హైదరాబాద్ మెట్రో రైల్‌ను ప్రభుత్వం ఎందుకు కొనుగోలు చేసింది?

హైదరాబాద్ మెట్రో రైల్ మే 1 నుంచి తెలంగాణ ప్రభుత్వ నిర్వహణలోకి వస్తోంది.

ఇన్నాళ్లుగా ఎల్ అండ్ టీ నిర్వహణలో ఉండగా, ఇకపై పూర్తిగా ప్రభుత్వమే నిర్వహించనుంది.

కేంద్ర ప్రభుత్వ సూచనలకు తగ్గట్టుగా ఫేజ్ 2 నిర్మాణానికి ఎలాంటి అడ్డంకులూ రాకుండా ఉండేందుకే ఎల్అండ్‌టీ నుంచి మెట్రో రైల్ ఈక్విటీ కొనుగోలు ఒప్పందం జరిగిందని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్) ఎండీ సర్ఫరాజ్ అహ్మద్ బీబీసీతో చెప్పారు. ఇక నుంచి పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో మెట్రో రైల్ నిర్వహణ ఉంటుందని ఆయన అన్నారు.

ఎల్‌అండ్‌టీ హైదరాబాద్ మెట్రో రైల్‌కు ఉన్న 100 శాతం ఈక్విటీని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ద్వారా కొనుగోలు చేసినట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.

ప్రభుత్వ నిర్వహణలోకి మెట్రో రైల్ వచ్చిన తర్వాత ఏం జరుగతుంది? ఏం మార్పులు రావచ్చు?

ఒప్పందం ఏమిటి?

ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో 69 కిలోమీటర్ల మేర మెట్రో రైల్ ఆపరేట్ అవుతోంది. దీన్ని నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ నిర్వహిస్తోంది. ఇప్పుడు ఎల్‌అండ్‌టీ కంపెనీ తనకున్న ఈక్విటీని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్‌కు బదలాయించింది.

దీంతో మే 1 నుంచి మెట్రో రైల్ పూర్తిగా తెలంగాణ ప్రభుత్వ నియంత్రణలోనే నడవనుంది.

''ఇది పరిపాలనా పరమైన ప్రక్రియ మాత్రమే కాదు. మెట్రో రైల్ నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరించడం, నగర రవాణా ప్రణాళికను పరిపుష్ఠం చేయడంలో కీలకంగా మారనుంది'' అని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్) ప్రకటించింది.

ఎల్‌అండ్‌టీతో కుదిరిన ఈక్విటీ కొనుగోలు ఒప్పందం విలువ రూ.1461.47 కోట్లు అని హెచ్ఎంఆర్ఎల్ తెలిపింది.

ఇది కాకుండా ఎల్‌అండ్‌టీకి మెట్రో రైల్ పరంగా ఉన్న రూ.13,538.53 కోట్ల అప్పును తెలంగాణ ప్రభుత్వ గ్యారంటీపై రీఫైనాన్స్ చేస్తారు. ఇందుకు ఐడీబీఐ క్యాపిటల్ సలహాదారుగాను, సరఫ్ అండ్ పార్ట్నర్స్.. లీగల్ గైడెన్స్‌గా వ్యవహరిస్తారని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ప్రకటించింది.

మెట్రో రైల్ ప్రభుత్వ అధీనంలోకి రావడం స్వాగతించదగ్గ పరిణామం అని ఉస్మానియా యూనివర్సిటీ సివిల్ ఇంజినీరింగ్ ఆచార్యుడు, రవాణా రంగ నిపుణుడు డి.రాజశేఖరరెడ్డి బీబీసీతో చెప్పారు.

"ప్రభుత్వ అధీనంలోకి తీసుకురావడం వల్ల 'లాస్ట్ మైల్ కనెక్టివిటీ'కి సాధ్యపడుతుంది. అయితే, ఈ విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలి" అని వివరించారు.

ప్రత్యేక బోర్డు నియామకం

స్వాధీన ప్రక్రియలో భాగంగా ఏప్రిల్ 26న మెట్రో రైల్‌కు ప్రత్యేక బోర్డును ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

దీనికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. మేనేజింగ్ డైరెక్టర్‌గా హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీగా ఉన్న సర్ఫరాజ్ అహ్మద్, జేఎండీగా శివేంద్ర ప్రతాప్ వ్యవహరిస్తారు.

