ఊటీ అడవుల్లో భారీ కార్చిచ్చు, వేల ఎకరాల్లో మంటలు.. వీటివెనుక ఏదైనా కుట్రకోణం ఉందా?

- రచయిత, జేవియర్ సెల్వకుమార్
- హోదా, రిపోర్టర్, బీబీసీ తమిళ్
- చదివే సమయం: 7 నిమిషాలు
తమిళనాడు రాష్ట్రం, నీలగిరి జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో రెండు వారాలుగా చెలరేగిన భారీ మంటలు అడవులకు తీవ్రనష్టం కలిగించాయి. దాదాపు 5 వేల ఎకరాల అటవీ ప్రాంతం కాలిపోయి ఉండవచ్చని పర్యావరణవేత్తలు, జర్నలిస్టులు అంటున్నారు.
మానవ తప్పిదాల వల్లే ఈ మంటలు చెలరేగాయన్న ఆరోపణలపై దర్యాప్తు జరుగుతోందని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు.
అడవిలో మంటలను ప్రస్తుతం అదుపులోకి తెచ్చామని ముదుమలై టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ కృపా శంకర్ బీబీసీకి తెలిపారు. దాదాపు వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో, ప్రధానంగా రావి చెట్లు ఎక్కువగా కాలిపోయాయని ఆయన తెలిపారు.
మంటలు ఇంతలా వ్యాపించడానికి 'కలుపు మొక్కలే' ప్రధాన కారణమని అటవీ శాఖ కార్యదర్శి సుప్రియా సాహు బీబీసీకి వివరించారు. అలాగే, ఈ మంటలు జనావాస ప్రాంతాలకు వ్యాపించలేదని ఆమె చెప్పారు.
పశ్చిమ కనుమలలో కీలక భాగమైన నీలగిరి జిల్లాలో ముదుమలై టైగర్ రిజర్వ్, ముకుర్తి నేషనల్ పార్క్‌తో పాటు నీలగిరి, గూడలూర్ అటవీ విభాగాలు ఉన్నాయి.

నీలగిరి అటవీ ప్రాంతం షోలా అడవులు, గడ్డి భూములు, చిత్తడి నేలలు, సామాజిక అటవీవనాలు వంటి వివిధ రకాల అడవుల సమూహం.
వేసవిలో తీవ్రమైన ఎండల వల్ల ఈ అడవులు ఎండిపోతాయి. కాబట్టి అడవిలో మంటలు సాధారణం. వీటిని నిరోధించడానికి 'ఫైర్ బ్రేక్స్' ఏర్పాటు సహా పలు రక్షణ చర్యలను తమిళనాడు అటవీ శాఖ తీసుకుంటోంది.
ఈ ఏడాది కూడా నీలగిరిలో సుమారు 1000 కిలోమీటర్ల మేర ఫైర్ బ్రేక్ లైన్లను ఏర్పాటు చేసినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు.
గడ్డి భూములు, చెట్లు, మొక్కలు దట్టంగా ఉన్న ప్రాంతాల మధ్య ఒక కాలువలా మట్టి తవ్వి నిర్మించిన పొడవైన గీత వంటి మార్గాన్ని 'ఫైర్ బ్రేక్ లైన్' అంటారు. ఒక ప్రాంతంలో మంటలు చెలరేగినా, అవి ఈ లైన్ దాటి మరో ప్రాంతానికి వ్యాపించవు.
అయితే, గాలులు వేగంగా వీచినప్పుడు, మంటల తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు నిప్పు రవ్వలు ఈ లైన్లను దాటి అవతలి వైపు పడి మంటలు వ్యాపిస్తాయని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు నీలగిరిలో వ్యాపించిన మంటలు కూడా అలాంటివేనని వారు అంటున్నారు.

ఒకే సమయంలో 10 చోట్ల మంటలు..
ముదుమలై టైగర్ రిజర్వ్, నీలగిరి అటవీ విభాగంలోని వివిధ రేంజ్‌లలో ఏప్రిల్ 14 నుంచి సంభవించిన కార్చిచ్చులతో పెద్ద సంఖ్యలో చెట్లు, మొక్కలు, వన్యప్రాణులు నశించిపోయాయని పర్యావరణ కార్యకర్తలు చెబుతున్నారు.
గత రెండు వారాల్లో, ఒకేసారి పదికి పైగా ప్రాంతాల్లో మంటలు వ్యాపించాయని ముదుమలై టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ కృపాశంకర్ బీబీసీకి చెప్పారు.
