మహిళలను గడప దాటనివ్వని రోజుల్లో ‘సైకిల్’ వారి జీవితాలను ఎలా మార్చేసిందంటే..

    • రచయిత, మురళీధరన్ కాశీవిశ్వనాథన్
    • హోదా, సీనియర్ రిపోర్టర్, బీబీసీ తమిళ్
  • చదివే సమయం: 6 నిమిషాలు

"దేశానికి 1947లో స్వాతంత్య్రం వచ్చింది, కానీ నాకు మాత్రం1992లో స్వేచ్ఛ దొరికింది" అని 55 ఏళ్ల జయచిత్ర అంటారు. ఆమె దక్షిణ భారత దేశంలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు.

ఆమె జీవితం 33 ఏళ్ల కిందట మలుపుతిరిగింది. అప్పట్లో జిల్లా స్థాయి అధికారి ఒకరు చిన్నదే అయినప్పటికీ ఓ విప్లవాత్మక మార్పును జాతీయ అక్షరాస్యతా మిషన్‌కు జోడించారు. అది మహిళలు సైకిల్ నేర్చుకునేలా ప్రోత్సహించింది.

గ్రామీణ, సంప్రదాయ కుటుంబాల నుంచి వచ్చిన లక్ష మంది మహిళల్లో జయచిత్ర ఒకరు. వీరిలో చాలామంది అప్పటివరకు గడపదాటి బయటకు వెళ్లడం కూడా అరుదు. కానీ, సైకిల్ తొక్కడం నేర్చుకున్నాక వారికి ఇంటి నుంచి అడుగుపెట్టే అవకాశమే కాదు, స్వాతంత్య్రం, స్వేచ్ఛ కూడా లభించాయి.

1990ల ప్రారంభంలో సైకిల్ నేర్చుకున్న కొంతమంది మహిళలు మంచి జీతాలున్న ఉద్యోగాలు పొందారు.

ఇది వారి భవిష్యత్తును మాత్రమే కాకుండా వారి కుమార్తెలు, మనవరాళ్ల భవిష్యత్తును కూడా మార్చింది.

అభివృద్ధి పథంలోకి..

దేశంలో, 1988లో జాతీయ అక్షరాస్యతా మిషన్ ప్రారంభమైంది. ప్రజలకు చదవడం, రాయడం, లెక్కలు నేర్పించడం, వారి ప్రాథమిక హక్కులపై అవగాహన కల్పించడం దీని లక్ష్యం.

తమిళనాడులోని పుదుకోట్టై జిల్లాలో ఈ కార్యక్రమాన్ని "ఎన్‌లైటెనింగ్ మూమెంట్" అని పిలిచేవారు.

ఈ జిల్లాలో 1991గణాంకాల ప్రకారం, సగానికంటే తక్కువ మంది మహిళలకు మాత్రమే చదవడం, రాయడం వచ్చు. సుమారు 2,70,000 మంది మహిళలు నిరక్షరాస్యులే.

‘‘అక్షరాస్యతా మిషన్ గురించి జరిగిన చర్చల్లో ఈ పథకంలో ప్రధానంగా లబ్ధిపొందాల్సింది మహిళలేనని స్పష్టమైంది’’ అని ఆ సమావేశంలో పాల్గొన్న ఎన్‌లైటెనింగ్ మూమెంట్ సమన్వయకర్త కణ్ణమ్మాళ్ గుర్తు చేసుకున్నారు.

మహిళలకు చదువు చెప్పడానికి సుమారు 30 వేల మంది వలంటీర్లు అవసరమని అక్షరాస్యత మిషన్‌ అంచనా వేసింది. ఈ వనరుల సమస్యే సైక్లింగ్ పథకం మొదలు కావడానికి కారణమైంది.

చదువు నేర్చుకోవాలనుకున్న మహిళలు, వారి కుటుంబాలు మహిళా టీచర్లు అయితేనే బావుంటుందని ఆశించేవారు. పైగా అప్పట్లో చాలా తక్కువ మంది మహిళలకే సొంత రవాణా సౌకర్యం ఉండేది.

"ఆ సమయంలో మహిళలకు సైకిళ్లు లేదా మోపెడ్‌లు అందుబాటులో ఉండేవి కాదు. వారు సొంతంగా వెళ్లలేకపోయేవారు. ఇలాంటి సౌకర్యం కల్పించడం చాలా ముఖ్యమని భావించాను" అని అప్పటి జిల్లా కలెక్టర్ షీలా రాణి చుంకత్ చెప్పారు.

