You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
స్కాట్లాండ్‌లో ‘ప్రాస్టిట్యూట్’ హత్య కేసులో చిక్కుకుని, అసలు హంతకుడు వేరే అని తెలిసిన తరువాత చనిపోయిన భారతీయుడి భార్య ప్రధాని మోదీని ఏం కోరుతున్నారు?
- రచయిత, పాల్ ఓ హారే
- హోదా, బీబీసీ స్కాట్లాండ్
- చదివే సమయం: 7 నిమిషాలు
1997లో జరిగిన హత్య కేసులో సౌగత్ ముఖర్జీ అనే వ్యాపారవేత్తను అనుమానితుడిగా పేర్కొంటూ కేసు పెట్టారు. అది తప్పుడు కేసు అని తేలడంతో స్కాట్లాండ్ అధికారులపై నష్టపరిహారం దావా వేయడానికి భారత ప్రధానమంత్రి మద్దతు ఇవ్వాలని ఆయన భార్య కోరుతున్నారు.
ట్రేసీ వైల్డ్ అనే మహిళను చంపిన అసలు హంతకుడు గ్లాస్గోలో పట్టుబడి, శిక్షపడిన నాలుగేళ్ల తర్వాత.. 2023లో 44 ఏళ్ల సౌగత్ ముఖర్జీ పశ్చిమ బెంగాల్‌లో మరణించారు.
ట్రేసీ వైల్డ్ హత్య కేసులో తన భర్తను అనుమానితుడిగా పేర్కొనడంతో ఆయన జీవితం నాశనమైపోయిందని, నష్టపరిహారంతోపాటు జరిగినదానిపై భారత ప్రభుత్వం దర్యాప్తు జరిపించాలని సౌగత్ భార్య సప్న కోరుతున్నారు.
కాగా విచారణలో ఉన్న కోర్టు కేసులపై వ్యాఖ్యానించబోమని స్కాట్లాండ్ పోలీస్ విభాగం తెలిపింది.
పోలీసులు పంపే ఏవైనా నేర అనుమానాల నివేదికలను.. చర్య తీసుకునే ముందు జాగ్రత్తగా పరిశీలిస్తామని స్కాట్లాండ్ ప్రాసిక్యూటర్లు గతంలో చెప్పారు.
సరిపడా ఆధారాలు ఉన్నప్పుడే చర్య తీసుకుంటారు, కేసులను నిరంతర పరిశీలనలో ఉంచుతారు అని ద క్రౌన్ ఆఫీస్ అండ్ ప్రాసిక్యూటర్ ఫిస్కల్ సర్వీస్ (సీఓపీఎఫ్‌ఎస్) పేర్కొంది.
2014లో తన భర్త ఉద్యోగంలో ఉన్నత స్థానంలో కొనసాగుతున్న సమయంలో, ఆయన్ను మరో దేశంలోని పోలీసులు వెతుకుతున్నట్టు తెలిసిందని 45 ఏళ్ల సప్న తెలిపారు.
ముగ్గురు పిల్లల తండ్రి జీవితం ఆ తర్వాతి వారాల్లో పూర్తిగా కుప్పకూలింది. ఎందుకంటే ఆయన దేశాల మధ్య సాగిన దీర్ఘకాలిక అప్పగింత న్యాయ పోరాటం మధ్యలో చిక్కుకుపోయారు.
డీఎన్ఏ పరీక్షలో నిజం తెలిసిన తర్వాత కేసు నుంచి సౌగత్ పేరును తొలగించారు. కానీ చనిపోయేదాకా ఆయన అపఖ్యాతి మోయాల్సి వచ్చిందని, దాన్నుంచి బయటపడలేకపోయారని ఆయన కుటుంబం చెబుతోంది.
సీఓపీఎఫ్‌ఎస్‌పై కేసు వేయాలనే తన ప్రయత్నానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ మద్దతు ఇవ్వాలని సప్న కోరారు.