పైకారా, గ్లెన్‌మార్గాన్ ప్రాంతాల్లో మొదట మంటలు చెలరేగాయి. అక్కడ మంటలను ఆర్పడానికి ప్రయత్నాలు జరుగుతుండగానే, ఊటీకి సమీపంలోని పార్సన్స్ వ్యాలీ ఆనకట్ట పరిసరాల్లో మంటలు భారీగా వ్యాపించాయని అటవీ శాఖ అధికారులు వివరించారు.
అలాగే వెన్‌లాక్ డౌన్, మసినగుడి, సింగారా, సీకూర్, మరవక్కండి డ్యామ్ ప్రాంతం, కొడనాడ్, చిన్నకున్నూరు పికపతిమండు తదితర ప్రాంతాల్లో ఒకేసారి మంటలు భారీయెత్తున వ్యాపించాయి.
వైల్డ్‌లైఫ్ అండ్ నేచర్ కన్జర్వేషన్ ట్రస్ట్ వ్యవస్థాపకులు సాదిక్ అలీ బీబీసీతో మాట్లాడుతూ, ''నీలగిరిలో మంటలు చెలరేగడం సాధారణమే. కానీ, ఒకే సమయంలో ఇలా వేర్వేరు చోట్ల వరుసగా కార్చిచ్చు వ్యాపించడం ఇంతకుముందెన్నడూ జరగలేదు. దీనివల్ల వేల ఎకరాల అడవి నాశనమైంది. కేవలం చెట్లు, మొక్కలు మాత్రమే కాకుండా, ఈ మంటల్లో చిక్కుకుని వన్యప్రాణులు, పక్షులు, సూక్ష్మ జీవులు, కీటకాలు ఏ స్థాయిలో అంతరించిపోయాయో చెప్పలేం'' అని అన్నారు.
వైమానిక దళ సాయం కోరిన కలెక్టర్
ఈ మంటలను అదుపు చేయడానికి అటవీ శాఖ చేపట్టిన చర్యలను కృపాశంకర్ బీబీసీకి వివరించారు.
మొదట నీలగిరికి చెందిన వందలాది మంది అటవీ సిబ్బందితో మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. కానీ, మంటలు వేగంగా వ్యాపిస్తుండడం, తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఇతర జిల్లాల నుంచి వందలాది మంది అటవీ సిబ్బందిని రప్పించారు.
నీలగిరి, పొరుగు జిల్లాల నుంచి భారీ సంఖ్యలో అగ్నిమాపక వాహనాలను కూడా తీసుకొచ్చారు. పరిస్థితి చేయిదాటడంతో, జిల్లా కలెక్టర్ భారత వైమానిక దళ సాయం కోరారు.
ఏప్రిల్ 25న సూలూర్ వైమానిక స్థావరం నుంచి హెలికాప్టర్‌ను రప్పించారు. పార్సన్స్ వ్యాలీ డ్యామ్ నుంచి నీటిని తోడి మంటలపై వెదజల్లి ఆర్పే ప్రయత్నం చేశారు. కానీ, వేగంగా గాలులు వీస్తుండడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకోవాల్సి వచ్చిందని అటవీ శాఖ కార్యదర్శి సుప్రియా సాహు తెలిపారు.
''నీలగిరి, కోయంబత్తూరు, తిరుప్పూర్, ఈరోడ్, సేలం, నామక్కల్, తిరునెల్వేలి సహా వివిధ జిల్లాల నుంచి 500 మందికి పైగా వచ్చిన అటవీ శాఖ సిబ్బంది ఈ మంటలను ఆర్పేందుకు రంగంలోకి దిగారు. అగ్నిమాపక వాహనాల సహాయంతో అత్యంత తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రయత్నంలో భాగంగానే హెలికాప్టర్‌ను కూడా ఉపయోగించాం'' అని కృపాశంకర్ వివరించారు.

అడవులకు జరిగిన నష్టమెంత?
నీలగిరిలో గత రెండు వారాల్లోనే కొన్ని వేల ఎకరాల విస్తీర్ణంలో అటవీ ప్రాంతం బూడిదైపోయిందని పర్యావరణ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సుమారు 28 ప్రాంతాల్లో మంటలు వ్యాపించాయని, గరిష్టంగా 5 వేల విస్తీర్ణంలో అడవి కాలిపోవడంతో అనేక వన్యప్రాణులు చనిపోయాయనే వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా వేల సంఖ్యలో రావి చెట్లు పూర్తిగా కాలిపోయాయని చెబుతున్నారు.
అయితే, ఇప్పటివరకు తమకున్న అంచనా ప్రకారం దాదాపు వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో అడవి మాత్రమే కాలిపోయి ఉండవచ్చని కృపాశంకర్ బీబీసీతో చెప్పారు.
