పంతానికి పోయి 40 ఏళ్ల నుంచి అన్నం తినడమే మానేసిన అవ్వ... మరి ఆమె భోజనం ఏమిటి?

ఆహారం, పల్లీలు, అన్నం, పోషకాలు, స్నేహం, మహిళ
ఫొటో క్యాప్షన్, ఖాజమ్మ దీర్ఘకాలంగా అన్నం తినడం మానేశారు
    • రచయిత, ప్రవీణ్ శుభం
    • హోదా, బీబీసీ కోసం
  • ప్రచురణ
  • చదివే సమయం: 5 నిమిషాలు

"అత్తారింటికి వెళ్లనంటే.. 'మరి ఒక పూట అన్నం మానేస్తావా?' అని పొరుగింటావిడ ప్రశ్నించింది. సరదాగా నన్ను ఆటపట్టించడానికి ఆమె అలా అడిగి ఉండొచ్చు. కానీ నేను మాత్రం పంతానికే పోయాను. అనాటినుంచి అన్నం బదులు పల్లీలు, బెల్లం తింటూ బతుకుతున్నా. చూస్తుండగానే 40 ఏళ్లు గడిచిపోయాయి" అన్నారు ఖాజమ్మ.

పెళ్లయ్యాక ఏవో కారణాలతో అత్తారింటికి వెళ్లకుండా పుట్టింట్లోనే ఉండిపోయారు ఆమె. ఆ సమయంలోనే ' అత్తారింటికి పోనంటే, మరి అన్నం కూడా తినకుండా ఉంటావా' అన్నారుట పొరుగింటావిడ.

"అత్తారింటికి ఎందుకు వెళ్లలేదో కారణాలు నాకు సరిగ్గా గుర్తు లేవు. చాలా ఏళ్లయ్యింది కదా" అన్నారు ఖాజమ్మ. అయితే ఆ చిన్న వయసులో ఉండే 'పిరికితనం ఒక కారణం కావొచ్చు' అని ఆమె చెప్పారు.

ఖాజమ్మ వయసు ఖచ్చితంగా ఎంతో నిర్ధరించే 'డేట్ ఆఫ్ బర్త్' రికార్డు లేదు. ఆమె వయసు 70 ఏళ్ల పైనే ఉంటుందని ఆమె స్వగ్రామమైన జగిత్యాల జిల్లా మైతాపూర్‌లో బీబీసీతో మాట్లాడిన కొందరు గ్రామస్తులు చెప్పారు.

ఖాజమ్మ చెబుతున్నట్టుగా అన్నం మానేసి 40 ఏళ్లు పైనే అయిందన్న విషయాన్ని 'బీబీసీ' స్వతంత్రంగా నిర్ధరించడంలేదు. అయితే అన్నం తినకుండా ఆమె ఇన్నేళ్లుగా ఎలా ఉండగలిగారనేది అందరికీ వచ్చే అనుమానం.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఖాజమ్మ దీర్ఘకాలంగా అన్నం తినకుండా ఎలా ఉండగలిగారనే విషయంపై కరీంనగర్ కు చెందిన సీనియర్ ఫిజీషియన్ డాక్టర్ ఆర్. తిరుణాధర్‌ను అడిగినప్పుడు.. ''అన్నం తినకుండా బతకడం అద్భుతమేమీ కాదు. వైద్య శాస్త్రంలో ఇలాంటి కేసులు గతంలోనూ ఉన్నాయి'' అని బీబీసీతో చెప్పారు.

''మోనోట్రోఫిక్ ఫుడ్ ఇన్‌టేక్’..అంటే ఒక వ్యక్తి చాలా కాలం పాటు ఒకే రకమైన ఆహారం లేదా చాలా పరిమితమైన కొన్ని ఆహారాలనే తీసుకోవడం.కొన్ని రకాల ఆహార పదార్థాలను పూర్తిగా మానేయడాన్ని వైద్యశాస్త్ర పరిభాషలో అవాయిడెంట్/రిస్ట్రిక్టివ్ ఫుడ్ ఇన్‌టేక్ డిజార్డ‌ర్‌గా పిలుస్తారు. ఇది ఒక రకమైన ఆహార సంబంధిత మానసిక ఆరోగ్య సమస్య" అని చెప్పారు.

ఖాజమ్మ జీవితంలో జరిగిన కొన్ని విషయాలను ఆమె ''ఆహారం తీసుకునే ప్రవర్తనలో వచ్చిన అసాధారణ మార్పుగా, ఒక 'సైకలాజికల్ ట్రామా'గా చూడాలి" అని అన్నారు డాక్టర్ తిరుణాధర్.

ఆహారం, పల్లీలు, అన్నం, పోషకాలు, స్నేహం, మహిళ
ఫొటో క్యాప్షన్, ఖాజమ్మ బాగోగులన్నీ తానే చూసుకుంటున్నానని స్నేహితురాలు వెంకటమ్మ చెప్పారు.

