ఈవీఎంలో ఏం ఉంది? పార్టీలకు, ప్రజలకు అంతుచిక్కని పశ్చిమబెంగాల్ ఎన్నికలు

ఫొటో సోర్స్, Getty Images
- పశ్చిమ బెంగాల్‌లో రెండు దశల్లో జరిగిన పోలింగ్
- ఈ సారి ప్రశాంతంగా ముగిసిన ఓటింగ్
- తొలి దశలో 93.19శాతం, రెండో దశలో 92.67శాతం ఓటింగ్ నమోదు
- బీజేపీ, తృణమూల్ మధ్య హోరాహోరీ పరిస్థితి ఉందని ఎగ్జిట్ పోల్స్ అంచనా
- 230కి పైగా సీట్లు సాధిస్తామని తృణమూల్ ధీమా
- ఈ సారి ప్రభుత్వం ఏర్పాటుచేసేది తామే అంటున్న బీజేపీ
- రచయిత, రూపసా సేన్‌గుప్తా
- హోదా, బీబీసీ ప్రతినిధి
- చదివే సమయం: 7 నిమిషాలు
తీవ్రస్థాయిలో సన్నద్ధమైన పరీక్ష ఎట్టకేలకు పూర్తయింది. ఇప్పుడు ఫలితం వచ్చే సమయం.
మే 4న కౌంటింగ్ జరుగుతుంది. బెంగాల్‌లోని రాజకీయ పార్టీలు దేనికవే విశ్వాసంతో కనిపిస్తున్నాయి.
చెమటలు కారే ఎండల్లో అంతకుముందు పార్టీలు భారీ స్థాయిలో ప్రచారం నిర్వహించాయి. ప్రత్యర్థులపై పదునైన రాజకీయ అస్త్రాలు ప్రయోగించాయి. సోషల్ మీడియాలోనూ విస్త్రృత ప్రచారం జరిపాయి. సాధారణ ప్రజలకు దగ్గరగా ఉన్నట్టు తెలియజెప్పేందుకు ప్రయత్నాలు చేశాయి.
ఓ పోరాటం స్థాయిలో జరిగిన రెండు దశల ఎన్నికలు పూర్తయిన తర్వాత పార్టీలు కాస్త విశ్రాంతి భావనలో ఉన్నాయి.
తమకు ఎన్ని సీట్లు అనుకూలంగా ఉన్నాయనే మార్క్‌షీట్ తెలుసుకునేందుకు పార్టీలు ఆతృతగా ఎదురుచూస్తున్నాయి.


ఫొటో సోర్స్, Getty Images
ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
రికార్డు స్థాయిలో ఓటింగ్ జరిగినట్టు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. తొలి దశలో 93.19శాతం, రెండో దశలో 92.67శాతం జరిగినట్టు తెలిపింది. పోలింగ్ హింసతో తరచూ వివాదాల్లో ఉండే బెంగాల్‌లో ఈ సారి పరిస్థితి భిన్నంగా కనిపించింది.
ఎన్నికలు అనుకున్న కంటే ప్రశాంతంగా ముగిశాయి.
నాదియా, దక్షిణ 24 పరగణాల జిల్లాల్లో కొన్ని స్వల్ప ఘర్షణలు, ఆరోపణలు వంటి ఘటనల మినహా తొలి దశ పోలింగ్ దాదాపు ప్రశాంతంగా జరిగింది. రెండో దశలో హుగ్లీలో రాజకీయ ఉద్రిక్తతలు తీవ్రస్థాయిలో కనిపించాయి. మధ్యాహ్నానికి కోల్‌కతాలోని భవానిపూర్‌లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. మమతా బెనర్జీ, సువేందు అధికారి ఇక్కడ పోటీచేస్తున్నారు. అందరి దృష్టీ నెలకొన్న కొన్ని కీలక నియోజకవర్గాల్లో ఇదొకటి.
రాష్ట్రమంతా పోలింగ్ ఫలితాల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న ఈ సమయంలో బీబీసీ బంగ్లా రాజకీయపార్టీలతో మాట్లాడి వారి మూడ్ తెలుసుకునే ప్రయత్నంచేసింది.

ఫొటో సోర్స్, Getty Images
మళ్లీ మాదే అధికారం: తృణమూల్ కాంగ్రెస్
రెండు దశల పోలింగ్ ముగిసిన తర్వాత రాజకీయ శిబిరాలన్నింటిలో కామన్‌గా కనిపిస్తున్న విషయం ఫలితాలపై సానుకూల నమ్మకం.
