హోప్: ఈ తిమింగలం పేలిపోవచ్చన్న ఆందోళన ఏంటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అలెక్స్ ఫిలిప్స్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 3 నిమిషాలు
జర్మన్లను ఆకట్టుకున్న హంప్‌బ్యాక్ తిమింగలం చనిపోయింది. దాన్ని రక్షించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చనిపోయిన తర్వాత దాని మృతదేహాన్ని ఒడ్డుకు లాక్కొచ్చారు.
డెన్మార్క్‌లోని అన్‌హోల్ట్ ద్వీపంలోని ఒక మోటారు సాయంతో తిమింగలాన్ని నెమ్మదిగా ఒడ్డుకు లాక్కొస్తున్న దృశ్యాలను జర్మన్ న్యూస్ వెబ్‌సైట్ న్యూస్ 5 పోస్ట్ చేసింది.
తిమింగలం మృతదేహానికి డెన్మార్క్ పర్యావరణ సంస్థ గురువారం పోస్ట్ మార్టం నిర్వహించనుంది.
టిమ్మి, హోప్ అనే మారుపేర్లు ఉన్న ఈ తిమింగలం ఈ ఏడాది మార్చ్‌లో బాల్టిక్ సముద్రంలో చిక్కుకుపోయింది. దాన్ని తిరిగి నార్త్ సముద్రంలోకి తీసుకువచ్చేందుకు అనేక ప్రయత్నాలు జరిగాయి.
అనారోగ్యంతో ఉన్న తిమింగలాన్ని రక్షించేందుకు మే ప్రారంభంలో ఆఖరి ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే అది మృత్యువు అంచున ఉన్నట్లు గుర్తించారు.

చనిపోయిన ఈ తిమింగలం దాదాపు 15 మీటర్లదాకా పొడవుంది.
చనిపోయిన తర్వాత కుళ్లిపోతుండటంతో శరీరంలో గ్యాస్ చేరుకుని దాని సైజు పెరిగింది. మరణించాక ఒడ్డుకు కొట్టుకు వచ్చే తిమింగలాల మృతదేహాలు పేలిపోవడం అందరికీ తెలిసిందే.
అలాగే ఇది కూడా పేలిపోతుందేమో అనే ఆందోళన వ్యక్తమవుతోంది.
తిమింగలం నమూనాలు సేకరించేందుకు పశువైద్యులు, పరిశోధకులు దాని శరీరాన్ని ముక్కలుగా కోస్తారని అన్‌హోల్ట్ ద్వీపంలోని పర్యావరణ సంస్థ అధికారి మోర్టెన్ అబిల్డ్ స్ట్రోమ్ జైలాండ్స్ పోస్టెన్ అనే వార్తా పత్రికతో చెప్పారు.
ఆ ముక్కలను వేరే ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ నాశనం చేస్తారని ఆయన వెల్లడించారు.

ఫొటో సోర్స్, Reuters
బాల్టిక్ సముద్ర తీరంలో చిక్కుకుపోయిన హంప్‌బ్యాక్ తిమింగలాన్ని రక్షించేందుకు చేపట్టిన ప్రైవేట్ మిషన్ విఫలమైన రెండు వారాల తర్వాత మే ప్రారంభంలో అన్‌హోల్ట్ తీరంలో దాన్ని గుర్తించారు.
బాల్టిక్ సముద్రంలో ఉప్పు శాతం తక్కువగా ఉండటంతో తిమింగలం చర్మం దెబ్బ తింది. దీంతో అది బలహీనపడి అనారోగ్యం పాలైంది. అక్కడ నుంచి దాన్ని తరలించడం కష్టమైనప్పటికీ, ఆ ప్రయత్నానికి జర్మన్ అధికారులు అనుమతి ఇచ్చారు.
గాలితో నింపిన కుషన్లను ఉపయోగించి, తిమింగలాన్ని పైకి లాగి, ఫ్లోటింగ్ ప్లాట్‌ఫామ్ ఉంచి ఉత్తర సముద్రంలోకి తీసుకెళ్లారు.
అయితే, డెన్మార్క్ జూట్‌ల్యాండ్ తీరంలోని ఒక ద్వీపానికి ఆ తిమింగలం ఎలా వచ్చిందనే దానిపై స్పష్టత లేదు.
జర్మనీ నుంచి దాన్ని తీసుకొచ్చిన పడవ, డెన్మార్క్ ఉత్తర కొన నుంచి సుమారు 70 కిలోమీటర్ల అవతల సముద్రంలో దాన్ని వదిలేసింది.
ఈ తిమింగలం కళేబరం సందర్శకులతో రద్దీగా ఉండే బీచ్‌లో ఉండటంతో దాన్ని త్వరగా పారవేయాలని అధికారులు భావిస్తున్నట్లు అబిల్డ్‌స్ట్రోమ్ తెలిపింది.
తిమింగలం కళేబరాన్ని సముద్ర తీరం నుంచి డెన్మార్క్ ప్రధాన భూభాగంలోని గ్రెనా పోర్టుకు తరలించేందుకు అధికారులు గతంలో ప్రయత్నించారు. అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో ఆ ప్రయత్నం విఫలమైంది.
అది మొదట వలల్లో చిక్కుకుని ల్యూబెక్ బే దగ్గర ఇరుక్కుపోయింది. అక్కడ దాన్ని రక్షించడానికి ప్రయత్నాలు జరిగాయి.
జర్మన్ పర్యావరణ కార్యకర్తలు ఒక ఇసుక దిబ్బ నుండి దానిని విడిపించి అది ఈదుకుంటూ వెళ్ళడానికి వీలుగా ఒక కాలువను తవ్వారు.
కానీ అది మరింత తూర్పుగా ఈది, పోయెల్ ద్వీపం సమీపానికి చేరుకుని, అక్కడ నిస్సారమైన నీటిలో చిక్కుకు పోయింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

























