గాయపడ్డ సింహం మూవీ రివ్యూ: హీరో ‘డోనల్డ్ ట్రంప్ మీద ఎందుకు పగపట్టాడు’?

ఫొటో సోర్స్, Zee Studios/YT
- రచయిత, జీఆర్ మహర్షి
- చదివే సమయం: 3 నిమిషాలు
తరుణ్ భాస్కర్ హీరోగా , జెడి చక్రవర్తి, ఫరియా అబ్దుల్లా , శ్రీవిష్ణు నటించిన గాయపడ్డ సింహం థియేటర్‌లోకి వచ్చింది.
మరి ఈ సింహం ప్రేక్షకుల్ని ఏం చేసిందో చూద్దాం.
కథ ఏమంటే ఐజి విజయకాంత్ (శుభలేఖ సుధాకర్) నాయకత్వంలో హర్షవర్ధన్ కొందరు పోలీస్ అధికారులు డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతారు. విజయకాంత్ కూతురు ఫరియా అబ్దుల్లాకి సంబంధాలు చూస్తూ వుంటారు. పెళ్లి చూపులకి హీరో తరుణ్ భాస్కర్ వస్తాడు. పెళ్లి కుదురుతుంది. అయితే భాస్కర్‌కి, తన తండ్రికి ముందే పరిచయం వుందని ఫరియా గ్రహించి , తనకి నిజం చెప్పమని కోరుతుంది.
కెేజీఎఫ్ తరహాలో సుధాకర్ ప్లాష్‌బ్యాక్ స్టార్ట్ చేస్తాడు.
తరుణ్ భాస్కర్ డబ్బులు సంపాదించి, లవర్ (మానస చౌదరి)ని పెళ్లి చేసుకోవాలని అమెరికా బయల్దేరుతాడు. అయితే వెళ్లిన వాడు వెళ్లినట్టే తిరిగి వస్తాడు. కారణం డోనల్డ్ ట్రంప్. ఆయన తీసుకున్న నిర్ణయం వల్ల వెనక్కి వచ్చిన (డిపోర్ట్) భారతీయ విద్యార్థుల్లో మన హీరో ఒకడు.

తిరిగి వచ్చిన తర్వాత ట్రంప్ మీద పగ పడతాడు హీరో.
తాను గాయపడిన సింహాన్ని అని, ప్రతీకారం తీర్చుకుంటానని స్నేహితులతో చెబుతాడు.
ఈ గోల భరించలేక ఒక స్నేహితుడు సలహా ఇస్తాడు. అదేంటి?
అసలు ట్రంప్ మీద పగ తీర్చుకోవడం సాధ్యమా?
ఈ కథకి మాఫియా డాన్ బ్రూటల్ ధర్మా (జెడి చక్రవర్తి)కి ఏంటి సంబంధం?
మంత్రతంత్రాల తండ్రితో గొడవపడి, సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతున్న శ్రీవిష్ణు కథని ఎలా మలుపు తిప్పాడు? అన్నది మిగతా సినిమా.

ఫొటో సోర్స్, Zee Studios/YT
క్రైమ్ కామెడీ కథలకి పెద్దగా లాజిక్ అడక్కూడదు. చూసినంత సేపు నవ్విస్తే చాలు.
ట్రంప్ మీద పగ తీర్చుకోవడం ప్రాక్టికల్‌గా అసంభవం కాబట్టి, ఆ పాయింట్‌లోనే కావాల్సినంత కామెడీ వుంది.
అందరికీ సిల్లీ అనిపించే విషయాన్ని హీరో సీరియస్‌గా తీసుకోవడం బాగుంది కానీ, కథనం పూర్తిగా నెమ్మదించడంతో ముందుకు పోకుండా అక్కడక్కడే తిరుగుతున్నట్టు అనిపిస్తుంది.
ఫస్టాఫ్‌లో పాటలు కథకి అడ్డం తగిలి బ్రేకులు వేస్తూ వుంటాయి.
కామెడీ, పంచ్‌లైన్లు అక్కడక్కడ నవ్విస్తాయి.
తరుణ్ భాస్కర్ ఈ తరహా కామెడీని ఆయన గత సినిమాల్లో చూసేశాం. కీడాకోలా తరహా పదాల గారడి, వాక్యాలను విరిచి ఫన్ చేయడం రొటీన్ అనిపిస్తుంది.
అన్ని సినిమాలు జాతిరత్నాలు కాలేవు. అనుదీప్ కూడా మళ్లీ ఆ మ్యాజిక్ చేయకలేపోయాడు.

ఫొటో సోర్స్, Kasyap Sreenivas/facebook
తండ్రితో ప్లాష్‌బ్యాక్‌ని గంభీరంగా చెప్పించడం తప్ప ఫరియా అబ్దుల్లాకి పెద్దగా నటించే అవకాశం రాలేదు. శుభలేఖ సుధాకర్, కృష్ణభగవాన్, హర్షవర్ధన్, ఓయి విష్ణు ఇలా చాలా మంది ఉన్నా ఎవరూ పెద్దగా గుర్తుండరు.
ప్రత్యేకంగా చెప్పాల్సింది జెడి చక్రవర్తి గురించి.
బ్రూటల్ ధర్మాగా వేసిన విలన్ వేషంలో కొత్తగా కనిపించాడు. అయితే ఆ పాత్రని పూర్తిస్థాయి కామెడీగా మలచడంలో దర్శకుడు కాశ్యప్ శ్రీనివాస్ సఫలం కాలేదు. దిల్లీ బెల్లీ తరహా కామెడీ వర్కౌట్ అయ్యే అవకాశం చేజారింది.
చక్రవర్తి సైకియాట్రిస్ట్‌ని కలవడం రాబర్ట్ డినీరో ఎనలైజ్ దిస్ సినిమాని గుర్తుకు తెచ్చింది.
కామియోకి మించిన పాత్రలో నటించిన శ్రీవిష్ణు పాత్ర కథకి చాలా కీలకమైంది.
అయితే ఈ క్యారెక్టర్ కొంచెం తికమకగా వుంది. మంత్రతంత్రాలపై దర్శకుడికే కొంచెం నమ్మకం వున్నట్టుంది. కామెడీ కీలకంగా నడిచే కథలోకి సీరియస్ విషయాలు వస్తే ప్రేక్షకుడు తికమకపడతాడు.
మొత్తం మీద ఈ సినిమా జస్ట్ ఓకే. ఎక్కువ ఆశించకుండా చూడొచ్చు.
ప్లస్ పాయింట్స్ః
1.తరుణ్ భాస్కర్, జెడి చక్రవర్తి
2.సెకెండాఫ్
మైనస్ పాయింట్స్ః
1.ఫస్టాఫ్ స్లో నెరేషన్
2. ఉడికీ ఉడకని కథ
ఫైనల్‌గా - గాయపడిన సింహం ప్రేక్షకుల్ని కూడా గాయపరిచే ప్రయత్నమే చేసింది.
(అభిప్రాయాలు సమీక్షకుల వ్యక్తిగతం)
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
































