కాకినాడ: సోషల్ మీడియాలో చూసి ఉమ్మెత్త ఆకులతో పప్పు వండుకుని తిన్నారు, తర్వాత ఏమైందంటే..

    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం
  • చదివే సమయం: 6 నిమిషాలు

సోషల్ మీడియాలో చూసిన వీడియోను నమ్మి… ఉమ్మెత్త ఆకులతో వంట చేసుకుని తిన్న ఒక కుటుంబం ప్రాణాల మీదకు తెచ్చుకుంది.

మిగిలిన ఆకు కూరల్లానే ఉమ్మెత్త ఆకులతో కూర వండుకుని తింటే ఆరోగ్యమని ఇటీవల సోషల్‌ మీడియాలో ఒక వీడియో చూశారు కాకినాడ జిల్లా గండేపల్లి మండలం యర్రంపాలెం గ్రామానికి చెందిన బిక్కిన గంగాభవాని కుటుంబీకులు.

ఆ వీడియోలో చూపించినట్టుగానే ఉమ్మెత్త ఆకులను పప్పులో వేసుకుని సోమవారం నాడు కూర వండుకున్నారు. తర్వాత బిక్కిన గంగాభవాని, ఆమె తల్లి ముత్యాల వీరలక్ష్మి, మామ బిక్కిన వీరబ్బు, బంధువు రిమ్మలపూడి జయలక్ష్మి ఆ కూరను అన్నంలో కలుపుకుని తిన్నారు.

తిన్న కాసేపటికే అస్వస్థతకు గురయ్యారు. గమనించిన కుటుంబ సభ్యులు వారిని వెంటనే కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ప్రస్తుతం వారంతా ప్రాణాపాయం నుంచి బయటపడినట్టు కాకినాడ జీజీహెచ్ డిప్యూటీ సూపరింటెండెంట్ పద్మనాభన్ శ్రీనివాసన్ బీబీసీకి తెలిపారు.

అసలేం జరిగింది?

బిక్కిన గంగభవాని కుటుంబం హైదరాబాద్‌లో నివాసం ఉంటోంది.

వీరి సొంతూరు కాకినాడ జిల్లా గండేపల్లి మండలం, యర్రంపాలెం గ్రామం. అక్కడ అమ్మవారి తీర్థం ఉండటంతో గంగభవాని, ఆమె మామ వీరబ్బు, ఇద్దరు పిల్లలతో హైదరాబాద్ నుంచి యర్రంపాలెం వచ్చారు. ఆదివారం తీర్థం జరిగింది.

గంగభవాని తల్లి వీరలక్ష్మి ఇన్‌స్టా‌గ్రామ్‌లో చూసి ఉమ్మెత్త ఆకులు, పప్పు కలిపి సోమవారం కూర వండారు. మధ్యాహ్నం భోజనం చేసిన వీరబ్బు, గంగభవాని, వీరలక్ష్మితో పాటు మరో బంధువు జయలక్ష్మి కూడా వికారం, వాంతులు, తలనొప్పి వంటి లక్షణాలతో క్రమంగా అపస్మారక స్థితిలోకి వెళ్లారు.

సాయంత్రం నాలుగు గంటల సమయంలో వీరి పరిస్థితి గమనించిన గంగభవాని తండ్రి హరిబాబు అందరినీ వెంటనే స్థానిక పెద్దపురం ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం వైద్యుల సూచన మేరకు వారిని కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు.

హరిబాబుతో పాటు గంగాభవాని ఇద్దరు కుమారులు ఉమ్మెత్త ఆకుతో చేసిన కూర తినలేదు. దీంతో వారికి ఏ ఇబ్బందీ రాలేదు.

"పండుగ కోసం వచ్చారు మా అన్నయ్య కుటుంబం. పండుగలో అందరం కలిసి తిరిగాం. మాతో చాలాసేపు గడిపారు. సోమవారం సాయంత్రం కళ్లు తిరిగిపడిపోయారంటే వెంటనే ఆసుపత్రిలో చేర్చాం. ఫోన్‌లో వీడియోలు చూసి ఉమ్మెత్త ఆకులతో కూర చేసుకుని తిన్నారని తెలిసింది" అని వీరబ్బు సోదరుడు ప్రసాద్ చెప్పారు.

