వాహనాలకు నెంబర్ ప్లేట్ల వాడకం ఎప్పుడు, ఎక్కడ మొదలైంది?

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం
    • రచయిత, శారద మియాపురం
    • హోదా, బీబీసీ కోసం
  • ప్రచురణ
  • చదివే సమయం: 6 నిమిషాలు

స్టీరింగ్ వద్ద ఉన్న బటన్ నొక్కగానే.. చూస్తుండగానే కారు నంబర్ ప్లేట్ మారిపోయిన వీడియో ఈ మధ్య వైరల్ అయింది.

ట్రాఫిక్ చలాన్ల నుంచి, ఇతర నేరాల నుంచి తప్పించుకోవడానికి కొందరు ఇలా వాహనాల నెంబర్ ప్లేట్లను మార్చి పోలీసులకు దొరికిపోతున్న ఘటనలు ఈ మధ్య హైదరాబాద్‌తో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి.

హైదరాబాద్ నగర వ్యాప్తంగా జూన్ 4న పోలీసులుప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నెంబర్ ప్లేట్ల విషయంలో అవకతవకలకు పాల్పడిన 2,100కు పైగా వాహనాలను సీజ్ చేసినట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ వెల్లడించారు.

ఆపరేషన్ కవచ్ పేరుతో రాత్రి 10 గంటల నుంచి అర్థరాత్రి వరకు పోలీసులు చేసిన తనిఖీల్లో నంబర్ ప్లేట్ క్లోనింగ్, ట్యాంపరింగ్, నకిలీ నెంబర్ ప్లేట్లను వాడటం, రెండు వాహనాలకు ఒకే నంబర్ వాడటం వంటివి గుర్తించినట్లు పోలీసులు మీడియాకు చెప్పారు.

వాహనాల రిజిస్ట్రేషన్ ప్లేట్లను ట్యాంపర్ చేయడం ఇకపై ఓ సాధారణ ట్రాఫిక్ ఉల్లంఘనగా పరిగణించమని కమిషనర్ అన్నారు. రిజిస్టర్డ్ నెంబర్ ప్లేట్ల విషయంలో చట్టాన్ని బోల్తా కొట్టించే ఎలాంటి చర్యకైనా క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

ఈ నేపథ్యంలో అసలు రిజిస్టర్డ్ నెంబర్ ప్లేట్ అంటే ఏంటి? వాటి చరిత్ర ఏంటి? భారత్‌లో వీటి వాడకం ఎప్పుడు మొదలైందో ఇక్కడ చూద్దాం?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
హైదరాబాద్ సిటీ పోలీసులు షేర్ చేసిన ఫోటోలు

ఫొటో సోర్స్, fb/Hyderabadcitypolice

ఫొటో క్యాప్షన్, హైదరాబాద్ సిటీ పోలీసులు షేర్ చేసిన ఫోటోలు

రిజిస్టర్డ్ నెంబర్ ప్లేట్ అంటే?

మోటార్ వాహనాల చట్టం-1988 సెక్షన్ 41 (6) ప్రకారం, రవాణా శాఖ ఒక వాహనానికి కేటాయించే నంబర్‌ను 'రిజిస్ట్రేషన్ మార్క్'గా పిలుస్తారు. దీన్నే రిజిస్ట్రేషన్ నెంబర్ అంటారు.

అంటే, దేశంలో తిరిగే ఏదైనా ఒక మోటార్ వాహనాన్ని అధికారికంగా గుర్తించడానికి రవాణా శాఖ (ఆర్టీవో) కేటాయించే నెంబర్ ఇది. ఈ నెంబర్‌ను వాహనం ముందు, వెనుక భాగాల్లో అందరికీ స్పష్టంగా కనిపించేలా ప్రదర్శించాలని మోటార్ వాహనాల చట్టం సూచిస్తోంది.

ఈ చట్టంలోని సెక్షన్ 39 ప్రకారం, రవాణా శాఖ జారీ చేసిన రిజిస్ట్రేషన్ నెంబర్ లేకుండా దేశంలో ఏదైనా మోటార్ వాహనాన్ని నడపడం చట్టరీత్యా నేరం.

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

నెంబర్ ప్లేట్‌ దేన్ని సూచిస్తుంది?

వాహనాల నెంబర్ ప్లేట్ ఒక నిర్దిష్ట క్రమంలో ఉంటుంది. ఉదాహరణకు TS 06 AB 1234 (కల్పిత నెంబర్) అనే నెంబర్ ప్లేట్‌ను తీసుకుంటే.. కేంద్ర మోటార్ వాహనాల నియమావళి (1989) రూల్ 50 ప్రకారం.. ఈ నెంబర్‌లోని మొదటి రెండు అక్షరాలు అంటే TS అనేవి వాహనం రిజిస్టర్ అయిన రాష్ట్రం కోడ్‌ను సూచిస్తాయి.

