ఆగస్టు 31న ‘రెండో స్వాతంత్య్ర దినోత్సవం’ జరుపుకునే ఈ తెగల కథేంటి?

- రచయిత, రాక్సీ గాడ్గేకర్ ఛారా
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 6 నిమిషాలు
1947 ఆగస్టు 15న బ్రిటిష్ పాలన నుంచి భారత్ స్వాతంత్య్రం పొందింది. అయితే దేశంలోని కొన్ని కమ్యూనిటీలు మాత్రం స్వాతంత్య్రం తరువాత కూడా విముక్తి కోసం కొన్నాళ్లపాటు ఎదురు చూశాయి.
దేశంలోని సంచార తెగల్లోని ప్రజలను పెద్ద సంఖ్యలో బ్రిటిష్ కాలం నాటి ఒక చట్టం కింద 'నేరస్థ కులాలు'గా గుర్తించారు. వారిని నిర్దిష్ట ప్రాంతాల్లో స్థిరంగా నివసించేలా ఒత్తిడి చేశారు.
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా ఈ చట్టం ఐదేళ్ల పాటు అమల్లో ఉంది.
ఈ చట్టాన్ని 1952 ఆగస్టు 31న రద్దు చేసిన తర్వాత ఈ తెగలను 'విముక్త' లేదా డీనోటిఫైడ్ తెగలుగా పిలిచారు. అందుకే ఈ కమ్యూనిటీలకు చెందిన వారు ఆగస్టు 31న 'విముక్తి దినోత్సవం' లేదా 'రెండో స్వాతంత్య్ర దినోత్సవం'గా జరుపుకుంటారు.
భారత్‌లో అంటరాని, సంచార, సముదాయాల సంఖ్యపై ప్రభుత్వ గణాంకాలు, వివిధ అధ్యయనాల ఆధారంగా వేర్వేరు అంచనాలు ఉన్నాయి. దేశంలో ఇలాంటి సముదాయాలు వందల సంఖ్యలో ఉన్నాయి. గుజరాత్‌లోనే దాదాపు 13 సంచార తెగలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలలో కూడా స్టూవర్ట్‌పురం లాంటి డీనోటిఫైడ్ ప్రాంతాలు ఉన్నాయి. వీటిపై బీబీసీ తెలుగు కథనాలు ప్రచురించింది.
అయితే ఈ తెగల విషయంలో ఆగస్టు 31 ప్రాధాన్యత ఏంటో అర్థం చేసుకోవాలంటే దాదాపు ఒకటిన్నర శతాబ్దం వెనక్కి వెళ్లాలి.


ఫొటో సోర్స్, Pavan Jaishwal
'క్రిమినల్ ట్రైబ్'గా గుర్తింపు
చరిత్రకారుల ప్రకారం, సంచార జీవితం గడిపే సముదాయాలపై నిఘా ఉంచడం బ్రిటిష్ ప్రభుత్వానికి కష్టంగా ఉండేది.
వీరు ఒకే ప్రాంతంలో శాశ్వతంగా నివసించేవారు కాదు. చాలామందికి సొంత భూమి లేదా ఇతర స్థిరాస్తులు కూడా ఉండేవి కావు. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సంచరిస్తూ ఉండేవారు.
సంచార సముదాయాలతో ఏళ్ల తరబడి కలిసి పనిచేసిన భాషావేత్త, కార్యకర్త డాక్టర్ గణేశ్ దేవి ఈ విషయంపై బీబీసీతో మాట్లాడారు.
"వీరు ఎంతమంది ఉన్నారు, ఎక్కడ నివసిస్తున్నారు, ఏం చేస్తున్నారు, వారి జీవన విధానం ఎలా ఉంది? అనే విషయాలేవీ బ్రిటిష్ ప్రభుత్వానికి తెలియవు. అందుకే వారి గురించి సమాచారం సేకరించే బాధ్యతను బ్రిటిష్ అధికారి విలియం స్లీమన్కు అప్పగించారు" అని చెప్పారు.
