అనారోగ్యాన్ని నయం చేసుకోవడానికి మూలికలతో స్వయంగా చికిత్స చేసుకుంటున్న ఏనుగులు

ఫొటో సోర్స్, Mount Elgon Foundation
- రచయిత, విక్టోరియా గిల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 5 నిమిషాలు
ఆఫ్రికా ఏనుగులు వాటి మందలోని ఇతర ఏనుగులు ఏదైనా అనారోగ్యం బారినపడినప్పుడు వివిధ రకాల వనమూలికలను చికిత్స కోసం వినియోగిస్తాయి.
ఈ విషయాన్ని ఓ అధ్యయనంలో నిర్థరించారు. ఇందులో కెన్యాలోని మౌంట్ ఎల్గాన్ ప్రాంతంలో ఏనుగులతోపాటు కలిసి జీవించినవారిని ఇంటర్వ్యూ చేశారు.
తమ అసాధారణ ప్రవర్తనతో ఈ ప్రత్యేకమైన జంతువులు చాలా కాలంగా శాస్త్రవేత్తల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. వీటిని సాల్ట్-మైనింగ్ ఏనుగులు అంటారు. ఎందుకంటే అవి గుహలలోకి వెళ్లి, తమ పోషకాహారం కోసం దంతాలతో రాళ్లను గీకి ఖనిజాలను గ్రహిస్తాయి.
ఈ ఏనుగులు వైద్యపరమైన అవసరాల కోసం అడవిలోని వివిధ జాతుల మొక్కలను ఉపయోగిస్తాయని తాజాగా ప్రచురితమైన పరిశోధన సూచిస్తోంది.

ఆ పరిశోధనకు నేతృత్వం వహించిన వారిలో ఒకరైన అమెరికాలోని బ్రౌన్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ ఎలోడీ ఫ్రైమాన్ మాట్లాడుతూ, అడవుల విధ్వంసం వల్ల జంతువులు, మనుషులు కూడా తాము ఆరోగ్యంగా ఎదగడానికి అవసరమైన ఔషధాలను కోల్పోతున్నారా? అనే ప్రశ్నను ఈ అధ్యయనం లేవనెత్తిందని పేర్కొన్నారు.
""మన ఔషధాలు మానవేతర ప్రపంచంతో ఎంతగా ముడిపడి ఉన్నాయో ఇది చూపుతోందని’’అని డాక్టర్ ఫ్రైమాన్ అన్నారు.
ఈ అధ్యయనం కోసం మౌంట్ ఎల్గాన్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి శాస్త్రవేత్తలు పనిచేశారు. స్థానికులు, వైల్డ్ లైఫ్ స్కౌట్స్, కమ్యూనిటీ లీడర్స్‌ని వారు ఇంటర్వ్యూ చేశారు.

ఫొటో సోర్స్, Mount Elgon Foundation
ఏనుగులు తమకు అనారోగ్యంగా ఉందని భావించినప్పుడు కొన్ని నిర్దిష్టమైన మొక్కలను ఎంచుకుంటాయని, తల్లి ఏనుగులు పిల్ల ఏనుగులకు కూడా వాటిని అందిస్తాయని స్థానికులు వివరించారు.
దీని ఆధారంగా నైరోబీలోని కెన్యా జాతీయ మ్యూజియం శాస్త్రవేత్తలతో కూడిన ఈ పరిశోధక బృందం, ఏనుగులు 35 రకాల మొక్కల జాతులను ఉపయోగిస్తున్నాయని, వాటిలో 25 రకాల మొక్కలు ఔషధ గుణాలు కలిగినవిగా స్థానికంగా గుర్తింపు పొందాయని నిర్థరించింది.

