ఫతా-3: ఈ పాకిస్తానీ క్షిపణిని భారత్ బ్రహ్మోస్‌తో ఎందుకు పోలుస్తున్నారు?

ఫొటో సోర్స్, ISPR
- రచయిత, ఉమైర్ సలీమి
- హోదా, బీబీసీ ప్రతినిధి
- చదివే సమయం: 5 నిమిషాలు
ఫతా-3 క్రూయిజ్ క్షిపణిని తయారు చేసినట్లు పాకిస్తాన్ సైన్యం తాజాగా ప్రకటించింది. ఈ క్షిపణిని భారత్ దగ్గరున్న బ్రహ్మోస్ మిసైల్‌తో పోలుస్తున్నారు.
పాకిస్తాన్ సైన్యానికి చెందిన ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ఐఎస్‌పీఆర్) మే 7న తమ సైనిక సన్నద్ధతలకు సంబంధించి విడుదల చేసిన ప్రమోషనల్ వీడియోలో ఫతా-3 క్రూయిజ్ క్షిపణి చిత్రాన్ని చూపించింది.
ఫతా-3 క్రూయిజ్ క్షిపణి సామర్థ్యాలను ఐఎస్‌పీఆర్ వెల్లడించనప్పటికీ.. ఇది సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి అని రక్షణ నిపుణులు భావిస్తున్నారు. ధ్వని వేగంతో పోలిస్తే మూడు నుంచి నాలుగింతలు అధిక వేగంతో వెళ్తుందని అంటున్నారు.
రక్షణ నిపుణుల ప్రకారం.. భవిష్యత్‌లో జరిగే నిర్దిష్ట దాడుల కోసం పాకిస్తాన్ దీన్ని అభివృద్ధి చేసిందని రక్షణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
సోషల్ మీడియాను చూస్తే.. ఫతా-3 క్రూయిజ్ క్షిపణిని చాలామంది కామెంటర్లు బ్రహ్మోస్ క్షిపణితో పోలుస్తున్నారు. ఫతా-3, బ్రహ్మోస్ మధ్యనున్న సారూప్యతలేంటి? సామర్థ్యాల పరంగా వాటిని ఎలా ఉపయోగిస్తారో తెలుసుకోవడానికి బీబీసీ ప్రయత్నించింది..

ఫతా-3 ‘సూపర్ సోనిక్’ క్రూయిజ్ క్షిపణి ప్రత్యేకతలేంటి?
ఫతా-3 గురించి ఇప్పటి వరకు వెల్లడైన సమాచారం ప్రకారం.. పాకిస్తాన్ సైన్యం సొంతంగా సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణిని రూపొందించేందుకు పనిచేస్తున్నట్లు సూచిస్తోందని రక్షణ పరిశోధకులు, టోరంటోకు చెందిన డిఫెన్స్ న్యూస్ అండ్ అనాలసిస్ గ్రూప్ ఖువ్వత్ వ్యవస్థాపకలు బిలాల్ హుస్సేన్ ఖాన్ తెలిపారు.
ఫతా సిరీస్ క్షిపణులు సుదూరంలోని 'కచ్చితమైన లక్ష్యాల' కోసం ఉపయోగించే సంప్రదాయ ఆయుధాలు. ఇవి తక్కువ ఎత్తులో ప్రయాణిస్తాయి కాబట్టి వీటిని అడ్డుకోవడం కష్టం.
వీటిల్లో ఫతా-1 పరిధి 140 కిలోమీటర్లు కాగా.. ఫతా-2 పరిధి 400 కిలోమీటర్ల వరకు ఉంటుంది.
2026 ఏప్రిల్ 28న జారీ చేసిన ఒక ప్రకటనలో, స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఫతా-2 క్షిపణిని విజయవంతంగా ప్రయోగించినట్లు పాకిస్తాన్ సైన్యం తెలిపింది.

ఫొటో సోర్స్, X
750 కిలోమీటర్ల పరిధి గల ఫతా 4ను భూ ఉపరితలం నుంచి ప్రయోగించే క్రూయిజ్ క్షిపణిగా పరీక్షించినప్పటికీ, ఫతా 3ను ఇప్పుడు ప్రత్యేకంగా సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణిగా అభివృద్ధి చేశారని బిలాల్ హుస్సేన్ చెప్పారు.
