ఇజ్రాయెల్‌ను, పాకిస్తాన్, సౌదీ, ఖతార్ గుర్తిస్తాయా? సెనేటర్ గ్రాహం పోస్టుపై ముస్లిం దేశాలలో విమర్శలు దేనికి?

అమెరికా, ఇరాన్, ఖతార్, పాకిస్తాన్, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్, అబ్రహం ఒప్పందాలు

ఫొటో సోర్స్, Pakistan Prime Minister

ఫొటో క్యాప్షన్, సౌదీ అరేబియా, పాకిస్తాన్ ఇప్పటి వరకు ఇజ్రాయెల్‌ను గుర్తించలేదు
ప్రచురణ
చదివే సమయం: 7 నిమిషాలు

ఇరాన్‌తో చర్చలు సానుకూలంగా సాగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ చెప్పారు.

ఇజ్రాయెల్‌ను గుర్తించే చారిత్రాత్మక అబ్రహం ఒప్పందాల్లో మధ్యప్రాచ్య దేశాలు కూడా చేరతాయని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు.

ట్రూత్ సోషల్‌లో ట్రంప్ పోస్ట్ చేసిన ఈ ప్రకటనపై విస్తృతంగా చర్చ జరుగుతోంది.

అదే సమయంలో అమెరికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం తన ఎక్స్ ఖాతాలో ట్రంప్‌ ప్రకటనకు మద్దతుగా పోస్ట్ పెట్టారు.

"ఇరాన్-అమెరికా వివాదం చర్చల ద్వారా పరిష్కారమై, ఈ ప్రాంతంలోని అరబ్, ముస్లిం మిత్రదేశాలు అబ్రహం ఒప్పందంలో చేరితే అది మిడిల్ ఈస్ట్ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైనది అవుతుంది" అని రాశారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ట్రంప్ తన ప్రకటనలో ప్రత్యేకంగా ఏ దేశం పేరు ప్రస్తావించనప్పటికీ లిండ్సే గ్రాహం తన పోస్ట్‌లో సౌదీ అరేబియా, ఖతార్, పాకిస్తాన్ పేర్లను ప్రస్తావించారు.

ఈ మూడు దేశాలు అబ్రహం ఒప్పందాల్లో చేరకపోతే "భవిష్యత్‌లో మన సంబంధాలలో తీవ్ర పరిణామాలు ఎదురుకావచ్చు" అని ఆయన హెచ్చరించారు.

దీంతో పాకిస్తాన్, సౌదీ అరేబియా, ఖతార్‌కు చెందిన యూజర్లు గ్రాహం పోస్ట్‌పై తీవ్రంగా స్పందించారు. ఆయన వ్యాఖ్యలపై విమర్శలు గుప్పించారు.

ఇజ్రాయెల్‌ను గుర్తించాల్సిందిగా ఈ దేశాలపై ఎలా ఒత్తిడి తెస్తారంటూ అనేకమంది గ్రాహంను విమర్శించారు.

అమెరికా, ఇరాన్, ఖతార్, పాకిస్తాన్, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్, అబ్రహం ఒప్పందాలు

ఫొటో సోర్స్, Jabin Botsford/The Washington Post via Getty Images)

ఫొటో క్యాప్షన్, అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు 2020 సెప్టెంబర్ 15న అబ్రహం ఒప్పందాలపై సంతకం చేశారు.

అరబ్, ముస్లిం దేశాల నాయకులతో ట్రంప్ చర్చలు

డోనల్డ్ ట్రంప్ ఆదివారం పాకిస్తాన్, సౌదీ అరేబియా, తుర్కియే, ఖతార్, ఈజిప్ట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, జోర్డాన్ నాయకులతో ఫోన్‌లో సంభాషించారు.

వీరిలో పాక్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్, సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ ఉన్నారు.

ఇరాన్‌తో చర్చల పురోగతి గురించి ఇజ్రాయెల్‌కు వివరించినట్లు ట్రంప్ చెప్పారు.

ఇరాన్‌తో ఒప్పందం దాదాపు ఖరారైందని త్వరలోనే ప్రకటిస్తామనని ట్రంప్ అంటున్నారు.