"నా భర్తను ట్రేసీ వైల్డ్ హత్యలో అనుమానితుడిని చేయడంవల్ల మానసిక ఒత్తిడి తట్టుకోలేక డిప్రెషన్‌లోకి వెళ్లారు" అని సప్నా బీబీసీకి తెలిపారు.
2023 జనవరి 17న లివర్ సిరోసిస్ కారణంగా ఆయన మరణించారు.
"నిర్దోషి అయిన ఒక వ్యక్తి జీవితం పూర్తిగా, తిరిగి సరిచేయలేని విధంగా నాశనమైందని, అతని కుటుంబం ఇప్పటికీ దాని వల్ల బాధపడుతోందని ప్రజలు తెలుసుకోవాలి" అని సప్న అన్నారు.
ట్రేసీ వైల్డ్‌ని ఎవరు చంపారు?
1997 నవంబర్ 24న గ్లాస్గోలోని బార్ములోచ్‌లో ఉన్న తన ఫ్లాట్‌లో 21 ఏళ్ల ట్రేసీ వైల్డ్‌ని గొంతు నులిమి చంపేశారు.
వ్యభిచార వృత్తిలో ఉన్న ట్రేసీ మృతదేహాన్ని మరుసటి రోజు గుర్తించారు. ఆమెకు ఒక కొడుకు కూడా ఉన్నాడు.
ఆ సమయంలో గ్లాస్గో నాటికల్ కాలేజీలో చదువుతున్నారు సౌగత్. అప్పుడాయనకు 19ఏళ్లు. ఆ కాలేజ్‌ని ఇప్పుడు సిటీ ఆఫ్ గ్లాస్గో కాలేజీ అని పిలుస్తున్నారు.
సౌగత్ 1996లో స్కాట్లాండ్‌కు వచ్చారు. ట్రేసీ మరణించిన మూడు నెలల తర్వాత ఆయన చదువు ఆపేసి భారత్‌కి తిరిగి వెళ్లారు.
సప్నను వివాహం చేసుకున్న సౌగత్ చెన్నైలోని యూనివర్సిటీలో కొత్త కోర్సులో చేరారు.
తరువాత ఆయన సేల్స్, బిజినెస్ డెవలప్‌మెంట్ రంగంలో పనిచేశారు. ఉద్యోగం కారణంగా అమెరికా, యూఏఈ, గ్రీస్ వంటి అనేక దేశాల్లో పర్యటించారు.
2014 అక్టోబర్ వరకు అంతాబాగానే ఉంది.
కానీ అప్పుడే గ్లాస్గోలో పరిష్కారం కాని హత్య కేసులో అనుమానితుడివి అంటూ భారత పోలీసులు సౌగత్‌కు తెలిపారు.
2015 జనవరిలో ఆయన్ను అరెస్టు చేసి ముంబయి జైలులో మూడు వారాలు ఉంచారు.
తరువాతి నెలలో అధికారికంగా అనుమానితుడిగా పేర్కొన్నారు. సండే మెయిల్ పత్రికలో కథనం ప్రచురితమైంది.
ట్రేసీ వైల్డ్‌తో కలిసి నడుస్తున్న గుర్తు తెలియని వ్యక్తి ఉన్న సీసీటీవీ ఫోటోలు కూడా విడుదలయ్యాయి.
"ఆ ఆరోపణ అతన్ని పూర్తిగా నాశనం చేసింది. నేను ప్రేమించిన వ్యక్తి మెల్లగా కుప్పకూలడంచూసినా ఏమీ చేయలేకపోయాను" అని సప్న తెలిపారు.
