నార్త్ అమెరికా నుంచి యూరప్ దేశాలు తమ బంగారాన్ని ఎందుకు తరలిస్తున్నాయి?

బంగారం, యూరప్ దేశాలు, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్, ద్రవ్యోల్బణం, యుద్ధ భయాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రపంచ ఆర్థిక సంక్షోభం తర్వాత వివిధ దేశాలు కేంద్ర బ్యాంకుల ద్వారా బంగారం నిల్వ చేసే ధోరణి వేగం పుంజుకుంది.
    • రచయిత, మైఖేల్ రేస్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 6 నిమిషాలు

నెదర్లాండ్స్ కేంద్ర బ్యాంకు ఈ వారంలో తమ దేశానికి చెందిన టన్నుల కొద్దీ బంగారాన్ని ఉత్తర అమెరికా నుంచి తరలించినట్లు నిర్ధరించింది.

ఈ తరలింపు ‘‘తీవ్ర సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కోవడానికి’’ దోహదపడుతుందని పేర్కొంది.

పెరుగుతున్న భౌగోళిక రాజకీయ అశాంతి దృష్ట్యా అమెరికా, కెనడాలో ఉన్న మొత్తం 313 టన్నుల బంగారంలో దాదాపు 86 టన్నులను లండన్‌కి తరలించినట్టు తెలిపింది. తద్వారా సంక్షోభ సమయంలో ఈ పసిడి వినియోగానికి సిద్ధంగా ఉంటుందని వెల్లడించింది.

ఈ ప్రకటన వెలువడిన వెంటనే నెదర్లాండ్స్ ఇలా ఎందుకు చేసింది? సమీప భవిష్యత్తులో ఏదైనా ఆర్థిక సంక్షోభం రానుందనే ముందస్తు అంచనాలతోనే ఇలాంటి వ్యూహాన్ని ఎంచుకుందా? అనే ప్రశ్నలు తలెత్తాయి.

అయితే లాంటివేవీ కనిపించడం లేదు. కానీ వాణిజ్య, సైనిక యుద్ధాలు ఆయా దేశాలను ముందు జాగ్రత్త చర్యలు తీసుకునేలా తమ బంగారాన్ని తమ వద్దే అట్టిపెట్టుకునే పరిస్థితులు కల్పిస్తున్నాయన్నది స్పష్టం.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
బంగారం, యూరప్ దేశాలు, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్, ద్రవ్యోల్బణం, యుద్ధ భయాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, లండన్‌లోని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్‌ ఖజానాలో పెద్ద మొత్తంలో బంగారు కడ్డీలు ఉన్నాయి.

ఫ్రాన్స్, జర్మనీ కూడా..

ఈ ఏడాది ప్రారంభంలో ఫ్రాన్స్ తన బంగారు నిల్వలను అమెరికా నుంచి స్వదేశానికి తరలించినట్టు ప్రకటించింది.

ఇక జర్మనీ కేంద్ర బ్యాంక్‌ కూడా తమ విదేశీ నిల్వ కేంద్రాలైన న్యూయార్క్ నుంచి 111 టన్నులు, పారిస్ నుంచి 105 టన్నులు మొత్తంగా 216 టన్నులకుపైగా బంగారాన్ని స్వదేశానికి తరలించే ప్రక్రియను 2016 నాటికే పూర్తిచేసింది.

" ప్రపంచంలో అస్థిరత నెలకొన్న సమయాల్లో గతంలో కూడా ప్రపంచ దేశాలు ఇలాంటి వ్యూహాన్నే అనుసరించాయి. ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో కొన్ని యూరోపియన్ సెంట్రల్ బ్యాంకులు తమ బంగారు నిల్వల్లో కొంత భాగాన్ని న్యూయార్క్‌కు తరలించాయి" అని గోల్డ్‌మన్ శాక్స్ కు చెందిన పరిశోధన విశ్లేషకులు లీనా థామస్, డాన్ స్ట్రూవెన్ అన్నారు.

వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ సీనియర్ మార్కెట్ వ్యూహకర్త జోసెఫ్ కావటోని బీబీసీతో మాట్లాడుతూ "యుద్ధాలు, వాణిజ్య ఉద్రిక్తతలు ఈ నిర్ణయాలు తీసుకోవడంలో కొంత పాత్ర పోషిస్తున్నప్పటికీ, ప్రధాన కారణాలు అవే అని చెప్పలేం" అన్నారు.

ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లతోపాటు వేగంగా లావాదేవీలు జరపగలిగే చోట బంగారాన్ని ఉంచడం కూడా ఈ నిర్ణయంలో కీలక పాత్ర పోషించాయి.

"సమీప భవిష్యత్‌లో ఏదో ప్రమాదం ముంచుకొస్తుందని నేను భావించడం లేదు. కానీ కేంద్ర బ్యాంకులు తమ రిజర్వ్ ఆస్తులను ఎలా నిర్వహించుకోవాలి? వాటిని ఎలా పెంచుకోవాలి? ఎలా సద్వినియోగం చేసుకోవాలనే దానిపై మరింత అవగాహన పెంచుకుంటున్నాయని భావిస్తున్నా" అని కావటోని అన్నారు.

ఈ ఏడాది మార్చి నుంచి ఆగస్టు మధ్య అమెరికా, కెనడా నుంచి తరలించిన బంగారం ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ ఖజానాలో ఉందని నెదర్లాండ్ కేంద్ర బ్యాంక్ తెలిపింది.

"ఆ బంగారాన్ని ఉపయోగించాల్సిన అవసరం మాకు ఇప్పట్లో రాదని భావిస్తున్నాం. కానీ ఆర్థిక సామర్థ్యాన్ని, సంసిద్ధతను పెంచుకోవాల్సిన అవసరం ఉంది" అని డచ్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ ఓలాఫ్ స్లీజ్ పెన్ అన్నారు.

"ప్రపంచంలో ఒక ప్రధాన వాణిజ్య కేంద్రంగా లండన్‌కు విశిష్ట స్థానం ఉండటంతో, ఆ నగరాన్ని అత్యుత్తమ వేదికగా ఎంచుకున్నారు. సంక్షోభ సమయంలో బంగారాన్ని వేగంగా కొనాలన్నా లేదా అమ్మాలన్నా, లండన్ సరైన ప్రదేశం. అందుకే బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ ఒక ముఖ్యమైన నిల్వ కేంద్రంగా ఉంది" అని ఓలాఫ్ స్లీజ్ పెన్ అన్నారు.

"ఈ బ్యాంక్ ప్రపంచంలోనే బంగారాన్ని భద్రపరిచే అతి పెద్ద సంస్థల్లో ఒకటి. లండన్ మధ్య భాగంలో ఉన్న 300 ఏళ్ల పురాతనమైన ఈ సంస్థ భూగర్భ ఖజానాలో 200 బిలియన్ పౌండ్లకు(రూ. 25.53 లక్షల కోట్లు) పైగా విలువైన సుమారు 4 లక్షల బంగారు కడ్డీలు(బార్లు) ఉన్నాయి.

బంగారం, యూరప్ దేశాలు, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్, ద్రవ్యోల్బణం, యుద్ధ భయాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బంగారాన్ని భద్రపరిచే ఖజానాగా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్‌కు గుర్తింపు ఉంది.

బంగారం ఖజానా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్

వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ సర్వేల ప్రకారం, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ ఎక్కువ ఆమోదం పొందిన నిల్వ ప్రదేశంగా ఉంది. కానీ కేంద్ర బ్యాంకులు ఈ విలువైన లోహాన్ని నిల్వ చేసే ప్రదేశాలను ఇప్పుడు భిన్నంగా ఎంపిక చేయడం ప్రారంభించాయి.