ఐఎస్‌పీఆర్ విడుదల చేసిన వీడియో, చిత్రాలు.. ప్రత్యేకమైన రామ్‌జెట్ ఇంజిన్ కారణంగా ఫతా-3 క్షిపణి ధ్వని వేగం కంటే వేగంగా ప్రయాణిస్తుందని చూపిస్తున్నాయని ఆయన అన్నారు.
దాని డిజైన్ చైనాలో తయారైన హెచ్‌డీ-1 క్షిపణిని పోలి ఉందని కూడా ఈ చిత్రాలు సూచిస్తున్నాయి.
హెచ్‌డీ-1 అనేది సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి. 2018లో చైనాకు చెందిన మైనింగ్ కంపెనీ తొలుత దీన్ని అభివృద్ధి చేసింది.
కంపెనీ చెప్పిన వివరాల ప్రకారం.. దీని వేగం గంటకు 2,716 నుంచి 4,321 కిలోమీటర్లు. ధ్వని వేగం కంటే చాలారెట్లు ఎక్కువ.
పాకిస్తాన్ తన రక్షణ పరికరాల్లో ఎక్కువగా చైనా నుంచి దిగుమతి చేసుకున్నందున, హెచ్‌డీ-1 క్షిపణిని దేశీయంగా తయారు చేసేందుకు పాకిస్తాన్ లైసెన్స్ పొంది ఉండొచ్చని బిలాల్ హుస్సేన్ ఖాన్ భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ క్షిపణిని బ్రహ్మోస్‌తో పోల్చవచ్చా?
భారత బ్రహ్మోస్ క్షిపణి కూడా ధ్వనికంటే వేగంగా ప్రయాణించేందుకు రామ్‌జెట్ ఇంజిన్‌ను ఉపయోగిస్తుందని, లక్ష్యాన్ని గుర్తించడానికి దీనిలో కొన్ని నావిగేషన్ వ్యవస్థలూ ఉన్నాయని బిలాల్ హుస్సేన్ ఖాన్ తెలిపారు.
బ్రహ్మోస్ లాగే, హెచ్‌డీ-1ను కూడా భూ ఉపరితలం, ఆకాశం నుంచి ప్రయోగించవచ్చు.
బ్రహ్మోస్ క్షిపణి గంటకు 290 కిలోమీటర్ల వరకు సూపర్ సోనిక్ వేగంతో ప్రయాణించగలదని, దీని ద్వారా ప్రయాణ సమయం తగ్గుతుందని భారత మీడియా నివేదికలు పేర్కొంటున్నాయి.
ఈ నివేదికల ప్రకారం, ఇది లక్ష్యం తనను తాను రక్షించుకోవడానికి సమయం ఇవ్వదు. దాడి వేగంగా ఉంటుంది. ప్రపంచంలోని ఏ క్షిపణి నిరోధక వ్యవస్థతోనైనా దీనిని ఆపడం కష్టం.
బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రకారం.. శత్రు రాడార్ నుంచి తప్పించుకునే సామర్థ్యం దీనికుంది.
''ఫైర్ అండ్ ఫర్గెట్'' ప్రిన్సిపల్‌ను ఇది వాడుతుంది. అంటే, లక్ష్యంవైపుగా సాగే దాని ప్రయాణాన్ని నిరంతరం పర్యవేక్షించరు.
మరోవైపు, ఫతా-3 క్షిపణి పరిధి వివరాలు ఇంకా బయటికి రాలేదు. కానీ, దీనిని చైనా హెచ్‌డీ-1 క్షిపణికి చెందిన 'ఎక్స్‌పోర్టు గ్రేడ్'గా పరిగణిస్తే, దాని పరిధి 280 కిలోమీటర్లు ఉంటుంది.
అయితే, పాకిస్తాన్ చాలా ఎక్కువ పరిధి గల క్షిపణులను అభివృద్ధి చేసినందున, దాని పరిధిని బహుశా 400 నుంచి 500 కిలోమీటర్ల వరకు పెంచుతుందని ఆయన భావిస్తున్నారు.
గైడెన్స్, ట్రాకింగ్ టెక్నాలజీ విషయానికి వస్తే, ఈ క్షిపణుల సామర్థ్యం బ్రహ్మోస్‌ను పోలి ఉంటుందని, ఆధునిక చైనా ఆయుధాల మాదిరి సామర్థ్యాన్ని కలిగి ఉండవచ్చని ఆయన అన్నారు.