జయేశ్ రంజన్, వికాస్ రాజ్, సందీప్ కుమార్ సుల్తానియా, బి.శివధర్ రెడ్డి, ఆర్వీ కర్ణన్, కె.అశోక్ రెడ్డి, జితేష్ వి.పాటిల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లుగా ఉంటారు.

ప్రభుత్వం ఎందుకు స్వాధీనం చేసుకుందంటే..

మెట్రో మొదటి దశలో 69 కిలోమీటర్ల నెట్‌వర్క్‌ను సుమారు రూ.22వేల కోట్లతో పీపీపీ పద్ధతిలో నిర్మించారు. 2017 నవంబరు నుంచి మెట్రో రైలు అందుబాటులోకి వచ్చింది.

అయితే, రెండో ఫేజ్ నిర్మాణాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నిర్మించాలని ప్రభుత్వాలు నిర్ణయించాయి. అయితే, ఇప్పటివరకు ఉన్న ఫేజ్ ప్రైవేటు అధీనంలో ఉండగా.. దానికి అనుసంధానంగా నిర్మించే కారిడార్లు ప్రభుత్వ అధీనంలో నిర్మిస్తే నిర్వహణలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసిందని 2026 మార్చి 29న అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.

ఆ క్రమంలో మెట్రో రైల్ మొదటి ఫేజ్ నెట్‌వర్క్‌ను ప్రభుత్వ అధీనంలోకి తీసుకోవాలని అసెంబ్లీలో తీర్మానం చేశారు.

మెట్రో స్వాధీనానికి సంబంధించిన వివరాలను హెచ్ఎంఆర్ఎల్ ఎండీ సర్ఫరాజ్ అహ్మద్ బీబీసీతో పంచుకున్నారు.

''మెట్రో రైల్ మొదటి ఫేజ్ కన్సెషన్ అగ్రిమెంట్. ఇది అప్పటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, ఎల్ అండ్ టీ మధ్య జరిగింది. రెండో ఫేజ్ నిర్మాణం మాత్రం కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం మధ్య ఉంది. ప్రస్తుత కారిడార్లను విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం రెండు ఆప్షన్లు సూచించింది'' అని చెప్పారు.

''ఎల్బీనగర్-మియాపూర్ కారిడార్, నాగోలు-రాయదుర్గం కారిడార్‌లను విస్తరించాలని నిర్ణయించారు. కానీ ప్రస్తుతం ఆ రెండు కారిడార్లు ఎల్ అండ్ టీ నిర్వహణలో ఉన్నాయి. దీంతో విస్తరించే భాగానికి సంబంధించి భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తే వీలుంది. అంటే ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్‌కు విస్తరించినప్పుడు రెండు యాజమాన్యాల పరిధిలో నిర్వహణ ఉంటే రైళ్లు ఆపరేట్ చేయడం, ఫ్రీక్వెన్సీ, కరెంటు ఖర్చులు.. ఇలా చాలా సవాళ్లు ఎదురయ్యే వీలుంది'' అని సర్ఫరాజ్ అహ్మద్ బీబీసీతో చెప్పారు.

దీనివల్ల గమ్యస్థానం చేరాలంటే ఒకే కారిడార్‌లో ఒక రైలు దిగి మరో రైలు ఎక్కాలి లేదా ఎల్‌అండ్‌టీతో డెఫినిటివ్ అగ్రిమెంట్ చేసుకోవాలి అని రెండు ఆప్షన్లను కేంద్ర ప్రభుత్వం సూచించిందని అధికారులు చెబుతున్నారు.

తెలంగాణ ప్రభుత్వం ఒకే రైలులోనే పూర్తి దూరం ప్రయాణించేలా డీపీఆర్ సిద్ధం చేసింది.

''డెఫినిటివ్ అగ్రిమెంట్ కంటే కూడా తమ వాటాను పూర్తిగా విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నామని ఎల్‌అండ్‌టీ చెప్పింది. కేంద్ర ప్రభుత్వం లేదా తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేస్తే విక్రయిస్తామంది. ప్రయాణికుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వమే ఎల్‌అండ్‌టీ నుంచి ఈక్విటీని కొనుగోలు చేసింది'' అని సర్ఫరాజ్ అహ్మద్ బీబీసీతో చెప్పారు.