"కుటుంబానికి భారమయ్యానని నా భర్త మథనపడేవాడు. ఎందుకంటే ఐదేళ్లపాటు నేను మాత్రమే సంపాదిస్తూ అతని వైద్య ఖర్చులను చూసుకుంటూ, ముగ్గరు పిల్లలను పెంచాల్సివచ్చింది. ఆయన తల్లిదండ్రులు కూడా ఆయన్ని డిప్రెషన్ నుంచి బయటకు తీసుకురావడానికి తమదగ్గరున్న ప్రతి పైసా ఖర్చు చేశారు" అని సప్న చెప్పారు.
అసలు హంతకుడు ఎలా దొరికాడు?
2018లో ఈ హత్యకేసులో ఒకరిని అరెస్ట్ చేశారని గూగుల్ న్యూస్ నోటిఫికేషన్ ద్వారా సౌగత్ తెలుసుకున్నారు.
గ్లాస్గోలోని కౌకాడెన్స్ ప్రాంతంలో జరిగిన దాడి కేసులో అరెస్టైన తర్వాత జి మిన్ చెన్ పోలీసులకు డీఎన్ఏ నమూనా ఇచ్చారు. ఆ డీఎన్ఏ 20 ఏళ్లక్రితం ట్రేసీ వైల్డ్ ఫ్లాట్‌లో దొరికిన ఆధారాలతో సరిపోలింది.
చైనాలో జన్మించిన 44 ఏళ్ల చెన్ 2019 ఏప్రిల్‌లో ఈ నేరాన్ని అంగీకరించారు. ఆయనకి 20 ఏళ్ల జైలు శిక్ష పడింది.
"ఆమె సొంతిట్లోనే బలహీనమైన యువతిపై క్రూరంగా, పిరికితనంగా, హింసాత్మక చర్యకు పాల్పడ్డావ్" అని న్యాయమూర్తి లార్డ్ ఆర్థర్‌సన్ అన్నారు.
తర్వాత గ్లాస్గో హైకోర్టు బయట మాట్లాడిన వైల్డ్ సోదరి బెర్నడెట్ మెక్‌కాష్ కోర్టు తీర్పు చాలా అన్యాయంగా అనిపించిందని అన్నారు.
ఆ శిక్ష సరిపోదని, తమ కుటుంబం చాలా నిరాశ చెందిందని, ఆయన 20 ఏళ్లకు పైగా ఎక్కడికో పారిపోయి దాక్కున్నారని ఆమె అన్నారు.
తర్వాత హంతకుడు చెన్ అప్పీల్ చేసుకోగా ఆయన శిక్షను 16 సంవత్సరాలకు తగ్గించారు.
2019లో సౌగత్ బీబీసీతో మాట్లాడుతూ.. తనపై వచ్చిన ఆరోపణలు తనను తీవ్రంగా షాక్‌కు గురి చేశాయని చెప్పారు. గ్లాస్గో నుంచి త్వరగా వెళ్లిపోవడం, సీసీటీవీ ఆధారంగా తనపై కేసు నమోదైందని, ఈ ఆరోపణల వల్ల తన కుటుంబం చాలా బాధపడిందని చెప్పారు.
"2019 మే 1న సౌగత్‌ను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారికంగా అన్ని కేసులనుంచి విముక్తుడిని చేసింది.
అయితే ఇకపై అనుమానించకపోయినా, ఆయన జీవితానికి జరిగిన నష్టం తిరిగి సరిచేయలేనిదని సప్న అన్నారు.
ఇప్పుడు తమ కుటుంబ పరిస్థితిని తెలియజేయడానికి ఆమె భారత ప్రధానమంత్రికి లేఖ రాశారు.
బీబీసీ చూసిన ఆ లేఖలో సేల్స్ మేనేజర్ సప్న ఏం రాశారంటే.. ఈ కేసు తన కుటుంబం, పిల్లలు శ్రేష్ఠ (21), శ్లోక్ (18), శ్రేయ (16)పై తీవ్ర ప్రభావం చూపింది. ఒంటరైన ఇంటిలో, విరిగిన హృదయంతో ఈ లేఖ రాస్తున్నానని, తన కుటుంబానికి న్యాయం కావాలని, అలాగే విదేశాల్లో తప్పుగా ఆరోపణలు ఎదుర్కొనే భారతీయులకు రక్షణ ఉండాలని కోరారు.
