యెమెన్ తీరంలో మరో చమురు ట్యాంకర్‌ను హైజాక్‌ చేసిన సముద్రపు దొంగలు

    • రచయిత, మొహమ్మద్ గబోబే
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • చదివే సమయం: 3 నిమిషాలు

యెమెన్ తీరంలో సోమాలియా సముద్రపు దొంగలు ఒక చమురు ట్యాంకర్‌ను హైజాక్ చేసినట్లు బీబీసీతో పలువురు సోమాలియా భద్రతాధికారులు చెప్పారు.

'ఎంటీ యురేకా' అనే ట్యాంకర్ హైజాక్‌ అయిందని, అది సోమాలియా వైపు వెళ్తోందని అంతకుముందు యెమెన్ కోస్ట్‌గార్డ్ వెల్లడించింది. గల్ఫ్ ఆఫ్ ఏడెన్‌లోని ఖానా ఓడరేవు సమీపంలో సముద్రపు దొంగలు ఈ నౌకను తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు సోర్సెస్ తెలిపాయి.

గల్ఫ్ ఆఫ్ ఏడెన్ తీరంలోని ఖండాలా అనే పట్టణ సమీపంలోని మారుమూల ప్రాంతం నుంచి సముద్రపు దొంగలు వచ్చినట్లు పుంట్‌ల్యాండ్ ప్రాంతానికి చెందిన ముగ్గురు భద్రతా అధికారులు బీబీసీకి తెలిపారు.

గత పది రోజుల్లో ఈ ప్రాంతంలో చమురు ట్యాంకర్ హైజాక్ అవ్వడం ఇది రెండోసారి. ఏప్రిల్ 22న సోమాలియా దొంగలు 'హానర్ 25' అనే నౌకను హైజాక్ చేశారు. ఆ నౌకలో మొగడిషుకు వెళ్తున్న 18,500 బ్యారెల్స్ చమురు ఉంది.

పశ్చిమ ఆఫ్రికా దేశమైన టోగో జెండాతో ప్రయాణిస్తున్న 'ఎంటీ యురేకా'ను ఈరోజు ఉదయం స్థానిక కాలమానం ప్రకారం 5:00 గంటలకు(భారత కాలమానం ప్రకారం 7.30 గంటలు) తుపాకులతో వచ్చిన వ్యక్తులు చుట్టుముట్టారని భద్రతా అధికారులు వెల్లడించారు.

ప్రస్తుతం ఈ నౌక యెమెన్, సోమాలియా మధ్య గల్ఫ్ ఆఫ్ ఏడెన్ సముద్రంలో ప్రయాణిస్తోంది. మరికొద్ది గంటల్లోనే ఇది సోమాలియా జలాల్లోకి చేరుకునే అవకాశం ఉంది.

మరో ఘటనలో, యెమెన్‌లోని అల్-ముఖాలా సమీపంలో ఒక బల్క్ క్యారియర్ నౌకను చిన్న పడవలో వచ్చిన సాయుధ వ్యక్తులు సమీపించినట్లు యునైటెడ్ కింగ్‌డమ్ మారిటైమ్ ట్రాన్స్‌పోర్టేషన్ ఆపరేషన్ శుక్రవారం రిపోర్ట్ చేసింది.

ముగ్గురు వేర్వేరు భద్రతా అధికారుల సమాచారం ప్రకారం, ఆ సాయుధ వ్యక్తులు కాలూలా (అలూలా) అనే మత్స్యకార పట్టణం సమీపంలోని మారుమూల తీర ప్రాంతం నుంచి వచ్చారు. 'ఎంటీ యురేకా' నౌకను స్వాధీనం చేసుకునేందుకు హైజాకర్లు బయలుదేరిన చోటు నుంచి ఈ కాలూలా పట్టణం 209 కిలోమీటర్ల దూరంలో ఉంది.

ఈ రెండు వేర్వేరు ఘటనలను పరిశీలిస్తే, ఆఫ్రికా ప్రధాన భూభాగంలోనే అత్యంత పొడవైన తీరప్రాంతం (3,333 కిలోమీటర్లు) కలిగిన సోమాలియా వ్యాప్తంగా సముద్రపు దొంగతనాలు విస్తరిస్తున్నట్లు స్పష్టమవుతోంది. నేటి హైజాక్‌తో కలిపి గత రెండు వారాల్లో సముద్రపు దొంగలు విజయవంతంగా చేపట్టిన నాలుగో ఘటన ఇది.

తాజా హైజాక్‌పై సోమాలియా అధికారులు కానీ, సోమాలియా జలాల్లో పైరసీ వ్యతిరేక కార్యకలాపాలను పర్యవేక్షించే యూరోపియన్ యూనియన్ నేవల్ ఫోర్స్ కానీ ఇప్పటివరకు స్పందించలేదు.

2011 నుంచి తగ్గుముఖం పట్టిన సముద్ర దొంగతనాలు, 2023 చివరి నుంచి మళ్లీ పెరుగుతూ వస్తున్నాయి. గల్ఫ్ ఆఫ్ ఏడెన్, ఎర్ర సముద్రంలో ప్రయాణించే నౌకలపై హూతీ తిరుగుబాటుదారులు దాడులు ప్రారంభించడంతో అంతర్జాతీయ నావికా దళాలు ఆ ముప్పును ఎదుర్కోవడంపై దృష్టి సారించాయి. దీనిని అదనుగా తీసుకున్న సోమాలియా తీరంలోని సాయుధ ముఠాలు, భద్రతా లోపాలను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి.

"సముద్రపు దొంగలతో నెలకొన్న ప్రస్తుత సంక్షోభం చాలామంది ఊహిస్తున్న దానికంటే దారుణంగా ఉంది. తీరప్రాంతం అంతటా సాయుధ ముఠాల కదలికలు పెరుగుతున్నాయి" అని పుంట్‌ల్యాండ్ ప్రాంతానికి చెందిన ఓ భద్రతా అధికారి బీబీసీకి తెలిపారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)