''నాకు నమ్మకముంది. మేం గెలుస్తున్నాం'' అని డమ్‌డమ్ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేత చండీరామ భట్టాచార్య చెప్పారు.
బుధవారం(ఏప్రిల్ 29)సాయంత్రం కోల్‌కతాలోని తృణమూల్ ఆఫీస్‌లోనూ ఇలాంటి వాతావరణమే కనిపించింది.
''తొలిదశలోనే మేం వందసీట్లకు పైగా సాధిస్తాం. బీజేపీ 50స్థానాలు కూడా గెలవలేదు''అని పార్టీ ప్రతినిధి కుణాల్ ఘోష్ చెప్పారు.
కోల్‌కతాలోని బేలేఘాటా నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఘోష్ ఎగ్జిట్ పోల్స్‌ను తోసిపుచ్చారు. ''2021 ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయో గుర్తుతెచ్చుకోండి? వారికి క్షేత్రస్థాయి వాస్తవాలు తెలియదు. 235కు పైగా సీట్లతో మమతాబెనర్జీ తిరిగి అధికారంలోకి రాబోతున్నారు'' అని కుణాల్ ఘోష్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఓటింగ్ పారదర్శకంగా జరిగింది: బీజేపీ
మరోవైపు బీజేపీ నాయకుడు దిలీప్ ఘోష్ కూడా ఇంతే స్థాయిలో నమ్మకంతో కనిపించారు. ఆయన ఖరగ్‌పుర్ సదర్ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్నారు. ''సీట్ల సంఖ్య గురించి ఇప్పుడు చర్చించడం తెలివైన పని కాదు. కావాల్సినంత మెజార్టీతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుచేస్తుందనేదే నేను చెప్పాలనుకుంటున్న విషయం'' అని ఆయన్నారు.
ఓటింగ్ స్థాయి బాగా పెరగడాన్ని బీజేపీ అభ్యర్థి అగ్నిమిత్ర పౌల్ ప్రస్తావిస్తున్నారు. దక్షిణ అసన్‌సోల్ నుంచి పోటీచేస్తున్న ఆమె ఎన్నికలు పారదర్శకంగా జరిగాయని తెలిపారు. ''పెద్ద సంఖ్యలో ఓటర్లు వచ్చారు. వారందరికీ కృతజ్ఞతలు. టీఎంసీ ఆరోపణలు చేస్తోందిగానీ రిగ్గింగ్ జరగలేదు. ఈ నెల 4న వచ్చే ఫలితాలు మాకు అనుకూలంగా ఉన్నా లేకపోయినా...పోలింగ్ పారదర్శకంగా జరిగిందని నేను భావిస్తున్నా'' అని ఆమె అన్నారు.
ఆమె నియోజకవర్గంలో పోలింగ్ ఏప్రిల్ 23న ముగిసింది. సంస్థాగతమైన పనులు కొన్ని మిగిలిఉన్నప్పటికీ ప్రస్తుతం అగ్నిమిత్ర పౌల్ కొంత విశ్రాంతిగా ఉన్నారు.
తీవ్రస్థాయిలో సాగిన ప్రచారం సరళిని ఆమె వివరించారు. ''నేను కొంచెం ముందుగా ప్రచారం ప్రారంభించా. రోజుకు 12 నుంచి 15కిలోమీటర్లు నడిచా. రోజుకు మూడు, నాలుగు గంటలు నిద్రపోయానేమో. కొన్నిరోజులయితే అంత నిద్రకూడా పోలేదు. మొదటిదశ పోలింగ్ ముగిసిన తర్వాత ఏప్రిల్ 24న నేను కూర్చున్నచోటునే నాకు తెలియకుండా నిద్రపోతున్నా. నా శరీరం పూర్తిగా అలిసిపోయింది'' అని ఆమె చెప్పారు.
ఫలితాల గురించి తాను ఆందోళన చెందడం లేదని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
‘సంప్రదాయ లెక్కలన్నీ తప్పని తేలుతాయి’
మొదటి, రెండు స్థానాల్లో ఉండేందుకు కాంగ్రెస్, లెఫ్ట్ ఫ్రంట్ తీవ్రస్థాయిలో పోరాడనప్పటికీ ఫలితాలపై అవి రెండూ ఆశాభావంతో ఉన్నాయి. కాంగ్రెస్ నాయకుడు అధీర్ రంజన్ చౌధురి ముర్షీదాబాద్‌లోని బహరామ్‌పుర్ నియోజకవర్గం నుంచి పోటీచేశారు. విజయంపై ఆయన ధీమాతో ఉన్నారు. భారీ స్థాయిలో కేంద్ర బలగాలను మోహరించడం ప్రజలకు భద్రతపై నమ్మకం కలిగించిందని ఆయన చెప్పారు.
