ఆస్ట్రేలియాలో పోర్న్‌హబ్ ఎందుకు ఆగింది, మళ్లీ ఎందుకు మొదలైంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, లానా లామ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 3 నిమిషాలు
ఆస్ట్రేలియాలో పోర్న్‌హబ్ తిరిగి వచ్చింది. వయసు ధృవీకరణ చట్టాల కారణంగా అది 8 నెలల కిందట ఆ దేశం నుంచి వెళ్లిపోయింది. ఇప్పుడు కూడా కేవలం యాపిల్ డివైజెస్ ఉన్న పెద్దలు మాత్రమే ఈ సైట్‌ను యాక్సెస్ చేయగలుగుతున్నారు.
దాని మాతృ సంస్థ ఐలో బుధవారం ఒక ప్రకటన చేసింది. " ఆస్ట్రేలియాలో వయసు నిర్దరణ ప్రక్రియను యాపిల్ ద్వారా పూర్తి చేసిన అర్హత కలిగిన పెద్దలు" మళ్లీ ఈ వెబ్‌సైట్ సేవలు వినియోగించుకోగలుగుతున్నారని పేర్కొంది.
ప్రపంచంలోనే అతి పెద్ద అశ్లీల కంటెంట్‌ను అందించే ఈ వెబ్‌సైట్ మార్చిలో ఆస్ట్రేలియా మార్కెట్ నుంచి వెళ్లిపోయింది. 18 ఏళ్లు నిండినట్టు యూజర్లు తప్పనిసరిగా నిరూపించుకోవాలనే కొత్త చట్టాలు పిల్లలను రక్షించలేవని, డేటా గోప్యతకు సంబంధించిన సమస్యలు సృష్టిస్తాయని, నియమాలు పాటించని ప్లాట్‌ఫామ్‌లలోని కంటెంట్‌కు యూజర్లుఆకర్షితులవుతారని వెళ్తూ వెళ్తూ ఆ సంస్థ పేర్కొంది.
యూకేలో అమలు చేసిన తర్వాత, యాపిల్ ఇటీవల ఆస్ట్రేలియాలో కూడా కొత్త వయసు ధృవీకరణ విధానాన్ని ప్రవేశ పెట్టింది.
మార్చిలో ఆస్ట్రేలియా కఠినమైన కొత్త చట్టాలను అమల్లోకి తీసుకొచ్చింది. వాటి ప్రకారం, అశ్లీల కంటెంట్, ఆర్-రేటెడ్ వీడియో గేమ్స్, లైంగిక అంశాలతో కూడిన ఏఐ చాట్‌బాట్‌లు వంటి పెద్దల కంటెంట్‌ను చూడాలంటే వినియోగదారులు తమకు 18 ఏళ్లు నిండినట్టు నిరూపించాల్సి ఉంటుంది.

ఈ కొత్త నిబంధనలు పిల్లలను హానికరమైన కంటెంట్ నుంచి కాపాడటానికి ఉపయోగపడతాయని, వాటిని ఉల్లంఘించే ప్లాట్‌ఫామ్‌లకు జరిమానాలు విధిస్తామని ఆస్ట్రేలియా ఆన్‌లైన్ భద్రత నియంత్రణ సంస్థ పేర్కొంది.
ఈ విధానాల వల్ల డేటా గోప్యత సమస్యలు తలెత్తే అవకాశం ఉందని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ గుర్తింపు, డిజిటల్ ఐడీలు, క్రెడిట్ కార్డ్ వివరాలు వంటి వయసు నిర్దరణ వ్యవస్థలను కూడా మోసం చేసే దారులను వినియోగదారులు వెతికిపట్టుకుంటారని అన్నారు.
వినియోగదారులు తాము పెద్దవాళ్లమని నిర్ధరించుకోనంత వరకు అన్ని డివైస్‌లలో పిల్లల భద్రతా ఫీచర్లను డిఫాల్డ్‌గా అమలు చేసిన యాపిల్ ఒక మైలురాయి నెలకొల్పిందని పేర్కొంటూ ఆస్ట్రేలియాలో సేవలు పునఃప్రారంభిస్తున్నట్టు ఐలో ప్రకటించింది.
దీని వల్ల, ప్రారంభం నుంచే ప్రతి ఫోన్ లేదా ట్యాబ్లెట్ పిల్లలకు సురక్షితమైన పరికరంగా మారుతుందని ఆ సంస్థ అభిప్రాయపడింది.
"ఆన్‌లైన్‌లో వయసుకు అనుకూలంకాని కంటెంట్‌ను మైనర్లు యాక్సెస్ చేయకుండా నిరోధించడానికి, డివైస్-బేస్డ్ ఏజ్ వెరిఫికేషన్ విధానమే అత్యంత ప్రభావవంతమైనది. అలాగే గోప్యతను కాపాడేదని ఐలో ఎన్నో సంవత్సరాలుగా వాదిస్తోంది" అని ఐలో బ్రాండ్ అండ్ కమ్యూనిటీ విభాగం ఉపాధ్యక్షురాలు అలెక్స్ కేకేసీ అన్నారు.
వయసు ధృవీకరణ పూర్తి అయిన యాపిల్ పరికరాలను ఉపయోగిస్తున్న ఆస్ట్రేలియన్ యూజర్లకు సాధారణ వయోజన యూజర్ల అనుభవం అందుబాటులో ఉంటుందని ఆమె తెలిపారు.
యాపిల్ వినియోగదారులు తమకు 18 ఏళ్లు దాటినట్టు క్రెడిట్ కార్డు, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ లేదా ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డు ద్వారా నిర్దరించుకోవాలి.
"పిల్లల భద్రతకు మంచిది"
పిల్లల భద్రతా ఫీచర్లు డిఫాల్డ్‌గా పరికరాల్లో ఉండటం వల్ల, వయోజనులు అనవసరమైన వ్యక్తిగత సమాచారాన్ని అనేక యాప్‌లు, వెబ్‌సైట్స్‌కు ఇవ్వాల్సిన అవసరం ఉండదని కేకేసీ తెలిపారు.
అలాగే వయసు ధృవీకరణ వ్యవస్థలను తప్పించుకోవడానికి ఉపయోగించే వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్‌ల ప్రభావాన్ని కూడా ఇది తగ్గిస్తుందని ఆమె పేర్కొన్నారు.
సాధారణంగా వీపీఎన్‌లను ఉపయోగించి, తాము మరో దేశం నుంచి వెబ్‌సైట్‌లోకి ప్రవేశిస్తున్నట్టు చూపించవచ్చు. దీంతో వినియోగదారులు ఆ వెబ్‌సైట్లను యాక్సెస్ చేయగలుగుతారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























