ఆయిల్ ధరలు దిగివస్తున్నాయి.. అమెరికా, ఇరాన్ ఒప్పందం తరువాత తగ్గుదల

అమెరికా, ఇరాన్, ఒప్పందం, పాక్, చమురు ధరలు

ఫొటో సోర్స్, EPA/Shutterstock

    • రచయిత, పీటర్ హాస్కిన్స్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 3 నిమిషాలు

అమెరికా-ఇరాన్ యుద్ధాన్ని ముగించేందుకు ఒప్పందం కుదిరిందన్న ప్రకటన తరువాత మార్కెట్లు స్పందించాయి.

ఆసియా మార్కెట్ల ప్రారంభ ట్రేడింగ్‌లో చమురు ధరలు తగ్గాయి.

ఈ ఒప్పందం ద్వారా కీలకమైన హార్ముజ్ జలసంధి తిరిగి తెరుచుకోనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ తెలిపారు.

ప్రపంచ చమురు ప్రమాణంగా పరిగణించే బ్రెంట్ క్రూడ్ ధర 3.8 % తగ్గి బ్యారెల్‌కు 84.02 డాలర్లకు చేరుకుంది. అమెరికాలో ట్రేడయ్యే క్రూడ్ ఆయిల్ ధర 4.1% తగ్గి బ్యారెల్‌కు 81.40 డాలర్లుగా నమోదైంది.

ఈ ఒప్పందంపై రెండు దేశాలు అధికారికంగా జూన్ 19న స్విట్జర్లాండ్‌లో సంతకాలు చేస్తాయని పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ వెల్లడించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఇరాన్ డిప్యూటీ మినిష్టర్ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ కాజిమ్ గరీబాబాదీ ఈ ఒప్పందాన్ని ధ్రువీకరించారు.

ఆ దేశ ప్రభుత్వ టీవీ చానల్‌తో ఆయన ఫోన్‌లో మాట్లాడుతూ.. అమెరికాతో ఒప్పందం కుదిరిందని, శుక్రవారం స్విట్జర్లాండ్‌లో ఒప్పందంపై సంతకాలు జరుగుతాయని తెలిపారు.

'ప్రపంచంలోని నౌకలన్నీ ఇక తమ ఇంజిన్లు ఆన్ చేయొచ్చు. ఇక చమురు ప్రవహించనీ' అంటూ డోనల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు.

'అయితే, ఇప్పటికీ ఒప్పందంలో వివరాలు స్పష్టంగా లేకపోవడం మార్కెట్లలో ఆందోళన, అనిశ్చితిని పెంచవచ్చు'అని ఎనర్జీ మార్కెట్ విశ్లేషణ సంస్థ వందా ఇన్‌సైట్స్‌కు చెందిన వందనా హరి చెప్పారు.

ఇది వచ్చే వారం మొత్తం చమురు మార్కెట్‌లో అస్థిరతకు దారితీయొచ్చని ఆమె చెప్పారు.

అమెరికా, ఇజ్రాయెల్ ఫిబ్రవరి 28న ఇరాన్‌పై వైమానిక దాడులు ప్రారంభించిన కొద్దిసేపటికే హార్ముజ్ జలసంధిని మూసేసింది ఇరాన్. అలాగే ఈ కీలక జలమార్గాన్ని ఉపయోగించే నౌకలపై దాడి చేస్తామని హెచ్చరించింది.

ప్రపంచంలోని చమురు, లిక్విడ్ నేచురల్ గ్యాస్‌లో సుమారు 20% రవాణా ఈ మార్గం ద్వారానే జరుగుతుంది.

స్టాక్ మార్కెట్, పెట్రోల్, డీజిల్

ఫొటో సోర్స్, Getty Images

కొన్ని నెలలుగా గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లు అస్థిరంగా ఉన్నాయి. అమెరికా–ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరిగిన యుద్ధ పరిణామాలకు అనుగుణంగా ధరలు ఒక్కసారిగా పెరుగుతూ లేదా తగ్గుతూ వచ్చాయి.

యుద్ధం ప్రారంభం కాకముందు బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు సుమారు 70 డాలర్లు ఉండేది. కానీ యుద్ధ సమయంలో ఇది గరిష్ఠంగా 120 డాలర్ల వరకు పెరిగింది.

హార్ముజ్ జలసంధి ద్వారా చమురు రవాణా యుద్ధానికి ముందు స్థాయికి తిరిగి రావడం వెంటనే సాధ్యం కాదని ఇంధనరంగ నిపుణులు కూడా హెచ్చరించారు.

ముందుగా సముద్ర మార్గంలో మందుపాతరలను తొలగించాల్సి ఉంటుందని, దీనికి కొన్ని వారాల నుంచి ఆరు నెలల వరకు సమయం పట్టవచ్చని లిపో ఆయిల్ అసోసియేట్స్ కన్సల్టింగ్ కంపెనీకి చెందిన ఆండ్రూ లిపో చెప్పారు.

అలాగే ఆ జలమార్గాన్ని ఉపయోగించేందుకు ఇప్పటికే చాలా ట్యాంకర్లు క్యూలో ఉన్నాయని, చమురు ఉత్పత్తిని మళ్లీ ప్రారంభించి నౌకల లోడింగ్‌ను సాధారణ స్థాయికి తీసుకురావడానికి కూడా కొన్ని వారాలు పట్టవచ్చని తెలిపారు.

ఇదిలా ఉండగా ఒప్పందం వార్తలతో ఆసియా స్టాక్ మార్కెట్లు పుంజుకున్నాయి.

జపాన్‌లోని నిక్కీ 225 సూచీ ఉదయం ట్రేడింగ్‌లో 4.3% పెరిగింది. దక్షిణ కొరియాలోని కోస్పి సూచీ 5% కంటే ఎక్కువగా పెరిగింది.

ఆ ప్రాంతం చమురు,ఎల్ఎన్‌జీ సరఫరాల కోసం మధ్యప్రాచ్యంపై ఎక్కువగా ఆధారపడటం వల్ల ఇంధన ధరలు పెరగడంతో తీవ్ర ప్రభావం పడింది.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)