"సైకిల్ నేర్చుకోవడం మహిళలకు స్వేచ్ఛను, ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది" అని చుంకత్ అన్నారు.

"కొంతమంది అధికారులు మహిళలను వలంటీర్లుగా నియమించడాన్ని వ్యతిరేకించారు. మహిళలు దూర గ్రామాలకు వెళ్లలేరని చెప్పారు. కానీ, జిల్లా కలెక్టర్ (చుంకత్) ఆ వాదనలను పట్టించుకోలేదు" అని కణ్ణమ్మాళ్ అన్నారు.

"మహిళలు సొంతంగా వెళ్లడం మొదలుపెట్టినప్పుడు, ఏదైనా చేయగలమని కూడా వారు గ్రహించారు. ఇది పురుషులు సృష్టించిన అనేక ఇతర అడ్డంకులను కూడా అధిగమించేందుకు మార్గం సుగమం చేసింది"ని కణ్ణమ్మాళ్ చెప్పారు.

విజయగాథలు

వివిధ సామాజిక వర్గాలకు చెందిన ఎంతోమంది మహిళలకు (అంటే ఉపాధ్యాయులకు, విద్యార్థులకు) ఈ ప్రాజెక్ట్ చాలా మేలుచేసింది.

"ఆ సమయంలో నేను ఓ బానిసలా బతికాను. కిటికీలు తీసి బయటికి చూడడానికి కూడా మా నాన్న ఒప్పుకునేవారు కాదు. ఆ రోజుల్లో పెళ్లికాని అమ్మాయిలను మగవారి కంటపడకుండా దూరంగా ఉంచేవారు" అని అప్పటికే కొంచెం చదువుకున్న జయచిత్ర చెప్పారు.

పదో తరగతి పూర్తయ్యాక టైలరింగ్ లేదా టైప్‌రైటింగ్ నేర్చుకోవాలని ఆమె బంధువులు సలహాలు ఇచ్చారు. వీటిని మహిళలకు సురక్షితమైన, సరైన ఉద్యోగాలుగా అప్పట్లో భావించేవారు.

జయచిత్ర గణితంలో 99% మార్కులు సాధించారు. అందువల్ల ఆ సలహాలు ఆమెకు నిరుత్సాహం కలిగించాయి. జయచిత్ర టీచర్ ట్రైనింగ్ కోసం ఆమె తల్లి తన తాళిబొట్టును తాకట్టు పెట్టారు.

లిటరసీ మిషన్‌లో భాగంగా జయచిత్రను సమీప గ్రామంలోని ముస్లిం మహిళలకు చదువు చెప్పేందుకు ఎంపిక చేశారు. అక్కడికి నడుచుకుంటూ వెళ్లడం సాధ్యం కాకపోవడంతో సైకిల్ నేర్చుకోవాలని నిర్ణయించుకున్నారామె.

"నేను పొడవాటి స్కర్టులు, లంగా ఓణీ వేసుకునేదాన్ని. అప్పట్లో మహిళల కోసం రూపొందించిన ప్రత్యేక సైకిళ్లు అందుబాటులో లేవు. కాబట్టి పురుషుల సైకిల్‌పైనే నేర్చుకున్నా" అని ఆమె చెప్పారు.

దీనివల్ల కొన్ని ఇబ్బందులు వచ్చాయి. చీర కట్టుకుని, సైకిల్ తొక్కడం అంత సులువుగా ఉండేది కాదు. దీంతో కొన్నిసార్లు కింద పడిపోయినా, ఆ అనుభవం ఆమెకు ఆనందాన్నే ఇచ్చింది.

"నా జీవితం పూర్తిగా మారిపోయింది. నాకు నేను.. ఒక సీతాకోకచిలుకలా భావించేదాన్ని. సాయంత్రపు క్లాసులకు సైకిల్ తొక్కుకుంటూ వెళ్లడం కోసం ఎదురుచూసేదాన్ని. మొదట మా నాన్న ఒప్పుకోలేదు, కానీ తర్వాత మనసు మార్చుకుని సైకిల్ కొనిచ్చారు. అది నా జీవితంలో మర్చిపోలేని రోజు" అని జయచిత్ర చెప్పారు.

వసంత ఇప్పుడు అరవయ్యేళ్లకు చేరువలో ఉన్నారు. ఆమె నిరక్షరాస్యురాలు, పేద దళిత కుటుంబానికి చెందినవారు. దళితులు అనేక శతాబ్దాలుగా సామాజికంగా వివక్షకు గురైన వర్గం. ఆమెకు చిన్న వయసులోనే వివాహం జరిగింది. ఆమె భర్త కూడా చదువుకోలేదు.