తర్వాతి రెండు అంకెలు (06) ఆ రాష్ట్రంలో వాహనాన్ని రిజిస్టర్ చేసిన నిర్దిష్ట జిల్లా లేదా ఆర్టీవో ఆఫీస్ కోడ్‌ను సూచిస్తాయి. మధ్యలోని ఆంగ్ల అక్షరాలు (AB) వాహన రిజిస్ట్రేషన్ సమయంలో నడుస్తున్న కరెంట్ రిజిస్ట్రేషన్ సిరీస్‌కు సంబంధించిన అక్షరమాలను సూచిస్తాయి. చివరి నాలుగు అంకెలు (1234) సదరు వాహనానికి మాత్రమే కేటాయించిన ప్రత్యేకమైన కంప్యూటరైజ్డ్ ఐడెంటిఫికేషన్ నెంబర్‌ను సూచిస్తాయి.

అసలు ఈ నంబర్ ప్లేట్ ప్రస్థానం ఎక్కడ? ఎలా మొదలైంది?

నెంబరే కాదు, పేరు, చిరునామా కూడా ఉండేవి

ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా వాహనాలకు నంబర్ ప్లేట్లను చట్టబద్ధంగా ప్రవేశపెట్టిన దేశం ఫ్రాన్స్.

1893 ఆగస్టు 14న పారిస్ పోలీస్ ఆర్డినెన్స్ ఒక కొత్త చట్టాన్ని తెచ్చింది. పారిస్ నగర వీధుల్లో తిరిగే మోటార్ వాహనాలు యాక్సిడెంట్లు చేసి పారిపోతుండటంతో, ఆయా వాహనాల యజమానులను పట్టుకోవడానికి వీలుగా నంబర్ ప్లేట్లను తప్పనిసరి చేస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చారు.

'పారిస్ నగరంలో తిరిగే ప్రతి మోటార్ వాహనానికి తప్పనిసరిగా ఒక గుర్తింపు ప్లేట్ ఉండాలి. ఆ ప్లేట్‌పై వాహనం నెంబర్‌తో పాటు, యజమాని పేరు, చిరునామా కూడా ఉండాలి' అని ఆ ఆర్డినెన్స్‌లో పేర్కొన్నారు.

పారిస్ నగర పరిధిలో ఈ రూల్ తీసుకురావడం చూసి.. జర్మనీ 1896లో తమ దేశంలో నంబర్ ప్లేట్లను ప్రవేశపెట్టింది.

ఈ విషయంలో నెదర్లాండ్స్ ఒక అడుగు ముందుకు వేసింది. దేశవ్యాప్తంగా ఒకే విధమైన నెంబర్ ప్లేట్ చట్టాన్ని తెచ్చిన ఘనత నెదర్లాండ్స్‌కు దక్కుతుంది.

నెదర్లాండ్స్ ప్రభుత్వం 1898లో ఒక జాతీయ రవాణా చట్టాన్ని తెచ్చింది. దీని ప్రకారం 'డ్రైవింగ్ పర్మిట్' ప్లేట్లు పేరుతో నెంబర్ ప్లేట్లను జారీ చేసింది.

అమెరికాలో1901లో న్యూయార్క్ రాష్ట్రం మొదటిసారిగా కార్లకు నంబర్ ప్లేట్లను తప్పనిసరి చేస్తూ చట్టం తెచ్చినట్లు నేషనల్ మ్యూజియమ్ ఆఫ్ అమెరికన్ హిస్టరీ వెబ్‌సైట్ పేర్కొంది.

'అయితే, అప్పట్లో ప్రభుత్వం నెంబర్ ప్లేట్లను ఇచ్చేది కాదు. కార్ల యజమానులే తోలు, లేదా ఇనుప ముక్కలపై తమ పేరులోని మొదటి అక్షరాలను పెయింట్‌తో రాసి వెనుకభాగంలో తగిలించేవారు. తర్వాత 1903లో మసాచుసెట్స్ రాష్ట్రంలో ప్రభుత్వమే నెంబర్ ప్లేట్లను జారీ చేయడం ప్రారంభించింది' అని ఈ వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు.

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

మరి భారత్‌లో ఎప్పుడు?

భారత ప్రభుత్వ అధికారిక చట్టాల రికార్డుల ప్రకారం.. 1914లో బ్రిటీష్ ప్రభుత్వం తీసుకొచ్చిన 'ది ఇండియన్ మోటార్ వెహికల్స్ యాక్ట్-1914' ద్వారానే భారత్‌లో వాహనాలకు నెంబర్ ప్లేట్ల వాడుక అధికారికంగా చట్టబద్ధమైంది.

అంతకుముందు 1900ల ప్రారంభంలో స్థానిక నగరాల పరిధిలోనే గుర్తింపు నంబర్లు వాడినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి.

ది లా ఆఫ్ మోటార్ వెహికిల్స్ ఇన్ ఇండియా అనే పుస్తకం ప్రకారం.. 1914 జాతీయ చట్టం రాకముందు.. బ్రిటీష్ ఇండియాలో వాహనాల నియంత్రణ, రిజిస్ట్రేషన్ల కోసం బాంబే (1901), బెంగాల్ (1903), మద్రాస్ (1907), యూపీ (1911), పంజాబ్ (1907), బర్మా (1906)లలో వేర్వేరు ప్రాంతీయ చట్టాలు అమల్లో ఉండేవి. ఈ చట్టాలన్నీ కలిపి వాహనదారుల సౌకర్యం కోసం 1914లో ఒకే జాతీయ చట్టంగా మార్చారు.