''ఏప్రిల్ 27వ తేదీ రాత్రి నాటికి అన్నిచోట్లా మంటలు అదుపులోకి వచ్చాయి. నిఘా మరింత పెంచాం. జనావాసాలకు మంటలు వ్యాపించే అవకాశం లేదు. ఎంత నష్టం జరిగిందనేది ఇకపై లెక్కించాల్సి ఉంది. వన్యప్రాణులు మరణించినట్లు మాకు ఎలాంటి సమాచారం లేదు'' అని ఆయన వెల్లడించారు.

'కారకులపై చర్యలు తీసుకోవాలి'
నీలగిరిలో ఈ మంటల వల్ల వన్యప్రాణుల ఆవాసాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని సాదిక్ అలీ అన్నారు. మానవ - వన్యప్రాణి సంఘర్షణ వల్ల ఇబ్బందులు పడుతున్న కొందరు వ్యక్తులే ఒక పథకం ప్రకారం నిప్పు పెట్టి ఉండవచ్చని ఆయన సందేహాలు వ్యక్తం చేశారు.
''అడవిని నాశనం చేస్తే వన్యప్రాణులు తమ ప్రాంతంలో ఉండవని భావించే కొందరు ఇలాంటి పనులకు ఒడిగడతారు. ఇది పూర్తిగా అటవీ శాఖకు వ్యతిరేకంగా కొందరు చేసిన కుట్రగా భావిస్తున్నాం. కాబట్టి మంటలకు కారణమైన వారిని గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి" అని ఆయన అన్నారు.
అడవులలో మంటలు అనివార్యమా?
అడవులలో మంటలు అనివార్యమైనవని పర్యావరణవేత్త కాళిదాసన్ అంటున్నారు. నైరుతి, ఈశాన్య రుతుపవనాల తర్వాత నవంబర్ నెలాఖరులో శీతాకాలం మొదలై, శరదృతువు వరకూ ఆకులు రాల్చే కాలం కొనసాగుతుందని ఆయన అన్నారు. ఆ సమయంలో ఎండిపోయిన ఆకులను అటవీ శాఖ వారే స్వయంగా తగులబెడుతుంటారని ఆయన ప్రస్తావించారు.
''అడవిలో మంటలు అనేది ప్రపంచవ్యాప్త సమస్య. అయితే, భారతదేశంలో అడవిలో కార్చిచ్చులు దాదాపుగా మానవ సంబంధిత కారణాల వల్ల సంభవించేవే'' అని కాళిదాసన్ అంటున్నారు.
అడవిలో మంటలకు కారణాలను రెండు రకాలుగా విభజించవచ్చని.. కొందరు బాధ్యతారాహిత్యం వల్ల నిప్పు పెడితే, మరికొందరు ఉద్దేశపూర్వకంగా చేస్తారని ఆయన చెప్పారు.
''గతంలో పశువుల మేత కోసం అడవిని తగులబెట్టేవారు. అడవి కాలిపోతే కొత్త గడ్డి మొలుస్తుందని, తద్వారా పశువులకు మేత దొరుకుతుందని వారు అలా చేసేవారు. కానీ, ఇప్పుడు పశువుల సంఖ్య తగ్గింది. అడవిలోకి మేత కోసం అనుమతించడం కూడా తగ్గింది. అదేవిధంగా, ఎండిన ఆకుల మధ్య పడి ఉన్న దుప్పి కొమ్ములను సులభంగా ఏరుకోవడం కోసం కూడా అడవికి నిప్పు పెట్టేవారు. అయితే, ప్రస్తుతం మంటలు ఇంత వేగంగా వ్యాపించడానికి శీతోష్ణస్థితి మార్పులు ప్రధాన కారణం" అని కాళిదాసన్ అన్నారు.
అడవి పునరుద్ధరణకు మంటలు అవసరమని కొందరు పర్యావరణ పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ఆ మంటలను అదుపులో ఉంచడమే అటవీ శాఖ ప్రధాన బాధ్యత అని వారు చెబుతున్నారు.
సాధారణంగా అడవిలో నేలపై ఎండుటాకులు ఎక్కువగా పేరుకుపోతే, ఆ తర్వాత వచ్చే మంటలను ఆర్పడం కష్టమవుతుంది. అందుకే అడపాదడపా తక్కువ స్థాయిలో మంటలు పెట్టి ఆ ఆకులను కాల్చివేయడం మంచిదని కొందరు వాదిస్తున్నారు.