‘స్నేహితురాలే అన్నీ అయి’

చేతనైనన్ని రోజులూ బీడీలు చుట్టడాన్ని ఖాజమ్మ జీవనాధారంగా చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె తెలంగాణ ప్రభుత్వ వృద్ధాప్య పింఛను లబ్దిదారు.

ఉత్తర తెలంగాణ జిల్లాల్లో బీడీ పరిశ్రమ సుదీర్ఘకాలం మహిళలకు ప్రధాన ఉపాధి రంగాల్లో ఒకటిగా ఉంది. తల్లిదండ్రులున్నంతవరకూ వారితోనే నివసించారు ఖాజమ్మ. ఆమెకు పిల్లలు లేరు. ప్రస్తుతం ఆమె ఒంటరి మహిళ.

'అన్నం మానేస్తావా అని ఎందుకు అన్నారో?' అని గుర్తొచ్చి మొదట్లో ఆకలైనా కడుపు మాడ్చుకున్నానని చెప్పారు ఖాజమ్మ.

అయితే పల్లీలు తినడం ఎలా అలవాటైందో ఆమె వివరించారు.

"బీడీలు చుట్టే చోట కొన్ని కాల్చిన పల్లీలు తిని నీరు తాగితే కడుపునిండినట్టు అనిపించింది. అప్పటి నుంచి పల్లీలే తింటున్నా. దాంతోపాటు బెల్లం చప్పరిస్తాను"అన్నారు ఖాజమ్మ.

ఏడాదికి సుమారు క్వింటా పల్లికాయలు అవసరమైతాయని, ఇన్ని పూటలన్న లెక్క ఏదీ లేదని, ఆకలనిపించినప్పుడు కొన్ని పల్లీలు తిని, టీ తాగుతానని వివరించారు ఖాజమ్మ.

"నాకు తెలిసి గత ముప్పై ఏళ్లకు పైగా ఆమెను చూస్తున్నా. అన్నం తినక పోయినా చురుకుగానే కనిపిస్తారు. ఆమె ఇంట్లో బియ్యం, నూనె, మసాలాలు, వంటపాత్రలు కనిపించవు. కేవలం పల్లీలు, బెల్లం, టీ పొడి మాత్రమే ఉంటాయి" అని గ్రామస్తుడు నరహరి అన్నారు.

ఖాజమ్మను కలవడానికి బీబీసీ మైతాపూర్‌కు వెళ్ళినప్పుడు మూడు గదుల తన ఇంట్లో ఒంటరిగా కనిపించారు. తన స్నేహితురాలు వెంకటమ్మ రాక కోసం ఎదురుచూస్తున్నానని చెప్పారామె.

మా సంభాషణ సాగుతున్న సమయంలోనే వెంకటమ్మ అక్కడికి వచ్చారు.

కల్లెపల్లి వెంకటమ్మ , ఖాజమ్మ బాల్య స్నేహితులు. వెంకటమ్మకు అదే గ్రామానికి చెందిన వ్యక్తితో పెళ్లవడంతో ఆమె అక్కడే నివసిస్తున్నారు. ప్రస్తుతం ఖాజమ్మ బాగోగులను వెంకటమ్మే చూస్తున్నారు.

"వృద్ధాప్యం కారణంగా పళ్లు ఊడిపోవడంతో ఇప్పుడు పల్లీలను మా ఇంటి వద్దే పొడి చేసుకుని తీసుకువస్తున్నా. రుచి కోసం అందులో కొద్దిగా ఉప్పు కలుపుతా. గ్రామస్తులు, బంధువుల ఇళ్లలో జరిగే కార్యక్రమాలకు వెళ్లినప్పుడు ఖాజమ్మ అక్కడ టీ మాత్రమే తాగుతుంది. వేరే ఆహార పదార్థాలు తీసుకోదు" అని వెంకటమ్మ చెప్పారు.

"ఇద్దరం కలిసే పెరిగాం. వాళ్లమ్మ (ఖాజమ్మ తల్లి) మా ఇద్దరినీ సొంత బిడ్డల్లానే చూసింది. తాను చనిపోయేటప్పుడు నా చేతిలో పెట్టి నా బిడ్డను చూడమ్మా అని మాట తీసుకుంది. ఆ మర్యాద అలాగే ఉంటుంది. ఇచ్చిన మాట మరిచిపోలేను"అన్నారు వెంకటమ్మ.

'ఈ లోకంలో ఎవరూ శాశ్వతం కాదని తెలుసు. నా వెంబడి తను రాదు. ఆమె వెంబడి నేను పోలేను. బతికినన్ని రోజులు మా ఇద్దరి బంధం ఇలాగే ఉంటుంది' అని అన్నారామె.

పల్లీలు, బెల్లం
ఫొటో క్యాప్షన్, పల్లీలు, బెల్లం మాత్రమే తింటానని, వాటితో పాటు టీ తాగుతానని ఖాజమ్మ చెప్పారు.