ఉమ్మెత్త మొక్క ప్రమాదకరమా?

ఉమ్మెత్త మొక్క విషపూరితమైనదని నిపుణులు చెబుతున్నారు.

ఉమ్మెత్త మొక్క.. ఒక విషపూరితమైన మొక్క అని ఆంధ్ర యూనివర్సిటీ వృక్షశాస్త్ర విభాగంలోని హెర్బేరియం క్యూరేటర్ డాక్టర్ ప్రకాశరావు బీబీసీతో చెప్పారు.

తెలుగులో మనం ఉమ్మెత్త అని పిలిచే ఈ మొక్క బొటానికల్ నామం దతూరా స్ట్రామోనియం.

ఎక్కువ విష ప్రభావం కలిగిన అట్రోపిన్, స్కోపోలామిన్లు కలిగి ఉంటుందీ మొక్క.

"ఉమ్మెత్త మొక్కపై 1999లో తైవాన్‌కు చెందిన షై-షిన్ చాంగ్ చేసిన పరిశోధన పత్రం వెటర్నరీ అండ్ హ్యూమన్ టాక్సికాలజీ జర్నల్‌లో ప్రచురించారు. దీని ప్రకారం, దతూరా మొక్క, ఆకులు, పువ్వులు కూడా విషపూరితమైనవి" అని డాక్టర్ ప్రకాశరావు తెలిపారు.

ఈ మొక్కలో అట్రోపిన్, స్కోపోలామైన్ వంటి విషపదార్థాలు ఉంటాయని, కొన్ని సందర్భాల్లో ప్రాణాపాయం కలగవచ్చని ఆయన హెచ్చరించారు.

ఈ మొక్కలోని పువ్వులు, ఆకులు, గింజలు తినడం వల్ల తల తిరగడం, నోరు పొడిబారడం, గుండె వేగంగా కొట్టుకోవడం, మతిభ్రమణం, దృష్టి మసకబారడం వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదముందని కాకినాడ జీజీహెచ్ డిప్యూటీ సూపరింటెండెంట్ పద్మనాభన్ శ్రీనివాసన్ చెప్పారు.

కొన్నిసార్లు మరణానికి కూడా దారి తీయవచ్చునని ఆ పరిశోధన పత్రంలో పేర్కొన్నట్లు క్యూరేటర్ డాక్టర్ ప్రకాశరావు బీబీసీకి తెలిపారు.

"ఉమ్మెత్త మొక్కకు తెలుపు, నారింజ రంగుతో కూడిన పువ్వులు పూస్తాయి. దీని వాసన కూడా చాలా ఘాటుగా ఉంటుంది. అయితే, ఇది ఔషధ గుణాలను కలిగి ఉంది. ముఖ్యంగా ఆయుర్వేద వైద్యంలో దీనిని ఉపయోగిస్తుంటారు. అలాగే కొన్ని కాంబినేషన్లతో ఇంగ్లిష్ వైద్యంలో కూడా వినియోగిస్తున్నారు" అని డాక్టర్ ప్రకాశరావు తెలిపారు.

'ఆయుర్వేదంలో వాడతారు, కానీ..'

ఉమ్మెత్త పువ్వుని ఆయుర్వేదంలో వాడతారని, కానీ దానికి ప్రొసీజర్ ఫాలో అవ్వాల్సి ఉంటుందని తిరుపతిలోని ఎస్పీ ఆయుర్వేదిక్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రేణు దీక్షిత్ బీబీసీతో చెప్పారు.

