ఇరాన్‌తో అమెరికా యుద్ధం ముగిసిందా? ట్రంప్ లేఖలో ఏముంది, 60 రోజుల నిబంధన ఏమిటి

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సరీన్ హాబెషైన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- చదివే సమయం: 4 నిమిషాలు
ప్రస్తుతం కాల్పుల విరమణ అమల్లో ఉందని, ఇరాన్,అమెరికాకు మధ్య యుద్ధం జరగడం లేదని అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు. యుద్ధానికి కాంగ్రెస్ అనుమతి పొందాల్సిన అవసరం ఇప్పుడు తనకు లేదని ఆయన వాదించారు.
మిలటరీ చర్య ప్రారంభించిన 60 రోజుల్లోపు అమెరికా అధ్యక్షుడు చట్ట ప్రకారం కాంగ్రెస్ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. లేదంటే యుద్ధాన్ని ఆపాలి.
గత నెలలో ఇరాన్‌తో కాల్పుల విరమణ జరగడంతో యుద్ధ అధికారాల చట్టం తనకు వర్తించదని కాంగ్రెస్ నేతలకు రాసిన లేఖలో ట్రంప్ చెప్పారు. 60 రోజుల గడువు వ్యవధి పరిధిలోకి ఇది రాదని అన్నారు.
అమెరికా, ఇరాన్ ఇంకా దీర్ఘకాలిక ఒప్పందం కుదుర్చుకోలేదు. పాకిస్తాన్ ద్వారా తెహ్రాన్ కొత్త సందేశం పంపించిందని ఇరాన్ మీడియా చెబుతోంది.
''ఏప్రిల్ 7 నుంచి అమెరికా బలగాలు, ఇరాన్ మధ్య కాల్పులు జరగలేదు'' అని కాంగ్రెస్ నేతలకు శుక్రవారం(మే 1)రాసిన లేఖలో ట్రంప్ తెలిపారు. కాంగ్రెస్‌కు సమాచారం ఇచ్చి 60 రోజులు పూర్తయిన తర్వాత ట్రంప్ ఈ లేఖ రాశారు. ''ఫిబ్రవరి 28, 2026న ప్రారంభమైన యుద్ధం ఇప్పుడు ముగిసింది'' అని తెలిపారు.


ఫొటో సోర్స్, Getty Images
ట్రంప్ ఇంకా ఏమన్నారంటే...
అమెరికాతో సంప్రదింపుల కోసం పాకిస్తాన్ మధ్యవర్తులకు తెహ్రాన్ ఓ ప్రతిపాదన పంపిందని ఇరాన్ ప్రభుత్వ న్యూస్ ఏజెన్సీ ఐఆర్ఎస్ఏ తెలిపింది.
మిగిలిన వివరాలేవీ ఆ న్యూస్ ఏజెన్సీ వెల్లడించలేదు. ఈ ప్రతిపాదన అమెరికాకు చేరిందా లేదా అనేదానిపై స్పష్టత లేదు.
''ఇరాన్‌తో చర్చలు ఇప్పుడే ముగిశాయి. ఏం జరుగుతుందో చూద్దాం. నేను సంతోషంగా లేనని చెప్పగలను'' అని ట్రంప్ విలేకరులతో చెప్పారు.
యుద్ధంలో ఇరాన్ సైనిక ఉన్నతాధికారులు మరణించడతో ఇరాన్ నాయకత్వం చాలా గందరగోళంలో ఉందని, దీంతో ఒప్పందం కుదరడం కష్టంగా ఉందని ఆయన చెప్పారు.
ఉన్న అవకాశాలను అమెరికా సెంట్రల్ కమాండ్ తనకు వివరించిందని, భారీ దాడి చేసి వారిని నిర్మూలించడం, ఒప్పందం కుదుర్చుకోవడం వంటి అవకాశాల గురించి తెలియజేసిందని అన్నారు.
''మేం కోరుకుంటున్న ఒప్పందంతో వాళ్లు ముందుకు రావడం లేదు'' అని ట్రంప్ చెప్పారు.
''మేం దీన్ని సరైన విధంగా పూర్తిచేయాలి. మధ్యలో వదిలేసి వెళ్లబోం. అలా వదిలేస్తే మూడేళ్లలో మళ్లీ సమస్య ఏర్పడుతుంది'' అని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
‘‘ఇలాంటి అనుమతులు అవసరం లేదు’’
హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించడానికి ఎవరైనా, ఏ కంపెనీ అయినా ''టోల్'' చెల్లిస్తే అమెరికా ఆంక్షలు ఉల్లంఘించినట్టేనని యుఎస్ ట్రెజరీ హెచ్చరించింది.