ఆమె క్వారీలో రాళ్లు కొట్టే పనికి వెళ్తున్నప్పుడు ఎన్‌లైటెనింగ్ మూమెంట్ ప్రతినిధులు ఆమెను కలిశారు. అప్పటికే సైక్లింగ్ ఈ ప్రాజెక్ట్‌లో ముఖ్య భాగమైంది. ఇందులో చేరినవారికి సైకిల్ తొక్కడం కూడా నేర్పించేవారు.

"సైకిల్ తొక్కడం నేర్చుకున్న వాళ్లకి సైకిళ్లు కూడా ఇస్తారని లిటరసీ మిషన్ వాళ్లు మాకు చెప్పారు" అని వసంత అన్నారు.

మొదట ఆమె చాలా సిగ్గుపడ్డారు, కొంచెం ఇబ్బందిగా కూడా అనిపించింది. కానీ, తోటి మహిళల్లో కనిపిస్తున్న ఉత్సాహంతో ఆమె కూడా సైకిల్ నేర్చుకున్నారు.

"ఆ సమయంలో మా ఊళ్లో చాలా తక్కువ మంది దగ్గరే సైకిళ్లు ఉండేవి. అయినా నేను ఒక సైకిల్ అద్దెకు తీసుకుని నేర్చుకున్నా" అని ఆమె చెప్పారు.

తర్వాత ఆమె తన సొంత సైకిల్ కొనుక్కున్నారు. ఆ తర్వాత నీళ్లు తెచ్చుకోవడానికి దాన్ని ఉపయోగించేవారు.

చదవడం, రాయడం, లెక్కలు నేర్చుకున్న తర్వాత ఆమె తనలాంటి మరో ముగ్గురితో కలిసి ఒక క్వారీని లీజుకు తీసుకుని, సొంతంగా వ్యాపారం మొదలుపెట్టారు.

సైక్లింగ్ ప్రోగ్రామ్ తనకు ఆత్మవిశ్వాసం, స్వేచ్ఛ, గౌరవాన్ని ఇచ్చిందని వసంత చెబుతున్నారు.

వైద్యురాలిగా మారాలని కలలు కంటున్న తన మనవరాలికి ఇప్పుడామె మద్దతుగా నిలుస్తున్నారు.

ఎన్నో ‘వసంతా’లు

ఈరోజు పుదుకోట్టైలోని దాదాపు ప్రతి గ్రామంలో వసంతలాంటి చాలా మంది మహిళలను మనం చూడొచ్చు. కొందరు చిన్న వ్యాపారాలు ప్రారంభించారు. మరికొందరు కాలానుగుణ వ్యవసాయ పనుల నుంచి జూనియర్ ఆఫీసర్ ఉద్యోగాల వరకు ఎదిగారు.

చదవడం, రాయడం నేర్చుకోవడం ద్వారా తమకు తక్కువ వేతనం ఇస్తున్నారనే విషయాన్ని మహిళలు గుర్తించారు. తమ వేతనాల పెంపు కోసం వాదించి, విజయం సాధించగలిగారు.

సైక్లింగ్ వల్ల మహిళలు బయటి పనుల కోసం కుటుంబంలోని పురుషులపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా స్వతంత్రంగా మారారు. ఆ సమయంలో గ్రామాల్లో రోడ్లు, ప్రజా రవాణా కూడా అంతంతమాత్రంగానే ఉండేవి.

1992 ఆగస్ట్ 11న పుదుకోట్టైను పూర్తి అక్షరాస్యత సాధించిన జిల్లాగా ప్రకటించారు.

ఈరోజు పుదుకోట్టైలో మహిళలు సైకిల్ తొక్కడం సాధారణ దృశ్యమే, కానీ జయచిత్ర సైకిల్ తొక్కడం లేదు. ఇప్పుడు స్కూటర్ ఉపయోగిస్తున్నారు, ఆమె కుమార్తెకు కారు కూడా ఉంది.

"సైక్లింగ్ ప్రాజెక్ట్ నాలాంటి వారికి ఆత్మవిశ్వాసం ఇచ్చింది. నేను ఎవరి మీదా ఆధారపడాల్సిన అవసరం లేదని నాకు అర్థమయ్యేలా చేసింది" అని జయచిత్ర చెబుతున్నారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)