You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
తమిళనాడు: హంగ్ అసెంబ్లీ అయితే.. ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారు? ఎవరు ఎవరికి మద్దతుగా నిలుస్తారు?
- రచయిత, జేవియర్ సెల్వకుమార్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- చదివే సమయం: 5 నిమిషాలు
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ రాకపోవడంతో.. హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకున్న పార్టీని గవర్నర్ ఆహ్వానించే అవకాశం ఉందని పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్లు చెప్పారు.
కానీ, టీవీకే ఏ పార్టీతో పొత్తు పెట్టుకోనందున, డీఎంకే లేదా అన్నాడీఎంకే కూటములకు అనుబంధంగా ఉన్న పార్టీలు ఆయనకు మద్దతు ఇస్తాయని అంచనాలు ఉన్నాయి.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రకారం.. తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ అత్యధిక స్థానాలను గెలుచుకుంది.
ఈ పార్టీ 108 సీట్లలో విజయం కెరటం ఎగరవేసింది. కానీ, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన మెజారిటీ సీట్లు 118ని మాత్రం పొందలేకపోయింది.
దీంతో తమిళనాడులో హంగ్ అసెంబ్లీ ఏర్పడే పరిస్థితి నెలకొంది.
హంగ్ అసెంబ్లీ అంటే ఏమిటి?
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన కనీస స్థానాలను ఏ రాజకీయ పార్టీ గానీ, ఎన్నికలకు ముందు ఏర్పడిన కూటమి గానీ గెలుచుకోనప్పుడు హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుంది.
తమిళనాడు శాసనసభలోని 234 స్థానాలకు గాను, మెజారిటీ సాధించడానికి 118 స్థానాలు అవసరం. ఈ ఎన్నికల్లో ఏ ఒక్క పార్టీ గానీ, కూటమి గానీ ఈ స్థాయిలో అసెంబ్లీ సీట్లను గెలుచుకోలేదు.
ఇలాంటి పరిస్థితి నెలకొంటే ఏమవుతుందనే విషయంపై కోయంబత్తూర్‌లోని గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీ పొలిటికల్ సైన్స్ డిపార్ట్‌మెంట్ హెడ్, ఉచిత ఐఏఎస్ శిక్షణ సంస్థ వ్యవస్థాపకులు ప్రొఫెసర్ కనగరాజ్ వివరించారు.
''హంగ్ అసెంబ్లీ ఏర్పడినప్పుడు ఏ విధానాలను అనుసరించాలో రాజ్యాంగం వివరించింది. తొలి దశలో, అత్యధిక స్థానాలు గెలుచుకున్న పార్టీని గవర్నర్ ఆహ్వానిస్తారు. ఆ పార్టీకి కొంత సమయం ఇస్తారు''
''అప్పుడు ఆ పార్టీ గానీ, కూటమిగానీ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన సభ్యుల మద్దతు వారికి ఉందని నిరూపించుకోవాలి. కొన్ని పార్టీలకు బయటి నుంచి మద్దతు లభించవచ్చు లేదా సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించి, ఆ కూటమి పార్టీలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించవచ్చు" అని ఆయన అన్నారు.
''ఎన్నికల తర్వాత గెలుపొందిన అతిపెద్ద పార్టీ, కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, చర్చల ద్వారా అధికార పంపిణీపై ఒప్పందాలు కుదుర్చుకుంటుంది. ఆ ప్రాతిపదికన, అవసరమైన అదనపు సభ్యుల మద్దతును పొంది, ఓటింగ్ ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీని నిరూపించుకోగలదు" అని ప్రొఫెసర్ కనగరాజ్ చెప్పారు.
''ఇతర పార్టీలు కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే హక్కును కోరితే, గవర్నర్ నిర్ణయం తీసుకుని, వారిని కూడా ఆహ్వానిస్తారు. అయితే, ప్రభుత్వ ఏర్పాటుకు ఎలాంటి అవకాశం లేకపోతే, రాష్ట్రపతి పాలన విధించి, మరోసారి ఎన్నికలు నిర్వహిస్తారు'' అని తెలిపారు.
తమిళనాడు రాజకీయాల్లో అంతకుముందు ఏం జరిగింది?
ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. 1952లో ఎన్నికలు జరిగినప్పుడు, మద్రాసు రాష్ట్రంలో 375 సీట్లు ఉన్నాయి. ఆ సమయంలో కాంగ్రెస్ కేవలం 152 సీట్లను మాత్రమే సంపాదించగలిగింది. ప్రభుత్వ ఏర్పాటుకు మెజారిటీ 188 సీట్లు అవసరం. ఆ తర్వాత, కొన్ని పార్టీల మద్దతుతో ఇది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
2006లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో ఒక విచిత్ర పరిస్థితి నెలకొంది.