'అన్నం ఎందుకు బంద్ చేశానా అనిపించింది'

రెండేళ్ల కిందట ఖాజమ్మ అనారోగ్యానికి గురయ్యారు. జగిత్యాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యులను సంప్రదించగా పరీక్షల్లో ఆమె వెన్నెముకలో సమస్య ఉన్నట్టు తేలింది.

అప్పటి నుంచి తన రోజువారీ ఆహారంలో కొన్ని కొత్త పదార్థాలు చేరాయని ఖాజమ్మ చెప్పారు. డాక్టర్ సూచన మేరకు టీ బదులు పాలు తాగుతున్నానని, రోజూ రెండు ఉడికించిన గుడ్లు తీసుకుంటున్నానని తెలిపారు.

"ఇన్ పేషెంట్‌గా ఆసుపత్రిలో ఉండాలని డాక్టర్ చెప్పినప్పుడు.. అయ్యో దేవుడా... అన్నం తినక ఈ బీమారి (అనారోగ్యం) తెచ్చుకున్నాననిపించింది. ఇప్పుడు తినలేను. అన్నం మీద మనసు విరిగిపోయింది" అన్నారు.

ఆహారం, పల్లీలు, అన్నం, పోషకాలు, స్నేహం, మహిళ
ఫొటో క్యాప్షన్, ఒకే ఆహారానికి పరిమితం కావడం మంచిదికాదని డాక్టర్ తిరుణాధర్ చెప్పారు.

అన్నం తినకపోయినా ఎలా?

అన్నం తినకపోయినా ఇంతకాలం ఖాజమ్మ చురుకుగా ఉండటం వెనుక కారణాలు ఏమయ్యింటాయో డాక్టర్ తిరుణాధర్ వివరించారు. అడాప్టివ్ మెకానిజంలో ఆమె శరీరం పనిచేసిందని చెప్పారు. ఇలాంటి వారిలో గుండె కొట్టుకునే వేగం, శ్వాస తీసుకునే రేటు సాధారణ వ్యక్తులతో పోలిస్తే తక్కువగా ఉంటుందని చెప్పారు.

"సాధారణ మనిషి రోజువారీ కార్యక్రమాల నిర్వహణకు 1,500- 2,200 క్యాలరీల శక్తి అవసరం . శారీరక శ్రమ ఎక్కువగా లేని ఖాజమ్మకు పల్లీలు, బెల్లం ద్వారా సరిపోయే క్యాలరీలు అందాయి. అయితే అది సమీకృత ఆహారం మాత్రం కాదు.

ఎక్కువ రోజులు ఈ తరహా ఆహారం తీసుకోవడం వల్ల బీ-12, డీ-3 విటమిన్ లోపాల వల్ల నాడీ వ్యవస్థ, రక్తకణాల అభివృద్దిపైన ప్రభావం పడుతుంది తద్వారా ఎనీమియా, ఎముకల అరుగుదల వంటి సమస్యలు ఎదురవుతాయి'' అని ఆయన చెప్పారు.

అయితే ఉన్నపళంగా ఇలాంటి వ్యక్తులకు చికిత్స అందించలేమని, అన్ని రకాల పదార్థాలు వీరి శరీరానికి అందిస్తే 'రీఫీడింగ్ సిండ్రోమ్' ప్రభావంతో సోడియం, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్పేట్ వంటి ఎలక్ట్రోలైట్ ఇంబాలెన్స్ ఏర్పడి గుండె , కండరాల సంబంధిత సమస్యలు వస్తాయని డాక్టర్ తిరుణాధర్ చెప్పారు. ఒక్కోసారి ఇది ప్రాణాంతకం కావచ్చని ఆయన అన్నారు.

అయితే సైకియాట్రిస్ట్, న్యూరోఫిజీషియన్, ఆర్థోపిడిషియన్‌ల పర్యవేక్షణలో క్రమబద్దమైన చికిత్స అందిస్తే మంచిదని చెప్పారు.

ఈమధ్య కాలంలో సోషల్ మీడియాలో బరువు తగ్గేందుకు ఒకే రకమైన ఆహార పదార్థాలను తీసుకునే ట్రెండ్ ఒకటి కనిపిస్తోందని అయితే ఇది పాటించకూడదని డాక్టర్ తిరుణాధర్ చెప్పారు. ఇలాంటి డైట్ ఫాలో అయిన వారు కొద్ది రోజులకే ఆసుపత్రులకు వస్తున్న కేసులు పెరుగుతున్నాయన్నారు. సమతుల ఆహారం తీసుకోవడమే ఆరోగ్యానికి మంచిదని సూచించారు.

''ప్రపంచ ఆరోగ్య సంస్థ ( డబ్యూహెచ్ఓ) ప్రకారం.. కేవలం శారీరకంగానేకాకుండా మానసికంగా కూడా మనం స్ట్రాంగ్ గా ఉండాలి. అదే సమయంలో చుట్టుపక్కల వారితో ఆరోగ్యకరమైన సంబంధాలు పెంచుకున్నప్పుడే సంపూర్ణ ఆరోగ్యం'' అని డాక్టర్ తిరుణాధర్ అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)