"తమ దేశ బంగారాన్ని ఎక్కడ భద్రపరచాలనే అంశం రిజర్వ్ మేనేజర్లకు ముఖ్య అంశంగా మారింది’’ అని చెప్పారు గోల్డ్‌మన్ శాక్స్ కు చెందిన థామస్, స్ట్రూవెన్.

రవాణా భారాన్ని తగ్గించుకోడానికి ఇదో మార్గం. ఆధునిక ప్రపంచంలో బంగారాన్ని ఒక చోట నుంచి మరొక చోటుకు తరలించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. నెదర్లాండ్స్ ప్రభుత్వం న్యూయార్క్‌లో సుమారు 59 టన్నుల బంగారాన్ని అమ్మి ఆ తర్వాత లండన్‌లో కొత్త నిల్వలను కొనుగోలు చేసింది.

దీని వల్ల అట్లాంటిక్ మహాసముద్రం దాటి బంగారాన్ని రవాణా చేసే ఖర్చు తగ్గింది. అయితే, 27 టన్నులకు పైగా బంగారాన్ని అమెరికా, కెనడా నుంచి డచ్ పట్టణమైన జీస్ట్‌కు "భౌతికంగా తరలించారు". అంతే పరిమాణంలో ఉన్న బంగారాన్ని జీస్ట్ నుంచి లండన్‌కు కూడా పంపారు.

ఇలాంటి సేవలను అందించే కంపెనీలు తమ రవాణా సమాచారాన్ని అత్యంత రహస్యంగా ఉంచుతాయి. అయితే సినీ ఫక్కీలో భారీ దోపిడీలు జరగకుండా ఉండేలా కఠినమైన భద్రతా ఏర్పాట్లు, ప్రణాళికలు ఉంటాయని చెప్పవచ్చు.

బంగారాన్ని ఒక మార్కెట్‌లో విక్రయించి, అదే సమయంలో మరో మార్కెట్‌లో కొనుగోలు చేయడమే పసిడి తరలింపునకు ఉన్న సులభమైన మార్గం అంటారు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్‌కు చెందిన కావటోని.

"ఉదాహరణకు, నాకు న్యూయార్క్‌లో బంగారం కావాలి. కానీ అది లండన్ లో ఉందనుకుందాం. దానిని లండన్‌లో అమ్మి, న్యూయార్క్‌లో అదే రోజు, అదే సమయంలో కొనగలను. దీని వల్ల వాస్తవానికి మరే ఇతర రవాణా అవసరం లేకుండానే బదిలీని సులంభంగా పూర్తి చేసుకోవచ్చు" అని ఆయన చెప్పారు.

సరిహద్దులు దాటి బంగారం రవాణా చేసే కంపెనీలు కొన్ని మాత్రమే ఉన్నాయి. వాటిలో బ్రింక్స్ గ్లోబల్ సర్వీసెస్ ఒకటి. ఇటీవలి కాలంలో సెంట్రల్ బ్యాంకుల వంటి సంస్థల నుంచి డిమాండ్ పెరిగినట్టు తాము గమనించామని ఆ సంస్థ బీబీసీకి తెలిపింది.

"పెరిగిన భౌగోళిక రాజకీయ, ఆర్థిక అనిశ్చితి, అలాగే వ్యూహాత్మక ఆర్థిక నిల్వగా బంగారం పాత్ర పెరగడం వంటివి ప్రస్తుత పరిస్థితికి కారణం" అని బ్రింక్స్ గ్లోబల్ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ నాదర్ అంతర్ అన్నారు. కేంద్ర బ్యాంకులు బంగారాన్ని ఎక్కువ కొనుగోలు చేస్తుండటంతో నిల్వ అంశం గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నాయి. దానిని స్వదేశంలో నిల్వ చేయడానికి ఖర్చు ఎక్కువవుతుందని గోల్డ్‌మన్ సాక్స్ కు చెందిన థామస్ స్ట్రూవెన్ అన్నారు.