కానీ, ఈ పద్ధతి పాశ్చాత్య దేశాల్లోని విస్తృతమైన అడవులకు సరిపోతుందని, భారత దేశంలో అడవులు చిన్న చిన్న భాగాలుగా ఉండటం వల్ల ఇలా తరచుగా నిప్పు పెడితే సూక్ష్మజీవులు అంతరించిపోతాయని మరికొందరు వ్యతిరేకిస్తున్నారు.
ఈ రెండు భిన్నమైన వాదనల మధ్య సమతుల్యతను పాటిస్తూ ఈ సమస్యను పరిష్కరించాలని కాళిదాసన్ అభిప్రాయపడ్డారు.

వాతావరణ మార్పుల పాత్ర ఎంత?
అడవిలో మంటలు మనుషుల వల్ల సంభవించినప్పటికీ, వాటి తీవ్రత పెరగడానికి, ఊహించలేనంతగా వ్యాప్తి పెరగడానికి వాతావరణ మార్పులే కారణమని దిల్లీలోని వరల్డ్ వైల్డ్‌ఫైర్ ఫండ్ డైరెక్టర్ అరీంద్రన్ చెబుతున్నారు. అడవిలో మంటల నివారణ చర్యలపై ఇటీవల ఆయన నీలగిరిలో తమిళనాడు అటవీ శాఖ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.
''భారత దేశంలో కార్చిచ్చులను అదుపు చేసే చర్యలు బాగున్నాయి. కానీ మంటలు కొన్నిసార్లు పరిస్థితి అదు తప్పి పరిస్థితి చాలా తీవ్రంగా మారుతోంది. నీలగిరిలో ప్రస్తుతం సంభవించిన కార్చిచ్చుల ప్రభావం కూడా అలాగే ఉంది" అని అరీంద్రన్ బీబీసీతో అన్నారు.
''మంటలు వేగంగా వ్యాపించే ప్రమాదకర ప్రాంతాలను శాస్త్రీయంగా గుర్తించడానికి పరిశోధనలు చేస్తున్నాం. ఇవికాకుండా, పర్యటకుల అవగాహనా రాహిత్యం లేదా బాధ్యతారాహిత్యం కూడా అడవుల్లో మంటలు చెలరేగడానికి ఒక ముఖ్య కారణం. కాబట్టి పర్యటకులు, స్థానికులలో అవగాహన పెంచాలి. ముఖ్యంగా అటవీ శాఖకు అదనపు సిబ్బంది అవసరం'' అని చెప్పారు.
పర్యావరణవేత్త కాళిదాసన్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, స్థానిక ప్రజల సహకారం లేకుండా అడవుల్లో చెలరేగే మంటలను అదుపు చేయడం సాధ్యం కాదని అన్నారు.
తమిళనాడు అటవీ శాఖ కార్యదర్శి సుప్రియా సాహు బీబీసీకి వివరణ ఇస్తూ, ''తీవ్రమైన వేడి, తేమ తక్కువగా ఉండడం, బలమైన గాలుల కారణంగానే అడవిలో మంటలు వేగంగా వ్యాపించాయి. ఎండిన మొక్కలు ఇంధనంలా మారి తీవ్రతను పెంచాయి. నీలగిరి కొండ ప్రాంతాల నైసర్గిక స్వరూపం వల్ల మంటలను ఆర్పడం సవాలుగా మారింది. లోతైన వాలు ప్రాంతాలు, అనూహ్యంగా వీచే గాలుల దిశల వల్ల మంటలను అదుపు చేయడం కష్టమైంది. అయినప్పటికీ, అటవీ శాఖ వేగంగా స్పందించి పరిస్థితిని అదుపులోకి తెచ్చింది" అని చెప్పారు.
మొత్తం 6 జిల్లాల అటవీ అధికారులు, 7 అగ్నిమాపక వాహనాలు, 60 మంది ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది, 500 మంది అటవీ సిబ్బంది ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారని ఆమె తెలిపారు.
గాలిలో తేమ 30 శాతం కంటే తగ్గడం వల్ల చిన్నరవ్వ కూడా పెద్ద మంటగా వ్యాప్తి చెందిందని కృపాశంకర్ చెప్పారు.
ఏప్రిల్ 29 మధ్యాహ్నం తర్వాత నీలగిరి జిల్లాలోని పార్సన్స్ వ్యాలీ, మసినగుడి, సింగారా వంటి ప్రాంతాల్లో విస్తారంగా వర్షం కురిసింది. దీంతో మంటల ప్రభావం తగ్గుతుందని తమిళనాడు అటవీ శాఖ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

































