పాకిస్తాన్ రక్షణ బడ్జెట్ భారీగా పెరిగింది, భారత్‌తో పోటీ పడుతోందా?

పాకిస్తాన్ సాధారణ బడ్జెట్, రక్షణ వ్యయం, భారత ప్రభుత్వం, ఆయుధాల కొనుగోళ్లు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, అసద్ సుహైబ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 6 నిమిషాలు

గత ఏడాదితో పోలిస్తే రక్షణ బడ్జెట్‌ కేటాయింపులను 17.6 శాతం పెంచుతూ పాకిస్తాన్ 2026-27 సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది.

ఆ దేశ జాతీయ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన పాకిస్తాన్ ఆర్థికమంత్రి మొహమ్మద్ ఔరంగజేబ్, ఈ ఏడాది రక్షణ బడ్జెట్ కోసం 3 లక్షల కోట్ల పాకిస్తానీ రూపాయలను కేటాయించినట్లు ప్రకటించారు.

గత ఆర్థిక సంవత్సరంలో పాకిస్తాన్ రక్షణ బడ్జెట్‌ను 20.2 శాతం పెంచి 2,55,000 కోట్ల పాకిస్తానీ రూపాయలకు చేర్చారు. తర్వాత దానిని 2,59,500 కోట్ల పాకిస్తానీ రూపాయలకు సవరించారు.

2024లో పీఎంఎల్-ఎన్ ( పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్) ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో రక్షణ బడ్జెట్ కోసం 7.63 బిలియన్ డాలర్లు (సుమారు 2.12 ట్రిలియన్ పాకిస్తానీ రూపాయలు) కేటాయించింది.

అంతకు ముందు ఏడాది బడ్జెట్‌తో పోలిస్తే ఇది 1.13 బిలియన్ డాలర్లు( సుమారు 314 బిలియన్ పాకిస్తానీ రూపాయలు) పెరిగింది. గత మూడేళ్లలో పాకిస్తాన్ రక్షణ బడ్జెట్ మొత్తం 3.16 బిలియన్ డాలర్ల ( సుమారు 880 బిలియన్ పాకిస్తానీ రూపాయలు)కు పెరిగింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

2026-27 ఆర్థిక సంవత్సరానికి పాకిస్తాన్ బడ్జెట్ 64.71 బిలియన్ డాలర్లు( సుమారు 17.99 ట్రిలియన్ పాకిస్తానీ రూపాయలు) కాగా, ఇందులో రక్షణ బడ్జెట్ వాటా 16.67శాతంగా ఉంది.

సైనికులిచ్చే పెన్షన్లు రక్షణ బడ్జెట్‌లో భాగం కాదు.

వచ్చే ఆర్ధిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ల కోసం 4.20 బిలియన్ డాలర్లు (సుమారు 1.17 ట్రిలియన్ పాకిస్తానీ రూపాయలు) కేటాయిస్తే, అందులో 2.95 బిలియన్ డాలర్లు (సుమారు 820 బిలియన్ పాకిస్తానీ రూపాయలు) రిటైరైన సైనికులకిచ్చే పెన్షన్ల కోసం కేటాయించారు.

"దేశ భద్రతను బలోపేతం చేయడం, ఈ ప్రాంతంలో అస్థిరతను ఎదుర్కోవడానికి రక్షణ బడ్జెట్‌ను భారీగా పెంచాల్సి వచ్చింది" అని ఆర్థిక మంత్రి రక్షణ బడ్జెట్ పెంపుదలను సమర్థించుకున్నారు.

"భారత దురాక్రమణను పాక్ సైన్యం గట్టిగా తిప్పి కొట్టింది. దేశ సైనిక సంసిద్ధత, సామర్థ్యాన్ని ప్రదర్శించింది" అని ఆయన అన్నారు.

పాకిస్తాన్ సాధారణ బడ్జెట్, రక్షణ వ్యయం, భారత ప్రభుత్వం, ఆయుధాల కొనుగోళ్లు

ఫొటో సోర్స్, Getty Images

పాక్ రక్షణ బడ్జెట్‌లో ఇంకా ఏముంది?

పాకిస్తాన్ బడ్జెట్ పత్రాల ప్రకారం 10.78 బిలియన్ డాలర్ల రక్షణ బడ్జెట్‌లో 3.48 బిలియన్ డాలర్లను సైనిక అధికారుల జీతాలు, భత్యాలతో సహా సిబ్బంది ఖర్చుల కోసం కేటాయించారు. గతేడాదితో పోలిస్తే ఇది 14.36 శాతం పెరిగింది.

ఇక రవాణా, వైద్యం, రేషన్, శిక్షణ, ఇంధనం, రోజువారీ ఖర్చుల కోసం 2.67 బిలియన్ డాలర్లకు పైగా కేటాయించారు.