బంగారం, యూరప్ దేశాలు, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్, ద్రవ్యోల్బణం, యుద్ధ భయాలు

ఫొటో సోర్స్, Getty Images

కేంద్ర బ్యాంకుల బంగారు నిల్వలపై చర్చ ఎందుకు?

"దేశీయంగా నిల్వ చేయడానికి భౌతిక భద్రత, ఆడిట్ మౌలిక సదుపాయాలు, బీమా కోసం పెట్టుబడి అవసరం, చిన్న కేంద్ర బ్యాంకుల విషయంలో ఈ ఖర్చులు భారంగా మారవచ్చు" అని థామస్, స్ట్రూవెన్ పేర్కొన్నారు.

వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం గత నాలుగేళ్లలో, కేంద్ర బ్యాంకులు ఏటా సగటున 1,000 టన్నుల బంగారాన్ని తమ నిల్వల్లో చేర్చుకున్నాయి.

ఇది గతంలో ఉన్న 500 టన్నుల సగటు కంటే చాలా ఎక్కువ.ఈ ధోరణి ప్రపంచ ఆర్థిక సంక్షోభం నాటి నుంచే కొనసాగుతోంది.

రాబోయే ఏడాదిలో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. ఇటీవలి కాలంలో బంగారానికి ఆదరణ బాగా పెరిగింది.

దీని ధర కొత్త రికార్డులను సృష్టిస్తూ, జనవరిలో ఔన్సు(సుమారు 31.1 గ్రాములు)కు $5,000 (4.72లక్షల రూపాయలు) మార్కును దాటింది.

దీని విలువ భారీగా పెరగడానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ, వాణిజ్య ఒడిదుడుకులు, యుద్ధాల వల్ల ఏర్పడే ఆర్థిక, భౌగోళిక, రాజకీయ అస్థిరత సమయాల్లో పెట్టుబడి పెట్టడానికి అనువైన సురక్షితమైన ఆస్తిగా ప్రజలు భావించడం ఒక ప్రధాన కారణం.

ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు కూడా బంగారం డిమాండ్‌పై ప్రభావం చూపుతాయి.

బంగారం అరుదైన లోహం కావడం, వేల సంవత్సరాలుగా దీనికి ఉన్న విలువ కారణంగా ధర పెరుగుదల ప్రభావం దీనిపై తక్కువగా ఉంటుంది. అందుకే దీనిని ఒక మంచిపెట్టుబడిగా భావిస్తారు.

"గత అర్ధ శతాబ్ద కాలంలో ద్రవ్యోల్బణాన్ని అంచనా వేసే అత్యంత కీలకమైన సూచిక అయిన వినియోగదారుల ధరల సూచీ కంటే బంగారం ధర చాలా వేగంగా పెరిగింది’’ అంటారు ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ చార్లెస్ ష్వాబ్.

"ఈ ఏడాది ప్రారంభంలో నమోదైన రికార్డు స్థాయి ధరతో పోలిస్తే బంగారం ధర తగ్గినప్పటికీ, చరిత్ర చూస్తే అది ఇప్పటికీ అధిక స్థాయిలోనే ఉంది.

గోల్డ్‌మన్ పరిశోధకుల అంచనా ప్రకారం, "2026 చివరి నాటికి దీని ధర ట్రాయ్ ఔన్స్ 4,900 డాలర్లు(4.63లక్షల రూపాయలు)పెరుగుతుంది. ఇది ఆగస్టు నాటి ధర కంటే 300 డాలర్లు(రూ. 28,347) ఎక్కువ.

"ధరలు వేగంగా పెరగడానికి గల ప్రధాన కారణలలో కేంద్ర బ్యాంకుల నుంచి బంగారానికి డిమాండ్ ఎక్కువ కావడం కూడా ఒకటి " అని థామస్, స్ట్రూవెన్ పేర్కొన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)