ఫొటో సోర్స్, Fabien Schultz
కడపు నొప్పికి 'అంగూర్‌వీట్'
సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనం, ఇంటర్వ్యూ చేసిన స్థానికుల పేర్లను వెల్లడించలేదు. ఇందులో పాల్గొన్న వారు తమ అనుభవాలను ఎటువంటి సంకోచం లేకుండా పంచుకోవాలనే ఉద్దేశంతో వారి పేర్లను గోప్యంగా ఉంచారు.
వారు పంచుకున్న సాక్ష్యాలు కొన్ని ఆసక్తికరమైన వివరాలను వెల్లడిస్తున్నాయి. ఏనుగులు 'అంగుర్‌వీట్' గా పిలిచే ఒక మొక్కను 'పిల్ల ఏనుగులకు ఒక ఔషధంగా ఉపయోగించడాన్ని తాను చూశానని ఒక వన్యప్రాణి సంరక్షకుడు వివరించారు.
కడుపునొప్పితో సహా పలు అనారోగ్య సమస్యలకు అంగుర్‌వీట్‌ను ఒక నివారణగా ఉపయోగిస్తారు. తల్లి ఏనుగులు ఆ మొక్క ఆకులను తొలగించి, మిగిలిన కొమ్మను ఇతర చెట్ల వేర్లతో కలిపి, అవి మెత్తగా అయ్యేంతవరకు తమ నోటితో నమిలి మిశ్రమంలా మార్చాయని సదరు సంరక్షకుడు వివరించారు.
పాలుతాగడానికి వచ్చే పిల్ల ఏనుగులకు తమ పొదుగు వద్ద తల్లి ఏనుగులు ఈ మిశ్రమాన్ని కూడా కలిపి ఇవ్వడం చూశానని ఆయన గుర్తుచేసుకున్నారు. 'అవి ఆ మిశ్రమాన్ని పిల్లలకు ఇస్తాయి, ఆ పిల్లలు వాటిని నమిలి, పిప్పిని బయటకు ఉమ్మేస్తాయి' అని ఆయన పేర్కొన్నారు.
ఈ విషయం చాలా ఆసక్తి కలిగిస్తోందని జపాన్‌లోని నాగసాకి యూనివర్సిటీలో వానరాజతుల శాస్త్రవేత్త మైఖేల్ హఫ్‌మన్ అన్నారు.
అయితే ఏనుగులు తమ పిల్లలకు వైద్య చికిత్స అందిస్తున్నాయని నిర్ధరించడానికి మరిన్ని ఆధారాలు అవసరమని ఆయన పేర్కొన్నారు.
శాస్త్రవేత్తలు ఇప్పటికే ఆధారాలను సేకరించే పనిలో ఉన్నారు. స్థానిక వన్యప్రాణి నిపుణులకు కెమేరాలు ఇచ్చి వాటి ప్రవర్తనను రికార్డు చేయిస్తున్నారు.
ఏనుగులు ఉపయోగించే మొక్కలను కూడా వారు విశ్లేషిస్తున్నారు. ఏనుగులే స్వయంగా కనుగొని ఉండవచ్చని భావిస్తున్న కొత్త ఔషధాల కోసం వారు అన్వేషిస్తున్నారు.
ఈ ప్రాజెక్టుకు నాయకత్వం వహించిన మరో ప్రముఖ పరిశోధకుడు, హాంబర్గ్‌లోని బెర్న్‌హార్డ్ నోచ్ట్ ఇనిస్టిట్యూట్ ఫర్ ట్రాపికల్ మెడిసిన్‌కు చెందిన డాక్టర్ ఫాబియన్ షుల్ట్జ్ 'స్థానికుల పరిజ్ఞానం మాకో దారి చూపింది' అని చెప్పారు.
"ఇకపై ఏనుగులను నిశితంగా గమనించాలనుకుంటున్నాం. ఒక ప్రత్యేక అనారోగ్య సమస్యకు తగిన ప్రత్యేకమైన మొక్కలనే అవి ఎంచుకుంటున్నాయా? ఆ మొక్కలకు నిజంగానే జీవక్రియ ఉందా? అని పరిశోధించాల్సి ఉంది" అని ఫాబియన్ పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, S Powles
మూడో శతాబ్దం నుంచే...
ఏనుగులు స్వయంగా చికిత్స చేసుకోవడం మూడో శతాబ్దం నుంచే ఉందని ప్రాచీన శాస్త్రీయ అధ్యయనాలు చెబుతున్నాయి.
రోమన్ రచయిత క్లాడియస్ ఏలియన్ రాసిన డి నాచురా యానిమాలియం (జంతువుల స్వభావం) అనే గ్రంథంలో జంతువుల స్వీయ చికిత్స సామర్థ్యానికి సంబంధించిన ఓ కథనాన్ని వివరించారు. దాని ప్రకారం, ఈటెలు, బాణాల దాడిలో గాయపడిన ఓ ఏనుగు.. ఆలివ్ చెట్టు పువ్వులను, నూనెను వినియోగించిన తర్వాత పూర్తిగా కోలుకున్నట్లు చెప్పారు.
శతాబ్దాల తర్వాత, వన్యప్రాణులు తాము పరిణామం చెందిన అడవులలోని మొక్కల గుణగణాల గురించి మనకు ఏం నేర్పించగలవు? అనే అంశంపై శాస్త్రవేత్తలు ఇప్పుడు లోతుగా పరిశోధిస్తున్నారు.

ఫొటో సోర్స్, Christopher Powles
దోమల నుంచి ఏప్స్ వరకు..
"దోమలు, డ్రోసోఫిలా (ఈగలు), తేనేటీగల నుంచి ఆఫ్రికా, ఆసియాలలోని గ్రేట్ ఏప్స్ వరకు స్వయంగా చికిత్స చేసుకుంటాయని ఇప్పుడు మనకు తెలుసు." అన్నారు ఫ్రొఫెసర్ హఫ్‌మన్. ఆయన ఈ అధ్యయనంలో పాల్గొనలేదు.
"కొత్త కొత్త జాతుల గురించి అధ్యయనం చేసిన కొద్దీ మన ఔషధ చరిత్ర గురించి మరింత స్పష్టమైన అవగాహన వస్తోంది." అని చెప్పారు.
ఈ అధ్యయన ఫలితాల్లో భవిష్యత్తుకు సంబంధించిన పాఠాలు కూడా ఉంటాయని డాక్టర్ ఫ్రైమాన్ అన్నారు.
"ఫార్మసీలలో మనం కొనే ఔషధాలు.. మొక్కలు, నాచు, ఫంగై, పగడపు దిబ్బల నుంచి సేకరించిన రసాయన సమ్మేళనాల నుంచి తయారైనవే’’ అని చెప్పారు.
‘‘అడవులను రక్షించడం, ప్రకృతి అందించిన సహజ ఔషధ శాలలను కాపాడుకోవడం ఉభయతారకం. భవిష్యత్తులో మన ప్రాణాలను కాపాడే సరికొత్త ప్రకృతి సిద్ధ ఉత్పత్తులను కనుగొనేంతవరకు అవి మనుగడ సా
ఈ అడవులను కాపాడుకుంటూ, ఈ సహజ ఔషధశాలలను పరిరక్షించుకోవడం ఉభయతారకం. భవిష్యత్తులో మన ప్రాణాలను రక్షించే సరికొత్త సహజ ఔషధాలను కనుగొనడానికి ఇవి మనకు ఎంతో అవసరం.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























