తమిళనాడులో అసలేం జరుగుతోంది?

సారాంశం
  • తమిళనాడులో క్షణక్షణానికీ ఉత్కంఠ
  • నిరంతరం మారుతున్న రాజకీయ సమీకరణాలు
  • మూడుసార్లు గవర్నర్‌ను కలిసిన విజయ్
  • విజయ్ పార్టీ టీవీకేకు కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల మద్దతు
  • ఒక్క ఎమ్మెల్యే మద్దతు లేక ఆగిపోయిన ప్రమాణస్వీకారం
  • టీవీకేకు మద్దతు ఇవ్వడంపై ప్రకటన చేయని వీసీకే
  • మద్దతు ఇవ్వడం లేదని ఐయూఎంఎల్ స్పష్టీకరణ
  • అర్ధరాత్రి గవర్నర్‌ను కలిసిన దినకరన్
  • చదివే సమయం: 6 నిమిషాలు

తమిళనాడు రాజకీయం అత్యంత రసవత్తరంగా మారింది. విజయ్ ప్రమాణస్వీకారం ఇవాళ అయిపోతుంది, రేపు అయిపోతుంది అంటూ మీడియా హడావుడి చేస్తోంటే... క్షేత్ర స్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. అనేక మలుపులు తిరుగుతున్నాయి.

ముఖ్యంగా విజయ్‌కి కావలసిన మ్యాజిక్ ఫిగర్ ఉంటే తప్ప, సింగిల్ లార్జెస్ట్ పార్టీ పద్ధతిలో ప్రమాణ స్వీకారం చేయించేది లేదనే వైఖరిలో గవర్నర్ ఉండడంతో, మ్యాజిక్ ఫిగర్ 118 (ఒకవేళ విజయ్ రాజీనామా పరిగణిస్తే 117) కోసం విజయ్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.

ముందుగా కాంగ్రెస్ పార్టీ విజయ్‌కి మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వీసీకే, సీసీఐ, సీపీఎం కూడా విజయ్ కి మద్దతు ఇస్తాయనీ, ఆ మూడు పార్టీలు మద్దతిస్తే ఇక సమస్య ఉండదని విజయ్ అనుకూలురు ఆశించారు.

అనుకున్నట్టుగానే మే 8వ తేదీ శుక్రవారం కమ్యూనిస్టు పార్టీలు విజయ్‌కి మద్దతు ప్రకటించాయి సీపీఐ, సీపీఎం రెండూ ప్రభుత్వంలో చేరబోమనీ, బయట నుంచి విజయ్ కి మద్దతు ఇస్తామని ప్రకటించాయి.

''తమిళనాడులో మళ్ళీ ఎన్నికలు రావాలని కోరుకోవడం లేదు. సుస్థిర ప్రభుత్వం కోసం మేం మద్దతు ఇస్తున్నాం. ప్రజా పోరాటాల కోసం, బీజేపీని రాష్ట్రంలో విస్తరించకుండా అడ్డుకునేందుకు డీఎంకేతో కూడా కలిసి పనిచేస్తాం'' అని ఉమ్మడి విలేఖర్ల సమావేశంలో ప్రకటించారు సీపీఐ, సీపీఎం తమిళనాడు రాష్ట్ర కార్యదర్శులు.

మూడోసారి గవర్నర్‌ను కలిసిన విజయ్

గవర్నర్ ను కలిసిన తరువాత టీవీకే అధ్యక్షుడు విజయ్ సీపీఎం కార్యాలయానికి వెళ్లి అక్కడ ఇరు పార్టీల నాయకులకూ కృతజ్ఞతలు తెలియజేశారు.

మే 8 సాయంత్రం లోక్ భవన్‌లో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను విజయ్ మరోసారి కలిశారు. విజయ్ గవర్నర్‌ని కలవడం ఇది మూడోసారి. రెండోసారి గవర్నర్‌ను కలిసినప్పుడే ''విజయ్ పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా మద్దతు లేదని'' చెప్పినట్టు లోక్ భవన్ ప్రకటన విడుదల చేసింది.