అయితే 1914 చట్టం చాలా ప్రాథమికమైనది కావడంతో, దేశవ్యాప్తంగా వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగిన తర్వాత బ్రిటీష్ ప్రభుత్వం రవాణా వ్యవస్థను పూర్తిగా క్రమబద్ధీకరించడానికి మోటార్ వాహనాల చట్టం-1939ని తీసుకొచ్చింది.

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

చట్టంలో ఏముంది?

భారతదేశం అంతటా ఒకే విధమైన రిజిస్ట్రేషన్ వ్యవస్థను తీసుకురావడానికి బ్రిటీష్ ప్రభుత్వం 1939లో మోటార్ వెహికల్స్ యాక్ట్‌ను అమలులోకి తెచ్చింది.

చట్టం ప్రకారం దేశవ్యాప్తంగా నంబర్ ప్లేట్ల శైలిని మార్చారు. రెండు అక్షరాల ప్రావిన్స్/రాష్ట్ర కోడ్, దాని పక్కన ఒక సిరీస్ అక్షరం, ఆపై నాలుగు అంకెలు ఇచ్చే పద్ధతిని తెచ్చారు (ఉదాహరణకు: బొంబాయి ప్రావిన్స్‌ నెంబర్ ప్లేట్: BMY 1234 ).

అప్పట్లోనే ప్రైవేట్ వాహనాలకు నల్లటి ప్లేట్‌పై తెల్లటి అక్షరాలతో, కమర్షియల్ (టాక్సీ) వాహనాలకు తెల్లటి ప్లేట్‌పై నల్లటి అక్షరాలతో రాయాలనే నిబంధన పెట్టారు.

1988 మోటార్ వాహనాల చట్టం: నేటి కాలానికి తగినట్లుగా మార్పులు

పాత చట్టం స్థానంలో భారత ప్రభుత్వం తీసుకువచ్చిన మోటార్ వెహికల్స్ యాక్ట్-1988 లోని సెక్షన్ 41 ప్రకారం ప్రస్తుతం మనం చూస్తున్న నంబర్ ప్లేట్ల ఫార్మాట్ అమల్లోకి వచ్చింది.

రాష్ట్రాల కోడ్: దీనికి అనుబంధంగా ఉండే కేంద్ర మోటార్ వాహనాల నియమావళి, 1989 లోని రూల్ 50 ప్రకారం ప్రతి రాష్ట్రానికి రెండు అక్షరాల ప్రత్యేక కోడ్ (తెలంగాణకు TS, ఆంధ్రప్రదేశ్‌కు AP) కేటాయించారు.

రంగుల నిబంధన: ప్రైవేట్ వాహనాలకు తెలుపు రంగు ప్లేట్, కమర్షియల్ వాహనాలకు పసుపు రంగు ప్లేట్, ఎలక్ట్రిక్ వాహనాలకు ఆకుపచ్చ రంగు ప్లేట్ ఉండాలని ఈ రూల్ నిర్దేశిస్తుంది.

కొత్త ప్రైవేట్ వాహనాలకు మాత్రమే బీహెచ్ సిరీస్ నంబర్ ప్లేట్ పొందవచ్చు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కొత్త ప్రైవేట్ వాహనాలకు మాత్రమే బీహెచ్ సిరీస్ నంబర్ ప్లేట్ పొందవచ్చు

హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు

నకిలీ నంబర్ ప్లేట్ల మోసాలను, వాహనాల దొంగతనాలను అరికట్టడానికే కేంద్ర ప్రభుత్వం హెచ్‌ఆర్‌ఎస్‌పీ (హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు) విధానాన్ని తెచ్చింది. ఈ అల్యూమినియం ప్లేట్లపై క్రోమియం ఆధారిత హోలోగ్రామ్, లేజర్ కోడ్ నెంబర్లు ఉంటాయి. దీనివల్ల ప్లేట్‌ను మార్చడం అసాధ్యంగా మారుతుంది.

అలాగే, ఉద్యోగ రీత్యా తరచూ ఇతర రాష్ట్రాలకు బదిలీ అయ్యే వారి కోసం 2021లో కేంద్ర ప్రభుత్వం 'బీహెచ్' (భారత్ సిరీస్) నంబర్ ప్లేట్లను ప్రవేశపెట్టింది. దేశవ్యాప్తంగా ఈ నంబర్ ప్లేట్ చెల్లుతుంది. అంటే ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి వెళ్తే వాహనాన్ని మళ్లీ రిజిస్టర్ చేయాల్సిన అవసరం ఉండదు.

ఇంకో ప్రయోజనం ఏంటంటే, ఒకవేళ మీరు వాహనాన్ని మరొక రాష్ట్రానికి చెందిన వ్యక్తికి సులభంగా అమ్మవచ్చు. ఎందుకంటే బీహెచ్ సిరీస్ రిజిస్ట్రేషన్ దేశమంతటా చెల్లుతుంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)