"పరారీలో ఉన్నాడని నా భర్తపై ముద్ర వేశారు. ఆరోపణలు వచ్చిన తర్వాత ఆయనకి తిరిగి ఉద్యోగం రాలేదు. హత్యకేసులో అనుమానితుడి ఇంటిపక్కన ఉండడానికి పొరుగువారు ఇష్టపడకపోవడంతో మా కుటుంబాన్ని అద్దె ఇంటి నుంచి ఖాళీ చేయించారు. పిల్లలను ఎవరూ దగ్గరకు రానివ్వలేదు" అని ఆమె చెప్పారు.
తన తల్లిదండ్రులు, అత్తమామలపై సౌగత్ ఆర్థికంగా ఆధారపడాల్సి వచ్చిందని, వారు తాము దాచుకున్నదంతా ఖర్చు చేసి ఇప్పుడు ఇల్లు అమ్ముకునే స్థితికి వచ్చారని ఆమె చెప్పారు.
ఆయన మద్యానికి బానిసై, డిప్రెషన్‌లోకి వెళ్లి, అవమానం, నిరాశతో బాధపడ్డారని కూడా ఆమె తెలిపారు.
ఆ సమయంలో కుటుంబం గడవడానికి తాను మాత్రమే సంపాదించేదాన్నని సప్న చెప్పారు.
"ఏ తప్పూ చేయకపోయినా, అన్నీ కోల్పోయి, నేను భయపడ్డవిధంగానే.. చివరికి చనిపోయారు" అని ఆమె తెలిపారు.
సౌగత్ డీఎన్ఏ క్రైమ్ సీన్‌తో సరిపోలకపోయినా, ఆయన పేరు క్లియర్ చేయడానికి నాలుగేళ్లు ఎందుకు పట్టిందని సప్న ప్రశ్నించారు.
స్కాట్లాండ్ అధికారుల నుంచి తమ కుటుంబానికి నష్టపరిహారం అందేలా మద్దతు ఇవ్వాలని ఆమె భారత ప్రభుత్వాన్ని కోరారు. అలాగే ఈ హత్య కేసులో సౌగత్‌ను అనుమానితుడిగా ఎలా గుర్తించారో తెలుసుకునేందుకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ దర్యాప్తు చేయాలని కూడా కోరారు.
"నా భర్త నిర్దోషి, ఏ నేరం చేయలేదు, ఎవరికీ హాని చేయలేదు, అధికారులకు సహకరించాడు, వ్యవస్థపై నమ్మకం ఉంచాడు. కానీ ఆ వ్యవస్థ ఆయన్ని పూర్తిగా నాశనం చేసింది" అని ఆమె అన్నారు.
అయితే ప్రస్తుతం విచారణలో ఉన్న కోర్టు కేసులపై వ్యాఖ్యానించబోమని పోలీస్ స్కాట్లాండ్ విభాగం తెలిపింది.
"2019లో ఇచ్చిన ప్రకటనకు కొత్తగా జోడించడానికి ఏమీ లేదని, సరిపడా ఆధారాలు ఉంటేనే, ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందన్నప్పుడు మాత్రమే చర్యలు తీసుకుంటాం. అలాగే కేసులు నిరంతర పరిశీలనలో ఉంటాయి. పూర్తిగా పరిశీలించిన తర్వాత సౌగత్ ముఖర్జీపై ఇకపై ఎలాంటి న్యాయ చర్యలు ఉండవని క్రౌన్ న్యాయవాదులు నిర్ణయించారు" అని క్రౌన్ ఆఫీస్ తెలిపింది.
దీనిపై స్పందిచాల్సిందిగా భారత విదేశాంగ మంత్రిత్వ శాఖను కూడా బీబీసీ కోరింది.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)