స్లీమన్ నివేదికలతో పాటు ప్రభుత్వ అధ్యయనాల ఆధారంగా బ్రిటిష్ ప్రభుత్వం 1871లో 'క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్'ను తీసుకొచ్చింది.
ఈ చట్టం కింద అనేక తెగలను క్రిమినల్ ట్రైబ్స్‌గా ప్రకటించారు.
ఈ చట్టం కింద నమోదైన సముదాయాలకు చెందిన ప్రజలను సెటిల్మెంట్స్గా పిలిచే నిర్దిష్ట ప్రాంతాల్లో ఉంచడం ప్రారంభించింది బ్రిటిష్ ప్రభుత్వం.
ఈ సెటిల్మెంట్లు సాధారణ జైళ్లకు భిన్నంగా ఉండేవి. అయితే అక్కడ నివసించే ప్రజల కదలికలు, రోజువారీ జీవితంపై కఠినమైన నియంత్రణలు ఉండేవి. రోజులో పలుమార్లు వారి అటెండెన్సును తీసుకునేవారు.
ఈ వర్గాలకు చెందిన ప్రజలను నియంత్రించేందుకు పోలీసులకు విస్తృత అధికారాలు ఉండేవి.

ఫొటో సోర్స్, Shrenik Garage
అహ్మదాబాద్‌లోని నరోడా సెటిల్మెంట్
అలాంటి ఒక సెటిల్మెంట్ను అహ్మదాబాద్‌లోని నరోడా ప్రాంతంలో నిర్మించారు.
ఛారా సముదాయానికి చెందిన వసియత్భాయ్ గరాంగ్ ఇప్పుడు బతికిలేరు. కానీ గతంలో ఈ కథనం రాస్తున్న నాతో తన జ్ఞాపకాలను పంచుకున్నారు. "మొత్తం ఒక తెగనే అహ్మదాబాద్‌లోని నరోడా ప్రాంతంలో నిర్మించిన ఇలాంటి జైలులో ఉంచారు" అని ఆయన చెప్పారు.
"1920లలో అహ్మదాబాద్ బట్టల మిల్లులకు కేంద్రంగా ఉండేది. అప్పుడు అహ్మదాబాద్‌లో ఒకే ఒక వంతెన ఉండేది. దాన్ని మేము 'లక్కడియా బ్రిడ్జ్' అని పిలిచేవాళ్లం. అది నేటి ఎల్లిస్ బ్రిడ్జ్ లేదా స్వామి వివేకానంద బ్రిడ్జ్ ఉన్న ప్రాంతమే" అని ఆయన గుర్తు చేసుకున్నారు.
"మమ్మల్ని కట్టేసి ఈ జైలు నుంచి ఆ వంతెన వద్దకు తీసుకెళ్లేవారు. అక్కడ పత్తి లేదా ఉప్పు బస్తాలను మోసే పని చేసేవాళ్లం. వంతెనకు ఒకవైపు నుంచి మరోవైపుకు బస్తాలు మోసుకెళ్లేవాళ్లం. అందుకు మాకు డబ్బులు ఇచ్చేవారు" అని ఆయన గుర్తు చేసుకున్నారు.
వసియత్భాయ్ కొంతకాలం క్రితం మరణించారు. అయితే ఆయన జ్ఞాపకాలను పలువురు చిత్రనిర్మాతలు, రచయితలు తమ రచనలు, చిత్రాల్లో నమోదు చేశారు.
తాత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఆయన మనవడు శ్రేణిక్ గరాంగ్ మాట్లాడారు.
"మా తాత తరచూ మాతో ఆ సెటిల్మెంట్ గురించి చెబుతుండేవారు. అక్కడ మహిళలు కూడా నివసించేవారని చెప్పేవారు. బహిరంగ ప్రదేశంలో వారికి గుడిసెలు ఇచ్చేవారు. వాళ్లే తమ ఆహారం వండుకోవాల్సి వచ్చేది" అని చెప్పారు.