ఆయన చెప్పిన వివరాల ప్రకారం, క్షిపణుల కోసం రామ్‌జెట్, స్క్రామ్‌జెట్ ఇంజిన్‌లను డిజైన్ చేసి, పరీక్షించే ఆధునిక సౌకర్యాలు పాకిస్తాన్‌కు లేవు. దీని కోసం చైనా సహాయం కోరి ఉండే అవకాశం ఉంది.
2018లో పాకిస్తాన్‌కు హెచ్‌డి-1ను ఒక చైనీస్ మైనింగ్ కంపెనీ ఆఫర్ చేసినప్పుడు, ఈ విషయంలో టెక్నాలజీ బదిలీ అయి ఉంటుందని చాలా ఊహాగానాలు వచ్చాయని ఆయన అన్నారు.
భారత బ్రహ్మోస్ క్షిపణులను దేశీంగా తయారు చేస్తున్నప్పటికీ, రామ్‌జెట్ ఇంజిన్‌లను రష్యా నుంచి దిగుమతి చేసుకునే అవకాశం ఉందని ఆయన అన్నారు.
ఫతా-3 విషయంలో, పాకిస్తాన్ బహుశా దానిని చైనా నుంచి దిగుమతి చేసుకుని, దాని సహకారంతో గైడెన్స్ సిస్టమ్‌ను అభివృద్ధి చేస్తుందని తెలిపారు.

ఫొటో సోర్స్, ISPR
భవిష్యత్ సైనిక సంఘర్షణల్లో క్రూయిజ్ క్షిపణులు ఎలాంటి పాత్ర పోషిస్తాయి?
గత ఏడాది మే నెలలో జరిగిన సైనిక ఘర్షణలో భారత్ బ్రహ్మోస్ క్షిపణిని ఉపయోగించగా, ఫతా-1 క్షిపణిని పాకిస్తాన్ ప్రయోగించిందని పలు మీడియా నివేదికలు పేర్కొన్నాయి.
భారత్, పాకిస్తాన్ రెండింటి వద్ద కూడా సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణులు ఉన్నాయని, ఇవి భవిష్యత్తు సైనిక యుద్ధాలను గత యుద్ధాలకన్నా చాలా భిన్నంగా మార్చగలవని రక్షణ నిపుణులు అన్నారు.
సుదూర బాలిస్టిక్ క్షిపణుల మాదిరిగా కాకుండా, క్రూయిజ్ క్షిపణులు రాడార్‌ను తప్పించుకోగలవని, సూపర్ సోనిక్ వేగంతో ప్రయాణించగలవని పాకిస్తానీ సైన్యంలో మాజీ బ్రిగేడియర్ డాక్టర్ తుగ్రాల్ యామిన్ బీబీసీకి చెప్పారు. కానీ, వాటి పరిధి తక్కువగా ఉంటుందని తెలిపారు.
యుక్రెయిన్‌లో యుద్ధం, మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న సంఘర్షణలను ఉదాహరణగా చూపుతూ.. యుద్ధాలలో క్షిపణులు, డ్రోన్‌ల వాడకం గణనీయంగా పెరిగిందని ఆయన అంటున్నారు.
గత ఏడాది ఆగస్టులో రాకెట్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసినప్పటి నుంచి పాకిస్తాన్ సాయుధ దళాలు పలు క్షిపణులను పరీక్షించాయి.
రాకెట్ ఫోర్స్ ఏర్పాటు చేసిన ఉద్దేశ్యం సంప్రదాయ క్షిపణుల నుంచి వ్యూహాత్మక అణు క్షిపణులను వేరుచేసి చూపించడమేనని తుగ్రాల్ యామిన్ చెప్పారు.
ఫతా-3 క్షిపణుల వాడకంపై స్పందించిన ఆయన.. ఫతా-3 వంటి అత్యంత కచ్చితత్వంతో దాడి చేయగల క్షిపణులు, శత్రురక్షణ వ్యవస్థను లక్ష్యంగా చేసుకోగలవని అన్నారు. ఒకవేళ తొలి దాడి లేదా ముందస్తు దాడి విజయవంతమైతే, యుద్ధాన్ని తక్కువ సమయంలోనే ముగించవచ్చని పేర్కొన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)