''అధికార పార్టీకి వ్యతిరేకంగా ప్రజలు భారీగా తరలివచ్చారు. ఎన్నికల ఫలితాల్లో అది కనిపిస్తుంది'' అని ఆయనన్నారు.
''బెంగాల్ ప్రజల తెలివితేటలను, సామర్థ్యాన్ని, స్వేచ్ఛగా ఆలోచించే విధానాన్ని సందేహించాల్సిన అవసరమే లేదు. వాళ్లు చాలా తెలివిగలవాళ్లు. ఎస్ఐఆర్ పరిస్థితులతో వాళ్లు తప్పుదోవపట్టరని నేననుకుంటున్నా. ఓటు హక్కును వాళ్లు ఉపయోగించుకున్న విధానాలు సంప్రదాయలెక్కలన్నీ తప్పని రుజువుచేస్తుంది. మే 4వరకు ఎదురుచూడండి చాలు'' అని పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు శుభంకర్ సర్కార్ అన్నారు.
''ప్రభుత్వ ఏర్పాటులో ఏ పార్టీకీ ఆధిపత్యం ఉండదని కాంగ్రెస్ తరఫున నేను చెప్పగలను'' అని ఆయన్నారు.
''కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నంత కాలం తృణమూల్ నేతలు అక్కడే చక్కర్లు కొడుతూ కనిపిస్తారు. వామపక్షాలు ప్రభుత్వం ఏర్పాటు చేస్తే తృణమూల్, బీజేపీ అవినీతి నాయకులందరూ జైలు కెళ్తారు''అని కోల్‌కతాలోని పానిహాటినుంచి పోటీచేస్తున్న సీపీఎం అభ్యర్థి కలాతన్ దాస్ గుప్తా విశ్వాసం వ్యక్తంచేశారు.

ఫొటో సోర్స్, Getty Images
‘ఎన్నికలంటే గతంలో పండగ వాతావారణం’
పోలింగ్ సమయంలో గతంలో జరిగిన సంఘటనలను సీపీఎం నాయకుడు సుజన్ చక్రవర్తి బీబీసీతో మాట్లాడుతూ గుర్తుచేసుకున్నారు. ''మా హయాంలో ఎన్నికలు పండగలా ఉండేవి. ఒకటీరెండు ఘటనలు మినహా ఓటింగ్ ప్రశాంతంగా సాగేది'' అని ఆయన చెప్పారు.
''నేనప్పుడు స్కూల్ లేదా కాలేజ్‌లో ఉన్నా. వామపక్ష శిబిరం దగ్గర పోలింగ్ బూత్‌ల బయట 25నుంచి30మందితో శిబిరాలుండేవి. కాంగ్రెస్ శిబిరాలు కూడా అలాగే ఉండేవి. రోజంతా మేం మాట్లాడుకుంటూ ఉండేవాళ్లం''
''కాంగ్రెస్ శిబిరం దగ్గర మంచి ఆహారం ఉండేది. వాళ్లు దాన్ని మాతో షేర్ చేసుకునేవారు. మా దగ్గరున్న టీ, మరమరాలు వాళ్లకు ఇచ్చేవాళ్లం. ఓటు వేసిన తర్వాత ప్రజలు పోలింగ్ సరళిని గమనించేందుకు చుట్టుపక్కల తిరిగేవాళ్లు. గట్టి భద్రత కల్పించాల్సిన పరిస్థితులుండేవికావు. తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పరిస్థితులు మారిపోయాయి. భయం, ఆందోళన మధ్య ఇప్పుడు ఓటింగ్ జరుగుతోంది'' అని సుజన్ చక్రవర్తి అన్నారు.
ఈ సారి భారీ ఘటనలు జరగకపోయినప్పటికీ పండగ వాతావరణం, స్ఫూర్తి కనిపించలేదని ఆయన అన్నారు.