"మా తాత సంపాదించి తెచ్చే డబ్బుతోనే నానమ్మ వంట చేసేదని ఆయన మాకు చెప్పేవారు. అంటే అది జైలే, కానీ అక్కడ ఉచితంగా ఆహారం మాత్రం ఇచ్చేవారు కాదు" అన్నారాయన.

ఫొటో సోర్స్, Kushal Batunge
‘‘పురుషులు పని చేసేవారు, మహిళలు సెటిల్మెంట్లలోనే ఉండేవారు’’
ఈ సెటిల్మెంట్లలో నివసించే పురుషులను వివిధ రకాల పనులు కోసం బయటకు తీసుకెళ్లేవారు.
అహ్మదాబాద్‌లోని బట్టల మిల్లులతో పాటు నిర్మాణ రంగం, ఇతర కూలి పనుల్లోనూ ఈ సముదాయాలకు చెందిన ప్రజలతో పనిచేయించేవారు.
సెటిల్మెంట్లో నివసించిన కుటుంబాల జీవనోపాధి పురుషుల శ్రమపైనే ఆధారపడి ఉండేదని, మహిళలు, పిల్లలు మాత్రం సెటిల్మెంట్లోనే ఉండేవారని వసియత్భాయ్ జ్ఞాపకాలు చెబుతున్నాయి.
ఆ చట్టం ఒక వ్యక్తి కదలికలను మాత్రమే నియంత్రించలేదు. మొత్తం కుటుంబాన్ని, తెగలోని అందరి జీవితాలను ప్రభావితం చేసింది.
ఈ సెటిల్మెంట్లో నివసించిన రెండు ప్రధాన తెగలకు చెందిన ప్రజలు నేడు నివసిస్తున్న అహ్మదాబాద్‌లోని ఛారానగర్, కైకడివాస్ ప్రాంతాలు అభివృద్ధి చెందాయి. అయితే వారికి ఈ జైలు, దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా కొనసాగింది.
1947 ఆగస్టు 15న భారత్ స్వాతంత్య్రం పొందింది. కానీ క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్‌ను వెంటనే రద్దు చేయలేదు.
అందువల్ల బ్రిటిష్ పాలన ముగిసిన తర్వాత కూడా ఈ సముదాయాలకు చెందిన ప్రజల సెటిల్మెంట్ జీవితం కొనసాగింది.
తేడా ఏంటంటే, బ్రిటిష్ తరువాత ఈ వ్యవస్థ భారత ప్రభుత్వ పాలనలో కొనసాగింది.
అహ్మదాబాద్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని స్టూవర్ట్‌పురం, ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్, కర్ణాటకలోని గదగ్, మహారాష్ట్రలోని సోలాపూర్, ఉత్తర భారతదేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఇలాంటి సెటిల్మెంట్లు ఉండేవి.
క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్‌ను 1952 ఆగస్టు 31న రద్దు చేసి, ఈ సముదాయాలను డీనోటిఫైడ్ అంటే ఆ చట్టం నుంచి విముక్తి పొందినవిగా ప్రకటించారు.
మహారాష్ట్రలోని సోలాపూర్‌లో ఉన్న ఇలాంటి ఒక సెటిల్మెంట్ చుట్టూ ఏర్పాటు చేసిన ముళ్ల కంచెను ప్రజలు తొలగించిన ఘటన ఈ సముదాయాల జ్ఞాపకాల్లో ప్రత్యేకం.
అయితే చట్టం రద్దయిన తర్వాత కూడా ఈ సముదాయాలపై నిఘా వ్యవస్థ పూర్తిగా అంతం కాలేదు. వివిధ రాష్ట్రాల్లో హ్యాబిచ్యువల్ అఫెండర్స్కు సంబంధించిన చట్టాలు అమల్లోకి వచ్చాయి.

ఆగస్టు 31 'రెండో స్వాతంత్య్ర దినోత్సవం'గా ఎలా మారింది?
"ఆగస్టు 15ను మేము ఎంతో గౌరవిస్తాం. ఆ రోజు జెండా ఎగరేస్తాం, వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తాం. అయితే దానితో పాటు 1998 నుంచి ఆగస్టు 31న కూడా మా రెండో స్వాతంత్య్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం" అని ఛారా తెగకు చెందిన నాయకుడు, కార్యకర్త ఆతిశ్ ఇంద్రేకర్ చెప్పారు.