ఆయుధాలు, సైనిక పరికరాలు, మందుగుండు సామగ్రి కొనుగోలు లాంటి వాటి కోసం కేటాయింపుల్లో భారీ పెరుగుదల కనిపించింది. వీటి కోసం వచ్చే ఆర్థిక సంవత్సరంలో 3.33 బిలియన్ డాలర్లు కేటాయించారు.

గతేడాది దీని కోసం 2.38 బిలియన్ డాలర్లు కేటాయించగా తాజా బడ్జెట్‌లో అది 39 శాతానికి పైగా పెరిగింది.

సైనిక మౌలిక సదుపాయాల కల్పన, ప్రజా పనులు, కొత్త స్థావరాల నిర్మాణానికి 1.21 బిలియన్ డాలర్లు కేటాయించారు. ఇది గతేడాది కంటే 7.92 శాతం అధికం.

పాకిస్తాన్ సాధారణ బడ్జెట్, రక్షణ వ్యయం, భారత ప్రభుత్వం, ఆయుధాల కొనుగోళ్లు

ఫొటో సోర్స్, Getty Images

రక్షణ బడ్జెట్ తగ్గించడం సాధ్యం కాదా?

కొన్నేళ్లుగా పాకిస్తాన్ రక్షణ బడ్జెట్ దాదాపు ప్రతి ఏటా పెరుగుతూ వస్తోంది. దీంతో అసలే బలహీనంగా ఉన్న ఆర్థిక వ్యవస్థ ఇంత పెద్ద రక్షణ బడ్జెట్‌ను భరించగలదా? ప్రతీ ఏటా రక్షణ బడ్జెట్ మొత్తాన్ని పెంచడం అవసరమా? అనే దానిపై చర్చ జరుగుతోంది.

ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న యుద్ధాలు, సరిహద్దు ఉద్రిక్తతలు, అంతర్గత పరిస్థితులు పాక్ రక్షణ బడ్జెట్ పెంచాల్సిన పరిస్థితిని కల్పిస్తున్నాయని రక్షణ రంగ నిపుణుడు, రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ ఖాలిద్ నయీమ్ లోధి చెప్పారు.

"దేశ రక్షణ బలంగా లేకపోతే, భారీ నష్టాలను చవి చూడాల్సి వస్తుందని గల్ఫ్‌లో ఇటీవల జరిగిన యుద్ధం కూడా స్పష్టం చేసింది" అని ఆయన బీబీసీతో చెప్పారు.

"యుక్రెయిన్ యుద్దం నుంచి గతేడాది జరిగిన భారత్- పాకిస్తాన్ సంఘర్షణ, ఇప్పుడు గల్ఫ్‌లో జరుగుతున్న దాడులు ఇవన్నీ చూస్తే సంప్రదాయ యుద్ధం స్థానంలో సైబర్ యుద్ధం, రాకెట్లు, డ్రోన్లు, లేజర్ టెక్నాలజీ, రిమోట్ కంట్రోల్ ఆధారిత వ్యవస్థలు యుద్ధ గమనాన్ని మార్చడంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు స్పష్టమవుతోంది" అని ఆయన వివరించారు.

ఇలాంటి పరిస్థితుల మధ్య ఏ దేశమైనా నూతన సాంకేతికత లేకుండా రక్షణను బలోపేతం చేసుకోలేదు అని ఖాలిద్ నయీమ్ అన్నారు.

కొత్త నౌకల్ని కొనుగోలు చేయడం, నౌకాదళంలోకి నూతన జలాంతర్గాములను కొనడం, సైనికుల కోసం ఆధునిక సైనిక పరికరాలను కొనుగోలు చేయడం లాంటివన్నీ బడ్జెట్ ద్వారానే సాధ్యమని ఆయన వివరించారు.

"నా సర్వీసు కాలంలో, రక్షణ బడ్జెట్ కోసం మరెక్కడి నుంచైనా డబ్బు రావడం ఎప్పుడూ చూడలేదు. అంటే ప్రభుత్వ బడ్జెట్ నుంచే అంతా ఖర్చు చేశారు. మాకు తెలియని వనరులు ప్రభుత్వం వద్ద ఉంటే అది వేరే విషయం" అని సైనిక వ్యయం గురించి లోధి చెప్పారు.

పాకిస్తాన్ సాధారణ బడ్జెట్, రక్షణ వ్యయం, భారత ప్రభుత్వం, ఆయుధాల కొనుగోళ్లు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పాకిస్తాన్ సైన్యం ఇటీవల అఫ్గానిస్తాన్‌పై వైమానిక దాడులు చేసింది.

సైనిక సిబ్బంది పింఛను రక్షణ బడ్జెట్‌లో భాగం కాదు.

సైనిక సిబ్బంది ఖర్చులు గణనీయంగా పెరిగాయి కాబట్టి, సైనిక సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి అనుకూలంగా పెంచారో లేదో చూడాల్సి ఉందని ఆర్థిక విశ్లేషకుడు ఖుర్రం హుస్సేన్ అన్నారు.