విజయ్ మూడోసారి గవర్నర్‌ను కలవడం చూస్తే కచ్చితంగా ఆయనకి మ్యాజిక్ ఫిగర్ కి సంబంధించిన మద్దతు లేఖలు ఇతర పార్టీల నుంచి అంది ఉంటాయనీ, అందుకే విజయ్ మరోసారి గవర్నర్‌ని కలుస్తున్నారని అందరూ భావించారు.

అయితే మే 8వ తేదీ శుక్రవారం నాడు రెండు కమ్యూనిస్ట్ పార్టీల లేఖలు మాత్రమే విజయ్ గవర్నర్‌కు అందించారు. కాంగ్రెస్ లేఖ అంతకుముందే ఇచ్చారు. దీంతో తన సభ్యులు కాకుండా అదనంగా 9 మంది సభ్యుల మద్దతు విజయ్‌ కి దక్కింది.

విజయ్‌కి మొత్తం 10 మంది సభ్యుల మద్దతు కావాలి. అంటే ఒక్క ఎమ్మెల్యే మద్దతు లేక ప్రస్తుతం విజయ ప్రమాణ స్వీకారం ఆగిపోయినట్టయింది.

ముస్లిం లీగ్ మద్దతు వదంతులు

ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ - ఐయుఎంఎల్ పార్టీ ఎన్నికల తర్వాత వరుసగా రెండు సార్లు ''తాము స్టాలిన్ వెంటే ఉంటాం, డీఎంకేతోనే కొనసాగుతామంటూ'' ప్రకటించింది. అలాంటి ఐయుఎంఎల్ అకస్మాత్తుగా విజయ్‌కి మద్దతు ఇచ్చిందంటూ మే 8 సాయంత్రం తమిళ, ఇంగ్లీషు మీడియాలో వార్తలొచ్చాయి.

కాసేపటికి తాము విజయ్ పార్టీకి మద్దతు ఇవ్వబోవడం లేదనీ, స్టాలిన్ తోనే కొనసాగుతున్నామని ప్రకటించారు ఆ పార్టీ ప్రతినిధులు. ఈ గందరగోళానికి కారణం ఒక్క లేఖ. తమిళంలో ఐయుఎంఎల్ విడుదల చేసిన లేఖలో ''ప్రజాస్వామ్యపరంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి గవర్నర్ తీసుకునే చర్యలను తాము సమర్థిస్తాం'' అని రాశారు.

అంటే ''గవర్నర్ ప్రభుత్వం ఏర్పాటుకి విజయ్‌ని పిలుస్తారు కాబట్టి దాన్ని సమర్ధిస్తున్నారు'' అని భావించిన పాత్రికేయులు కొందరు ఐయుఎంఎల్ పార్టీ విజయ్‌కి మద్దతుఇస్తుందంటూ వార్తలు వేయడం ఈ గందరగోళానికి కారణం.

''ప్రజాస్వామ్య పరంగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని తాము కోరుకుంటున్నాము తప్ప మద్దతు ఇవ్వడం లేదని ఐయూఎంఎల్ వివరణ ఇవ్వడంతో ఆ వార్తలు ఆగిపోయాయి.

వాస్తవానికి వీసీకే మద్దతు ఆలస్యం అవుతోన్న క్రమంలో, ఆ పార్టీ లేఖ లేనప్పటికీ విజయ్ గవర్నర్ ను కలవడానికి రావడం, అదే సమయంలో ఐయూఎంఎల్ వదంతి వ్యాపించడంతో, బహుశా విజయ్ ఐయూఎంఎల్ మద్దతుతోనే గర్నవర్‌ను కలవడానికి వెళ్తున్నారు అని ఎక్కువ మంది పాత్రికేయులు భావించడం కూడా గందరగోళానికి కారణం. అటు టీవీకే పార్టీ దీనిపై స్పష్టత ఇవ్వకపోవడం కూడా గందరగోళం పెంచింది.

వీసీకే వైఖరి ఏంటి?