దీనివల్ల రెండో ఫేజ్ నిర్మాణ పనులు సులువు కానున్నాయని వివరించారు.

2072 వరకు మొదటి ఫేజ్ నిర్వహణకు అవకాశం ఉన్నప్పటికీ, ప్రభుత్వానికి తన వాటాను ఎల్‌అండ్‌టీ విక్రయించింది.

''ఎలాంటి ఆటంకం లేకుండా భవిష్యత్తులో మెట్రో కారిడార్లు విస్తరించేందుకు వీలుంటుంది. అన్ని ఫేజ్‌ల పరంగా ఒకే విధంగా నిర్ణయాలు తీసుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఆర్థికపరంగా, నిర్వహణ పరంగా మరింత సమర్థంగా పనిచేసేందుకు అవకాశం ఉంటుంది'' అని మెట్రో మొదటి దశ స్వాధీనం అగ్రిమెంట్ పూర్తయ్యాక హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ఒక ప్రకటనలో తెలిపింది.

సర్కారు చేతికి వచ్చాక ఏం జరగనుంది?

మొదటి దశలో నిర్మించిన మూడు కారిడార్ల (నాగోలు-రాయదుర్గం, ఎల్బీనగర్-మియాపూర్, జేబీఎస్-ఎంజీబీఎస్) పరిధిలో రోజుకు సగటున 4.5 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు.

ఇప్పుడు మెట్రో రైల్ రెండో ఫేజ్‌ను రెండు భాగాలుగా చేపట్టాలనేది ప్రణాళిక.

అవి: ఫేజ్ - 2ఏ, ఫేజ్ – 2బీ

ఫేజ్ 2ఏలో ఐదు కారిడార్లు ఉన్నాయి. ఇందులో ఒకటి కొత్త కారిడార్ కాగా, మిగిలిన నాలుగూ ఇప్పటికే ఫేజ్ -1లో నిర్మించిన కొన్ని కారిడార్ల పొడిగింపు.

కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం జాయింట్ వెంచర్‌గా రెండో ఫేజ్ నిర్మించనున్నట్లు హెచ్ఎంఆర్ఎల్ చెబుతోంది.

మొత్తం రూ.24,269 కోట్ల అంచనా వ్యయంతో 2024 నవంబరులో కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు తెలంగాణ ప్రభుత్వం డీపీఆర్ పంపించింది.

దీని ప్రకారం ఇందులో కేంద్ర ప్రభుత్వ నిధుల వాటా 18 శాతం కాగా, తెలంగాణ ప్రభుత్వ వాటా 30 శాతంగా ఉంది. 48 శాతం రుణాల ద్వారా సమకూర్చుకుని, మరో నాలుగు శాతం నిధులను పీపీపీ విధానంలో సేకరించాలనేది ప్రణాళిక.

ఇందుకు తమ నుంచి ఇంకా అనుమతులు మంజూరు కాలేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

''తెలంగాణ ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనలు మాకు అందాయి. ప్రాజెక్టుకు అనుమతులు పరిశీలన దశలో ఉన్నాయి. ప్రాజెక్టు వ్యయం, వనరుల లభ్యత ఆధారంగా అనుమతుల మంజూరు ఉంటుంది. ఇందుకు నిర్ధిష్ట కాలపరిమితి విధించలేం'' అని 2026 ఏప్రిల్‌లో లోక్‌సభలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి తోఖన్ సాహూ చెప్పారు.

ఫేజ్ 2బీలో 86.1 కిలోమీటర్ల మేర నిర్మాణ ప్రతిపాదన

ఫేజ్ 2బీ కింద మరో మూడు కారిడార్లను 86.1 కిలోమీటర్ల మేర నిర్మించాలని హెచ్ఎంఆర్ఎల్ ప్రతిపాదించింది. ఇందుకు 2025 జూన్ 21న రూ.19,579 కోట్లతో ప్రతిపాదనలు పంపించింది.

కారిడార్ – 9: శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఫ్యూచర్ సిటీ – 39.6 కిలోమీటర్లు

కారిడార్ – 10: జేబీఎస్ – మేడ్చల్ – 24.5 కిలోమీటర్లు

కారిడార్ – 11: జేబీఎస్ – శామీర్‌పేట – 22 కిలోమీటర్లు

మొత్తం కారిడార్ల నిర్మాణం పూర్తయితే 232 కిలోమీటర్ల మేర హైదరాబాద్‌లో మెట్రో రైల్ నెట్‌వర్క్ అందుబాటులోకి వస్తుందని ప్రభుత్వం చెబుతోంది.