అరబ్, ముస్లిం దేశాల నాయకులతో ట్రంప్ చర్చల వివరాలు పూర్తి స్థాయిలో అందుబాటులో లేనప్పటికీ ఇరాన్‌తో శాంతి ఒప్పందానికి సంబంధించిన అన్ని అంశాలపై వారితో చర్చించినట్లు ట్రంప్ పేర్కొన్నారు.

హార్ముజ్ జలసంధి ద్వారా రవాణాను పునరుద్ధరించడం సహా ఒప్పందంలో అనేక అంశాలున్నాయని ట్రంప్ చెబుతున్నారు.

అమెరికా, ఇరాన్, ఖతార్, పాకిస్తాన్, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్, అబ్రహం ఒప్పందాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ట్రంప్ కీలక సహచరులలో రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం ఒకరు.

'మీరు లైన్‌లోనే ఉన్నారా'

మిడిల్‌ఈస్ట్‌లో శాంతి స్థాపనకు ట్రంప్ 'అసాధారణ ప్రయత్నం' చేశారని పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ అన్నారు.

"ట్రంప్‌తో టెలిఫోన్ చర్చల్లో పాకిస్తాన్ తరపున ఆ దేశపు ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ ప్రాతినిధ్యం వహించారు. శాంతి సాధనలో ట్రంప్ కృషిని అభినందించాలి" అని షాబాజ్ షరీఫ్ ఎక్స్‌లో చేసిన పోస్టులో తెలిపారు.

ట్రంప్‌తో ఫోన్ సంభాషణల్లో భాగంగా తాజా పరిణామాలపై చర్చించినట్లు సౌదీ ప్రెస్ ఏజెన్సీ వెల్లడించింది.

‘‘ఇరాన్‌తో యుద్ధం ముగించే ఒప్పందం కుదిరితే ముస్లిం, అరబ్ దేశాలు ఇజ్రాయెల్‌తో శాంతి ఒప్పందంపై సంతకం చేయాలని తాను కోరుకుంటున్నట్లు ట్రంప్ ఆయా దేశాల నేతలతో చెప్పారని’’ ఫోన్ కాల్ చర్చల గురించి తెలిసిన ఇద్దరు అమెరికన్ అధికారులు తమతో చెప్పినట్లు ఆక్సియోస్ వార్తా సంస్థ తెలిపింది.

"ట్రంప్ అభ్యర్థనతో సౌదీ, ఖతార్, పాకిస్తాన్ నాయకులు ఆశ్చర్యపోయారు. ఈ మూడు దేశాలకు ఇజ్రాయెల్‌తో ఎలాంటి సంబంధాలు లేవు. ట్రంప్ ప్రతిపాదన విన్న తర్వాత వాళ్లంతా నిశబ్దంగా ఉండటంతో ట్రంప్ సరదాగా "మీరు లైన్‌లోనే ఉన్నారా?" అని అడిగినట్లు అమెరికన్ అధికారి తమతో చెప్పారని ఆక్సియోస్ కథనం తెలిపింది.

అయితే ఇప్పటిదాకా ఈ దేశాలు ఫోన్ కాల్ గురించిన వివరాలు వెల్లడించడం కానీ, ట్రంప్ అటువంటి సంభాషణ జరిపారని నిర్థరించడం కానీ చేయలేదు.

అయితే సౌదీ యువరాజుతో కిందటి నవంబరులో శ్వేతసౌధంలో జరిపిన సంభాషణలో ఇజ్రాయెల్‌ను గుర్తించమని ట్రంప్ సూచించడం ఇక్కడ ప్రస్తావించుకోవాల్సిన అంశం.

అమెరికా, ఇరాన్, ఖతార్, పాకిస్తాన్, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్, అబ్రహం ఒప్పందాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అబ్రహం ఒప్పందాల గురించి రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం చేసిన వ్యాఖ్యలు విస్తృత చర్చకు దారి తీశాయి.

గ్రాహం వ్యాఖ్యలపై ముస్లిం దేశాల్లో ఆగ్రహం

రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం ట్రంప్ కీలక సహచరులలో ఒకరుగా భావిస్తారు.