''భారీ ఘటనలు లేకపోయినప్పటికీ పండుగ వాతావరణం అయితే లేదు. ఎస్ఐఆర్ వల్ల ఏర్పడిన భయంతో ప్రజలు బయటకు వచ్చి ఓట్లేశారు'' అని ఆయన అన్నారు.
భంగార్ నుంచి పోటీచేస్తున్న ఐఎస్ఎఫ్ నాయకుడు నౌసద్ సిద్దిఖీ మాట్లాడుతూ ఎప్పుడూ హింసతో ఉండే నియోజకవర్గంలో ప్రశాంతంగా ఓట్లేసినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ''ఇది ప్రశాంతమైన ఎన్నిక. దీనికి ప్రజలకు కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నా'' అని ఆయనన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
హోరాహోరీ పోరు
స్వాతంత్ర్యం తర్వాత రికార్డుస్థాయిలో జరిగిన పోలింగ్‌పై విశ్లేషకుల మధ్చ చర్చ సాగుతోంది. పెరిగిన పోలింగ్ 2011 నుంచి అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగానా లేక వ్యతిరేకంగానా అన్నదానిపై చర్చ జరుగుతోంది.
ఎగ్జిట్ పోల్స్ చాలా సార్లు నిజం కాకపోయినప్పటికీ బెంగాల్‌లో ఎవరు గెలుస్తారు అనే మిలయన్ డాలర్ ప్రశ్న తీవ్రతను అవి మరింత పెంచాయి. స్థానిక మీడియా నుంచి జాతీయ మీడియా వరకు అన్నీ ఎగ్జిట్ పోల్స్‌పై దృష్టిపెట్టాయి.
ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్‌ను బీజేపీ చేరుతుందని వాటిలో చాలా అంచనా వేయగా, టీఎంసీ బొటాబొటీ మెజార్టీతో విజయం సాధిస్తుందని కొన్ని ఎగ్జిట్‌పోల్స్ తెలిపాయి.
రెండో దశ పోలింగ్‌లో మమతాబెనర్జీ పోలింగ్ బూత్‌లను పరిశీలించారు. తన సాధారణ వ్యవహారశైలికి భిన్నంగా కనిపించారు. ఈ వైఖరిని బీజేపీ తమ శైలిలో విశ్లేషిస్తోంది.
అయితే ఓటువేసిన తర్వాత ఆమె విజయసంకేతం చూపించారు. ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పినప్పటికీ తాము 200కు పైగా సీట్లు గెలుచుకుంటామని తృణమూల్ కాంగ్రెస్ అంటోంది.
తమ పార్టీ విజయం సాధించబోతోందని బీజేపీ నేత సువేందు అధికారి అంటున్నారు.
ఏఏ పార్టీ ఎన్ని స్థానాలు గెలుస్తాయనేదానిపై మీడియా రిపోర్టులద్వారాగానీ, ఎగ్జిట్ పోల్స్ ద్వారాగానీ స్పష్టత రానప్పటికీ తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ ఉందని మాత్రం అర్ధమవుతోంది.

‘ఎవరు గెలుస్తారో ఎవరికి తెలుసు’
ఎన్నికల ఫలితాలపైనే ఇప్పుడంతా చర్చ సాగుతోంది. రాజకీయ సర్కిళ్లు, విశ్లేషకుల మధ్య మాత్రమే కాకుండా టీ స్టాల్స్‌లోనూ, సాధారణ ప్రజల మధ్య రాష్ట్రమంతా చర్చ సాగుతోంది.
''చిన్నతనంలో నేను వామపక్షాలను చూశాను. స్కూల్, కాలేజ్ రోజుల్లో టీఎంసీని చూశాను. ఇప్పుడు బీజేపీని చూస్తున్నాను. మాకు ఎక్కువ ఆప్షన్లు లేవు. చూద్దాం ఏం జరుగుతుందో'' అని దక్షిణ కోల్‌కతాకు చెందిన మిత్రయు దాస్‌గుప్తా చెప్పారు.
ఫలితాలపై ఓ అవగాహన వచ్చేందుకు తాను నిరంతరం ఎగ్జిట్‌పోల్స్ చూస్తున్నానని కోల్‌కతాలోని న్యూటన్‌కు చెందిన దియా ఘోష్ చెప్పారు.
''ఈ సారి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ చూసిన తర్వాత నాకు ఎలాంటి స్పష్టతారాలేదు. ఎవరు గెలుస్తారో ఎవరికి తెలుసు'' అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.





























