెచ్చరించారు.

వాతావరణ మార్పుల ముప్పు అంతర్జాతీయ సమస్య. దీన్ని నేపాల్ ఒంటరిగా ఎదుర్కోలేదు. ప్రభుత్వాలు, అంతర్జాతీయ సంస్థలు కలిసి సమాచారాన్ని పంచుకోవాలి. జరగబోయే ప్రమాదాలను అంచనా వేయాలి. ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను బలోపేతం చేసుకోవాలి అని యూఎన్ వాతావరణ సమావేశంలో నేపాల్ ప్రతినిధి మంజీత్ ధాకల్ కోరారు.

"ఈ తీవ్రమైన ప్రమాదాలకు దారి తీసిన గ్రీన్ హౌస్ ఉద్గారాల విషయంలో అతి తక్కువ బాధ్యత గల దేశాల్లో నేపాల్ ఒకటి" అని ఆయన అభిప్రాయపడ్డారు.

"విచిత్రమేంటంటే, మా జలవిద్యుత్ పరిశ్రమ ఉద్గారాలను మరింత తగ్గించే ప్రయత్నం. ఈ ప్రమాదాలను ఎదుర్కోవాల్సిన బాధ్యత మాపైనే పూర్తిగా వేయకూడదు, మేము ఒంటరిగా వాటిని ఎదుర్కోలేం" అని ఆయన అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)