సౌదీ అరేబియా, ఖతార్, పాకిస్తాన్ పేర్లను ప్రస్తావిస్తూ "వాళ్లు అబ్రహం ఒప్పందాల్లో చేరడం ఈ ప్రాంతానికి, ప్రపంచానికి గేమ్‌ ఛేంజర్ అవుతుంది. ఇది అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ తీసుకున్న అద్భుతమైన చర్య" అని ఆయన అన్నారు.

"మధ్య ప్రాచ్యానికి నూతన భవిష్యత్ ఇచ్చేందుకు సౌదీ అరేబియాతో పాటు ఇతర దేశాలు సాహసోపేత నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం వచ్చేసింది. అధ్యక్షుడు ఇప్పటికే ఈ దిశగా సంకేతాలిచ్చారు. అరబ్- ఇజ్రాయెల్ ఘర్షణను అంతం చేసే అబ్రహం ఒప్పందాల్లో ఈ దేశాలు చేరతాయని ఆశిస్తున్నా" అని గ్రాహం అన్నారు.

దీనిపై సౌదీ అరేబియా, పాకిస్తాన్ నుంచి అధికారిక స్పందన ఏదీ రాలేదు. కానీ ఈ విషయం ఆ దేశపు ఆన్‌లైన్ యూజర్లలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఈ రెండు దేశాలు ఇజ్రాయెల్‌ను గుర్తించలేదు. ఇజ్రాయెల్‌తో వాటికి దౌత్య సంబంధాలు లేవు.

"కొన్ని రోజుల క్రితం గ్రాహం పాకిస్తాన్‌పై విషం కక్కారు. అకస్మాత్తుగా, ఆయన పాకిస్తాన్‌ను పొగుడుతున్నారు. వాళ్ళు ఆటలాడుతున్నారు" అని పాకిస్తానీ జర్నలిస్ట్ హమీద్ మీర్ ‌తన ఎక్స్ ఖాతాలో రాశారు.

"లిండ్సే గ్రాహం కలలు కంటున్నారు" అని మరో జర్నలిస్ట్ అస్మా షిరాజీ అన్నారు.

సౌదీ అరేబియా ద్విదేశ పరిష్కారాన్ని సాధించడానికి 2026 మే 22న ఒక అంతర్జాతీయ కూటమిని ఏర్పాటు చేసిందని సౌదీ అరేబియాకు చెందిన అబ్దుల్ సలాం సలేహ్ తన సోషల్ మీడియా అకౌంట్‌లో రాశారు.

"అబ్రహం ఒప్పందాలలో చేరమని మాకు చెప్పడానికి మిమ్మల్ని ప్రేరేపించిన అంశం ఏంటి? మీరు మాకు మేలు చేస్తున్నారా లేక మా నిర్ణయాలకు మార్గనిర్దేశం చేస్తున్నారా? పాలస్తీనా సమస్యపై మా వైఖరి చర్చలకు అతీతమైనది. బెదిరింపులు లేదా ప్రలోభాలతో దానిపై ఒత్తిడి తీసుకురాలేరు" అని సలేహ్ పేర్కొన్నారు.

"తూర్పు జెరూసలేం రాజధానిగా స్వతంత్ర పాలస్తీనా ఏర్పాటు చేయకుండా శాంతి సాధ్యం కాదు. ఇదే వైఖరిని మేం ప్రపంచానికి తెలియజేశాం. దీనికి 165 దేశాల మద్దతు ఉంది" అని ఆయన రాశారు.

"సౌదీ అరేబియా తన సొంత ప్రయోజనాల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటుంది తప్ప లిండ్సే గ్రాహం అభిప్రాయాల ఆధారంగా కాదు" అని సౌదీ అరేబియాకి చెందిన యూజర్ ఒకరు అభిప్రాయపడ్డారు.

అమెరికా, ఇరాన్, ఖతార్, పాకిస్తాన్, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్, అబ్రహం ఒప్పందాలు

ఫొటో సోర్స్, Saeed MMT Jaras/Anadolu via Getty Images

ఫొటో క్యాప్షన్, గాజాలో ఇజ్రాయెల్ చర్యలను సౌదీ అరేబియా మరిచిపోలేదని నిపుణులు చెబుతున్నారు.