రెండో ఫేజ్ నిర్మాణానికి సంబంధించి అడ్డంకులు ఇప్పుడు తొలగిపోవడంతో కేంద్ర ప్రభుత్వ అనుమతుల కోసం ఎదురు చూస్తున్నామని సర్ఫరాజ్ అహ్మద్ బీబీసీతో చెప్పారు.

‘ఇంటిగ్రేషన్‌కు అవకాశం’

ప్రభుత్వ పరిధిలోకి వస్తే వేర్వేరు రవాణా వ్యవస్థలను ఇంటిగ్రేట్ చేసేందుకు వీలవుతుందని ప్రొఫెసర్ రాజశేఖరరెడ్డి బీబీసీతో చెప్పారు.

''స్మార్ట్ ప్లానింగ్ ఉండాలి. కమ్యూటర్ (ప్రయాణికుల) కేంద్రంగా విస్తరణ జరగాలి. దానివల్ల ప్రయాణికులు ఎక్కువ సంఖ్యలో మెట్రో వినియోగించుకుని సులువుగా గమ్యస్థానాలకు చేరే వీలుంటుంది. ఎప్పటికప్పుడు రిస్క్ మేనేజ్‌మెంట్ చేస్తూ సర్వీసులకు అంతరాయం లేకుండా చూడాలి. ఏదైనా సమస్య తలెత్తితే వెనువెంటనే పరిష్కరించే వ్యవస్థ ఉంటే ప్రభుత్వంపై అపవాదు రాకుండా ఉంటుంది. ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం ద్వారా మరింత విస్తరణ జరిగి కాలుష్యం తగ్గేందుకు వీలు కలుగుతుంది'' అని ప్రొఫెసర్ డి.రాజశేఖరరెడ్డి బీబీసీతో చెప్పారు.

రెండో ఫేజ్ పూర్తయితే...

ఫేజ్ 2ఏ కారిడార్ నిర్మాణం పూర్తయితే, రోజూ సుమారు 8 లక్షల మంది రాకపోకలు సాగిస్తారని హెచ్ఎంఆర్ఎల్ అంచనా వేస్తోంది.

ఇందులో భాగంగా నిర్మించే ఐదు కారిడార్ల నిర్మాణంలో భాగంగా... అవసరమైన భూములు, ఆస్తుల సేకరణ పాతబస్తీలో ఇప్పటికే జరుగుతోంది. మిగిలిన కారిడార్లలో భూసేకరణ కోసం రూ.2,787 కోట్లకు 2026 జనవరిలో తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది.

ఇక ఫేజ్ 2బీ లోని మూడు కారిడార్ల నిర్మాణం పూర్తయితే 6.50 లక్షల మంది వరకు రాకపోకలు సాగించే వీలుందని హెచ్ఎంఆర్ఎల్ అంచనా.

ప్రభుత్వం కిందకు వస్తే ఛార్జీలు తగ్గుతాయా?

హెచ్ఎంఆర్ఎల్ వెబ్ సైట్ ప్రకారం మెట్రో రైల్ కారిడార్లో కనిష్ఠ ఛార్జీ రూ.12 ఉండగా, గరిష్ఠ ఛార్జీ రూ.75గా ఉంది. ప్రభుత్వ అధీనంలోకి వెళ్తే ఛార్జీలు తగ్గుతాయా? ప్రయాణికులకు నేరుగా ప్రయోజనం కలుగుతుందా? అనే ప్రశ్నలు ప్రయాణికుల నుంచి వస్తున్నాయి.

దీనిపై సర్ఫరాజ్ అహ్మద్ బీబీసీతో మాట్లాడారు.

"మెట్రో ఛార్జీల తగ్గింపు వంటి ప్రతిపాదనేదీ లేదు. ప్రస్తుత ఛార్జీలు యథావిధిగా కొనసాగుతాయి" అని స్పష్టం చేశారు.

మరోవైపు, ఎల్‌అండ్‌టీ నిర్వహణలో ఉన్న ఆస్తులు, భూములు కూడా పూర్తిస్థాయిలో ప్రభుత్వానికి బదలాయింపు అవుతాయని వివరించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)