కాంగ్రెస్‌తో పాటు, సీపీఐ, సీపీఎం, వీసీకేల మద్దతు కోరారు విజయ్. ముందు నుంచీ ఆ అంశంపై సానుకూలంగా మాట్లాడుతూ వచ్చారు ఈ మూడు పార్టీల నాయకులు. సాధారణంగా తమిళనాడులో ఈ మూడు పార్టీలది చాలా విషయాల్లో ఉమ్మడి కార్యాచరణ.

అంతేకాకుండా మే 8 శుక్రవారం నాటి విలేకర్ల సమావేశంలో ''వీసీకే కూడా టీవీకేకి మద్దతు ఇస్తుంది'' అని స్వయంగా తమిళనాడు కమ్యూనిస్టు నాయకులు చెప్పారు. దీంతో వీసీకే మద్దతు పక్కా అనే వాదన స్పష్టం అయింది. కానీ వీసీకే మాత్రం శుక్రవారం రాత్రి వరకూ ఎక్కడా అధికారిక ప్రకటన చేయలేదు, లేఖ ఇవ్వలేదు.

ఒక దశలో వీసీకే, ముస్లిం లీగ్ కలిపి విజయ్‌కు 120 మంది సభ్యుల మద్దతు ఉందన్న ప్రచారమూ జరిగింది. ఆ మేరకు విజయ్ ప్రమాణ స్వీకారం చేయడానికి మార్గం సుగమమైపోవడమే కాకుండా, శనివారం మే 9వతేదీ ఉదయం 11 గంటలకే విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారంటూ వార్తలు వచ్చాయి.

ఈ మేరకు లోక్‌ భవన్ నుంచి అధికారిక ప్రకటన మాత్రమే పెండింగ్ అని చాలా మీడియా సంస్థలు వార్తలు కూడా అందించాయి.

కానీ కాసేపటి తర్వాత మెల్లగా స్పష్టత రావడం మొదలైంది. వీసీకే శుక్రవారం ఆన్‌లైన్‌లో నిర్వహించిన పార్టీ హైలెవెల్ మీటింగ్ తరువాత, వీసీకే నాయకులు తిరుమావళన్ డీఎంకే అధినేత స్టాలిన్‌ను కలిశారు.

ఆ తరువాత కూడా వారి నుంచి ఏ ప్రకటన గానీ, లేఖ కానీ రాలేదు. చకచకా వీసేకే నిర్ణయం వస్తుందనుకున్న టీవీకే శ్రేణులకు నిరాశ ఎదురైంది. అంతేకాదు, రాత్రి గడిచే కొద్ది పరిణామాలు మారిపోయాయి.

వీసీకే మద్దతు ఇవ్వాలంటే ఆ పార్టీకి ఉప ముఖ్యమంత్రి పదవి, కేబినెట్ మంత్రి పదవి, విజయ్ ఖాళీ చేసే అసెంబ్లీ సీటు, దళితుల సంక్షేమానికి ప్రత్యేక చట్టం – అనే నాలుగు డిమాండ్లు నెరవేర్చాలంటూ వీసీకే, టీవీకేకి షరతు పెట్టిందని వార్తలు వచ్చాయి.

అయితే ఈ వార్తలను బీబీసీ స్వతంత్రంగా ధృవీకరించలేదు. రాత్రి వీసీకే ప్రతినిధులతో బీబీసీ మాట్లాడడానికి చేసిన ప్రయత్నం సఫలం కాలేదు. మరోవైపు వీసీకే ప్రధాన కార్యదర్శి ఎక్స్ వేదికగా విజయ్‌పై కొన్ని విమర్శలు చేశారు.

''సింగిల్ లార్జెస్ట్ పార్టీ వారు తమ మద్దతు కావాలనుకున్నప్పుడు పార్టీ కార్యాలయానికి స్వయంగా వెళ్లి అడగటం మర్యాద. కానీ విజయ్ మాత్రం వాట్సప్ లో లేఖ పంపి రెస్పాండ్ అని పెట్టారు'' అంటూ విమర్శిచారాయన. ఇవాళ వీసీకే వైఖరిపై స్పష్టత రానుంది.