అమలు సాధ్యమేనా?

"పాలస్తీనా సమస్యను పూర్తిగా విస్మరించడం సాధ్యం కాదు. ఊహాజనిత విషయాలను పదే పదే చెప్పడం ద్వారా మిడిల్ ఈస్ట్‌ వాస్తవికతను మార్చలేరు" అని మిడిల్ ఈస్ట్ వ్యవహారాల నిపుణుడు డానీ సిట్రినోవిచ్ అన్నారు.

"ఇజ్రాయెల్ పాలకులు, ప్రజలు ఏదో ఒక రోజు ఈ నిజాన్ని ఎదుర్కోక తప్పదు" అని సిట్రినోవిచ్ అభిప్రాయపడ్డారు.

అరబ్ ప్రపంచంతో ముఖ్యంగా సౌదీ అరేబియాతో సంబంధాల విషయంలో పాలస్తీనా సమస్యపై అర్థవంతమైన పురోగతి సాధించడం అవసరం. ఏదో చేస్తున్నట్లు చూపించడం సరిపోదు. నిజమైన రాజకీయ పురోగతి అవసరం .

"గల్ఫ్ దేశాలు భద్రత, స్థిరత్వంపై దృష్టి సారిస్తాయి. ఇప్పటి వరకు యూఏఈ మాత్రమే ఈ విషయంలో ముందుంది. మిగతా దేశాలు కూడా ఇదే పని చేస్తాయి. ప్రస్తుత ఇజ్రాయెల్ పాలకుల కోణంలో చూస్తే సంబంధాలు సాధారణ స్థితికి వస్తాయని నమ్మకం లేదు" అని కార్నెగీ ఎండోమెంట్ అనే థింక్ ట్యాంక్‌కు చెందిన ఇర్విన్ డేవిడ్ మిల్లర్ అన్నారు.

"ఇవి చాలా ప్రమాదకర సంకేతాలు" అని అంటున్న పాకిస్తాన్ జర్నలిస్ట్ జాఫర్ నఖ్వీ దీనిపై పాక్ పాలకులు అధికారికంగా స్పందించాలని కోరారు.

ఇజ్రాయెల్‌ మధ్య ప్రాచ్యానికి పట్టిన "క్యాన్సర్" అని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ 2026 ఏప్రిల్‌లో అన్నారు.

"ఇజ్రాయెల్ సైనిక చర్యల్లో అమాయక పౌరులు చనిపోతున్నారు. మొదట గాజా, తర్వాత ఇరాన్, ఇప్పుడు లెబనాన్‌లో అడ్డూ అదుపు లేని రక్తపాతం స్పష్టంగా కనిపిస్తోంది" అని ఆయన ఇజ్రాయెల్ మీద ఆరోపణలు చేశారు.

"ఇజ్రాయెల్‌ను నాశనం చేయాలన్న పాక్ రక్షణ మంత్రి పిలుపు రెచ్చగొట్టేలా ఉంది. దీన్ని ఏ ప్రభుత్వం సహించదు. ముఖ్యంగా శాంతికి నిష్పక్షపాత మధ్యవర్తిగా ఉంటామని చెప్పుకునే ప్రభుత్వం అస్సలు అంగీకరించకూడదు" అని ఖవాజా ఆసిఫ్ ప్రకటనను ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం ఖండించింది.

పాక్, సౌదీ మాదిరిగానే ఖతార్ కూడా ఇజ్రాయెల్‌ను గుర్తించడానికి నిరాకరిస్తోంది.

ఖతార్‌లోని హమాస్‌ స్థావరాలపై 2025 సెప్టెంబర్‌లో ఇజ్రాయెల్ డ్రోన్ దాడి చేసింది.

ఇజ్రాయెల్‌తో శాంతి ఒప్పందానికి ముందు పాలస్తీనియన్లకు ఆమోదయోగ్యంగా ఉండే పాలస్తీనా ఏర్పాటు చేయాలని 2020లో ఖతార్ విదేశాంగ మంత్రి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)