ఆ సమయంలో డీఎంకే సొంతంగా కేవలం 96 సీట్లనే గెలుచుకుంది. కానీ, కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు, పీఎంకే వంటి సంకీర్ణ పార్టీల మద్దతుతో డీఎంకే కూటమి 163 సీట్ల బలాన్ని సంపాదించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
ఎన్నికల ముందు పొత్తులో భాగంగా, ఆ కూటమి పార్టీ శాసనసభ్యులు బయటి నుంచే డీఎంకే ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. ఆ పాలన పూర్తిగా ఐదేళ్లపాటు కొనసాగింది.
కానీ, డీఎంకే మెజారిటీ పొందకపోవడంతో, అప్పటి అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, ప్రతిపక్షాల నాయకురాలు జయలలిత, ఆ ప్రభుత్వాన్ని ''మైనార్టీ డీఎంకే ప్రభుత్వం''గా పిలిచేవారు.
''ఇది మైనార్టీ ప్రభుత్వం కాదు. ఇది మైనార్టీల కోసం ఏర్పడిన ప్రభుత్వం'' అని అప్పటి ముఖ్యమంత్రి, డీఎంకే నేత కరుణానిధి స్పష్టం చేశారు.
డీఎంకే రాజ్యసభ సభ్యుడు, ప్రొఫెసర్ కాన్‌స్టాంటైన్ రవీంద్రన్ బీబీసీతో మాట్లాడుతూ... "ఆ సమయంలో డీఎంకే మైనార్టీ ప్రభుత్వం అనే భావన ఉంది. కానీ, ఆ సమయంలో డీఎంకే కూటమికి 163 సీట్లను సంపాదించింది. కూటమి పార్టీలకు ఎక్కువ సీట్లు కేటాయించడం వల్లే డీఎంకే మెజారిటీ సీట్లు పొందలేకపోయింది" అని చెప్పారు.
ఇప్పుడేం జరుగుతుంది?
ప్రస్తుత ఫలితాల్లో విజయానికి సంబంధించి పూర్తి వివరాలు రాకముందే దీన్ని బీబీసీకి వివరించిన ప్రొఫెసర్ కనగరాజ్, ''ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం.. టీవీకే 100కి పైగా సీట్లలో ఆధిక్యంలో ఉంది. ఆ పార్టీని తొలుత గవర్నర్ ఆహ్వానిస్తారు. ఆ పార్టీకి కేవలం 10 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాలి. డీఎంకే కూటమిలో ఉన్న కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు బయట నుంచి దానికి మద్దతు ఇస్తాయి. అందువల్ల, తిరిగి ఎన్నికలు జరిగే అవకాశం లేదు'' అని తెలిపారు.
''టీవీకేతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో సమస్య వచ్చే అవకాశం లేదు. కాంగ్రెస్, టీవీకే మధ్య ఇప్పటికే మంచి అవగాహన ఉంది. వారు కచ్చితంగా మద్దతు ఇస్తారు. కమ్యూనిస్ట్ పార్టీ మనసు మార్చుకుంటుందని అనుకోవడం లేదు. అలాగే, డీఎంకే కూటమిలో ఉదయించే సూర్యుడి గుర్తుపై పోటీ చేయని ఇతర పార్టీలు కూడా దీనికి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. దీనివల్ల, టీవీకే కచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. దానికి సంబంధించిన పనులు కూడా ప్రారంభమవుతాయి'' అని సీనియర్ జర్నలిస్ట్ ఆర్.కె. రాధాకృష్ణన్ బీబీసీతో అన్నారు.
'అధికారాన్ని పంచుకోవడం'
ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి చర్చల సమయంలోనే, అధికారం పంచుకోవాలనే నినాదం వినిపిస్తూ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ నేతలు గిరీశ్ చోడంకర్, ప్రవీణ్ చక్రవర్తి, ఎంపీ మాణిక్కం ఠాకూర్‌లు పదేపదే ఈ డిమాండ్‌ను వినిపించారు.
''సంకీర్ణ ప్రభుత్వం అవుతుందా లేదా ఒకటే పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందా అన్నది ప్రజలు నిర్ణయిస్తారు. 2006లో ప్రజాభిప్రాయాన్ని అమలు చేయకపోవడం మన తమిళనాడు కాంగ్రెస్ పార్టీ తప్పే'' అని మాణిక్కం ఠాకూర్ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పేర్కొన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)