గతంలో సైనిక సిబ్బంది పెన్షన్లను విడిగా లెక్కించేవారని ఖుర్రం హుస్సేన్ అన్నారు.

2001లో ప్రభుత్వం ఈ పెన్షన్లను సాధారణ బడ్జెట్‌లో చేర్చింది. దీని వల్ల రిటైరైన సైనికులకిచ్చే పెన్షన్ల ఖర్చు ప్రభుత్వ వ్యయంలో కలిసిపోయింది.

ఆ సమయంలో సైన్యం చెప్పిన కారణం ఏమిటంటే.. సైనికుడు పదవీ విరమణ చేశాక అతనికి సైన్యంతో సంబంధం లేదు. పౌరుడిగా మిగులుతాడు. అందువల్ల అతనికిచ్చే పెన్షన్ సైనిక వ్యయంగా కాకుండా ప్రభుత్వ వ్యయంగా పరిగణించాలి.

పాకిస్తాన్ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో రక్షణ వ్యయం నిష్పత్తి క్రమంగా తగ్గిందని లాహోర్ యూనివర్శిటీ ఆఫ్ మేనేజ్‌మెంట్ సైన్సెస్‌కు అనుబంధంగా ఉన్న ఆర్థికవేత్త డాక్టర్ అలీ హస్నైన్ అన్నారు.

"ఈ విషయంలో పాకిస్తాన్ ఒకప్పుడు దక్షిణాసియా దేశాలలో అగ్రస్థానంలో ఉండేది" అని ఆయన అన్నారు.

భారత్ ఫిబ్రవరిలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి తన బడ్జెట్ ప్రవేశ పెట్టింది. గతేడాదితో పోలిస్తే రక్షణ బడ్జెట్‌ను 15 శాతం పెంచి 85.4 బిలియన్లకు చేర్చింది. ఈ మొత్తం భారత స్థూల జాతీయోత్పత్తిలో 1.9 శాతం.

పాకిస్తాన్ సాధారణ బడ్జెట్, రక్షణ వ్యయం, భారత ప్రభుత్వం, ఆయుధాల కొనుగోళ్లు

ఫొటో సోర్స్, Getty Images

రక్షణ బడ్జెట్‌ను పాక్ ఎందుకు పెంచాల్సి వచ్చింది?

భారత్-పాక్ ఒకరి కారణంగా మరొకరు తమ రక్షణ బడ్జెట్‌లను పెంచుకోవల్సి వస్తోందని రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ ఖాలిద్ నయీమ్ చెప్పారు.

ఈ రెండు దేశాలు కలిసి కూర్చుని వివాదాలను పరిష్కరించుకుంటే, రక్షణ బడ్జెట్‌ను తగ్గించి ఆ డబ్బును పేదరిక నిర్మూలనకు ఉపయోగించవచ్చని ఆయన తెలిపారు.

"ప్రపంచంలో కర్ర ఎవరి దగ్గర ఉంటే గేదె వారి దగ్గర ఉండాలి. అంతే కాకుండా ఆ కర్ర లావుగా ఉండాలి" అని లోధి చెప్పారు.

ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్ ప్రభావం క్రమంగా పెరుగుతోందని ఆయన అంటున్నారు.

"గతేడాది సౌదీ అరేబియాతో పాకిస్తాన్ రక్షణ ఒప్పందం కుదుర్చుకుంది. మధ్యప్రాచ్యంలోని సంఘర్షణను పరిష్కరించడంలో కూడా ముందుంది" అని లోధి గుర్తు చేశారు.

పాకిస్తాన్‌కు బలమైన ఆర్మీ ఉండటం వల్లనే ఇతర దేశాలు కూడా పాకిస్తాన్‌తో భద్రతా ఒప్పందాలను కోరుకుంటున్నాయి. దీనిపై మరిన్ని వనరులు ఖర్చు చేస్తుంటే, అది పాకిస్తాన్ ప్రయోజనాలకు మేలు చేస్తుందనేది ఆయన అభిప్రాయం.

"గతంలో పాకిస్తాన్‌కు భారత్‌తోనే శత్రుత్వం ఉండేది. కానీ ఇప్పుడు అఫ్గానిస్తాన్ సరిహద్దులో కూడా పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది" అని లోధి చెప్పారు.

"రక్షణపై ఇంత ఖర్చు చేస్తుంటే ప్రజల జీవితాలు ఎలా బాగు పడతాయనే ప్రశ్న తలెత్తుతుంది" అని అన్నారు.

పాకిస్తాన్ అంతర్గత భద్రత సమస్యలు పరిష్కారమై, పొరుగు దేశాలతో ఉద్రిక్తతలు ముగిసే వరకు పాకిస్తాన్ రక్షణ అవసరాలు పెరుగుతూనే ఉంటాయని లోధి అభిప్రాయ పడ్డారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)