ఆగస్టు 31న ఈ వేడుకకు ఛారానగర్ చరిత్రతోనూ సంబంధం ఉంది.
డాక్టర్ గణేశ్ దేవి 'పెయింటెడ్ వర్డ్స్' అనే పుస్తకంలో 1998లో రచయిత్రి మహాశ్వేతా దేవి ఛారానగర్ను సందర్శించినట్లు రాశారు. అక్కడి విద్యార్థులు ఒక గ్రంథాలయం కావాలని కోరగా, ఆ గ్రంథాలయాన్ని 1998 ఆగస్టు 31న ప్రారంభించారు.
"ఆ సమయంలో ఛారానగర్ యువత బుధన్ అనే నాటకాన్ని ప్రదర్శించింది. అందులో సంచార సముదాయాలు, వారికి స్వేచ్ఛ లభించడంలో జరిగిన జాప్యం గురించి ప్రస్తావించారు" అని ఛారానగర్కు చెందిన కర్మశీల్ దక్షిణ్ బజరంగ్ చెప్పారు.
"ఆ తర్వాత ఆగస్టు 31ను దేశవ్యాప్తంగా విముక్తి దినోత్సవంగా జరుపుతున్నారు" అని ఆయన చెప్పారు.
అయితే విముక్తి పొందిన తర్వాత ఈ సముదాయాల జీవితాల్లో వాస్తవంగా ఎంత మార్పు వచ్చిందో కూడా అర్థం చేసుకోవడం ముఖ్యం.
అంటరాని, సంచార తెగల సమస్యలు కేవలం వారికి అంటించిన చారిత్రకమైన ముద్రకు మాత్రమే పరిమితం కావు.
స్వాతంత్య్రం తర్వాత వారి పరిస్థితి, సమస్యలను అధ్యయనం చేసేందుకు రెండు ముఖ్యమైన కమిషన్లను ఏర్పాటు చేశారు.
మొదటిది బాలకృష్ణ రేంకే అధ్యక్షతన ఏర్పాటైన 'రేంకే కమిషన్'. ఆ తర్వాత 'ఇదాతే కమిషన్'ను ఏర్పాటు చేశారు.
విముక్త, సంచార తెగల కోసం విద్య, ఉపాధి, గృహ వసతి, సామాజిక, ఆర్థిక అభివృద్ధి వంటి అంశాలకు సంబంధించి వివిధ పథకాలను ఈ రెండు కమిషన్లు సిఫార్సు చేశాయి.
గుజరాత్ సహా వివిధ రాష్ట్రాలు కూడా ఈ సముదాయాల కోసం డీనోటిఫైడ్ ట్రైబ్స్ బోర్డులను ఏర్పాటు చేశాయి. వీటిలో విద్య, ఉపాధి, విదేశాల్లో చదువుకోవడం వంటి అంశాలకు సంబంధించిన వివిధ పథకాలు ఉన్నాయి.
అయితే ఒకటిన్నర శతాబ్దం క్రితం 'నేరస్థులు' అనే ముద్రను ఈ సముదాయాలపై మోపారు. అది నేటికి ఎంతవరకు తొలగిపోయిందనే ప్రశ్న మాత్రం వారికి ఇప్పటికీ అంతే ముఖ్యమైంది.
అందుకే ఆగస్టు 31 వారికి గతాన్ని గుర్తుచేసుకునే రోజు మాత్రమే కాదు.
1947లో భారత్ స్వాతంత్య్రం పొందినప్పటికీ, కొంతమంది భారతీయులకు తమ గుర్తింపు, స్వేచ్ఛను తిరిగి పొందే పోరాటం మరో ఐదేళ్ల తర్వాతే ముగిసిందని ఈ రోజు గుర్తుచేస్తుంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

