మొత్తంగా విజయ్ ముఖ్యమంత్రి కావడానికి కావలసిన 10 మంది ఎమ్మెల్యేల బదులు 9 మంది ఎమ్మెల్యేల దగ్గరే మద్దతు ఆగిపోయింది.

ఒకవేళ ఇవాళ (మే9వ తేదీ శనివారం) విసీకే మద్దతు ప్రకటిస్తే, విజయ్ మరోసారి ఆ లేఖ పట్టుకొని గవర్నర్ దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది. అంటే విజయ్ నాలుగోసారి గవర్నర్ దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు గవర్నర్ తగిన నిర్ణయం తీసుకుంటారు. ఆ తర్వాత ప్రమాణం స్వీకారం ఖరారు అయ్యే అవకాశం ఉంది.

ఒకవేళ వీసీకే నిర్ణయం ఆలస్యం అయితే, ప్రమాణస్వీకారం కూడా ఆలస్యం అవుతుంది. అంతేకాదు కేరళ పరిణామాల దృష్టా గవర్నర్ చెన్నై వదిలి కేరళ వెళ్తే అప్పుడు కూడా నిర్ణయం ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. (రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ప్రస్తుతం కేరళ గవర్నర్, తమిళనాడుకి పూర్తి స్థాయి గవర్నర్ లేకపోవడంతో ఆయన ఇక్కడ ఇంచార్జ్‌గా వ్యవహరిస్తున్నారు).

గవర్నర్ అర్లేకర్ సూచించినట్టుగా తనకు పూర్తి మెజారిటీ లేకపోయినా గవర్నర్‌ని విజయ్ మూడవసారి కలవడం వెనక గవర్నర్ పై ఒత్తిడి పెంచే ఆలోచన ఉందా అనే వార్తలు కూడా వ్యాపించాయి. టీవీకే దీనిపై స్పందించలేదు.

ఎమ్మెల్యే సంతకం ఫోర్జరీ ఆరోపణలు

విజయ్‌కి మద్దతు చుట్టూ ఈ హడావుడి జరుగుతుండగానే టిీటీవీ దినకరన్‌కి సంబంధించిన ఏఎంఎంకే పార్టీ చుట్టూ కొత్త వివాదం వచ్చింది. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ ఒకే ఒక ఎమ్మెల్యే స్థానం గెలుచుకుంది.

ఆ పార్టీ ఎమ్మెల్యే కామరాజు విజయ్‌కి మద్దతు ప్రకటించారంటూ ఒక లేఖ బయట వచ్చిందనీ, ఆ లేఖ ఫోర్జరీ అయ్యుండాలి లేదా తమ ఎమ్మెల్యేను కొనడానికి విజయ్ ప్రయత్నం చేసి ఉండాలని గవర్నర్‌ను కలసి ఫిర్యాదు చేశారు దినకరన్.

అయితే ఆయన స్వచ్ఛందంగానే లేఖ ఇచ్చారంటూ టీవీకే ఒక వీడియో విడుదల చేసింది. ఆ వీడియోలో ఎమ్మెల్యే కామరాజు ఒక లేఖతో ఉన్న దృశ్యాలు ఉన్నాయి. అర్థరాత్రి తరువాత మరోసారి ఆ ఎమ్మెల్యేను వెంటబెట్టుకుని గవర్నర్‌ను కలిసిన దినకరన్, మీడియా ముందుకు వచ్చి ఈ అంశంపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు.

మొత్తంగా విజయ్ ఎప్పటి ముఖ్యమంత్రి అవుతారు అనే సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. శనివారం వీసీకే మద్దతు ప్రకటిస్తే, అప్పుడు గవర్నర్ తేదీ నిర్ణయిస్తారు. వీసీకే మద్దతు ఇవ్వకపోయినా, ఆలస్యం అయినా విజయ్ మరో చోట మద్దతు వెతుక్కోవాలి. అప్పటి వరకూ విజయ్ అభిమానులకు ఎదురు చూపులు తప్పవు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)