ఈ కీలక జలసంధి ఇప్పటికీ దాదాపుగా మూసేఉంది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రభావం పడుతోంది.
యుద్ధానికి అధికారిక అనుమతి ఇవ్వాలా లేదా అనేదానిపై ఓటింగ్ నిర్వహించాలా లేదా అన్న ప్రశ్నలు కాంగ్రెస్ సభ్యులకు ఎదురవుతున్నాయి.
1973లో తీసుకొచ్చిన యుద్ధ అధికారాల చట్టం ద్వారా పోరాటంలో అమెరికా భద్రతాదళాలను ఉపయోగించిన అధ్యక్షుడు 60పని దినాల్లో కొన్ని అనుమతులు పొందాలి.
యుద్ధంపై కాంగ్రెస్ అధికారిక ప్రకటన చేయాలి లేదా బలగాలను సరైన విధంగా వెనక్కి రప్పించేందుకు వీలుగా 30 రోజులు గడువు పొడిగించేందుకు అధ్యక్షునికి అనుమతివ్వాలి. లేదంటే బలగాలను ఉపయోగించడాన్ని అధ్యక్షుడు నిలిపివేయాలి.
వియత్నాం యుద్ధంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ పరిధిని నియంత్రించడానికి 1973లో ఈ చట్టం తీసుకొచ్చారు.
కాంగ్రెస్ ఆమోదం పొందాల్సిన గడువు వర్తించదని రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ కాంగ్రెస్ ముందు వాదించారు.
''చట్టం ఇందుకు ఒప్పుకోదు'' అని డెమోక్రటిక్ సెనెటర్ టిమ్ కైన్ చెప్పారు.
ఇరాన్ విషయంలో ట్రంప్‌ను నియంత్రించేందుకు డెమోక్రట్ల నేతృత్వంలో జరిగిన ప్రయత్నాలు వరుసగా విఫలమయ్యాయి.
డెమోక్రట్ల ప్రయత్నాలను అనేకమంది రిపబ్లికన్లు వ్యతిరేకించారు. 60రోజుల గడువు తర్వాత తమ అభిప్రాయాన్ని మార్చుకోవచ్చని వారిలో కొందరు చెప్పారు.
కాంగ్రెస్ అనుమతి తీసుకోవడంపై ట్రంప్ స్పందించారు. ఏ దేశంలోనూ ఇలాంటి అనుమతులు అవసరం లేదన్నారు.
''ఇది పూర్తిగా రాజ్యాంగవిరుద్ధమని అనేకమంది భావిస్తున్నారు'' అని ట్రంప్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
‘‘యుద్ధం పూర్తిగా ముగిస్తేనే చట్టం వర్తించదు’’
యుద్ధ అధికారాల చట్టాన్ని ట్రంప్ అధికారయంత్రాంగం అర్ధం చేసుకున్న విధానంపై నిపుణులు సందేహాలు వ్యక్తంచేస్తున్నారు.
కాల్పుల విరమణ ఉన్నప్పటికీ 60రోజుల గడువుపై ఎలాంటి ప్రభావం ఉండబోదని వాషింగ్టన్ డీసీలో జార్జ్‌టౌన్ యూనివర్శిటీ లాకు చెందిన ప్రొఫెసర్ హీథర్ బ్రాండ్‌సన్-స్మిత్ చెప్పారు.
''కాల్పుల విరమణ సంక్షోభానికి శాశ్వత ముగింపు కాదు'' అని ఆమె అన్నారు. యుద్ధం శాశ్వతంగా ముగిసినప్పుడే 60రోజుల గడువు పూర్తయినట్టని ఆమె తెలిపారు.
ట్రంప్ అధికారయంత్రాంగం సంక్షోభాన్ని కొనసాగిస్తే కోర్టులు లేదా కాంగ్రెస్ మాత్రమే దాన్ని ఆపగలవని ఆమె అభిప్రాయపడ్డారు.
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ విస్తృత దాడులు జరిపి, సుప్రీం లీడర్‌ను హతమార్చడంతో సంక్షోభం మొదలయింది. ఇజ్రాయెల్, అమెరికా గల్ఫ్ మిత్రపక్షాలపై దాడులతో ఇరాన్ ప్రతిస్పందించింది.
ఇరాన్ అణుకార్యక్రమాన్ని అమెరికా, ఇజ్రాయెల్ వ్యతిరేకిస్తున్నాయి. అణుబాంబు తయారుచేసుకోవడానికి ఇరాన్ ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్నాయి. ఈ ఆరోపణలను తెహ్రాన్ ఖండించింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
