"ఉమ్మెత్త మొక్కని ముందుగా శుద్ధి చేయాలి. నేరుగా ఆ మొక్కని తీసుకోకూడదు. అది విషపూరిత లక్షణాలున్న మొక్క. పైగా మొక్కలపై ఏదైనా మందులు కొడతారు. అవి వాటితో రియాక్ట్ అవుతాయి. దానితో జరిగే రసాయనికచర్య వల్ల అవి మరింత విషపూరితంగా మారతాయి. అంతే కాదు సోషల్ మీడియాలో చూసి రకరకాలైన మొక్కలతో వంటలు చేసుకోవడం, వైద్యం చేసుకోవడం చాలా తప్పు. తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకోవాలి" అని డాక్టర్ రేణు దీక్షిత్ అన్నారు.

"గన్నేరు, బిళ్ల గన్నేరు, ఉమ్మెత్త ఒకే కుటుంబానికి (సోలానాటియే ఫ్యామిలీ) చెందినవి. వీటిలో కొన్ని విషపూరిత లక్షణాలు ఉన్నాయి" అని డాక్టర్ ప్రకాశరావు చెప్పారు.

విషపూరిత మొక్కలతో జాగ్రత్త

ఈ కుటుంబానికి చెందిన మొక్కలను డెవిల్స్ ట్రంప్ట్, థార్న్ యాపిల్, జిమ్సన్ వీడ్ అని కూడా పిలుస్తారు. ఇవి చూడడానికి అందంగా ఉంటాయి. కానీ చాలా విషపూరితమైన మొక్కలు.

"ఉమ్మెత్త మొక్కలోని పువ్వులు మాత్రమే కాదు.. గింజలు, ఆకులు, వేరు... ఇలా ఏదీ కూడా తినడానికి పనికిరాదు, చాలా విషపూరితం. ఇది శరీరంపై తీవ్రంగా ప్రభావం చూపి విషపూరిత పరిస్థితికి దారి తీస్తుంది" అని డాక్టర్ పద్మనాభన్ శ్రీనివాసన్ బీబీసీకి తెలిపారు.

"సోషల్ మీడియాలో వచ్చే వంటకాలను నిపుణుల సలహా లేకుండా ప్రయత్నించకండి. శాస్త్రీయ ధ్రువీకరణ అవసరం. ఫుడ్ సెప్టీ అండ్ స్టాండర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) గైడ్‌లైన్స్ చూడండి. సోషల్ మీడియాలో వచ్చిన ప్రతి అంశాన్ని నమ్మేయకండి. ముఖ్యంగా అవి మన ఆరోగ్యానికి సంబంధించనవైతే నిపుణుల సలహాలు తీసుకోండి" అని ఎఫ్ఎస్ఎస్ఏఐ డిప్యూటీ డైరెక్టర్ సురేష్ ఉప్పరాపల్లి బీబీసీతో అన్నారు.

ఇద్దరు ఇంకా ఐసీయూలోనే..

"ఉమ్మెత్త మొక్క ఆకు, పువ్వు, బెరడు అన్నీ కూడా విషపూరితమే. దాని ప్రభావం వెంటనే తగ్గదు. క్రమంగా తగ్గుతుంది. ప్రస్తుతం నలుగురికి చికిత్స కొనసాగుతోంది" అని డిప్యూటీ సూపరింటెండెంట్ పద్మనాభన్ శ్రీనివాసన్ బీబీసీతో చెప్పారు.

ఆసుపత్రిలో జాయిన్ అయినప్పటి కంటే ఇప్పుడు వారి పరిస్థితి మెరుగ్గానే ఉందని ఆయన చెప్పారు.

"ముగ్గురు మహిళలు, ఒక పురుషుడు నిన్న (04.05.26) ఆసుపత్రిలో చేరారు. నలుగురినీ ఐసీయూలో ఉంచి చికిత్స అందించాం. ఇద్దరు ఇంకా ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఇద్దరి పరిస్థితి మెరుగవడంతో వార్డుకి షిప్ట్ చేశాం. అందరి పరిస్థితి సాధారణంగానే ఉంది, ఇద్దరికి ఆస్తమా ఉండటంతో వారికి ఐసీయూలోనే చికిత్స కొనసాగిస్తున్నాం" అని కాకినాడ జీజీహెచ్ రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కోమల బీబీసీతో చెప్పారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)